the quality
-
నాసిరకం కానుక
విశాఖపట్నం: బెల్లం దిమ్మ పాకంలా కారిపోతోంది. భరించలేని కంపుకొడుతోంది. కంది పప్పు ప్యాకెట్లలో కేసరిదాల్ (నిషేధించిన కందిపప్పు) కలిసిపోయింది. సగానికి పైగా పుచ్చిపట్టిన, అత్యంత నాసిరకమైన పప్పు. శనగపప్పు కూడా నాసిరకమే. ప్యాకెట్ నిండా పొల్లపప్పు, పుచ్చులు, పుల్ల ముక్కలు కలిసిపోయి ఉన్నాయి. గోధుమ పిండి రంపపు పొట్టు, తవుడు మయం. చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత నేతిబీరకాయ చందంగా ఉండగా.. తూకాల్లో వంద నుంచి 150 గ్రాముల తరుగు కన్పిస్తోంది. జిల్లాలో 10,84,404 బీపీఎల్ కార్డులున్నాయి. జన్మభూమి మావూరులో 1,43, 914 కార్డులు మంజూరుచేశారు. కానీ ఇప్పటి వరకు 2,175 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, నెయ్యి 93 శాతంచొప్పున, శెనగపప్పు 92,బెల్లం 91 శాతం చొప్పున డీలర్లకు చేరాయి. 12,26,321 సంచులు కావాల్సి ఉండగా 7.60లక్షల సంచులు జిల్లాకు చేరాయి..వాటిలో 5.27లక్షలు మాత్రమే డీలర్లకు చేరడంతో సంచుల సమస్య ప్రధానంగా మారింది. గతనెల 23 నుంచి ప్రారంభించిన క్రిస్మస్ కానుక పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించారు. మొత్తం కార్డుల్లో 15 శాతం క్రిస్మస్ కానుక కింద పంపిణీ జరుగుతుందని భావిస్తే 25 శాతానికిపైగా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 3,50,070 కార్డులకు పంపిణీ చేశారు. తూకాల్లోనే కాంట్రాక్టర్ల చేతి వాటం బయటపడింది. ప్రతీ ప్యాకెట్‌లోనూ 100 నుంచి 150 గ్రాముల వరకు తరుగు కన్పించడం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతుంది. శనగపప్పు అరకిలోకి 410 గ్రా., గోధుమ పిండి కిలోకి 880గ్రా., నెయ్యి 100 గ్రాములకు 80 గ్రా.లు, పామాయిల్ కేజీకి 880 గ్రా., కందిపప్పు అరకిలోకి 420గ్రా. బెల్లం అరకిలోకు 400 గ్రా.చొప్పున మాత్రమే తూగుతున్నాయి. దాదాపు 80 శాతం డిపోల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్యాకెట్లలో సరుకులొచ్చాయి.. మేమేమైనా తినేశామా.. అంటూ డీలర్లు కార్డుదారులపై మండిపడుతుండడంతో చేసేది లేక ఉచితంగాఇస్తున్న సరుకులు కదా..దక్కినకాడకి..దక్కినంత అన్నట్టుగా మారు మాట్లాడకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కార్డుదారులది. ఇక ఇంటికెళ్లి చూసుకుంటే బెల్లం కారిపోయి దుర్వాసన కొడుతుండగా. పప్పులు పుచ్చుపట్టి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి చాలా ప్యాకెట్లలో రంపపుపొట్టు.. తవుడు కలిసిపోయి కంపుకొడుతోంది. ఏం చేయాలో..ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారికంగా మాకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..ఏం చేస్తాం.. అంటూ కాంట్రాక్టర్లను కాపుకాసే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఇక మీరే వాదించుకోవచ్చు
కేంద్ర మంత్రి పాశ్వాన్ వినియోగదారుల ఇంటి నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు {పమాణాలు పాటించని తయారీదారులపై కఠిన చర్యలు హైదరాబాద్: ఉత్పత్తుల్లో భారతీయ ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నిబంధనల ప్రకారం నాణ్యతను పాటించకుంటే ఇక నుంచి కఠిన చర్యలు అమలు చేయనున్నట్టు కేంద్ర పౌరసరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హెచ్చరించారు. కోర్టుల్లో తేల్చుకున్న తర్వాత జరిమానాలు విధించే పద్ధతి కాకుండా ఇక బీఐఎస్నే నేరుగా భారీ జరిమానాలు విధించనుందని, శిక్షా కాలాన్ని కూడా పెంచబోతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ విపణిలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా