బ్యాంకులకు వస్తలేరు.. | Bank Deposits Gone Down Due To Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు వస్తలేరు..

Published Sat, May 23 2020 4:44 AM | Last Updated on Sat, May 23 2020 4:44 AM

Bank Deposits Gone Down Due To Lockdown In Telangana - Sakshi

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని ఓ బ్యాంకులో ప్రతిరోజూ సగటున రూ.50 లక్షల డిపాజిట్లు వచ్చేవి. దాదాపు 300 మంది ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి వివిధ రకాల సేవలు పొందేవారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా పరిస్థితి మారింది. బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య 50కి మించట్లేదు. అలాగే నగదు డిపాజిట్లు రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలోనే ఉంటున్నాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఖాతాదారుల తాకిడి పూర్తిగా తగ్గిపోతోంది. గతంలో సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రస్తుతం సా.4 గంటలు దాటగానే బ్యాంకుకు తాళం పడుతోంది. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌.. బ్యాంకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో బ్యాంకుల్లోని లావాదేవీల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాంకేతిక సేవలు విస్తృతం అవుతున్న తరుణంలో నగదు జమలు, ఉపసంహరణ కోసం బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు ప్రస్తుతం క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్లు (సీడీఎం), ఏటీఎం మెషీన్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుండగా.. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింతగా మారింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం, శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించడం వంటి నిబంధనలను బ్యాంకులు కఠినతరం చేశాయి. దాదాపు 2 నెలలుగా రోజువారీగా బ్యాంకుకు వచ్చే ఖాతాదారుల సంఖ్య సగానికి తగ్గింది. లాక్‌డౌన్‌కు ముందు పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతానికిపైగా తగ్గినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. రోజువారీగా వచ్చే డిపాజిట్లు సైతం 40 శాతానికి తగ్గినట్లు పేర్కొంటున్నారు.

సడలింపుల తర్వాత.. 
ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెలాఖరు వరకు అమలవుతుంది. ఆ తర్వాత పొడిగింపు ఉంటుందా.. లేదా అనే దానిపై ఇంకా సందిగ్ధం ఉన్నా.. ప్రస్తుతం ఇచ్చిన సడలింపులు మార్కెట్లో వ్యాపారులకు భారీ ఊరటనిచ్చింది. ఈ పరిస్థితులతో బ్యాంకుల్లోనూ కాస్త సందడి నెలకొన్నా.. రోజువారీ లావాదేవీల్లో పెద్దగా మార్పులు రాలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. సడలింపులు ఇప్పుడిప్పుడే మొదలుకావడంతో కొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.

సాధారణంగా బ్యాంకుకు వచ్చే కస్టమర్లలో రోజువారీ లావాదేవీలు జరిపే వారిని పక్కనబెడితే రుణగ్రహీతలే బ్యాంకుకు కీలకం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త రుణాల మంజూరీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదివరకు తీసుకున్న రుణాలపై టాప్‌అప్‌ తీసుకోవడం, రీ షెడ్యూలింగ్‌ తదితర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే వ్యాపార సంస్థలు తెరుచుకుంటుండగా.. వాటి లావాదేవీలు ఇంకా ఊపందుకోలేదు. దీంతో బ్యాంకుల్లో నగదు జమలు ఇంకా పెరగట్లేదు. మరోవైపు రెడ్‌జోన్లలో కొత్త ఖాతాలు ఇవ్వొద్దనే సూచనలు డిపాజిట్లపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

11 శాతం పెరిగిన సీడీఎం డిపాజిట్లు.. 
బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేందుకు భౌతిక దూరం పాటించడంతో ఎక్కువ సమయం పడుతుందన్న భావన ఖాతాదారుల్లో ఉంది. దీంతో బ్యాంకులో కాకుండా సమీపంలోని సీడీఎంలో డిపాజిట్‌ చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. గత రెండు నెలల్లో సీడీఎం డిపాజిట్లు 11 శాతం పెరిగినట్లు నగరంలోని ఓ నేషనలైజ్డ్‌ బ్యాంకు చేసిన పరిశీలన చెబుతోంది. మరోవైపు బ్యాంకింగ్‌ సేవలను విస్తృతం చేసేందుకు బ్యాంకు మిత్ర (బీఎం), బిజినెస్‌ కరస్పాండెంట్‌(బీసీ)లను ప్రతి బ్యాంకు అందుబాటులోకి తెచ్చింది. మేజర్‌ పంచాయతీలతో పాటు 2, 3 గ్రామాలు కలిపేలా ఒక బీఎం, బీసీ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఆయా నిర్వాహకులకు బ్యాంకులు కమీషన్ల రూపంలో చెల్లింపులు చేస్తుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో బీఎం, బీసీ పాయింట్ల వల్ల ఖాతాదారులకు ఊరట లభించిందని శంషాబాద్‌లోని ఓ బ్యాంకు కార్యనిర్వాహణాధికారి ‘సాక్షి’తో అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement