Food Safety Act
-
డోకొచ్చేలా.. కేకులు
సాక్షి, సిటీబ్యూరో: ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసినా కల్తీ, అపరిశుభ్రత, బొద్దింకలు, ఎలుకల సంచారం, ఇతరత్రా పలు అవాంఛనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. హోటళ్లు, స్వీట్ షాపులు, చికెన్ మార్కెట్లతో పాటు ఆఖరికి కేకుల దుకాణాల్లోనూ డోకొచ్చే పరిస్థితులే కనిపించాయి. సికింద్రాబాద్ జోన్‌లోని అల్వాల్, కార్ఖానా ప్రాంతాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయల్పడ్డాయి. అల్వాల్‌లోని మచ్చ»ొల్లారం మాంగినీస్ కేక్ షాప్‌లో కేకుల తయారీ ప్రాంతాల్లో గుంపుగా సంచరిస్తున్న బొద్దింకలు, స్టోరేజీ ప్రాంతాల్లో ఎలుకల పెంటికలు దర్శనమిచ్చాయి. కేకుల తయారీకి వినియోగించే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కోల్డ్ రూమ్‌లోని ఏసీ లీకేజీతో గదిలోని ట్రేలలో ఉన్న ఆహార పదార్థాలు కలుషి తమయ్యే పరిస్థితులు కనిపించాయి. కేసర్ సిరప్, పైనాపిల్, వెనీలా ఫ్లేవర్లు, ఇతరత్రా పదార్థాలు గడువు ముగిసిపోవడం గుర్తించారు. పలు ఆహార పదార్థాలు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో అపరిశుభ్రంగా కనిపించాయి. రవాణాకు వినియోగించే ఏడు చిల్లర్ వాహనాలకు లైసెన్సుల్లేవు. ఇక సిబ్బంది ఆరోగ్య పరీక్షల వివరాలు, శిక్షణ పొందిన సరి్టఫికెట్లు లేవు. కార్ఖానాలోని వాక్స్ పేస్ట్రీస్ (బేకరీ)లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. సిబ్బంది వైద్య పరీక్షల రిపోర్డుల్లేవు. కేకుల తయారీలో ఆల్కహాల్.. ఎక్సైజ్ అనుమతి లేకుండా ప్లమ్ కేక్ తయారీలో ఆల్కహాల్ (రమ్) వినియోగిస్తుండటం కనిపించింది. కేకుల డబ్బాలపైనా ఆల్కహాల్ వినియోగించినట్లు వివరాల్లేవు. వంట పాత్రలు అధ్వానంగా ఉన్నాయి. కేకుల తయారీలో వినియోగించేందుకు భారీ మొత్తంలో తయారు చేసిన డ్రైఫ్రూట్స్, జామ్ మిక్స్‌ల పల్ప్‌ను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేశారు. దీన్ని ఆర్నెల్ల వరకు వినియోగించవచ్చని నిర్వాహకులు చెప్పినప్పటికీ ఎప్పుడు తయారు చేసింది, ఎప్పటిలోగా వినియోగించవచ్చో వివరాల్లేవు. బేకరీలో తయారు చేసిన ప్లమ్కేక్స్, బిస్కెట్లు, బ్రెడ్, తదితర ఆహార పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్‌పై ప్రదర్శించాల్సిన సమాచారం లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు, తయారీ కేంద్రం చిరునామా, వెజ్/నాన్‌వెజ్ లోగో వంటివి లేవు. తయారీలో వినియోగించిన పదార్థాలు, వాటి పోషక విలువలు, బ్యాచ్‌నెంబర్ వంటి వివరాల్లేవు. ఆహార పదార్థాలు, కెమికల్స్ వంటి పదార్థాలు, సగం వండిన వెజ్, నాన్‌వెజ్ పదార్థాలు కలగలిపి నిల్వ చేశారు. ఫ్రిజ్‌లలోని కొన్ని పదార్థాలకు మూతలు లేవు, లేబుల్స్ లేవు. తగిన టెంపరేచర్‌తో నిర్వహించడం లేదు. ఇలా పలు లొసుగులు బయటపడ్డాయి. శుక్రవారం తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఈ వివరాల్ని శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి -
ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.అదే సమయంలో శనివారం సెంట్రల్ ఫుడ్ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. -
నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాణ్యత, ప్రమాణాలు పాటించకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించే ఫుడ్ యూనిట్లను ఏమాత్రం సంకోచం లేకుండా సీజ్ చేయాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ తప్పకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్–2006కు లోబడి నిర్వహించాలన్నారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి రాజనర్సింహ ఫుడ్ సేఫ్టీ అంశంపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహార పదార్థాలను విక్రయించి ఇతర రాష్ట్రాలతో తెలంగాణ ఆదర్శంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆహార తనిఖీ బృందాలు నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తూనే ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా రోజుకు 180 నుంచి 200 ఫుడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని, ఏమాత్రం లోపాలు గుర్తించినా వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టల్స్, ప్రైవేటు బోర్డింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, బేకరీలు, డెయిరీ ఫుడ్ తయారీదారులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ యూనిట్లు తప్పనిసరిగా రిజి్రస్టేషన్ చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం నాణ్యత ప్రమాణాలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై మంత్రి దామోదర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి శనివారం మొబైల్ ఫుడ్ లాబ్స్ ద్వారా చేపట్టిన పరీక్షల వివరాల నివేదికను తనకు అందించాలన్నారు. ఫుడ్ సేఫ్టీపై ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌తో అవగాహన సదస్సులను నిర్వహించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ హెడ్ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరి ఎక్కడ తినమంటారు సార్?: టాలీవుడ్ నటుడు ఆసక్తికర ప్రశ్న
గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పలుచోట్ల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. పలు హోటల్ యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఫుడ్ సెఫ్టీ అధికారుల దాడుల్లో ఇంత పెద్దఎత్తున హోటల్ యజమాన్యాలు నిర్లక్ష్యం బయటపడడంతో ఆహార ప్రియుల గుండెల్లో దడ మొదలైంది.తాజాగా ఈ దాడులపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ట్వీట్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇలా అయితే మరీ ఎక్కడ తినాలి సార్? ఇంట్లోనేనా? అని రిప్లై ఇచ్చారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లో కుదరని సమయాల్లో ప్రముఖ రెస్టారెంట్స్‌కు వెళ్తుంటారు. ఇలా భాగ్యనగరంలో హోటల్ యజమాన్యాల నిర్లక్ష్యానికి ఆహార ప్రియులు భయపడుతున్నారు. ఇక నుంచి బయట తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. Sirr.. Mari ekkada thinamantaru..? Intilonaaa ..? https://t.co/Vs8r0kd83A— Brahmaji (@actorbrahmaji) May 23, 2024 -
తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..
పుట్టపర్తి: శివారులో ఇటీవల ప్రారంభమైన ఓ హోటల్‌కు 3 రోజుల క్రితం తమ చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. పలు వంటకాలు ఆర్డర్ చేసి తిన్నారు. రుచికరంగా లేవని హోటల్ నిర్వాహకులకు చెబితే.. మాట్లాడే సమయం లేదు, బిల్లు కట్టి వెళ్లాలంటూ దబాయించారు. తీరా ఇంటికెళ్లిన తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. హిందూపురం: బస్టాండు పక్కనే ఉన్న హోటల్లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు స్నేహితులు భోజనం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని అక్కడికి సిబ్బందికి చెబితే... ఇప్పుడే చేశాం, అలాగే ఉంటుందని సమాధానమిచ్చారు. దీంతో చేసేదిలేక స్నేహితులు తిన్నారు. ఇంటికెళ్లాక విరేచనాలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాక కాస్త ఉపశమనం లభించింది. సాక్షి, పుట్టపర్తి: చూడచక్కనైన బోర్డులు పెట్టి ఆకర్షిస్తారు. పసందైన వంటకాల మెనూతో నోరూరిస్తారు. లోపలికి వెళ్లగానే ఘుమఘుమలాడే వాసనలతో మైమరిపింపచేస్తారు. అన్నీ ఫ్రెష్వే అంటూ వడ్డించేస్తారు. కానీ, తిన్నాకే తెలుస్తుంది. మన కళ్లు మనల్ని ఎంతలా మోసం చేశాయో!. ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాకే అర్థం అవుతుంది.. ఆ హోటల్‌కి వెళ్లి ఎంతపెద్ద తప్పు చేశామో!. కల్తీతో కల్లోలం.. జిల్లా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ ఆహారం వీరవిహారం చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. రుచికరంగా ఉండేందుకు ఏవి పడితే అవి కలిపేయడం తిన్న వారి ప్రాణాలమీదికొస్తోంది. మరోవైపు నిల్వ ఉంచి వడ్డిస్తున్న వంటకాల ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులబాట పడుతున్న బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ.. మారిన జీవనశైలిలో భాగంగా చాలామంది హోటళ్లలో తినడానికి అలవాటుపడ్డారు. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఉదయంపూట ఒకేసారి వందల మందికి సరిపడా వంటకాలు తయారు చేసి ఉంచుతున్నారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్ల ఆధారంగా అప్పటికప్పుడు మరోసారి వేడి చేసి ఇస్తున్నారు. అమ్ముడు పోకుండా మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో ఉంచి మరుసటి రోజు అంటగడుతున్నారు. చుక్కలు చూపుతున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం.. చాలా హోటళ్లలో ఆహారం తిన్నాక బిల్లులు ఇవ్వడం లేదు. తెల్ల కాగితాలపై రాసి పంపిస్తున్నారు. మరుసటి రోజు కస్టమర్లు గొడవకు దిగినా.. మా హోటల్లో తినలేదంటూ దబాయిస్తున్నారు. తినే సమయంలోనూ ఆహారం బాగుండటం లేదని ప్రశ్నించినా హోటల్ నిర్వాహకులు తిరగబడు తున్నారు. బిల్లు ఇచ్చేది లేదు.. డబ్బు కట్టి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారు. తూతూమంత్రపు చర్యలతో సరి..! కల్తీ హోటళ్లపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. తూతూమంత్రపు తనిఖీలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సరిపెడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. దీంతో చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలీక మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫిర్యాదు చేసుకోవాలంటూ రుబాబు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రతి నెలా మాకు విధించిన లక్ష్యం మేరకు తనిఖీలు చేస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసి ళ్లు తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలకు ఆదేశిస్తున్నాం. కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం వడ్డించే హోటళ్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – రామచంద్ర, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
ప్రజారోగ్యం గాల్లో దీపం.. కల్తీ క్యాపిటల్‌గా మారుతున్న నగరం ?
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్తీ ఆహారం కారణంగా ఆస్పత్రులకు వెళ్తున్నవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జీహెచ్ఎంసీతో పాటు ఏ ప్రభుత్వ విభాగం కూడా దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో నగరంలో కల్తీకి అడ్డుకట్ట పడటం లేదు. వివిధ రంగాల్లో ముందంజలో నిలుస్తున్న హైదరాబాద్ నగరం కల్తీలో కూడా నెంబర్‌వన్‌గా మారనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నగరంలో స్ట్రీట్‌ఫుడ్ కేంద్రాలు లెక్కకు మించి ఉండటం తెలిసిందే. వారు సరైన శుచి శుభ్రత పాటించకపోవడంతో తాగే నీటి నుంచి తినే ఆహారపదార్థాల వరకు కలుషితమవుతున్నాయి. కొనుగోలుకు ముందే పప్పులు ఉప్పుల నుంచి నూనెల దాకా జరుగుతున్న కల్తీ వల్ల పరిస్థితులు మరింత విషమంగా మారుతున్నాయి. కల్తీ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ, ఐపీఎంలలోని ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్ఎంసీలో కేవలం ముగ్గురు మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండేవారు. కోటికి జనాభా ఉన్న నగరానికి ముగ్గురు సరిపోనందునే ఆహారకల్తీని కట్టడి చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు పేర్కొనేవారు. పరిస్థితిని గ్రహించిన ప్రభుత్వం కొత్తగా ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లను నియమించడంతో వారి సంఖ్య 22కు పెరిగింది. అయినా పరిస్థితి గతం కంటే భిన్నంగా కనిపించడం లేదు. లెక్కల్లో మాత్రం తనిఖీల సంఖ్య పెరిగినప్పటికీ, గుర్తించిన కల్తీదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎఫ్ఎస్ఎస్ఏ ఉన్నప్పటికీ.. కల్తీ నిరోధానికి ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్(ఎఫ్ఎస్ఎస్ఏ) ఉన్నప్పటికీ అది అమలవుతున్న దాఖలాల్లేవు. ఈ యాక్ట్ మేరకు, అన్ని ఆహార విక్రయ కేంద్రాలతోపాటు ఉత్పత్తి కేంద్రాల వివరాలు జీహెచ్ఎంసీ ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో తనిఖీలు జరగాలి. కల్తీని బట్టి కఠిన చర్యలుండాలి. ఉత్పత్తి స్థానం నుంచి ప్యాకింగ్, రవాణా, విక్రయం, వినియోగం వరకు ఎక్కడా కల్తీ జరగకుండా ఉండాలంటే తగిన ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాలి. కానీ ఇందులో ఏదీ అమలు జరగడం లేదు. కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే రూ. 10 లక్షల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు జైలుశిక్ష విధించవచ్చు. కల్తీని నిర్ధారించేందుకు తగినన్ని పరీక్షల కేంద్రాలుండాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఒకే పరీక్షా కేంద్రం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా పరీక్షాకేంద్రమంటూ లేకపోవడాన్ని జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలోనూ సభ్యులు ప్రస్తావించారు వీటిల్లో కల్తీ ఎక్కువ.. కల్తీ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారమున్న వాటిల్లో టీ పొడి నుంచి నూనెల దాకా ఎన్నో ఉన్నాయి. పాలు, తేనె, మసాలా దినుసులు, ఐస్‌క్రీమ్స్, తృణధాన్యాలు, పిండి, కాఫీ, టొమాటో సాస్, విజిటబుల్ ఆయిల్స్, నెయ్యి తదితరమైనవి వీటిల్లో ఉన్నాయి. ఈ కల్తీవల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. జంతు కళేబరాలు, కొవ్వు , ఎముకల నుంచి తయారు చేస్తున్న కల్తీనూనె నగరంలో ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లకు తెలిసినా పట్టించుకోవడం లేదు. చర్యలే లేవు.. పెద్దహోటళ్లనుంచి చిన్నతోపుడు బండ్ల దాకా ఆహారకల్తీపై కానీ.. పరిసరాల పరిశుభ్రత గురించి కానీ పట్టించుకుంటున్నవారు లేరు. పనిఒత్తిడి , వంట చేసుకునే సమయంలేక ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకుంటున్న వారు పెరిగిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పాడైపోయిన, తినడానికి పనికిరాని ఆహారాన్నే పంపిణీ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో శుచి లేకపోవడం, కల్తీ వంటివి నిరాటంకంగా జరుగుతున్నాయి. – భూషణ్‌చారి, అంబర్‌పేట -
పేదలకు ఆహార భద్రత.. రైతులకు కనీస మద్దతు ధర
సాక్షి, అమరావతి: పేదలు పస్తులుండకుండా.. ఆహార భద్రత ప్రమాదంలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. మరోవైపు మానవాళి మనుగడకు వ్యవసాయం కీలకమని గ్రహించి రైతుల పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేస్తోంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఒకవైపు పేదలకు ఆహార భద్రత కింద భరోసా కల్పించడం.. మరోవైపు రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటంతో పేదలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం) ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,868 ప్రకారం కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వమే రైతుల కళ్లాల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు.. ఆహార భద్రత చట్టం అమలుకు వేల కోట్లు ఖర్చు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకాడటం లేదు. వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు బియ్యం కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున కిలో రూ.1కే బియ్యం పంపిణీ చేస్తోంది. అంత్యోదయ అన్నయోజన కార్డున్న కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు 6 నెలల నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీల ద్వారా ఉచిత పౌష్టికాహారం అందిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. (చదవండి: పెట్టుబడి.. గిట్టుబాటు కావాలి: సీఎం జగన్) ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఆహార భద్రత చట్టం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో 1.52 కోట్లకు పైగా బియ్యం కార్డులున్నాయి. వీటి కోసం ప్రతి నెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. ఆహార భద్రత చట్టం ప్రకారం.. పట్టణాల్లో 40 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం కార్డుదారులకు మాత్రమే కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన వారికి సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. దీంతో ఏటా రూ.5 వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతోంది. కొనసాగుతున్న ఉచిత సరుకుల పంపిణీ కోవిడ్ సమయంలో ఉపాధి లేక పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నెలకు ఒక్కో వ్యక్తికి 10 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల పప్పు దినుసులు ఏప్రిల్ నుంచి ఉచితంగా పంపిణీ చేస్తోంది. బియ్యం కార్డుల్లో నమోదై ఉన్న 4.47 కోట్లకు పైగా కుటుంబ సభ్యులకు ఉచితంగా సరుకులు అందుతున్నాయి. ఇప్పటికే రూ.13 వేల కోట్ల విలువ చేసే బియ్యం, రూ.1,500 కోట్ల విలువ చేసే పప్పు దినుసులు పేదల ఇళ్లకు ఉచితంగా చేరాయి. ప్రస్తుతం 15వ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 20 నుంచి 16వ విడత ఉచిత సరుకులను పంపిణీ చేస్తారు. -
బియ్యంతో పాటే కందిపప్పు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును సైతం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే వారికి కిలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దీనిపై అధికారిక అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కంది పప్పు సరఫరా చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 2.80 కోట్ల మందికి 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పంపిణీని రెండ్రోజుల కిందట ఆరంభించినప్పటికీ కేంద్రం 5 కిలోల మేర పంపిణీ చేస్తామని చెప్పడంతో నిలిపివేసింది. కేంద్రం అందించే సుమారు 97 వేల మెట్రిక్ టన్నుల బియ్యంపై మార్గదర్శకాలు అందిన వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. కేంద్రం లెక్కల మేరకు 27 వేల టన్నుల కందిపప్పు రాష్ట్రానికి అందించాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర సంస్థ నాఫెడ్ ద్వారా తీసుకుని రాష్ట్రాలకు అందించాల్సి ఉంది. దీనిపై ఇంకా రాష్ట్రాలకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును లబ్ధిదారులకు అందించనున్నారు. రేషన్‌పై ప్రజల ఆరా... పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రేషన్ బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై లబ్ధిదారులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. మూడ్రోజులుగా శాఖ హెల్ప్ లైన్‌నంబర్లకు 1,500 ఫోన్లు రాగా ఇందులో అధికంగా బియ్యం పంపిణీ, ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500లను ఎప్పటినుంచి వేస్తారనే విషయాన్ని అడుగుతున్నా రని అధికారులు వెల్లడించారు. కుటుంబాల బ్యాంకు ఖాతాల అంశం కొలిక్కి వచ్చిన వెంటనే నేరుగా ఖాతాల్లో డబ్బు పడుతుందని అధికారులు తెలిపారు. -
హద్దులు దాటిన అక్రమాలు!
రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతోంది. గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. వందల క్వింటాళ్ల మేర రోజూ పక్క రాష్ట్రా లకు తరలుతోంది. డీలర్లు, రేషన్ దుకాణాల స్థాయిలో పటిష్ట వ్యవస్థ ఏర్పాటు కావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడ్డా, క్షేత్ర స్థాయిలో తయారైన దళారీలు పేదల నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల నుంచి రైళ్లు, ట్రక్కుల్లో బియ్యాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తు న్నారు. ఆహార భద్రత చట్టం కింద తెలంగాణలో మొత్తంగా 1.91 కోట్ల మందిని అర్హులుగా తేల్చిన కేంద్రం వీరి అవసరాల మేరకు బియ్యాన్ని సరఫరా చేస్తోంది. నిజానికి రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం కింద అర్హత సాధించిన వారి సంఖ్య 2.8 కోట్ల వరకు ఉంది. అదీగాక ఆహార భద్రత చట్టం కింద కేంద్రం తలా 4 కేజీల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుండగా రాష్ట్రం దానికి అదనంగా మరో రెండు కిలోలు కలిపి 6 కిలోలు రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఏటా 18 లక్షల మెట్రిక్ టన్నుల మేర బియ్యం అవసరమవుతోంది. దీనికి సబ్సిడీ కింద ఏటా ప్రభుత్వం