భారతీయ వస్తువుల నాణ్యతను కూడా మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీఐఎస్ కోసం మౌలాలిలో కొత్తగా నిర్మించిన అధునాతన భవనాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో బీఐఎస్‌ను ఆధునికీకరిస్తున్నట్టు వెల్లడించారు. దాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లులు ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టామని, అది త్వరలో చట్టంగా రూపొందించనుందని తెలిపారు. దీంతోపాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని కూడా మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా తెచ్చామన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించే ఉద్దేశంతో వినియోగదారుల కోర్టులను కూడా బలోపేతం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక అవి కమిషన్లుగా మారనున్నాయని, డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్‌గా మారతాయన్నారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేయొచ్చని, అడ్వొకేట్‌తో ప్రమేయం లేకుండా సొంతంగా వాదించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండ: వెంకయ్య ఎన్నికలు ముగియటంతోనే రాజకీయాలు పక్కన పెట్టి దేశాభివృద్ధిపై దృష్టి సారించాలనే విధానంతో ప్రధాని మోదీ, ఆయన మార్గదర్శకత్వంలో తాము ముందుకు సాగుతున్నామని వెంకయ్య అన్నారు. అందుకే ఎన్డీయే భాగస్వామ్య పార్టీ(దేశం) అధికారంలో ఉన్న ఏపీకి, ఎన్డీయేలో లేని టీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిలో కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణకు పూర్తిస్థాయి కొత్త బీఐఎస్ ల్యాబ్‌ను, ఏపీకి శాఖా కార్యాలయాన్ని మంజూరు చేయాలని వెంకయ్య కోరగా రెండింటిని మంజూరు చేస్తున్నట్టు పాశ్వాన్ ప్రకటించారు. స్థలం చూపితే మూడు నెలల్లో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. నెస్లే నుంచి 640 కోట్లు క్లెయిమ్ మ్యాగీ నూడుల్స్‌లో ప్రమాదకర సీసం స్థాయి అధికంగా ఉందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా వివాదానికి కారణమైన నెస్లే కంపెనీ నుంచి రూ.640 కోట్ల మొత్తాన్ని క్లెయిమ్ చేసినట్టు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. ‘ఆ నూడుల్స్‌లో సీసం పరిమాణం ఎంత ఉందనే విషయం త్వరలో తేలుతుంది. దాన్ని పక్కన పెడితే అసలు ఎఫ్ఎస్ఎస్ఐ అనుమతి లేకుండా సరుకులు మార్కెట్లోకి ఎలా తెచ్చారు, లేబుల్‌పై ముద్రించని కంటెంట్ లోపల ఎలా ఉంది.. అన్న రెండు ప్రధానాంశాల ఆధారంగా ఆ సంస్థ నుంచి రూ.640 కోట్లను మా శాఖ క్లెయిమ్ చేసింది’ అని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహాలో నిబంధనలను అనుసరించి ఓ సంస్థ నుంచి ఇంత భారీ మొత్తం క్లెయిమ్ చేయటం ఇదే ప్రథమమని చెప్పారు. -
కోట్ల పనులకు తూట్లు
పుష్కర ఏర్పాట్ల అంచనాల్లోనే వంచన అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు పర్యవేక్షించకుండా పరోక్ష సాయం మచ్చుకైనా కానరాని నాణ్యత నేడు కలెక్టర్ పుష్కరఘాట్ల సందర్శన పుష్కర స్నానం..పుణ్యఫలం. పుష్కరాల పనులేమో ధనఫలం! రూ.కోట్లు ఖర్చు చేసినా.. లక్షల స్థారుు నాణ్యత కూడా పనుల్లో కన్పించడం లేదు. పుష్కర పనులకు భారీగా అంచనాలు రూపొందించారు. అవి మంజూరయ్యూక తూతూమంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. అధికారులు వత్తాసు పలుకుతుండగా.. కాంట్రాక్టర్లు భారీమొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. ఈ అంచనాల మాటున దాగిన వంచన ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమైంది. వరంగల్: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మాత్రమే 2003 పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ నిర్మించారు. పుష్కర స్నానాలకు ఒకే రోజు వచ్చిన భక్తులు లక్షకు మించలేదు. కానీ, గతంలో లక్షలాదిగా భక్తులు వచ్చారని, ఈసారి కూడా తరలివస్తారని అధికారులు అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రతిపాదించారు. నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, రోడ్లు, భవనాల శాఖతో కలిపి సూమారు రూ. 25కోట్లు కేటాయించినట్లు తెలిసింది. పుష్కరాల్లో చేపట్టే పనులను ఉద్దేశించిన జీఓల్లో అభివృద్ధి పనుల పేర్లు స్పష్టంగా పేర్కొనకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. కాంట్రాక్టర్లు కోరిన విధంగా పనులకు రూపకల్పన చేసినట్లు తెలిసింది. పంచాయతీ రాజ్ పరిధిలో.. పంచాయతీరాజ్ మైన ర్ ఇరిగేషన్ శాఖకు రూ.9.70కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద పాత ఘాట్‌కు అదనంగా 100మీటర్ల నిర్మాణం, ముల్లకట్ట, మంగపేట గోదావరి రేవు వద్ద స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తికావస్తున్నారుు. నాణ్యతపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు రోడ్ల మరమ్మతు కోసం రూ.10.59 కోట్లు కేటాయించింది. తారురోడ్లు పెచ్చులు లేస్తూ వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారుు. ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు రూ.1.40 కోట్లతో రోడ్డు మరమ్మతులు చేశారు. ఇరువైపులా సైడ్ బర్మ్‌లు పోసి రోలింగ్ చేయాల్సి ఉన్నా విస్మరించారు. ఇది ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుంది. స్వరాష్ట్రంలో తొలి పుష్కరాలు.. సరిగ్గా ఎనిమిది రోజుల్లో ప్రారంభమవుతారుు. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అధికారులతో కుమ్మక్కై భారీగా అంచనాలు రూపొందించి.. సర్కారు సొమ్మును దండుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విస్మరిస్తున్నా.. అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
మతలబు ఏంటో...
అసంపూర్తి పనులకూ బిల్లుల చెల్లింపులు దెయ్యూలవాగు {బిడ్జి నిర్మాణంలో మాయ నాణ్యతనూ పట్టించుకోని ఐటీడీఏ అధికారుల తీరుపై అనుమానాలు విచారణ చేపట్టాలని పలువురి డిమాండ్ ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)కు ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయాలను వివిధ పథకాల్లో కేటాయిస్తోం ది. ఈ నిధులు నీళ్లలా వ్యయమవుతున్నా... పనులు తూతూమంత్రంగానే కొనసాగుతున్నా యి. పనులను పర్యవేక్షించే శాఖలు మొక్కుబడిగా వ్యవహరించడంతో నాణ్యత కొరవడిం ది. ఇది చాలదన్నట్లు గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరో అడు గు ముందుకేశారు. అసంపూర్తిగా ఉన్న పనులకూ మొత్తం బిల్లులు చెల్లించి చోద్యం చూస్తున్నారు. ఇందుకు దయ్యాలవాగు వద్ద చేపట్టిన పనులే నిదర్శనంగా నిలుస్తున్నారుు. మూరుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఐఏపీ (సమగ్ర కార్యచరణ ప్రణాళిక) పథకంలో గిరిజన ప్రాంతాల్లోని రహదారులు, వాగులపై బ్రిడ్జిలను నిర్మించారు. ఇందులో భాగంగా దొడ్ల గ్రామ సమీపంలోని దయ్యాలవాగుపై రూ.5కోట్ల వ్యయంతో హైలెవల్ వంతెన నిర్మించారు రూ.4కోట్లు బ్రిడ్జి కోసం కాగా, రూ.కోటితో అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేశారు. అరుుతే ఈ బ్రిడ్జిని నిర్మించిన ప్రాంతం అనువైనది కాదనే అభిప్రాయాలు అప్పటికే వ్యక్తమయ్యూరుు. వాగుకు బ్రిడ్జి అభిముఖంగా ఉండడం వల్ల భారీ వర్షాలు పడితే వరద ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతుందని నాణ్యతా విభాగం అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోగా... సదరు కాంట్రాక్టర్‌పై ఎనలేని ప్రేమచూపించడం విమర్శలకు తావిస్తోంది. బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ మొత్తం బిల్లులు చెల్లించారు. ఈ నేపథ్యంలో నజరనాలు ముట్టడంతోనే బిల్లులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. జాడ లేని రివిట్‌మెంటు దొడ్ల- కొండాయి గ్రామాల మధ్య ఉన్న వాగుపై రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపుల రివిట్మెంట్ నిర్మించకపోవడం వల్ల దాని భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత సపోర్టు గోడలకు రాయితో రివిట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈపనులు చేపట్టిన కాంట్రాక్టర్ రివిట్మెంట్ చేసేందుకు రాయి తెచ్చినా.. పనులు చేయలేదు. నిర్లక్ష్యంగా వదిలివేసినప్పటికీ అధికారులు బిల్లులు చెల్లించారు. గత వర్షాకాలంలో కురిసిన కొద్ది పాటి వర్షాలకే బ్రిడ్జి ఇరుపక్కల ఉన్న ఒడ్డు కోతకు గురైంది. అసంపూర్తిగా అప్రోచ్ రోడ్డు దొడ్ల బ్రిడ్జికి రూ.4కోట్లు వెచ్చించిన అధికారులు, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం మరో రూ.కోటి వ్యయం చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మించాలని అంచనాల్లోనే ఉంటుందని ఇతర శాఖల అధికారులు అంటున్నారు. అప్రోచ్‌రోడ్డు పేరిట మరో రూ.కోటి వ్యయం చేసినట్లు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ, బ్రిడ్జి అంచనాల్లో ఉందా...లేదా అన్న విషయాలు తెలియాలంటే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఐటీడీఏ పరిధిలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో పలువు రు కోరారు. కానీ.. ఇప్పటివరకు ఎవరూ స్పం దించిన దాఖలాలు లేవు. దీంతోపాటు సదరు కాంట్రాక్టర్ రివిట్మెంట్ పనులను అసంపూర్తిగా వదిలేసినా... ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు మొత్తం చెల్లించడంపై విచారణ చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.. -
కాణిపాకం ప్రసాదాల్లో నాణ్యత ఏదీ
ఐరాల :కాణిపాకంలోని సత్యప్రమాణాలస్వామి సన్నిధిలో విక్రయించే లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గుతోంది. వడలు కూడా అందరికీ అందడం లేదు. నాణ ్యమైన సరుకులు వాడకపోవడం, తయారీలో సూచనలు పాటించని కారణంగా ఈ పరిస్థితి ఏర ్పడింది. 70 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని గతంలో రూ.5 విక్రయిం చేవారు. ఆ తరువాత 100 గ్రాములు రూ. 10 విక్రయించేవారు. ఒక్కొక్క లడ్డూపై రోజుకు రూ.2.70 దేవస్థానానికి నష్టం వస్తుందనే నెపంతో 100 గ్రాముల లడ్డూ 80 గ్రాములు చేసి భక్తులకు అందిస్తున్నా రు. ఇలా రోజురోజుకూ లడ్డూ సైజు తగ్గిపోతుండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగటున ఒక్క రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆశించిన మేరకు లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదనే వ్యాఖ్యలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. రుచి కూడా తగ్గినట్లు చెబుతున్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం, ఎండుద్రాక్ష, జీడీపప్పు, యాలకులు కనిపించకపోవడం, కలకండ ఎక్కువగా వాడటం తదితర కారణాలతో నాణ్యత కొరవడినట్లు భావిస్తున్నారు. అధికారుల సూచనలుగాలికి గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోటు సిబ్బందికి ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందీ ముద్దగా తయారుచేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డుముద్దను తయారు చేస్తే నాణ్యత రెట్టింపుగా ఉం టుందని సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు. వడల తయారీలోనూ అంతే.. లడ్డూతో పాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు. రోజుకు 500 నుంచి 600 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికి తోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలినవి కనీసం గంట సమయం కూడా కౌంటర్లో లభించవు. చర్యలు తీసుకుంటున్నాం లడ్డూ, వడలు నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు సూచించిన విధంగా ప్రసాదాల తయారీకి శ్రద్ధ తీసుకుంటాం. వడలు తక్కువ సంఖ్యలో తయారవుతున్న మాట వాస్తవమే. స్టోరులో అందిస్తున్న నెయ్యి, పిండి, ఇతర వస్తువుల్లోని నాణ్యతతో మాకు సంబంధం లేదు. - చిట్టెమ్మ, పోటు ఇన్చార్జ్, జేఈవో, కాణిపాకం -
‘జంగా’కు బెయిల్
నాటకీయ పరిణామాల మధ్య మడికొండ ఠాణాకు చేరిన రాఘవరెడ్డి బెయిల్ పత్రాలు పరిశీలించి.. పూచీకత్తుపై విడుదల చేసిన సీఐ కాజీపేట : నాణ్యతలేని బ్రిడ్జిలను నిర్మించారనే అభియోగాలతో నమోదైన కేసులో కోర్టులో ముందస్తు బెయిల్ పొందిన జంగా కన్స్ట్రక్షన్స్ ఎండీ, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సినీఫక్కీలో మడికొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం లొంగిపోయి, బెయి ల్‌పై విడుదలయ్యారు. మడికొండ, టేకులగూడెం గ్రామాల్లో రెండు బ్రిడ్జిలను నాణ్యత లేకుండా నిర్మిం చడమేగాక అధికారులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆగస్టు 21న ఎస్ఈ జనార్దన్‌రెడ్డి మడికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లగా ఇటీవల మొదటి అదనపు న్యాయమూర్తి కె.బి నర్సింహు లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులతోపాటు *20 వేల వ్యక్తిగత పూచికత్తును సమర్పించి పోలీసుస్టేషన్లో లొంగి పోయి ఎస్హెచ్ఓ ఎదుట బెయిల్ పొందాలని ఆదేశించా రు. ఈ మేరకు రాఘవరెడ్డి సోమవారం న్యాయవాది ద్వారా మడికొండ సీఐ నందిరామ్‌నాయక్ ఎదుట లొంగిపోయి బెయిల్ తీసుకున్నారు. వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని రాఘవరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. పత్రాలు పరిశీలించాక రాఘవరెడ్డిని సీఐ నందిరామ్‌నాయక్ విడుదల చేశారు. జంగా వెంట డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నేతలు వరదరాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీను, ఉమాపతిరెడ్డి, గోపు బిక్షపతి, డి.జైపాల్‌రెడ్డి, రాజుగారి రఘు, సుంచు అశోక్, తొట్ల రాజు, పి.నాగరాజు, సయ్యద్ రజాలీ ఉన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. కొందరు వ్యక్తులు తనపై కక్ష కట్టి అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తున్నారని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించా రు. ఓ క్వారీ విషయంలో తలెత్తిన విబేధాలను మనసులో పెట్టుకుని జయ ఆస్పత్రి యజమాని, మాజీ ఎంపీ భర్త టి.నర్సింహారెడ్డి తన పనులపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని వాపోయారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా దంపతులకు మద్దతిచ్చాననే కోపంతో నర్సింగ్‌రెడ్డి తండ్రితో కలిసి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. బ్రిడ్జిలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పత్రాలను విలేకరులకు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి చాలా విషయాలను బహిర్గతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.