రుణమే శరణ్యం!  | Telangana Government Focusing To Increase State Government | Sakshi
Sakshi News home page

రుణమే శరణ్యం! 

Published Tue, Jul 14 2020 3:35 AM | Last Updated on Tue, Jul 14 2020 8:08 AM

Telangana Government Focusing To Increase State Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా, లాక్‌డౌన్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణ పరిమితి వెసులుబాటును ఆసరాగా చేసుకుని వీలున్నంత మేర రుణ సమీకరణతో పాటు సొంత ఆదాయ వనరులను పెంచుకునే దిశలో ముందుకెళుతోంది. 2020–21 బడ్జెట్‌ అంచనాలు తొలి త్రైమాసికంలోనే తలకిందులైన నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్థంకల్లా భారీగా నిధులు సమకూర్చుకునే ప్రణాళికలను ఆర్థికశాఖ సిద్ధం చేసుకుంటోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా నెలవారీ ఖర్చులు, అనివార్య చెల్లింపులకు ఇబ్బందుల్లేకుండా రాబడులు పెంచుకునే దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పేదలు, రైతులకు ఇబ్బంది కలగకుండా పన్నులు పెంచడం, ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల మార్కెట్‌ ధరల సవరణ వంటి అంశాలను అమల్లోకి తేవాలని భావిస్తోంది. 

వీలైనంతగా రుణ సమీకరణ 
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల మనుగడకు ఈ ఏడాది రుణ సమీకరణే శరణ్యమని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. ప్రభుత్వానికి ఓపెన్‌ మార్కెట్లో ఉన్న రుణ పరపతికి తోడు, జీఎస్‌డీపీ సామర్థ్యాన్ని బట్టి 5 శాతం వరకు రుణాలు తెచ్చుకునే అవకాశం కేంద్రం ఇవ్వడంతో బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.33 వేల కోట్ల రుణ సమీకరణకు అదనంగా మరో రూ.15 వేల కోట్లు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు కలిగింది.

దీంతో ఈ ఏడాది ఆ మేరకు రుణ సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి త్రైమాసికంలోనే రూ.12 వేల కోట్ల రుణ సమీకరణ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు త్రైమాసికాల్లో కలిపి మరో రూ.36 వేల కోట్లు అప్పు (ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే) తెచ్చుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించే యోచనలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అప్పులు తెచ్చుకునేందుకు ఇటీవలే ఆర్డినెన్స్‌ సైతం జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌తో రూ.9.7లక్షల కోట్ల జీఎస్‌డీపీలో 5 శాతం రుణ సమీకరణకు మార్గం సుగమమైంది.

సొంత ఆదాయం కొంత పెంచుకోవాలని.. 
♦ సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంలో భాగంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల మార్కెట్‌ ధరల సవరణ ప్రతిపాదనకు పరిష్కారం చూపనుంది. వాస్తవానికి, తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో భూముల విలువలు సవరించలేదు. దీంతో ఆరేళ్లుగా రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయాన్ని కోల్పోతోంది. వీటిని సవరించాలని పలుమార్లు డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం పక్కనపెట్టింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మార్కెట్‌ విలువల సవరణ ప్రభుత్వ ఆదాయం పెంపునకు ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉన్న భూముల విలువల్ని ప్రాంతాన్ని బట్టి 10–20 శాతం పెంచడం ద్వారా ఏటా రూ.3వేల కోట్ల వరకు అదనపు రాబడి సమకూర్చుకునే ప్రతిపాదనను ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది.  
♦ ఎక్సైజ్‌ శాఖ ద్వారా కూడా ఆదాయ వనరులను శాశ్వతంగా పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇటీవల కోవిడ్‌ సెస్‌ పేరుతో సగటున 16 శాతం మద్యం ధరలు పెంచింది. తద్వారా ప్రతి నెలా రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి మందుబాబుల జేబుకు చిల్లు తప్పదని ఎక్సైజ్‌ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పెరిగిన ధరల మేరకు మద్యం కంపెనీలతో అమ్మకపు ఒప్పందం కుదుర్చుకునే ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది పూర్తయ్యాక ఇప్పటికిప్పుడు కాకున్నా, త్వరలో మద్యం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రూపేణా ఏటా రూ.1,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. 
♦ వాహన పన్ను, గ్రామాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు, ఐదేళ్లుగా పెరగని మద్యం డిస్టిలరీల లైసెన్స్‌ ఫీజు పెంపు, గనులు, ఇసుక రీచ్‌ల ద్వారా పారదర్శకంగా ఆదాయం రాబట్టుకోవడం లాంటి అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, పన్నుల పెంపు విషయంలో సీఎం కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది కీలకమని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టామని ఆర్థికశాఖ చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement