తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ.. - | Sakshi
Sakshi News home page

తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..

Published Mon, Feb 5 2024 12:58 AM

- - Sakshi

  •  పుట్టపర్తి: శివారులో ఇటీవల ప్రారంభమైన ఓ హోటల్‌కు 3 రోజుల క్రితం తమ చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. పలు వంటకాలు ఆర్డర్‌ చేసి తిన్నారు. రుచికరంగా లేవని హోటల్‌ నిర్వాహకులకు చెబితే.. మాట్లాడే సమయం లేదు, బిల్లు కట్టి వెళ్లాలంటూ దబాయించారు. తీరా ఇంటికెళ్లిన తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు.
     
  •  హిందూపురం: బస్టాండు పక్కనే ఉన్న హోటల్‌లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు స్నేహితులు భోజనం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని అక్కడికి సిబ్బందికి చెబితే... ఇప్పుడే చేశాం, అలాగే ఉంటుందని సమాధానమిచ్చారు. దీంతో చేసేదిలేక స్నేహితులు తిన్నారు. ఇంటికెళ్లాక విరేచనాలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాక కాస్త ఉపశమనం లభించింది.

సాక్షి, పుట్టపర్తి: చూడచక్కనైన బోర్డులు పెట్టి ఆకర్షిస్తారు. పసందైన వంటకాల మెనూతో నోరూరిస్తారు. లోపలికి వెళ్లగానే ఘుమఘుమలాడే వాసనలతో మైమరిపింపచేస్తారు. అన్నీ ఫ్రెష్‌వే అంటూ వడ్డించేస్తారు. కానీ, తిన్నాకే తెలుస్తుంది. మన కళ్లు మనల్ని ఎంతలా మోసం చేశాయో!. ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాకే అర్థం అవుతుంది.. ఆ హోటల్‌కి వెళ్లి ఎంతపెద్ద తప్పు చేశామో!.

కల్తీతో కల్లోలం..
జిల్లా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ ఆహారం వీరవిహారం చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. రుచికరంగా ఉండేందుకు ఏవి పడితే అవి కలిపేయడం తిన్న వారి ప్రాణాలమీదికొస్తోంది. మరోవైపు నిల్వ ఉంచి వడ్డిస్తున్న వంటకాల ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రులబాట పడుతున్న బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది.

తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..
మారిన జీవనశైలిలో భాగంగా చాలామంది హోటళ్లలో తినడానికి అలవాటుపడ్డారు. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఉదయంపూట ఒకేసారి వందల మందికి సరిపడా వంటకాలు తయారు చేసి ఉంచుతున్నారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్ల ఆధారంగా అప్పటికప్పుడు మరోసారి వేడి చేసి ఇస్తున్నారు. అమ్ముడు పోకుండా మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో ఉంచి మరుసటి రోజు అంటగడుతున్నారు. చుక్కలు చూపుతున్నారు.

ప్రశ్నిస్తే దౌర్జన్యం..
చాలా హోటళ్లలో ఆహారం తిన్నాక బిల్లులు ఇవ్వడం లేదు. తెల్ల కాగితాలపై రాసి పంపిస్తున్నారు. మరుసటి రోజు కస్టమర్లు గొడవకు దిగినా.. మా హోటల్‌లో తినలేదంటూ దబాయిస్తున్నారు. తినే సమయంలోనూ ఆహారం బాగుండటం లేదని ప్రశ్నించినా హోటల్‌ నిర్వాహకులు తిరగబడు తున్నారు. బిల్లు ఇచ్చేది లేదు.. డబ్బు కట్టి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారు.

తూతూమంత్రపు చర్యలతో సరి..!
కల్తీ హోటళ్లపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. తూతూమంత్రపు తనిఖీలతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సరిపెడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. దీంతో చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలీక మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫిర్యాదు చేసుకోవాలంటూ రుబాబు చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం 
ప్రతి నెలా మాకు విధించిన లక్ష్యం మేరకు తనిఖీలు చేస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసి ళ్లు తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలకు ఆదేశిస్తున్నాం. కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం వడ్డించే హోటళ్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.

– రామచంద్ర, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement