నాసిరకం కానుక
విశాఖపట్నం: బెల్లం దిమ్మ పాకంలా కారిపోతోంది. భరించలేని కంపుకొడుతోంది. కంది పప్పు ప్యాకెట్లలో కేసరిదాల్ (నిషేధించిన కందిపప్పు) కలిసిపోయింది. సగానికి పైగా పుచ్చిపట్టిన, అత్యంత నాసిరకమైన పప్పు. శనగపప్పు కూడా నాసిరకమే. ప్యాకెట్ నిండా పొల్లపప్పు, పుచ్చులు, పుల్ల ముక్కలు కలిసిపోయి ఉన్నాయి. గోధుమ పిండి రంపపు పొట్టు, తవుడు మయం. చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత నేతిబీరకాయ చందంగా ఉండగా.. తూకాల్లో వంద నుంచి 150 గ్రాముల తరుగు కన్పిస్తోంది.
జిల్లాలో 10,84,404 బీపీఎల్ కార్డులున్నాయి. జన్మభూమి మావూరులో 1,43, 914 కార్డులు మంజూరుచేశారు. కానీ ఇప్పటి వరకు 2,175 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. ఎంఎల్‌ఎస్ పాయింట్స్ నుంచి కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, నెయ్యి 93 శాతంచొప్పున, శెనగపప్పు 92,బెల్లం 91 శాతం చొప్పున డీలర్లకు చేరాయి. 12,26,321 సంచులు కావాల్సి ఉండగా 7.60లక్షల సంచులు జిల్లాకు చేరాయి..వాటిలో 5.27లక్షలు మాత్రమే డీలర్లకు చేరడంతో సంచుల సమస్య ప్రధానంగా మారింది. గతనెల 23 నుంచి ప్రారంభించిన క్రిస్మస్ కానుక పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించారు. మొత్తం కార్డుల్లో 15 శాతం క్రిస్మస్ కానుక కింద పంపిణీ జరుగుతుందని భావిస్తే 25 శాతానికిపైగా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 3,50,070 కార్డులకు పంపిణీ చేశారు. తూకాల్లోనే కాంట్రాక్టర్ల చేతి వాటం బయటపడింది. ప్రతీ ప్యాకెట్‌లోనూ 100 నుంచి 150 గ్రాముల వరకు తరుగు కన్పించడం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతుంది. శనగపప్పు అరకిలోకి 410 గ్రా., గోధుమ పిండి కిలోకి 880గ్రా., నెయ్యి 100 గ్రాములకు 80 గ్రా.లు, పామాయిల్ కేజీకి 880 గ్రా., కందిపప్పు అరకిలోకి 420గ్రా. బెల్లం అరకిలోకు 400 గ్రా.చొప్పున మాత్రమే తూగుతున్నాయి. దాదాపు 80 శాతం డిపోల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
ఇదేమిటని ప్రశ్నిస్తే ప్యాకెట్లలో సరుకులొచ్చాయి.. మేమేమైనా తినేశామా.. అంటూ డీలర్లు కార్డుదారులపై మండిపడుతుండడంతో చేసేది లేక ఉచితంగాఇస్తున్న సరుకులు కదా..దక్కినకాడకి..దక్కినంత అన్నట్టుగా మారు మాట్లాడకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కార్డుదారులది. ఇక ఇంటికెళ్లి చూసుకుంటే బెల్లం కారిపోయి దుర్వాసన కొడుతుండగా. పప్పులు పుచ్చుపట్టి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి చాలా ప్యాకెట్లలో రంపపుపొట్టు.. తవుడు కలిసిపోయి కంపుకొడుతోంది. ఏం చేయాలో..ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారికంగా మాకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..ఏం చేస్తాం.. అంటూ కాంట్రాక్టర్లను కాపుకాసే ప్రయత్నాలు చేస్తున్నారు.