- నాటకీయ పరిణామాల మధ్య మడికొండ ఠాణాకు చేరిన రాఘవరెడ్డి
- బెయిల్ పత్రాలు పరిశీలించి.. పూచీకత్తుపై విడుదల చేసిన సీఐ
కాజీపేట : నాణ్యతలేని బ్రిడ్జిలను నిర్మించారనే అభియోగాలతో నమోదైన కేసులో కోర్టులో ముందస్తు బెయిల్ పొందిన జంగా కన్‌స్ట్రక్షన్స్ ఎండీ, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సినీఫక్కీలో మడికొండ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం లొంగిపోయి, బెయి ల్‌పై విడుదలయ్యారు. మడికొండ, టేకులగూడెం గ్రామాల్లో రెండు బ్రిడ్జిలను నాణ్యత లేకుండా నిర్మిం చడమేగాక అధికారులను బెదిరింపులకు గురిచేసినట్లు ఆగస్టు 21న ఎస్‌ఈ జనార్దన్‌రెడ్డి మడికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లగా ఇటీవల మొదటి అదనపు న్యాయమూర్తి కె.బి నర్సింహు లు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తులతోపాటు *20 వేల వ్యక్తిగత పూచికత్తును సమర్పించి పోలీసుస్టేషన్‌లో లొంగి పోయి ఎస్‌హెచ్‌ఓ ఎదుట బెయిల్ పొందాలని ఆదేశించా రు.
ఈ మేరకు రాఘవరెడ్డి సోమవారం న్యాయవాది ద్వారా మడికొండ సీఐ నందిరామ్‌నాయక్ ఎదుట లొంగిపోయి బెయిల్ తీసుకున్నారు. వందలాదిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పీఎస్‌కు చేరుకుని రాఘవరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. పత్రాలు పరిశీలించాక రాఘవరెడ్డిని సీఐ నందిరామ్‌నాయక్ విడుదల చేశారు. జంగా వెంట డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నేతలు వరదరాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాస్‌రావు, నమిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీను, ఉమాపతిరెడ్డి, గోపు బిక్షపతి, డి.జైపాల్‌రెడ్డి, రాజుగారి రఘు, సుంచు అశోక్, తొట్ల రాజు, పి.నాగరాజు, సయ్యద్ రజాలీ ఉన్నారు.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే..
కొందరు వ్యక్తులు తనపై కక్ష కట్టి అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తున్నారని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆరోపించా రు. ఓ క్వారీ విషయంలో తలెత్తిన విబేధాలను మనసులో పెట్టుకుని జయ ఆస్పత్రి యజమాని, మాజీ ఎంపీ భర్త టి.నర్సింహారెడ్డి తన పనులపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని వాపోయారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా దంపతులకు మద్దతిచ్చాననే కోపంతో నర్సింగ్‌రెడ్డి తండ్రితో కలిసి ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. బ్రిడ్జిలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పత్రాలను విలేకరులకు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి చాలా విషయాలను బహిర్గతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.