Kandi Pappu
-
నిత్యావసర ధరలకు రెక్కలు.. కిందకు దిగని కందిపప్పు
హైదరాబాద్: నిరంతరం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. తాజాగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 200కు చేరుకుని, సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. తరచూ పప్పు తినేవారు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా సామాన్యులకు కందిపప్పు అందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా అరకొరగానే అందుతోంది. దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది ఎలా? అని తల పట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటితే పప్పులతో సరిపెట్టుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు వాటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని వాపోతున్నారు. -
రూ.67కే కందిపప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా సబ్సిడీపై కందిపప్పును పంపిణీ చేస్తూ ప్రభుత్వం పేదలకు ఊరటనిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.110కి పైగా ఉండటంతో సామాన్యులపై భారాన్ని తగ్గించేలా ఒక్కో కార్డుదారుడికి కిలో రూ.67కే ప్రభుత్వం అందిస్తోంది. అవసరమైన నిల్వలను కొత్త జిల్లాల వారీగా పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన కందిపప్పును కిలో ప్యాకెట్ల రూపంలో పారదర్శకంగా సరఫరా చేస్తోంది. నెలకు 6,500 టన్నుల వినియోగం రాష్ట్రంలో 1.45 కోట్ల రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున పంపిణీ చేసేందుకు నెలకు 14,542 టన్నుల కందిపప్పు అవసరం అవుతుంది. ఐసీడీఎస్ పథకానికి మరో 1,097 టన్నులను వినియోగిస్తున్నారు. సగటున నెలకు రేషన్ దుకాణాల ద్వారా కేవలం 6,000 నుంచి 6,500 టన్నులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మండల నిల్వ కేంద్రాల్లో (ఎంఎల్ఎస్ పాయింట్లు) 1,771 టన్నుల సరుకు అందుబాటులో ఉంది. దీనికితోడు మరో 25 వేల టన్నుల సేకరణకు పౌరసరఫరాల శాఖ టెండర్లు ఖరారు చేసి సరఫరాకు అనుమతులు ఇచ్చింది. దీంతో మొత్తం 26,770 టన్నులు కందిపప్పు నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ లెక్కన మూడు నెలల పాటు ఎటువంటి అవరోధం లేకుండా సబ్సిడీపై కందిపప్పు అందించనున్నారు. పంచదార కిలో రూ.34 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అర కిలో ప్యాకెట్ల రూపంలో పంచదారను సబ్సిడీపై అందిస్తోంది. ఒక్కో కార్డుకు గరిష్టంగా కిలో వరకు రూ.34కు ఇస్తుండగా మరో మూడు నెలల వరకు సరఫరాకు అంతరాయం లేకుండా నిల్వలను సమకూర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో 4,442 టన్నుల పంచదార నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 15,335 టన్నుల సేకరణకు టెండర్లను ఖరారు చేశారు. ప్రతి నెలా 5,500–6000 టన్నుల వరకు వినియోగం ఉంటోంది. 3 నెలల వరకు ఢోకా లేదు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మూడు నెలల పాటు సబ్సిడీపై కందిపప్పు, పంచదార అందించేందుకు అవసరమైన నిల్వలను సమకూర్చాం. ఇప్పటికే టెండర్లు పూర్తవగా.. వేగంగా సరుకును సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. జిల్లాల్లో ఎక్కడైనా అత్యవసరంగా స్టాక్ అవసరమైతే పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేసేలా అధికారులను ఆదేశించాం. దాదాపు అన్ని మండల స్థాయి నిల్వ కేంద్రాలకు సరుకును అందుబాటులో ఉంచాం. వినియోగదారులకు రేషన్ పంపిణీలో జాప్యం జరగనివ్వం. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల శాఖ -
బియ్యంతో పాటే కందిపప్పు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును సైతం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే వారికి కిలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, దీనిపై అధికారిక అనుమతి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం, కంది పప్పు సరఫరా చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 2.80 కోట్ల మందికి 3.36 లక్షల టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పంపిణీని రెండ్రోజుల కిందట ఆరంభించినప్పటికీ కేంద్రం 5 కిలోల మేర పంపిణీ చేస్తామని చెప్పడంతో నిలిపివేసింది. కేంద్రం అందించే సుమారు 97 వేల మెట్రిక్ టన్నుల బియ్యంపై మార్గదర్శకాలు అందిన వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. కేంద్రం లెక్కల మేరకు 27 వేల టన్నుల కందిపప్పు రాష్ట్రానికి అందించాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర సంస్థ నాఫెడ్ ద్వారా తీసుకుని రాష్ట్రాలకు అందించాల్సి ఉంది. దీనిపై ఇంకా రాష్ట్రాలకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే రేషన్ బియ్యంతో పాటే కందిపప్పును లబ్ధిదారులకు అందించనున్నారు. రేషన్‌పై ప్రజల ఆరా... పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రేషన్ బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయమై లబ్ధిదారులు ఎక్కువగా ఆరా తీస్తున్నారు. మూడ్రోజులుగా శాఖ హెల్ప్ లైన్‌నంబర్లకు 1,500 ఫోన్లు రాగా ఇందులో అధికంగా బియ్యం పంపిణీ, ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500లను ఎప్పటినుంచి వేస్తారనే విషయాన్ని అడుగుతున్నా రని అధికారులు వెల్లడించారు. కుటుంబాల బ్యాంకు ఖాతాల అంశం కొలిక్కి వచ్చిన వెంటనే నేరుగా ఖాతాల్లో డబ్బు పడుతుందని అధికారులు తెలిపారు. -
కందిపప్పులో 'పందికొక్కులు'
సాక్షి, అమరావతి: చిన్నారుల నోటికాడ ముద్దనూ బొక్కేయడానికి వెనుకాడని దారుణం ఇదీ. మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు వండి పెట్టాల్సిన కందిపప్పు సరఫరా టెండర్లలో భారీ అక్రమాలకు తెరతీశారు. జిల్లాలవారీగా ఉన్న కందిపప్పు సరఫరా టెండర్‌ను రాష్ట్రస్థా యిలో కేంద్రీకృతం చేయడం ద్వారా రూ.65 కోట్ల దాకా కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మంత్రు లు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. దీనికి సంబంధించి న్యాయస్థా నంలో వ్యాజ్యాలు దాఖలైనా టెండర్లలో పాల్గొన్న కంపెనీల మధ్య సెటిల్మెంట్లు కుదిర్చి వాటాల వసూలుకు ప్రణాళిక రచించారు. హోల్‌సేల్ మార్కెట్లో కందిపప్పు కిలోకు రూ.52 లోపే ఉన్నా రూ.80కి పెంచి ఆమేరకు ముడుపులు పొందేందుకు పథకం వేశారు. 2 కోట్ల కిలోల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలకు రోజూ కందిపప్పును ఆహార పదార్థంగా వడ్డించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 20 గ్రాములు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిత్యం 30 గ్రాముల చొప్పున కందిపప్పును అందించాలి. రాష్ట్రంలోని 45,932 పాఠశాలల్లో 36,78,538 మంది విద్యార్థులకు ఏటా 2,10,10,497.20 కిలోల కందిపప్పు అవసరం. గతంలో మధాహ్న భోజన పథకం సరకులను జిల్లాలవారీగా కలెక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి సరఫరా చేశారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సరకుల సరఫరా టెండర్లను రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారు. దాదాపు రూ.165 కోట్ల విలువైన టెండర్‌ను తమకు నచ్చిన కంపెనీకి అప్పగించేలా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాదని ప్రైవేట్‌కు... కందిపప్పు సరఫరా కోసం పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది. ఏటా రూ. 