
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలో తులం గోల్డ్ రేటు రూ.90 వేలకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. అయితే రాబోయే బడ్జెట్‌లో (ఫిబ్రవరి 1) బంగారంపై దిగుమతి సుంకాలను పెంచితే.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని, బంగారం రేటు మరింత పెరుగుతుందని 'వరల్డ్ గోల్డ్ కౌన్సిల్' (WGC) పేర్కొంది.
గత ఏడాది జూలైలో బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపిందని. అంతేలోనే మళ్ళీ ఈ సుంకాలను పెంచితే.. స్మగ్లింగ్‌లో పెరుగుదల, దేశీయంగా బంగారం ధరలు పెరగడం వంటివన్నీ.. పరిశ్రమను వెనక్కి నెట్టేస్తాయని డబ్ల్యుజీసీ ఇండియా సీఈఓ 'సచిన్ జైన్' (Sachin Jain) వెల్లడించారు.
ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ఆర్థిక సంస్థలతో సహా వాటాదారులు కూడా.. ఈ బంగారం ధరలు సానుకూలంగా సాగటానికి సహకరించడం చాలా అవసరం. ఇదే జరిగితే బంగారు పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని జైన్ పేర్కొన్నారు.
బంగారు పరిశ్రమ భారతదేశ జీడీపీకి 1.3 శాతం సహకరిస్తుంది. అంతే కాకుండా సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. జూలైలో సమర్పించిన బడ్జెట్ 2024లో బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఈ చర్య అనధికారిక దిగుమతులను తగ్గించడానికి, అధికారిక మార్గాలను స్థిరీకరించడానికి, దేశీయంగా బంగారం కొనుగోలును ప్రోత్సహించడంలో సహాయపడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment