
సూడాన్‌లో పారామిలటరీ దారుణం
కైరో: సూడాన్‌లో మిలటరీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న పారామిలటరీ బలగాలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. ఇటీవలే దార్పుర్‌లోని ఎల్ ఫషెర్‌లోని ఆస్పత్రిపై దాడి చేసి 70 మంది అమాయకుల్ని బలి తీసుకున్న వీరు శనివారం మార్కెట్‌పై దాడి చేసి 54 మందికి పైగా చంపేశారు. ఒంబుర్మన్ నగరంలోని సబ్రెయిన్ మార్కెట్‌లో ఈ దారుణం జరిగింది. ఘటనలో మరో 158 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారంది. ఘటనపై పారా మిలటరీ బలగాలు స్పందించలేదు. మిలటరీ, పారామిలటరీ బలగా లు ఆధిపత్యం కోసం 2023 ఏప్రిల్ నుంచి ముఖాముఖి పోరు సాగిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనల్లో రాజధాని ఖార్టూమ్‌తోపాటు పొరుగునే ఉన్న ఒంబుర్మన్, తూర్పు, సెంట్రల్ ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాల్లో మిలటరీ పైచేయి సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న గెజిరా ప్రావిన్స్ రాజధాని వాద్ మెదానీని కూడా సైన్యం తిరిగి స్వాధీనం పర్చుకుంది.