145 కోట్ల టర్నోవర్‌తో గత మూడేళ్లలో రూ.435 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఇందులో పాల్గొనాలని నిబంధన విధించింది. ఎనిమిది సంస్థలు టెండర్లు దాఖలు చేయగా కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థకు మాత్రమే టెండర్ నిబంధనల్లో పేర్కొన్నట్లుగా రూ.145 కోట్ల టర్నోవర్ అర్హత ఉంది. తక్కిన ఏ సంస్థకూ ఆమేరకు టర్నోవర్ లేదు. టెక్నికల్ బిడ్లను తెరిచిన అధికారులు అర్హత ఉన్నా కృష్ణా సహకార మార్కెటింగ్ సంస్థను పక్కనపెట్టారు. విశాఖకు చెందిన కేంద్రీయ భాండార్, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నెల్లూరుకు చెందిన ఎంఎస్.పూరి జగన్నాథ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థల టెండర్లను మాత్రమే ఆమోదించారు. కిలో కందిపప్పు సరఫరాకు కేంద్రీయ భాండార్ రూ.87, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ రూ.86, పూరి జగన్నాథ్ ఎంటర్ప్రయిజెస్ సంస్థ రూ.84 చొప్పున టెండర్ దాఖలుచేశాయి. టర్నోవర్ నిబంధనల ప్రకారం వీటికి అర్హత లేకున్నా తక్కువ రేట్ కోట్ చేసిందంటూ పూరి జగన్నాథ్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ఉన్నా ఓకే... పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు పంపిణీ చేసే స్నాక్స్ సరఫరా చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఈ సంస్థ దాఖలు చేసిన పత్రాల్లో 2014–15లో రూ. 2.17 కోట్లు, 2015–16లో రూ. 1.18 కోట్లు, 2016–17లో 0.04 కోట్లు మాత్రమే టర్నోవర్ ఉంది. టెండర్ నోటిఫికేషన్ల ప్రకారం ఏటా 145 కోట్ల టర్నోవర్ లేకపోవడంతో అక్రమాలకు తెగబడింది. చెన్నైకి చెందిన అరుణాచల్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన టర్నోవర్‌ను తనదిగా పేర్కొంటూ టెండర్ పత్రాల్లో చూపించింది. పూరి జగన్నాథ్ సంస్థ మూడేళ్ల టర్నోవర్ దాదాపు రూ.3 కోట్లే ఉన్నా అరుణాచల్ ఇంపెక్స్ సంస్థ టర్నోవర్‌ను కలిపి రూ.523 కోట్లు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు టెండర్‌ను ఓకే చేసి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీలతో మంత్రుల సెటిల్మెంట్లు మరికొద్ది రోజుల్లో ఫైనాన్సియల్ బిడ్లను కూడా ఓపెన్ చేసి కందిపప్పు సరఫరా టెండర్‌ను ఖరారు చేయనున్నారు. నెల్లూరు చెందిన పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఓ మంత్రి ద్వారా తెరవెనుక వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విశాఖ కేంద్రీయ భాండార్, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు తమ జిల్లాకు చెందిన మంత్రిని కలిసి దీనిపై నివేదించడంతో ఇద్దరు మంత్రులూ కలసి ఈ మూడు సంస్థల మధ్య రాజీ కుదిర్చి వ్యవహారాన్ని సెటిల్ చేశారు. దీని ప్రకారం పూరి జగన్నాధ్ సంస్థకు 3 జిల్లాలు, కేంద్రీయ భాండార్‌కు 6 జిల్లాలు, నేషనల్ కోపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్‌కు 4 జిల్లాల్లో కందిపప్పు సరఫరా కాంట్రాక్టు అప్పగిస్తూ ఇద్దరు మంత్రులు సర్దుబాటు చేశారు. కిలో కందిపప్పు రూ.52 నుంచి రూ.79కి పెంపు ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 48 నుంచి 52 మధ్య మాత్రమే ఉంది. అయితే రూ. 27 నుంచి రూ. 30 మేర ధర అధికంగా పెంచి కిలో రూ.79 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 2.10 కోట్ల కిలోలు కొనుగోలు చేస్తున్నందున ధర ఇంకా భారీగా తగ్గుతుంది. రూ.52 చొప్పున 21010497.20 కిలోల కొనుగోలుకు రూ.109,25,45,854 అవుతుంది. కానీ ధరను రూ.79కి పెంచేయడంతో రూ. 165,98,29,278 కోట్లకు చేరింది. అంటే ఖజానాపై రూ.56,72,83,426 అదనంగా భారం పడనుంది. ఈ రూ.56.72 కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారనున్నాయి. అయితే హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నందున కిలో రూ.52 కన్నా ఇంకా తక్కువకే లభించే అవకాశం ఉంది. అప్పుడు ఈ ముడుపుల బాగోతం రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్లకు చేరుతుంది. ఇంత భారీగా ముడుపులు దక్కుతుండటంతోనే ఈ కాంట్రాక్టును రాష్ట్రస్థాయిలో కేంద్రీకృతం చేశారని చెబుతున్నారు. మార్క్‌ఫెడ్‌కు మొండిచేయి... తమ సంస్థకు అర్హత ఉన్నా టెండర్ల నుంచి పక్కకు తప్పించడం, తెరవెనుక వ్యవహారాలపై కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ప్రస్తుతం టెక్నికల్ టెండర్లో ఆమోదించిన పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు అర్హత లేకపోగా విశాఖకు చెందిన మిగతా రెండు సంస్థలు బ్లాక్‌లిస్టులో ఉన్నాయని ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రస్తుతం స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే భారీ ముడుపుల వ్యవహారం కావడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ ముఖ్యులతో సెటిల్మెంట్ చేయించారు. కేసును ఉపసంహరించుకుని తమకు కావాల్సిన మూడు సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ముక్కిపోతున్న కందులు కృష్ణా జిల్లా మార్కెటింగ్ సంస్థ ఛైర్మన్ కంచి రామారావు రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా అవసరమైన కందిపప్పును ప్రభుత్వమే కొనుగోలు చేసి మధ్యాహ్న బోజన పథకానికి అందచేస్తే తక్కువ ధరకే దక్కటంతోపాటు రైతులకు కూడా మేలు జరిగేది. రైతుల నుంచి కొనుగోలు చేసిన కందులను రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న మిల్లులకు అందించి కందిపప్పును మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేయిస్తే వేలాది మంది కార్మికులకు మేలు జరిగేది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన 80 వేల టన్నుల కందులు గోడౌన్లలో మగ్గుతున్నాయి. కానీ ముడుపులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు దీన్ని పట్టించుకోకుండా అర్హతలు లేని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధపడ్డారు. -
ప్చ్..‘పప్పు’ పుట్టడం లేదు..!
2 నెలలుగా రేషన్ దారులకు అందని కందిపప్పు * ధరలు పెరగడంతో కొనుగోలుకు ముందుకు రాని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు సరఫరా చేసే కందిపప్పునకు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. రెండు మాసాలు గా దీని సరఫరాను పూర్తిగా నిలిపేసిన ప్రభుత్వం ఈ నెల సైతం సరఫరాపై చేతులెత్తేసింది. అంతర్జాతీయంగా, జాతీయంగా కంది ధరలు పెరగడం, రాష్ట్రంలో సాగు తగ్గి దిగుబడులు లేకపోవడంతో వాటికి అనుగుణంగా కొనుగోలు చేసి, సబ్సిడీపై ఇవ్వడం భారం కావడంతో దాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. కనీసం సామాన్యుడికి కందిపప్పు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ ప్రభుత్వం విస్మరించడం ఆశ్చర్య పరుస్తోంది. అవసరానికి సరిపడా దొరకని తీరు.. మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం కాగా గత ఏడాది కేవలం 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లభించింది. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం 89లక్షల ఆహార భద్రతా కార్డులుండగా, ప్రతి కార్డుపై నెలకు కిలో రూ.50 వంతున 8,900 మెట్రిక్ టన్నుల కందిపప్పును పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయాలి. ఏడాది కాలంగా తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత 41శాతానికి పడిపోయింది. దీంతో ధర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.160 మధ్య ఉంటోంది. వీటికి టెండర్లు పిలిచినా దాల్‌మిల్లర్లు రూ.140కంటే తక్కువకు కోట్ చేసే పరిస్థితులు లేవు. తక్కువకు తక్కువ రూ.140 నుంచి 130కి కోట్ చేసినా, కిలో కందిపప్పునకు ప్రభుత్వంపై రూ.80 నుంచి రూ.90మేర భారం పడుతోంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో గడిచిన రెండు నెలలుగా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నెల సైతం సరఫరా చేయలేదు. దీంతో బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లు చేద్దామని భావించినా అక్కడ సైతం ధరలు ఉడికిస్తున్నాయి. గతంలో ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు దాల్మిల్లర్లతో చర్చలు జరిపి తక్కువ ధరకే టెండర్లు కోట్ చేసేలా ఒప్పించి సరఫరా చేసింది. బహిరంగ మార్కెట్లోనూ ధరలు అదుపులో ఉంచేం దుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం మలేషియా, దక్షిణాఫ్రికా,సింగపూర్, కెన్యా దేశాల నుంచి రాష్ట్రానికి దిగుమతి తగ్గడం,దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ ఈ ఏడాది సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపైఆధారపడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం విమర్శలకు గురవుతోంది. -
నాసిరకం కానుక
విశాఖపట్నం: బెల్లం దిమ్మ పాకంలా కారిపోతోంది. భరించలేని కంపుకొడుతోంది. కంది పప్పు ప్యాకెట్లలో కేసరిదాల్ (నిషేధించిన కందిపప్పు) కలిసిపోయింది. సగానికి పైగా పుచ్చిపట్టిన, అత్యంత నాసిరకమైన పప్పు. శనగపప్పు కూడా నాసిరకమే. ప్యాకెట్ నిండా పొల్లపప్పు, పుచ్చులు, పుల్ల ముక్కలు కలిసిపోయి ఉన్నాయి. గోధుమ పిండి రంపపు పొట్టు, తవుడు మయం. చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత నేతిబీరకాయ చందంగా ఉండగా.. తూకాల్లో వంద నుంచి 150 గ్రాముల తరుగు కన్పిస్తోంది. జిల్లాలో 10,84,404 బీపీఎల్ కార్డులున్నాయి. జన్మభూమి మావూరులో 1,43, 914 కార్డులు మంజూరుచేశారు. కానీ ఇప్పటి వరకు 2,175 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, నెయ్యి 93 శాతంచొప్పున, శెనగపప్పు 92,బెల్లం 91 శాతం చొప్పున డీలర్లకు చేరాయి. 12,26,321 సంచులు కావాల్సి ఉండగా 7.60లక్షల సంచులు జిల్లాకు చేరాయి..వాటిలో 5.27లక్షలు మాత్రమే డీలర్లకు చేరడంతో సంచుల సమస్య ప్రధానంగా మారింది. గతనెల 23 నుంచి ప్రారంభించిన క్రిస్మస్ కానుక పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించారు. మొత్తం కార్డుల్లో 15 శాతం క్రిస్మస్ కానుక కింద పంపిణీ జరుగుతుందని భావిస్తే 25 శాతానికిపైగా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 3,50,070 కార్డులకు పంపిణీ చేశారు. తూకాల్లోనే కాంట్రాక్టర్ల చేతి వాటం బయటపడింది. ప్రతీ ప్యాకెట్‌లోనూ 100 నుంచి 150 గ్రాముల వరకు తరుగు కన్పించడం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతుంది. శనగపప్పు అరకిలోకి 410 గ్రా., గోధుమ పిండి కిలోకి 880గ్రా., నెయ్యి 100 గ్రాములకు 80 గ్రా.లు, పామాయిల్ కేజీకి 880 గ్రా., కందిపప్పు అరకిలోకి 420గ్రా. బెల్లం అరకిలోకు 400 గ్రా.చొప్పున మాత్రమే తూగుతున్నాయి. దాదాపు 80 శాతం డిపోల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్యాకెట్లలో సరుకులొచ్చాయి.. మేమేమైనా తినేశామా.. అంటూ డీలర్లు కార్డుదారులపై మండిపడుతుండడంతో చేసేది లేక ఉచితంగాఇస్తున్న సరుకులు కదా..దక్కినకాడకి..దక్కినంత అన్నట్టుగా మారు మాట్లాడకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కార్డుదారులది. ఇక ఇంటికెళ్లి చూసుకుంటే బెల్లం కారిపోయి దుర్వాసన కొడుతుండగా. పప్పులు పుచ్చుపట్టి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి చాలా ప్యాకెట్లలో రంపపుపొట్టు.. తవుడు కలిసిపోయి కంపుకొడుతోంది. ఏం చేయాలో..ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారికంగా మాకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..ఏం చేస్తాం.. అంటూ కాంట్రాక్టర్లను కాపుకాసే ప్రయత్నాలు చేస్తున్నారు. -
నల్లబజారుకు కందిపప్పు
రేషన్ డీలర్ల చేతివాటం రెండు రోజులకే కోటా ఖతం కంది పప్పు నో స్టాక్ కొరవడిన అధికారుల నిఘా సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దఎత్తున ‘రేషన్ కంది పప్పు’ నల్లబజారుకు తరలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండు మూడు రోజులకే కంది పప్పు నో స్టాక్‌గా మారడం ఇందుకు బలం చేకూర్చుతోంది. కొందరు రేషన్ డీలర్లు వచ్చిన కంది పప్పు ఆయిపోయిందంటూ... మరి కొందరు పూర్తి కోటాను దిగమింగి సబ్సిడీ కంది పప్పు ఈ సారి రైతుబజార్, ప్రత్యేక కేంద్రాల్లో విక్రయిస్తున్నారని లబ్ధిదారులకు పేర్కొంటూ చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ధర పెరగడంతో డీలర్లు చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారులు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ధర కిలో రూ.200 లు పలుకుతుండగా.. చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై రూ.50లకు పంపిణీ చేయా ల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఫలితంగా చౌక ధర కంది పప్పు గుట్టుచప్పుడు కాకుండా డీలర్లు సొమ్ము చేసుకుం టున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి లో కంది పప్పు కోసం పూర్తిస్థాయి కోటా కోసం డీడీలు కట్టి ఇండెంట్ పెట్టిన డీలర్లు మొదటి విడతగా కేటాయించిన సుమారు 70 శాతం వరకు కోటాను గోదాముల నుంచి నేరుగా నల్లబజారుకు తరలించినట్లు తెలుస్తోంది. దాల్‌మిల్లర్స్, పప్పు దినుసుల వ్యాపారులు, దళారులు రేషన్ పుప్పుపై దృష్టి సారించడం డీలర్లకు మరింత కలిసివచ్చింది. అధికారుల నిఘా కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో నల్లబజారుకు తరలిపోయింది. సగానికి పైగా దుకాణాల్లో నో స్టాక్.. గ్రేటర్‌లోని సగానికిపైగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో గురువారం నాటికి కంది పప్పు లేకుండా పోయింది. మొత్తం 13.96 లక్షల కార్డుదారులు ఉండగా, ప్రతి కార్డు కు కిలో కంది పప్పు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు పౌరసరఫరా శాఖ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిల్స్‌లోని రేషన్ షాపులకు 817 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌లోని మూడు సర్కిల్స్లోగల షాపులకు 578 మెట్రిక్ టన్నుల చొప్పున కంది పప్పు కోటాను కేటాయించి మొదటి విడతగా 75 శాతం విడుదల చేసిం ది. చౌకధరల దుకాణాల డీలర్లకు కిలో రూ.49.45 పైసల చొప్పున సరఫరా చేసి రూ.50ల చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించింది. అయితే కంది పప్పుకు డిమాండ్ పెరగడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది. -
నందిగామలో విజిలెన్స్ దాడులు
కృష్ణ జిల్లా నందిగామలో విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. కందిపప్పును నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అక్రమంగా కందిపప్పు బ్లాక్ చేసిన ఒక వ్యాపారిని అరెస్టు చేశారు. కందిపప్పును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. -
మార్కెట్లోకి ఎం అండ్ ఎం కందిపప్పు!
న్యూఢిల్లీ: బ్రాండెడ్ పప్పు దినుసుల వ్యాపారంలోకి మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) అగ్రి బిజినెస్ డివిజన్ ప్రవేశించింది. న్యూప్రో బ్రాండ్‌తో కందిపప్పును ముంబై మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. మరిన్ని పప్పు దినుసులను త్వరలో తమ బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు మూడేళ్లను కంపెనీ నిర్దేశించుకుంది. సహజసిద్ధంగా సూర్యకాంతి ద్వారా ప్రాసెస్ జరిగే ఈ కందిపప్పు మార్కెట్లోని ఇతర సంబంధిత ప్రొడక్టులతో పోల్చితే 50 శాతం తొందరగా ఉడుకుతుందని ఎం అండ్ ఎం గ్రూప్ అగ్రి ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు.