ప్చ్..‘పప్పు’ పుట్టడం లేదు..!
2 నెలలుగా రేషన్ దారులకు అందని కందిపప్పు
* ధరలు పెరగడంతో కొనుగోలుకు ముందుకు రాని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రాష్ట్రంలోని రేషన్‌కార్డు దారులకు సరఫరా చేసే కందిపప్పునకు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడింది. రెండు మాసాలు గా దీని సరఫరాను పూర్తిగా నిలిపేసిన ప్రభుత్వం ఈ నెల సైతం సరఫరాపై చేతులెత్తేసింది. అంతర్జాతీయంగా, జాతీయంగా కంది ధరలు పెరగడం, రాష్ట్రంలో సాగు తగ్గి దిగుబడులు లేకపోవడంతో వాటికి అనుగుణంగా కొనుగోలు చేసి, సబ్సిడీపై ఇవ్వడం భారం కావడంతో దాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. కనీసం సామాన్యుడికి కందిపప్పు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ ప్రభుత్వం విస్మరించడం ఆశ్చర్య పరుస్తోంది.
అవసరానికి సరిపడా దొరకని తీరు..
మొత్తంగా రాష్ట్రంలో ఏటా 1.90లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం కాగా గత ఏడాది కేవలం 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లభించింది. ఇందులో రాష్ట్రంలో ప్రస్తుతం 89లక్షల ఆహార భద్రతా కార్డులుండగా, ప్రతి కార్డుపై నెలకు కిలో రూ.50 వంతున 8,900 మెట్రిక్ టన్నుల కందిపప్పును పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయాలి. ఏడాది కాలంగా తగ్గిన సాగు కారణంగా కందిపప్పు లభ్యత 41శాతానికి పడిపోయింది. దీంతో ధర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.160 మధ్య ఉంటోంది.
వీటికి టెండర్లు పిలిచినా దాల్‌మిల్లర్లు రూ.140కంటే తక్కువకు కోట్ చేసే పరిస్థితులు లేవు. తక్కువకు తక్కువ రూ.140 నుంచి 130కి కోట్ చేసినా, కిలో కందిపప్పునకు ప్రభుత్వంపై రూ.80 నుంచి రూ.90మేర భారం పడుతోంది. ఈ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో గడిచిన రెండు నెలలుగా సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నెల సైతం సరఫరా చేయలేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లు చేద్దామని భావించినా అక్కడ సైతం ధరలు ఉడికిస్తున్నాయి. గతంలో ఇలాంటి సమస్య ఏర్పడినప్పుడు దాల్‌మిల్లర్లతో చర్చలు జరిపి తక్కువ ధరకే టెండర్లు కోట్ చేసేలా ఒప్పించి సరఫరా చేసింది.
బహిరంగ మార్కెట్‌లోనూ ధరలు అదుపులో ఉంచేం దుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం మలేషియా, దక్షిణాఫ్రికా,సింగపూర్, కెన్యా దేశాల నుంచి రాష్ట్రానికి దిగుమతి తగ్గడం,దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ ఈ ఏడాది సాగు తగ్గడంతో వారు సైతం విదేశీ దిగుమతులపైఆధారపడుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, ప్రభుత్వంలో కదలిక లేకపోవడం విమర్శలకు గురవుతోంది.