రూ.2.200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. బియ్యాన్ని ప్రతి నెలా 1 నుంచి 15 లోపు అర్హులకు పంపిణీ చేస్తున్నారు. ఈ తర్వాతే అసలు కథ మొదలవుతోంది. రేషన్ పంపిణీ ముగిశాక దళారులు, అక్రమ వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండే గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గిరిజనులు ఎక్కువగా జొన్నలు, గోధుమలపై ఆధారపడే వంటకాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారి నుంచి దళారులు కేజీ రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్కువ మంది దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్ట పడట్లేదు. అలాంటి వారి నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి వారికి గోధుమలు, జొన్నలు ఇస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని అక్రమార్కులు పలు మార్గాల ద్వారా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం.. ఎక్కువగా అక్రమ వ్యాపారులు ప్యాసింజర్ రైళ్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, రామ గుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల ద్వారా ఈ దందా యథే చ్ఛగా సాగుతోంది. జమ్మికుంట, ఓదెల, కొత్తపల్లి, పెద్దపల్లి, రామ గుండం, మంచిర్యాల, మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో నుంచి నిత్యం వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం పలు రైళ్లలో మహారాష్ట్రకు తరలు తున్నాయి. రాత్రి వేళల్లో అధికారుల తనిఖీలు తక్కువగా ఉంటా యనే ఉద్దేశంతో అక్రమ వ్యాపారులు వీటిని రాత్రి వేళల్లో రైళ్లలో తరలిస్తున్నారు. ప్రయాణికుల సీట్ల కింద, మరుగుదొడ్ల క్యాబిన్లలో వేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధి కారులకు దొరుకుతున్నా అక్రమ వ్యాపారులు మాత్రం తప్పించు కుంటున్నారు. దొడ్డు బియ్యాన్ని మరపట్టించి దోశ, ఇడ్లీ, బియ్యం రొట్టెల్లో మన బియ్యాన్నే వాడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర హోటళ్లకు మన బియ్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా బోధన్, బిచ్కుంద, పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతాల నుంచి ట్రక్కులు, లారీల ద్వారా మహారాష్ట్రలోని నాందేడ్, సిరొంచలకు తరలిస్తున్నారు. ఇటీవలే పెద్దపల్లి జిల్లా కాటారం వద్ద మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్న సుమారు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా కూడా మహారాష్ట్రకు బియ్యం తరలుతోంది. సరిహద్దు ప్రాంతాల నుంచీ అధికమే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగుతోంది. గిరిజన తండాలు, మారుమూల పల్లెల నుంచి ఏజెంట్లను పెట్టుకొని వ్యాపారులు దందా చేస్తున్నారు. గ్రామాల వారీగా బియ్యాన్ని సేకరించి, ఆటోల ద్వారా గోడౌన్లకు తరలించి, ఒక లారీ లోడు సిద్ధమయ్యాక పలు రైస్‌మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్ చేసి బ్రాండ్ పేరుతో 25 కేజీల బ్యాగ్ తయారు చేసి ఆంధ్రా సరిహద్దులు దాటిస్తు న్నారు. గత నెలలో ఇదే జిల్లాలో 9న అనంతారం వద్ద లారీలో అక్ర మంగా తరలుతున్న 250 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దుగా ఉన్న వికారాబాద్ జిల్లా కొడంగల్, నారాయణపేట, మక్తల్‌ల పరిధిలోనూ ఈ రవాణా తీవ్రంగా ఉంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండటంతో అడిగేవారు, తనిఖీలు చేసే వారు లేకపోవడంతో యథేచ్ఛగా బియ్యం అక్రమంగా తరలిపోతోంది. దీని నివారణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన జాడే లేదు. కర్ణాటక చెక్ పోస్టులు మాత్రమే ఉండటంతో వాటిని దాటి నిరాటంకంగా వ్యాపారం సాగుతోంది. ఆ అక్రమ వ్యాపారం నిరోధానికి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తోంది. ఈ టాస్క్‌ఫోర్స్ మూడు నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 వేల క్వింటాళ్ల మేర పీడీఎస్ బియ్యం పట్టుకొని 60 మేర కేసులు నమోదు చేసి దందాకు ఫుల్స్టాప్ మాత్రం పడట్లేదు. -
మధ్యాహ్న భోజనం పెట్టకుంటే డబ్బులివ్వాలి!
► వరుసగా 3 రోజులు పథకం అమలుకాని స్కూళ్లకు వర్తింపు ► ఒక్కో విద్యార్థికి సంబంధిత స్కూలు రూ. 31 చెల్లించేలా నిబంధన ► తప్పిదాలకు పాల్పడే ఏజెన్సీలు, అధికారులపైనా కఠిన చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం అమల్లో సంస్కరణలు తెచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆహార భద్రత చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకం నిబంధనలను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్కూ లు విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు భోజనం పెట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేసే స్కూలు (విద్యాశాఖ) సంబంధిత విద్యార్థులకు ఆ మూడు రోజులకు విద్యార్థులకు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేలా నిబంధనల్లో విద్యాశాఖ మార్పులు చేస్తోంది. రోజూ 200 గ్రాముల చొప్పున బియ్యానికి అయ్యే ఖర్చుతోపాటు ఒక్కో విద్యార్థికి అవసరమయ్యే కూరగాయలు, వండిపెట్టేందు కు రోజుకు ఇస్తున్న రూ. 4.70 చొప్పున మొత్తంగా మూడు రోజులకు రూ. 31కిపైగా సంబంధిత పాఠశాల చెల్లించాల్సి ఉంటుం ది. అలాగే మూడు రోజులపాటు భోజనం ఎందుకు పెట్టలేదన్న విషయంలో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయట్లేదన్న ఆరోపణలు వస్తుండటంతోపాటు 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్థులను చూపుతూ ఏజెన్సీలు, సిబ్బంది బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించకపోయినా, తప్పిదాలకు పాల్పడినా మధ్యాహ్న భోజనం వండిపెట్టే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు చేపట్టేలా విద్యాశాఖ నిబంధనలు రూపొందించింది. మెనూ అమలు చేయకపోయినా, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోయినా సంబంధిత ఏజెన్సీని రెండుసార్లు హెచ్చరించనుంది. అయినా తీరు మార్చుకోకపోతే ఆ ఏజెన్సీని రద్దు చేయనుంది. ఈ మేరకు రూపొందించిన నిబంధనల ఆమోదం కోసం విద్యాశాఖ రెండు నెలల కిందటే ప్రభుత్వానికి ఫైలు సమర్పించింది. రాష్ట్రంపై తగ్గనున్న ఆర్థిక భారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులిస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అదనంగా 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 9 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. 200 కోట్ల వరకు రాష్ట్రం అదనంగా వెచ్చిస్తోంది. అయితే సెకండరీ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రమణియన్ కమిటీ సిఫారసు చేసింది. సెకండరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు, కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించేందుకు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ సిఫారసులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. నూతన విద్యా విధానంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని చేర్చాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది. -
సబ్సిడీలు @ 2.46 లక్షల కోట్లు!
ఆహార భద్రతకు రూ.1.15 లక్షల కోట్లు ఇంధనానికి రూ.65 వేల కోట్లు న్యూఢిల్లీ: అటు ఆహార భద్రత చట్టం.. ఇటు ఇంధన, ఎరువుల రాయితీలు.. వెరసి వచ్చే ఆర్థిక సంవత్సరం సబ్సిడీల మోత మోగనుంది. 2014-15కుగాను సబ్సిడీల కింద ఏకంగా రూ.2.46 లక్షల కోట్లు వెచ్చిస్తామని ఆర్థికమంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుకు రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. ఈ చట్టం అమలుకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ కేటాయింపులే నిదర్శనమని చిదంబరం చెప్పారు. కాగా ఎరువుల సబ్సిడీకి కిందటేడాది ఎంత ఇచ్చారో ఇప్పుడూ అంతే మొత్తాన్ని (రూ.67,970 కోట్లు) కేటాయించారు. ఇవి ఏ మూలకూ సరిపోవని భారత ఎరువుల సంఘం (ఎఫ్ఏఐ) డెరైక్టర్ జనరల్ సతీశ్ చందర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యాంశాలివీ.. - 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర కేటాయింపులు.. రూ.12,07,892 కోట్లు. ఇందులో ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీకి రూ.2.46 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14 సవరించిన అంచనాల్లో ఈ మొత్తం రూ.2.45 లక్షల కోట్లుగా ఉంది. - ఇంధన సబ్సిడీకి రూ.65 వేల కోట్లు కేటాయించారు. - ఆహార సబ్సిడీకి 2013-14 సవరించిన అంచనాల్లో రూ.92 వేల కోట్లు కేటాయించారు. అయితే ఆ నిధులకు మరో రూ.23 వేల కోట్లు అదనంగా ఇస్తూ 2014-14కు మొత్తం రూ.1.15 లక్షల కోట్లు కేటాయించారు. - ఎరువుల సబ్సిడీకి రూ.67,970 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యూరి యాకు రూ.12,300 కోట్లు, దేశీయ యూరియా సబ్సిడీకి రూ.31 వేల కోట్లు, ఫాస్పేట్, పొటాషియం వంటి (డీ-కంట్రోల్డ్ ఫెర్టిలైజర్స్) ఎరువులకు రూ.24,670 కోట్లు కేటాయించారు. బియ్యంపై సేవా పన్ను మినహాయింపు బియ్యం లోడింగ్ దశ నుంచి గిడ్డంగుల్లో నిల్వ చేసే దశ వరకూ వసూలు చేస్తున్న సేవా పన్నును మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ‘‘ఆర్థిక చట్టం-2012లో వ్యవసాయ ఉత్పత్తి నిర్వచనం ప్రకారం వరి నిల్వలకు మాత్రమే సేవాపన్ను నుంచి మినహాయింపు ఉంది. బియ్యాన్ని వరి నుంచి శుద్ధి చేసిన వస్తువుగా నిర్వచనంలో పేర్కొన్నందున మినహాయింపు ఇవ్వలేదు. అయితే ఈ తేడా కృత్రిమంగా ఉన్నందువల్ల బియ్యం లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, నిల్వ దశ వరకూ సేవా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నా’’ అని చెప్పారు. రాష్ట్రాలకు 3.38 లక్షల కోట్లు కేంద్రం సహాయమందించే పథకాలు (సీఎస్ఎస్)లకు రాష్ట్ర ప్రణాళిక కింద బడ్జెట్లో భారీగా నిధులు పెంచారు. రూ. 3,38,562 కోట్లను ఆ పథకాలకు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది సవరించిన అంచనాల కంటే రూ. 1,19,039 కోట్లు అధికంగా ఉంది. గత బడ్జెట్లో ఈ పథకాలకు రూ. 1,36,254 కోట్లు కేటాయించారు. ప్రణాళిక బడ్జెట్లో మధ్యాహ్న భోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర సీఎస్‌ఎస్‌ల అమలుకు అదనంగా సహాయం అందనుంది. ప్రస్తుతం 17 ప్రధాన పథకాల కింద అమలవుతున్న 122 స్కీంలను 66కు కుదించాలని యోచిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ. 34,000 కోట్లు, సర్వశిక్ష అభియాన్‌కు రూ. 27,635 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. 13,152 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌కు రూ.4,965 కోట్లు కేటాయించారు. అలాగే ఐసీడీఎస్‌కు కేంద్ర సహాయం కింద రూ. 18,631కోట్లు, గ్రామీణ గృహనిర్మాణానికి రూ.16,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు రూ. 13,000 కోట్లు అందించనున్నారు. సంపన్నులపై ఈ ఏడాది కూడా ఆర్థిక మంత్రి పి. చిదంబరం కనికరం చూపించలేదు. 2013-14 బడ్జెట్లో విధించిన సూపర్ రిచ్ పన్నును వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని ఆయన తన తాజా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించారు. యూపీఏ పదేళ్ల హయాంలో గ్రామీణ రోడ్ల నెట్వర్క్ ఏడు రెట్లు పెరిగిందని చిదంబరం తెలిపారు. 2004లో 51,511 కిలోమీటర్లుగా ఉన్న గ్రామీణ రోడ్ నెట్వర్క్ ప్రస్తుతానికి 3,89,578 కి.మీ.కు పెరిగిందని వివరించారు. గతంతో పోలిస్తే ఈ సారి బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు 16 శాతం అదనంగా రూ. 59,387 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఆధునీకరణకు చిదంబరం ప్రాధాన్యం ఇచ్చారు. దీంతోపాటు భద్రతాపరమైన వ్యయానికి రూ. 789.08 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణకు రూ. 600 కోట్లు, ఢిల్లీలో మహిళల భద్రతకు రూ. 2 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.