
హైదరాబాద్: నిరంతరం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. తాజాగా బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ. 200కు చేరుకుని, సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. తరచూ పప్పు తినేవారు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు.
గతంలో చౌకధరల దుకాణాల ద్వారా సామాన్యులకు కందిపప్పు అందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా అరకొరగానే అందుతోంది. దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది ఎలా? అని తల పట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటితే పప్పులతో సరిపెట్టుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు వాటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని వాపోతున్నారు.