సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును సైతం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే వారికి కిలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దీనిపై అధికారిక అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కంది పప్పు సరఫరా చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 2.80 కోట్ల మందికి 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పంపిణీని రెండ్రోజుల కిందట ఆరంభించినప్పటికీ కేంద్రం 5 కిలోల మేర పంపిణీ చేస్తామని చెప్పడంతో నిలిపివేసింది. కేంద్రం అందించే సుమారు 97 వేల మెట్రిక్ టన్నుల బియ్యంపై మార్గదర్శకాలు అందిన వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. కేంద్రం లెక్కల మేరకు 27 వేల టన్నుల కందిపప్పు రాష్ట్రానికి అందించాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర సంస్థ నాఫెడ్ ద్వారా తీసుకుని రాష్ట్రాలకు అందించాల్సి ఉంది. దీనిపై ఇంకా రాష్ట్రాలకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును లబ్ధిదారులకు అందించనున్నారు.
రేషన్‌పై ప్రజల ఆరా...
పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రేషన్ బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై లబ్ధిదారులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. మూడ్రోజులుగా శాఖ హెల్ప్ లైన్‌నంబర్లకు 1,500 ఫోన్‌లు రాగా ఇందులో అధికంగా బియ్యం పంపిణీ, ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500లను ఎప్పటినుంచి వేస్తారనే విషయాన్ని అడుగుతున్నా రని అధికారులు వెల్లడించారు. కుటుంబాల బ్యాంకు ఖాతాల అంశం కొలిక్కి వచ్చిన వెంటనే నేరుగా ఖాతాల్లో డబ్బు పడుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment