కోటాలో కోత
- గోధుమ పిండి పంపిణీలో గోల్‌మాల్
- మంజూరు 5 కిలోలు.. పంపిణీ కిలో
- కానరాని కందిపప్పు
- సరఫరాకాని గోధుమలు
- బయోమెట్రిక్‌లో కనిపిస్తున్న సరుకుల వివరాలు
ప్రొద్దుటూరు: మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేయాల్సిన సరుకులను కూడా సక్రమంగా అందించడం లేదు. మరో వైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పౌరసరఫరాల శాఖలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం సరఫరా చేస్తున్నట్లు ప్రకటించిన సరుకులేవీ లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా ఈ సరుకులు ఇచ్చినట్లు బయోమెట్రిక్ మిషన్‌లో నమోదు చేస్తున్నారు.
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించి బియ్యంతోపాటు ప్రతి బీపీఎల్ కార్డుకు 5 కిలోల గోధుమపిండి (కిలో రూ.16.50), ఐదు కిలోల గోధుమలు (కిలో రూ.7), కిలో కందిపప్పు రూ.50లు, చక్కెర అరకిలో రూ.6.75లు ప్రకారం పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రామారావు గత నెల 29న మండల తహశీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గోదాముల్లో సరుకుల నిల్వలు లేవని చాలా సరుకులు పంపిణీ చేయలేదు. ప్రభుత్వం ఏమో ఈ సరుకులన్నీ పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడంతో బయోమెట్రిక్ మిషన్లలో కూడా నమోదయ్యాయి. వినియోగదారుని కార్డు నెంబర్ కొడుతూనే ఈ సరుకుల వివరాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గోధుమపిండి, చక్కెర, బియ్యం మాత్రమే చౌకదుకాణాల్లో పంపిణీ చేస్తున్నారు.
అందని కందిపప్పు
ధరల ప్రభావం కారణంగా ప్రజలు మార్కెట్‌లో కందిపప్పు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కంది పప్పు రూ.150 వరకు ఉంది. అయితే ఇలాంటి సమయంలో కూడా ప్రభుత్వం కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1736 చౌకదుకాణాల పరిధిలో 6,99,563 కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్డుకు కిలో చొప్పున కందిపప్పు రూ.50ల ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. అయితే గత కొద్ది నెలలుగా పరిస్థితి ఇలాగే ఉంది.
ఈ విషయంపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశంను వివరణ కోరగా జిల్లాకు మొత్తం 700 మెట్రిక్ టన్నులు కందిపప్పు సరఫరా కావలసి ఉండగా ఇప్పటి వరకు 200 మెట్రిక్ టన్నులు చౌకదుకాణాలకు సరఫరా చేశామన్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సరఫరా చేశామని తెలిపారు. వచ్చిన సరుకు వచ్చినట్లే పంపుతున్నామని తెలిపారు. మిగతా సరుకుల విషయంపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కృపానందంను వివరణ కోరగా గోధుమపిండి 5 కిలోలు ఇవ్వాలని మండల అధికారులకు తెలిపామన్నారు. గోధుమలు గోడౌన్లల్లో ఉన్న చోట పంపిణీ చేస్తున్నామన్నారు.
మంజూరైంది 5 కిలోలు - పంపిణీ కిలో
అధికారుల సమన్వయ లోపం కారణంగా ప్రజలు నష్టపోతున్నారు. వాస్తవానికి పౌరసరఫరాల శాఖ అధికార్లు డీలర్లుకు ముందుగా గోధమపిండి విషయాన్ని స్పష్టంగా తెలపలేదు. దీంతో డీలర్లు కిలో ప్రకారం డబ్బు కట్టి సరుకు దించుకున్నారు. ప్రస్తుతం వినియోగదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ మిషన్లు ఆన్ చేయగా 5 కిలోల గోధుమపిండి అని చూపుతోంది. తమకు అధికారులు కిలో ప్రకారమే ఇచ్చారని, వాటినే తాము పంపిణీ చేస్తున్నామని కొంత మంది డీలర్లు చెబుతుండగా మరికొందరు డీలర్లు కిలో మాత్రమే పంపిణీ చేస్తూ 5 కిలోలు ఇచ్చినట్లు ఏకంగా బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేయించుకుంటున్నారు.