Essential Commodities Price
-
నిత్యావసర ధరలకు రెక్కలు.. కిందకు దిగని కందిపప్పు
హైదరాబాద్: నిరంతరం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. తాజాగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ. 200కు చేరుకుని, సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. తరచూ పప్పు తినేవారు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో చౌకధరల దుకాణాల ద్వారా సామాన్యులకు కందిపప్పు అందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా అరకొరగానే అందుతోంది. దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది ఎలా? అని తల పట్టుకుంటున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటితే పప్పులతో సరిపెట్టుకునేవాళ్లమని.. కానీ ఇప్పుడు వాటి ధరలు కూడా చుక్కలనంటుతున్నాయని వాపోతున్నారు. -
ఉప్పూపప్పు..నిప్పులే..రూ. 10- 30 పెరిగిన నిత్యావసరాల ధరలు..!
సాక్షి, హైదరాబాద్: వేసవిలో కొన్ని రకాల కూరగాయల ధరలు పెరగడం సహజమే. ఉత్పత్తికి అనుగుణంగా మామిడి, నిమ్మ ధరల్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే బియ్యం, నూనెలు, పప్పుల ధరలకు సీజన్‌తో సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు కూరగాయలు, మామిడి, నిమ్మతోపాటు నిత్యావసర వస్తువుల ధరలన్నీ వేసవి వేడిని మించి మండిపోతున్నాయి. కూరగాయలు, పప్పులు, బియ్యం, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మొదలైన ధరల పెరుగుదల.. రెండు నెలలు గడిచినా ఆగట్లేదు. యుద్ధం, పెరిగిన డీజిల్ ధరల సాకు చూపుతూ ఉత్పత్తిదారులే నిత్యావసరాలను బ్లాక్ మార్కెటింగ్‌కు తరలిస్తుండగా వ్యాపారులు అదే బాట పట్టారు. వీటికి తోడు వేసవిలో ఉత్పత్తి తగ్గే కూరగాయలు, పండ్లు, పాల రేట్లు కూడా పెరిగాయి. జిల్లాల వారీగా కొన్నిటి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నా.. దాదాపుగా అన్ని కూరగాయలు, నూనెలు పప్పు దినుసుల ధరలు బాగానే పెరిగాయి. తద్వారా సామాన్యుడిపై వంటింటి నిర్వహణ భారం నెల, రెండు నెలల్లోనే 25 శాతం నుంచి 50 శాతం వరకు అధికమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘పప్పు’.. తినాలంటే తిప్పలే.. రవాణా చార్జీల పెంపు పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పప్పు దినుసుల ధరలు కిలోకు రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం కిలో రూ.100 లోపున్న కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వేరుశనగల ధరలు ప్రస్తుతం రూ.110 నుంచి రూ.130కి చేరుకున్నాయి. ఉత్పత్తిదారుడు నుంచి హోల్‌సేల్ వ్యాపారికి, అక్కడి నుంచి రిటైలర్‌కు వచ్చే సరికి ధరల్లో భారీగా తేడా ఉంటుంది. హైదరాబాద్‌లో కందిపప్పు హోల్‌సేల్ ధర రూ.90గా ఉంటే... రిటైల్ మార్కెట్లో రూ.110 నుంచి రూ.130 వరకు ఉంది. అలాగే హైదరాబాద్ బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్‌కు, కరీంనగర్‌లోని రిటైల్ అమ్మకం దారునికి మధ్య కూడా రేట్లలో కిలోకు రూ.20 వరకు వ్యత్యాసం ఉంటోంది. మినప్పప్పు కూడా హోల్‌సేల్‌లో రూ.90 ఉంటే రిటైల్‌లో రూ.130 వరకు ఉంది. ఇక పెసరపప్పు రూ.120కి, ఎర్రపప్పు రూ.130 వరకు రిటైల్‌లో వినియోగదారుడికి అందుతోంది. పల్లీల (వేరుశనగ) ధర రిటైల్ మార్కెట్లో రూ.100–110 నుంచి రూ.140కి చేరింది. సూపర్ మార్కెట్లలో ప్యాకేజ్డ్ పప్పు దినుసుల ధరలు సామాన్యునికి అందుబాటులో లేనంతగా పెరిగాయి. ఇక చింతపండు కూడా రిటైల్ మార్కెట్లో రూ.140 నుంచి రూ.180 వరకు చేరింది. ఎండు మిర్చి కిలో రూ.250 వరకు పలుకుతోంది. దొడ్డు ఉప్పు ధర ఫిబ్రవరిలో కిలోకు రూ.7 ఉంటే అదిప్పుడు రూ.20కి చేరింది. గత 14 ఏళ్లుగా అగ్గిపెట్టె ధర రూపాయి మాత్రమే ఉండగా... ఇటీవలే దానిని రూ.2కు పెంచారు. ఎంఆర్పీ పేరిట నూనె కంపెనీల మాయాజాలం రెండు నెలల క్రితం సన్‌ఫ్లవర్ నూనె రూ.150కే వినియోగదారుడికి లభించేది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో ఫార్చూన్ సన్‌ఫ్లవర్ నూనె లీటర్ ఎంఆర్పీ రేటు రూ.230 కాగా డిస్కౌంట్ పేరుతో రూ.194కి విక్రయిస్తున్నారు. ఇక పల్లీ నూనె ఎంఆర్పీ రూ.250 ఉండగా, రూ.190కి వినియోగదారుడుకి విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ విజయ పల్లీ నూనె ఎంఆర్పీ రూ.220 కాగా, డిస్కౌంట్ సేల్ పేరుతో రూ.185కి విక్రయిస్తున్నారు. ఇలా అడ్డగోలుగా ఎంఆర్పీ ధరను ముద్రించి డిస్కౌంట్ పేరుతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. వాస్తవానికి ఫార్చూన్ నూనె రూ.230 ఎంఆర్‌పీగా ముద్రించి ఉందంటే అది హోల్‌సేల్ వ్యాపారికి రూ.190 లోపే వస్తుంది. దానిని రిటైల్‌లో 195 వరకు విక్రయిస్తారు. ఇది వ్యాపారులు, ఇతరులకు తప్ప ఎక్కువ శాతం మంది సామాన్యులకు తెలయని విషయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు రిటైల్ మార్కెట్లో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు (రూ.230 వరకు) నూనెలను విక్రయించారు. ఉత్పత్తిదారుడు ఎంఆర్‌పీగా అడ్డగోలు ధరను ముద్రించడంతో అప్పట్లో హోల్‌సేల్ వ్యాపారులు నూనె ప్యాకెట్లను, డబ్బాలను బ్లాక్ చేశారు. రూ.250కి చేరే అవకాశం ప్రస్తుతం కూడా ఆయిల్ కంపెనీలు పది రోజులుగా నూనెను బ్లాక్ చేసి, మార్కెట్లోకి రిలీజ్ చేయడం లేదు. తాజాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నూనెలకు సంబంధించిన ధర నిర్ణయమైన తర్వాత కొత్త రేట్లను ముద్రించి మార్కెట్లోకి వదిలే అవకాశం ఉందని కరీంనగర్‌కు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి ‘సాక్షి’కి తెలిపారు. అప్పుడు నూనె ప్యాకెట్ ధర రూ. 230 నుంచి రూ. 250కి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఆర్పీ ముద్రణపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలనే డిమాండ్ విన్పిస్తోంది. ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో సన్‌ఫ్లవర్‌తో పాటు అన్ని రకాల నూనెల్ని రూ. 210 వరకు విక్రయిస్తుండడం గమనార్హం. కాగా పామాయిల్ ధర నాలుగు రోజుల క్రితం హోల్‌సేల్‌లో రూ.146 ఉండగా, ప్రస్తుతం రూ.156 అయింది. దాన్ని రిటైల్‌గా రూ.170 వరకు విక్రయిస్తున్నారు. సాగు తగ్గడంతో పెరిగిన కూరగాయల రేట్లు ప్రస్తుతం కూరగాయల ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో టమాటా ధర కిలో రూ.40కి చేరుకోగా, బీరకాయ రూ.50, వంకాయ రూ.40, క్యాబేజీ రూ.40, క్యారెట్ రూ.50, కాలిఫ్లవర్ రూ. 60, పచ్చిమిర్చి రూ.80, బెండకాయ రూ.35, గోరుచిక్కుడు రూ.45, చిక్కుడు రూ.70కి పైగా విక్రయిస్తున్నారు. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డ ధరలు కూడా నెలరోజుల్లో 50 శాతం వరకు పెరిగిపోయాయి. అయితే రిటైల్ మార్కెట్ ధరలతో పోలిస్తే హోల్‌సేల్, సూపర్ మార్కెట్ల ధరల్లో కొంత తేడా ఉంది. అలాగే జిల్లాల వారీగా కూడా రేట్లలో కొంత తేడా ఉంది. హైదరాబాద్‌లో ఉన్న రేట్లకు కరీంనగర్ , వరంగల్ మార్కెట్లలో ఉన్న రేట్లకు కొంత తేడా ఉంది. అలాగే రైతుబజార్లలోని ధరలకు బస్తీల్లోని మార్కెట్ల ధరలకు కూడా తేడా ఉంది. వేసవి కాలంలో తెలంగాణలో కూరగాయల సాగు తక్కువగా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలకు రవాణా చార్జీలు పెరగడం కారణంగా ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెపుతున్నారు. మామిడికాయలు, నూనె, ఆవాలు, ఉప్పు ధరలు పెరగడంతో ఈ వేసవిలో సామాన్యులు మామిడి పచ్చడి పెట్టుకోవడం కూడా కష్టసాధ్యంగా మారింది. నిమ్మకూ లేని మినహాయింపు! హైదరాబాద్ చింతలబస్తీలోని రిటైల్ మార్కెట్లో ఒక మోస్తరు సైజు నిమ్మకాయ ధర 10 రూపాయలు. రూ.20కి 3. అదే మోండా మార్కెట్‌కు వెళితే రూ.20కి నాలుగు. ఈ స్థాయిలో నిమ్మకాయల ధరలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో నిమ్మ పంట పెద్దగా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దిగుబడి తగ్గిన కారణంగా సగటు వినియోగదారుడు ఒక నిమ్మకాయను పది రూపాయలకు కొనుక్కోవలసి వస్తోంది. వేసవి కాలంలో ఎక్కువగా వినియోగించే నిమ్మకాయల ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ రిటైల్ మార్కెట్లో కూరగాయల ధరలు..(కిలోకు రూ.లలో) టమాట 35, వంకాయ 40, బెండకాయ 30, పచ్చిమిర్చి 70, బీరకాయ 40, కాకరకాయ 45, సొరకాయ 15, చిక్కుడు 60, గోరుచిక్కుడు 40, దొండకాయ 40, క్యారెట్ 45, క్యాబేజి 30, క్యాలిఫ్లవర్ 50, తోటకూర 30, పాలకూర 50, చుక్కకూర 60, అల్లం 50, ఎల్లిగడ్డ 80, ఉల్లిగడ్డ 20, ఆలుగడ్డ 30. సర్దుకుంటున్నాం.. మార్కెట్లో ఏది ముట్టుకున్నా మండుతోంది. నిత్యావసరాలు, నూనె ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో ఇతర ఖర్చులు తగ్గించుకొని, తక్కువ మొత్తంలో సరుకులు కొనుక్కొని సర్దుకుంటున్నాం. – సుగుణ, గృహిణి, నాగర్‌కర్నూల్ -
పెట్రో మంటలు..! 10 నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో నెల రోజుల్లో లీటర్‌కు రూ.8కి పైగా పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విధంగా చమురు ధరలు పెరగడం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపి స్తోంది. వాహనదారులకు చుక్కలు కనబడుతుంటే.. నానాటికీ పెరుగుతున్న డీజిల్ ధరలు పరోక్షంగా నిత్యావసరా ల రేట్లు పెరిగేందుకు దోహదపడుతున్నా యి. సరుకు రవాణా చార్జీలు 10% నుంచి 15% వరకు పెరగడంతో నూనెలు, పప్పులు, కూరగాయల వంటి నిత్యావసరాలతో పాటు అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగిపోతున్నాయి. 15 రోజులకు బదులు రోజూ.. మే 2017 వరకు ప్రతి 15 రోజులకు పెట్రో ధరలను సవరించేవారు. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విధానం (అంతర్జాతీయ సర్దుబాట్లు పేరిట) నేపథ్యంలో ఆ ఏడాది జూన్ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించడం మొదలుపెట్టారు. 2019 చివరి వరకు కొంత అటు ఇటుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు 2020 నుంచి హెచ్చు తగ్గులకు లోనవడం ప్రారంభం అయ్యింది. ఇక 2021 జనవరి నుంచి మొత్తం మీద పెరుగుదలే కొనసాగింది. ఈ ఏడాది జనవరి 1న హైదరాబాద్‌లో రూ.87.06 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర నవంబర్1 వ తేదీ నాటికి రూ.114.12కు పెరిగింది. అదే సమయంలో లీటర్ డీజిల్ రూ. 80.60 నుంచి రూ.107.40కి చేరింది. అంటే రెండిటి ధరల్లో పది నెలల్లో రూ.26కు పైగా పెరుగుదల చోటు చేసుకుందన్నమాట. సెంచరీ దాటి దూసుకుపోతూ.. కరోనా కష్ట కాలంలో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ. 8.32 పైసలు, డీజిల్‌పై 9. 51 పైసలు పెరిగాయి. తర్వాత రెండు నెలలు లీటర్ పెట్రోల్‌పై 75 పైసలు, డీజిల్‌పై రూ.92 పైసలు మేరకు తగ్గాయి. ఆ తర్వాత వరసగా పెరుగుతూనే వచ్చాయి. జూన్‌లో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటగా... డీజిల్ అక్టోబర్ నెలలో సెంచరీ కొట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటు డీజిల్ వినియోగం 25 కోట్ల లీటర్ల మేర ఉంటోంది. ఈ లెక్కన నెలకు వినియోగదారులపై రూ. వందల కోట్ల భారం పడుతోంది. జనవరి నుంచి 10 నెలల్లో వేల కోట్ల భారం పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ.200కు చేరువలో వంట నూనెలు పెరుగుతున్న చమురు ధరలు నిత్యావసరాల ధరలపై పెను ప్రభావం చూపుతున్నాయి. పాలు, పెరుగు, బియ్యం, కూరగాయలు, పండ్లు, నూనెలు, పప్పుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు లీటర్‌కు రూ.200 మార్కుకు దగ్గరగా ఉన్నాయి. అనేక పప్పుల ధరలు కిలో రూ.150కి పైగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, టమాట, బెండకాయ, వంకాయ వంటి కూరగాయల ధరలు కిలోకు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలుకుతున్నాయి. ప్రతి కిరాణ వస్తువు మీద కిలోకు రూ. 1 నుంచి రూ. 2 వరకు వరకు ధరలను పెంచినట్లు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే సరకు రవాణా చార్జీలను 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంచారని, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెంచాల్సి వస్తోందని చెప్పారు. రవాణా చార్జీలు పెరగడంతో నిత్యావసరాలతో పాటు ఇతర అన్నిరకాల వస్తువుల ధరలూ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.40 కోట్ల వాహనాలు ఉండగా... అందులో సరుకు రవాణా వాహనాల సంఖ్య 3.73 లక్షలు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలు, ఇతర సరుకులు, వస్తువులు, సామగ్రి తెచ్చే వేలసంఖ్యలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పెరిగిన డీజిల్ ధరల ప్రభావం అన్ని రకాల సరుకులపై పడుతోంది వాహన ప్రయాణం భారం రాష్ట్రంలోని 1.40 కోట్ల వాహనాలలో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. టూ వీలర్ల ద్వారానే ప్రతిరోజు కోటి లీటర్లకు పైగా పెట్రోల్ వినియోగం అవుతోంది. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క లీటర్పైనే రూ.26కు పైగా పెరిగిందంటే 11 నెలల కాలంలో ఎంత మేర భారం పడిందో అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై వెళ్లడానికే భయపడే పరిస్థితి నెలకొంది. జీఎస్టీనే పరిష్కారమైనా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పెట్రోలియం సంస్థలు ధరలను పెంచుతుండగా, ఆ మొత్తానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను సవరిస్తున్నాయి. కేంద్రం పెట్రోల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పేరిట ఏకంగా రూ.39.27 మేర పన్నుల భారం వేస్తుండగా, రాష్ట్రం వ్యాట్ రూపేణా మరో రూ.26.29 వసూలు చేస్తోంది. ఈ పన్నుల కారణంగానే ధరలు అమాంతంగా పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఏడాదికి పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్ రూపేణా సుమారు రూ.8 వేల కోట్ల మేర ఆదాయం వస్తోంది. రెండు నెలలుగా భారీగా పెరుగుతున్న చమురు ధరలతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. కొన్ని రాష్ట్రాలు తమ పన్నుల వాటాను తగ్గించుకున్నా, మన రాష్ట్రం మాత్రం పన్నులను తగ్గించలేదు. ఈ నేపథ్యంలో చమురు ధరలు దిగిరావాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని చెబుతున్నా... చమురు, మద్యంపై హక్కును వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. 2021 జనవరి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌కు) ఇలా.. –––––––––––––––– నెల పెట్రోల్ డీజిల్ –––––––––––––––––––––––– నవంబర్ 114.12 107.40 అక్టోబర్ 106.00 98.39 సెప్టెంబర్ 105.40 96.84 ఆగస్టు 105.83 97.96 జూలై 102.69 97.20 జూన్ 98,20 93.08 మే 93.99 88.05 ఏప్రిల్ 94.16 88.20 మార్చి 94.79 88.86 ఫిబ్రవరి 89.77 83.46 జనవరి 87.06 80.60 – రాష్ట్రంలో పెట్రోల్ వినియోగం నెలకు సగటున: 15 కోట్ల లీటర్లు – జనవరితో పోలిస్తే నవంబర్ నాటికి వినియోగదారులపై పడిన భారం సుమారుగా రూ.405.9 కోట్లు – సగటు డీజిల్ వినియోగం : 25 కోట్ల లీటర్లు – వినియోగదారులపై పడిన భారం రూ.676.5 కోట్లు అన్ని వర్గాలపై ప్రభావం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలు అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరగడంతో సరుకు రవాణా చార్జీలు ఆకాశన్నంటాయి. దీంతో నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి. – డి.పాపారావు, ఆర్థికరంగ నిపుణుడు -
ధరలు డబుల్!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్.. నిత్యావసర సరుకులు మినహా మిగతా వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ బంద్. కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేయడంతో దుకాణాలకు పడిన తాళం తెరవని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. దీర్ఘకాలంగా వ్యాపారం నడవకుంటే గిట్టుబాటు కాదనుకున్న కొందరు వ్యాపారులు దొడ్డి దారిన అమ్మకాలకు తెరలేపారు. అది కూడా రెట్టింపు ధరలకు.. కొనుగోలుదారు అవసరాన్ని బట్టి విక్రయాలను జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టనప్పటికీ.. ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాల పనులను అంతర్గతంగా సాగిస్తున్నారు. అవసరమైన మెటీరియల్ కొనేందుకు సంబంధిత డీలర్లు, వ్యాపారులను సంప్రదిస్తుండగా ధరలను అమాంతం పెంచేస్తున్నారు. కొందరు రాత్రిపూట దుకాణాలను తెరుస్తుండగా.. మరికొందరు దొడ్డి దారిని ఎంచుకుని కస్టమర్లకు అవసరమైన సామగ్రిని సర్దుతున్నారు. కార్మికులు, కూలీలున్నారని... మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 14 వరకు ప్రకటించిన లాక్డౌన్.. అనంతరం మే 3వరకు పొడిగించింది. దీంతో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు, కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొందరు సొంత ప్రాంతాలను కాలిబాటన ప్రయాణం కాగా.. మరికొందరు తమ ఓనర్ల వద్దే తలదాచుకున్నారు. లాక్డౌన్ పొడిగించడంతో అటు పనిలేక, ఇటు పైసలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిర్మాణదారులు వారికి ఆశ్రయం కల్పిస్తూ వారితో మిగులు పనులను చేయించేందుకు ఉపక్రమించారు. దీంతో వారికి ఉపాధి దొరకడంతో పాటు వీరికి పనులు పెండింగ్‌లో కాకుండా కొనసాగించే వెసులుబాటు వచ్చింది. భగభగలే.. అయినా కొనుగోలే... బడా నిర్మాణ సంస్థలు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగత నిర్మాణాలు, చిన్నపాటి ఇళ్లను నిర్మిస్తున్న వారు ఎప్పటికప్పుడే తెచ్చుకుంటారు. లాక్డౌన్ రెండోసారి పొడిగించిన తర్వాత అప్పటివరకు నిలిచిపోయిన పనులను మెల్లగా ప్రారంభించారు. ఈనెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం కొందరు పనులు వేగిరం చేశారు. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం కత్తిమీద సాములా మారింది. చాలా చోట్ల డీలర్లు ధరలు పెంచేస్తున్నారు. సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్, సానిటరీ, రంగులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సరుకుల ధరలు 30% నుంచి రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్ (రాళ్లు) ధరలూ భారీగా పెరిగాయి. అయినా కొనుగోలుదారులు వెనక్కు తగ్గడం లేదు. నిర్మాణ పనులను నిలిపేయడం కంటే కాస్త ఎక్కువ పెట్టి సాగించడమే మేలని భావిస్తున్నారు. సమయం కలసిరావడంతో పాటు కూలీలు, కార్మికుల కొరతను సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేస్తూ నిర్మాణ పనులను కానిచ్చేస్తున్నారు. అపోహలు.. వదంతులు.. రాష్ట్రంలో లాక్డౌన్ మే 7 వరకు కొనసాగనుంది. ఇటు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరికొంత పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిర్మాణ పనులు నిలిచిపోతాయనే భావన నిర్మాణదారుల్లో ఉంది. మరోవైపు సరుకు రవాణా కష్టమవుతుందని, నిర్మాణ సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడుతుందని దుకాణదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ అపోహలు, వదంతుల మధ్య వ్యాపారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుండగా.. నిర్మాణదారులు మాత్రం ముందు జాగ్రత్త కింద స్టాకును తెచ్చిపెట్టుకుంటున్నారు. నగర శివార్లు, పట్టణ ప్రాంతాల్లో.. జోరుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం స్పీడు ఈ ఏడాది జనవరిలో కాస్త తగ్గింది. అయితే పట్టణాలు, గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో నిర్మాణ పనులు ఆశాజనకంగానే ఉన్నా యి.చాలాచోట్ల కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదలుపెట్టినవి మెజార్టీ 50 శాతంపైగా పూర్తయ్యాయి. మిగతావి పూర్తి చేసేలోపు కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ రావడంతో ఈ ప్రభావం నిర్మాణ పనులపై పడింది. రెండో విడత లాక్డౌన్ వున్నా కొందరు అంతర్గతంగా పనులు చేయిస్తున్నారు. కార్మికులు, కూలీలకు,ఓనరకూ నష్టం లేకుండా ఉంది. కొన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరలు ఇలా.. ► భవన నిర్మాణంలో కీలకమైంది సిమెంటు, ఇసుక. ప్రస్తుతం సిమెంటు దుకాణాలు మూతబడటంతో అవసరమున్న వారు రెట్టింపు ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రకం, బ్రాండెడ్ రకం ఒక్కో బ్యాగు ధర రూ.240 నుంచి 320 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.450 నుంచి 520 వరకు విక్రయిస్తున్నారు. ► లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇసుక రవాణా నిలిచిపోయింది. అయితే ఈ వ్యాపారం చేసే వాళ్లు ఇసుకను డంప్ చేస్తుంటారు. దీంతో అవసరమున్న నిర్మాణదారులు సమీపంలో ఉన్న సాండ్ డంపింగ్ యార్డు నుంచి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం టన్ను ఇసుక రూ.2,100 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.3,600 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ► నెల రోజుల క్రితం ఇటుక సాధారణ రకం, లైట్ వెయిట్ రకం ధరలు రూ. 5.25 నుంచి రూ. 7.50 ఉండగా.. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.11.50 చొప్పున అమ్ముతున్నారు. ► రెడీమెడ్ డోర్లు చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.130 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. ► ఎలక్ట్రికల్ సామగ్రిపై కనిష్టంగా రూ.40 శాతం అధికంగా విక్రయిస్తున్నారు. హార్డ్‌వేర్, శానిటరీ సరుకు లు కూడా ఇదే తరహాలో ధరలు పెంచేశారు. ► మరోవైపు సరుకు రవాణా చేసే వాహనదారులు సైతం చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్ : అడ్డగోలు దోపిడీ..
సాక్షి, హైదరాబాద్ : దేశం, రాష్ట్రమంతా కోవిడ్ మహమ్మారితో హడలెత్తిపోతుంటే.. ఈ ఆపత్కాలాన్ని కూడా వ్యాపారులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్నారు. ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ ప్రకటిం చిన నేపథ్యంలో కూరగాయల ధరలు పెం చేసి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. లాక్డౌన్ విధిం చినప్పటికీ.. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ప్రజ లంతా ఒక్కసారిగా మార్కెట్లకు ఎగబడ్డారు. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లు, సూపర్ మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 7 గంటల నుంచే జనం కూరగాయల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. నాలుగింతలు పెరిగిన ధరలు.. ఆదివారం జనతా కర్ఫ్యూ కొనసాగడంతో ఇళ్లకే పరిమితమైన జనం సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చారు. ఆదివారం మార్కెట్లోకి కూరగాయలు రాకపోవడంతో నిల్వలు తక్కువగా ఉండటం, డిమాండ్ అధికంగా ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మెహదీపట్నం రైతుబజార్లో నిన్నమొన్నటి వరకు కిలో టమాట రూ.10 వరకు ఉండగా, సోమవారం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు అమ్మారు. అధిక ధరలకు అమ్మొద్దని మార్కెట్ అధికారులు ప్రకటించి, ధరల నిర్ణయ సూచీ ఏర్పాటు చేసినా వ్యాపారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే బజార్లో పచ్చిమిర్చీ కిలో ఏకంగా రూ.100 వరకు అమ్మారు. ఇతర మార్కెట్లలో కూడా టామాట కిలో రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకం చేయగా, పచ్చిమిర్చి కిలో రూ.150 వరకు అమ్మినట్లు కొనుగోలుదారులు తెలిపారు. అన్ని రకాల కూరగాయలు కూడా నాలుగింతలు పెరిగాయి. వారం రోజులకు సరిపడా కొనుగోలు చేయడంతో మధ్యాహ్నం 12 గంటలకే స్టాక్‌లు ఖాళీ అయ్యాయి. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల పాలు, పెరుగుకు డిమాండ్ పెరిగింది. దీన్ని కూడా వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. పాల ప్యాకెట్‌పై రూ.5 వరకు పెంచినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బియ్యం, పప్పులు, నూనెల కొనుగోళ్లకూ గిరాకీ పెరిగింది. అయితే వీటి ధరల్లో మాత్రం పెరగలేదు. చాటాచోట్ల జనం మార్కెట్లకు మాస్క్‌లు లేకుండా, గుంపుగుంపులుగా వస్తుండటం, అది టీవీ చానళ్లలో ప్రసారం అవుతుండటంతో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంది. నిత్యావసరాల కొనుగోళ్లకు ఒక్కరికి మంచి బయటకు రావొద్దని, సమీప ప్రాంతాల దుకాణాల్లోనే సరుకులు కొనుగోలు చేయాలని, సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఆంక్షలు పెట్టడంతో సాయంత్రం రద్దీ తగ్గింది. జాగ్రత్తలు తీసుకోండి.. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోమవారం ఉదయం ఈ అంశమై కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి పవన్‌కుమార్ అగర్వాల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలు, కూరగాయల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ముఖ్య సరుకులను ఇంటికే పంపించే అంశాలపైనా సూచనలు చేశారు. పహారా మధ్య అమ్మిస్తేనే ఆపత్కాలంలో అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అనేక అపోహలు, అనుమానాల మధ్య బతుకుతున్న తమను నిలువు దోపిడీ నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు. అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచి అమ్మడంతో ఏమీ కొనలేకపోతున్నామని, లాక్డౌన్ ప్రారంభమైన రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే మరికొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయల అమ్మకాలను పోలీసు పహారా లేదంటే మరే రూపంలోనైనా జరపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుబజార్లు, మార్కెట్లు, మాల్స్‌లో విపరీతంగా పెరిగిపోయిన ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి కూరగాయలు అమ్మించాలని, నిత్య జీవితంలో కీలకమైన వీటిని కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అంటున్నారు. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై ఫిర్యాదు చేసే పరిస్థితి లేదని, ఎక్కడ ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అవసరమైతే ప్రభుత్వం ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సభ్యులు రైతు బజార్లు, మార్కెట్లలో స్వయంగా ఉండి కూరగాయల విక్రయాలను నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
కోటాలో కోత
- గోధుమ పిండి పంపిణీలో గోల్మాల్ - మంజూరు 5 కిలోలు.. పంపిణీ కిలో - కానరాని కందిపప్పు - సరఫరాకాని గోధుమలు - బయోమెట్రిక్‌లో కనిపిస్తున్న సరుకుల వివరాలు ప్రొద్దుటూరు: మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేయాల్సిన సరుకులను కూడా సక్రమంగా అందించడం లేదు. మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరసరఫరాల శాఖలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన సరుకులేవీ లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా ఈ సరుకులు ఇచ్చినట్లు బయోమెట్రిక్ మిషన్‌లో నమోదు చేస్తున్నారు. సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించి బియ్యంతోపాటు ప్రతి బీపీఎల్ కార్డుకు 5 కిలోల గోధుమపిండి (కిలో రూ.16.50), ఐదు కిలోల గోధుమలు (కిలో రూ.7), కిలో కందిపప్పు రూ.50లు, చక్కెర అరకిలో రూ.6.75లు ప్రకారం పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు గత నెల 29న మండల తహశీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గోదాముల్లో సరుకుల నిల్వలు లేవని చాలా సరుకులు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఏమో ఈ సరుకులన్నీ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడంతో బయోమెట్రిక్ మిషన్లలో కూడా నమోదయ్యాయి. వినియోగదారుని కార్డు నెంబర్ కొడుతూనే ఈ సరుకుల వివరాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గోధుమపిండి, చక్కెర, బియ్యం మాత్రమే చౌకదుకాణాల్లో పంపిణీ చేస్తున్నారు. అందని కందిపప్పు ధరల ప్రభావం కారణంగా ప్రజలు మార్కెట్లో కందిపప్పు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కంది పప్పు రూ.150 వరకు ఉంది. అయితే ఇలాంటి సమయంలో కూడా ప్రభుత్వం కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1736 చౌకదుకాణాల పరిధిలో 6,99,563 కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్డుకు కిలో చొప్పున కందిపప్పు రూ.50ల ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. అయితే గత కొద్ది నెలలుగా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ విషయంపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశంను వివరణ కోరగా జిల్లాకు మొత్తం 700 మెట్రిక్ టన్నులు కందిపప్పు సరఫరా కావలసి ఉండగా ఇప్పటి వరకు 200 మెట్రిక్ టన్నులు చౌకదుకాణాలకు సరఫరా చేశామన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సరఫరా చేశామని తెలిపారు. వచ్చిన సరుకు వచ్చినట్లే పంపుతున్నామని తెలిపారు. మిగతా సరుకుల విషయంపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కృపానందంను వివరణ కోరగా గోధుమపిండి 5 కిలోలు ఇవ్వాలని మండల అధికారులకు తెలిపామన్నారు. గోధుమలు గోడౌన్లల్లో ఉన్న చోట పంపిణీ చేస్తున్నామన్నారు. మంజూరైంది 5 కిలోలు - పంపిణీ కిలో అధికారుల సమన్వయ లోపం కారణంగా ప్రజలు నష్టపోతున్నారు. వాస్తవానికి పౌరసరఫరాల శాఖ అధికార్లు డీలర్లుకు ముందుగా గోధమపిండి విషయాన్ని స్పష్టంగా తెలపలేదు. దీంతో డీలర్లు కిలో ప్రకారం డబ్బు కట్టి సరుకు దించుకున్నారు. ప్రస్తుతం వినియోగదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ మిషన్లు ఆన్ చేయగా 5 కిలోల గోధుమపిండి అని చూపుతోంది. తమకు అధికారులు కిలో ప్రకారమే ఇచ్చారని, వాటినే తాము పంపిణీ చేస్తున్నామని కొంత మంది డీలర్లు చెబుతుండగా మరికొందరు డీలర్లు కిలో మాత్రమే పంపిణీ చేస్తూ 5 కిలోలు ఇచ్చినట్లు ఏకంగా బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేయించుకుంటున్నారు.