ఉచిత బియ్యం కోసం ఎదురుచూసిన నిరుపేదలకు అధికారులు రిక్తహస్తం చూపించారు. సుమారుమూడు లక్షల కుటుంబాలు అర్ధాకలితో అలమటించే పరిస్థితిలోకి నెట్టివేశారు. లాక్‌డౌన్ కష్టకాలంలో కొంతమంది పేదలకు ‘ఉచిత బియ్యం’ అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారాఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే
రేషన్ షాపులు మూసివేయడంతో ఆహార భద్రతకార్డు లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
సాక్షి,సిటీబ్యూరో: లాక్‌డౌన్ కష్టకాలంలో సుమారు మూడు లక్షలకు పైగా నిరుపేద కుటుంబాలకు ‘ఉచిత బియ్యం’ అందని దాక్షగా మారింది. పౌరసరఫరాల శాఖ అధికారుల తీరుతో ఉచిత బియ్యం అందుకోలేక పోయామన్న ఆవేదన పేద వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఈ నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన అధికారులు.. తొమ్మిది రోజుల ముందే రేషన్ షాపులు మూయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆహార భద్రతకార్డు కలిగిన నిరుపేద కుంటుంబాలకు ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వం రూ.1,500 ఆర్థిక సాయం ప్రకటించింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యుడు (యూనిట్)కు 12 కిలోల ఉచిత బియ్యం ప్రకటించడంతో నిరుపేదలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.
దీంతో ఉచిత బియ్యం పంపిణీ పాయింట్ల ముందు నిరుపేదలు పెద్ద ఎత్తున బారులు తీరారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల 15 తారీఖున రేషన్ సరుకుల పంపిణీ గడువు ముగుస్తుంది. దీంతో తమకు ఎక్కడ బియ్యం దక్కవోనని కనీసం పేదలు పెద్ద ఎత్తున షాపుల ముందు బారులు తీరారు. బియ్యం పంపిణీ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగుతుందని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. మరోవైపు పౌరసరఫరాలు శాఖ వెబ్‌సైట్‌లో అధికారికంగా ఈనెల 28న క్లోజింగ్ డేట్‌గా వెల్లడించింది. దీంతో పేదలు కొంత ఊపిరి పీల్చుకొని రద్దీ తగ్గిన తర్వాత ఉచిత బియ్యం అందుకుందామని భావించారు. కానీ ఈ నెల 21 గడువు ముగిసినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించడంతో గడువు నెలాఖరు వరకు ఉందన్న ఆశతో ఇప్పటి వరకు బియ్యం అందుకోని నిరుపేదలకు నిరాశే మిగిలినట్లయింది.
ఇదీ లేక్క..
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తం 16,00,930 ఆహార భద్రతకార్డులున్నాయి. ఇందులో 15,13,317 కార్డుదారులు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సైతం స్థానికేతరులైన 2,18,747 కార్డుదారులకు స్టేట్ రేషన్ పోర్టబిలిటీ ద్వారా ఉచిత బియ్యం పంపిణీ జరిగింది. మొత్తం మీద గ్రేటర్ పరిధిలోని 12,94,570 కుటుంబాలు మాత్రమే ఉచిత బియ్యం అందుకున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో సుమారు 3,06,360 కుటుంబాలకు ఉచిత బియ్యం అందని ద్రాక్షగా మారినట్టు కనిపిస్తోంది. దీంతో పౌరసరఫరాల అధికారుల తీరుపై పేదలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment