సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్.. నిత్యావసర సరుకులు మినహా మిగతా వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ బంద్. కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేయడంతో దుకాణాలకు పడిన తాళం తెరవని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. దీర్ఘకాలంగా వ్యాపారం నడవకుంటే గిట్టుబాటు కాదనుకున్న కొందరు వ్యాపారులు దొడ్డి దారిన అమ్మకాలకు తెరలేపారు.
అది కూడా రెట్టింపు ధరలకు.. కొనుగోలుదారు అవసరాన్ని బట్టి విక్రయాలను జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టనప్పటికీ.. ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాల పనులను అంతర్గతంగా సాగిస్తున్నారు. అవసరమైన మెటీరియల్ కొనేందుకు సంబంధిత డీలర్లు, వ్యాపారులను సంప్రదిస్తుండగా ధరలను అమాంతం పెంచేస్తున్నారు. కొందరు రాత్రిపూట దుకాణాలను తెరుస్తుండగా.. మరికొందరు దొడ్డి దారిని ఎంచుకుని కస్టమర్లకు అవసరమైన సామగ్రిని సర్దుతున్నారు.
కార్మికులు, కూలీలున్నారని...
మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 14 వరకు ప్రకటించిన లాక్‌డౌన్.. అనంతరం మే 3వరకు పొడిగించింది. దీంతో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు, కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొందరు సొంత ప్రాంతాలను కాలిబాటన ప్రయాణం కాగా.. మరికొందరు తమ ఓనర్ల వద్దే తలదాచుకున్నారు. లాక్‌డౌన్ పొడిగించడంతో అటు పనిలేక, ఇటు పైసలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిర్మాణదారులు వారికి ఆశ్రయం కల్పిస్తూ వారితో మిగులు పనులను చేయించేందుకు ఉపక్రమించారు. దీంతో వారికి ఉపాధి దొరకడంతో పాటు వీరికి పనులు పెండింగ్‌లో కాకుండా కొనసాగించే వెసులుబాటు వచ్చింది.
భగభగలే.. అయినా కొనుగోలే...
బడా నిర్మాణ సంస్థలు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగత నిర్మాణాలు, చిన్నపాటి ఇళ్లను నిర్మిస్తున్న వారు ఎప్పటికప్పుడే తెచ్చుకుంటారు. లాక్‌డౌన్ రెండోసారి పొడిగించిన తర్వాత అప్పటివరకు నిలిచిపోయిన పనులను మెల్లగా ప్రారంభించారు. ఈనెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం కొందరు పనులు వేగిరం చేశారు. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం కత్తిమీద సాములా మారింది. చాలా చోట్ల డీలర్లు ధరలు పెంచేస్తున్నారు.
సిమెంటు, స్టీలు, హార్డ్‌వేర్, సానిటరీ, రంగులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సరుకుల ధరలు 30% నుంచి రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్ (రాళ్లు) ధరలూ భారీగా పెరిగాయి. అయినా కొనుగోలుదారులు వెనక్కు తగ్గడం లేదు. నిర్మాణ పనులను నిలిపేయడం కంటే కాస్త ఎక్కువ పెట్టి సాగించడమే మేలని భావిస్తున్నారు. సమయం కలసిరావడంతో పాటు కూలీలు, కార్మికుల కొరతను సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేస్తూ నిర్మాణ పనులను కానిచ్చేస్తున్నారు.
అపోహలు.. వదంతులు..
రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 7 వరకు కొనసాగనుంది. ఇటు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరికొంత పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిర్మాణ పనులు నిలిచిపోతాయనే భావన నిర్మాణదారుల్లో ఉంది. మరోవైపు సరుకు రవాణా కష్టమవుతుందని, నిర్మాణ సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడుతుందని దుకాణదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ అపోహలు, వదంతుల మధ్య వ్యాపారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుండగా.. నిర్మాణదారులు మాత్రం ముందు జాగ్రత్త కింద స్టాకును తెచ్చిపెట్టుకుంటున్నారు.
నగర శివార్లు, పట్టణ ప్రాంతాల్లో..
జోరుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం స్పీడు ఈ ఏడాది జనవరిలో కాస్త తగ్గింది. అయితే పట్టణాలు, గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో నిర్మాణ పనులు ఆశాజనకంగానే ఉన్నా యి.చాలాచోట్ల కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదలుపెట్టినవి మెజార్టీ 50 శాతంపైగా పూర్తయ్యాయి. మిగతావి పూర్తి చేసేలోపు కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్ రావడంతో ఈ ప్రభావం నిర్మాణ పనులపై పడింది. రెండో విడత లాక్‌డౌన్ వున్నా కొందరు అంతర్గతంగా పనులు చేయిస్తున్నారు. కార్మికులు, కూలీలకు,ఓనరకూ నష్టం లేకుండా ఉంది.
కొన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరలు ఇలా..
► భవన నిర్మాణంలో కీలకమైంది సిమెంటు, ఇసుక. ప్రస్తుతం సిమెంటు దుకాణాలు మూతబడటంతో అవసరమున్న వారు రెట్టింపు ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రకం, బ్రాండెడ్ రకం ఒక్కో బ్యాగు ధర రూ.240 నుంచి 320 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.450 నుంచి 520 వరకు విక్రయిస్తున్నారు.
► లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇసుక రవాణా నిలిచిపోయింది. అయితే ఈ వ్యాపారం చేసే వాళ్లు ఇసుకను డంప్ చేస్తుంటారు. దీంతో అవసరమున్న నిర్మాణదారులు సమీపంలో ఉన్న సాండ్ డంపింగ్ యార్డు నుంచి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం టన్ను ఇసుక రూ.2,100 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.3,600 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు.
► నెల రోజుల క్రితం ఇటుక సాధారణ రకం, లైట్ వెయిట్ రకం ధరలు రూ. 5.25 నుంచి రూ. 7.50 ఉండగా.. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.11.50 చొప్పున అమ్ముతున్నారు.
► రెడీమెడ్ డోర్లు చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.130 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు.
► ఎలక్ట్రికల్ సామగ్రిపై కనిష్టంగా రూ.40 శాతం అధికంగా విక్రయిస్తున్నారు. హార్డ్‌వేర్, శానిటరీ సరుకు లు కూడా ఇదే తరహాలో ధరలు పెంచేశారు.
► మరోవైపు సరుకు రవాణా చేసే వాహనదారులు సైతం చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment