
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమవుతోంది. పాక్షిక లాక్‌డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ ప్రభుత్వ పాఠశాలల మూసివేత తదితర అంశాలపై ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కరోనా స్థితిగతులపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. సినిమా హాళ్లు, జనసమ్మర్థ ప్రాంతాలపై ఆంక్షలు విధించే యోచన చేస్తోంది. తెలంగాణలో పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ అదుపులో ఉన్నా కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో వారాంతాల్లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారంలో మూడ్రోజులపాటు లాక్‌డౌన్ విధింపు లేదా రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలపైనా ఉత్కంఠ నెలకొంది. ఈనెల 26వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందుగానే సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు మూడ్రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment