military actions
-
తైవాన్ను దిగ్బంధించిన డ్రాగన్
తైపీ: డ్రాగన్ దేశం చైనా సోమవారం తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలకు తెరతీసింది. విమాన వాహక నౌక, యుద్ద నౌకలు, అత్యాధునిక యుద్ధ విమానాలతో తైవాన్ను, చుట్టుపక్కల దీవులను చుట్టుముట్టింది. కమ్యూనిస్ట్ చైనాలో అంతర్భాగమని అంగీకరించబోమంటూ తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్–తె ఇటీవల చేసిన ప్రకటనకు సమాధానంగానే విన్యాసాలు చేపట్టినట్లు చైనా ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన జాతీయ ఉత్సవాల్లో అధ్యక్షుడు లాయ్ చింగ్–తె మాట్లాడుతూ.. తైవాన్ తమదేనంటూ చైనా చేస్తున్న వాదనను ఖండించారు. చైనా బెదిరింపులను, దురాక్రమణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం నచ్చని చైనా తాజాగా భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. విమాన వాహక నౌక లియోనింగ్ నుంచి జె–15 యుద్ధ విమానం టేకాఫ్ తీసుకుంటున్న వీడియోను అధికార టీవీ ప్రసారం చేసింది. అయితే, విన్యాసాలు ఎన్ని రోజులు కొనసాగుతాయనే విషయం తెలపలేదు. నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, మిస్సైల్ బలగాలు కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆరీ్మ(పీఎల్ఏ) ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రకటించింది. తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతిచ్చే వారికి ఇదో హెచ్చరికని పేర్కొంది. దీనిపై తైవాన్ స్పందించింది. గుర్తించిన ప్రాంతాల్లో యుద్ధ నౌకలను, మొబైల్ మిస్సైళ్లను మోహరించామని, రాడార్లతో గట్టి నిఘా ఉంచామని తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. 25 వరకు చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలను, మరో నాలుగు చైనా ప్రభుత్వ నౌకలను రాడార్లు గుర్తించాయని తైవాన్ పేర్కొంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో చైనా 125 సైనిక విమానాలను విన్యాసాలకు పంపిందని తైవాన్ తెలిపింది. వీటిలో 90 వరకు విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు తమ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోనే కనిపించాయంది. చైనా మేలోనూ ఇదే రకంగా మిలటరీ విన్యాసాలను చేపట్టింది. 2022లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సారథ్యంలోని బృందం తైవాన్ సందర్శన సమయంలో కూడా చైనా భారీ సైనిక విన్యాసాలతో తైవాన్ను దిగ్బంధంలో ఉంచింది. ఇలా ఉండగా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలో విలీనం కాకమునుపు తైవాన్ జపాన్ వలసప్రాంతంగా ఉండేది. చైనా ప్రధాన భూభాగంపై మావో జెడాంగ్ నేతృత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పటయ్యాక 1949లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ తైవాన్‌లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
International Court of Justice: రఫాలో సైనిక చర్య ఆపండి
ది హేగ్: దక్షిణ గాజాలోని రఫా నగరంలో సైనిక చర్యను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ శుక్రవారం ఆదేశించింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండకపోవచ్చు. పాలస్తీనియన్లపై దాడుల విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోతున్న ఇజ్రాయెల్‌పై కోర్టు ఆదేశాలు మరింత ఒత్తిడిని పెంచుతాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 10 లక్షల పైచిలుకు పాలస్తీనియన్లు రఫాకు వలస వచ్చారు. వీరిలో చాలామంది టెంట్లలో నివసిస్తున్నారు. రఫాపై ఇజ్రాయెల్ దృష్టి సారించడంతో మిత్రదేశం అమెరికాతో సహా పలుదేశాలు వారించాయి. ఈ వారమే మూడు యూరోప్ దేశాలు తాము పాలస్తీనాను స్వతంత్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. హమాస్‌కు మిగిలిన చివరి సురక్షిత స్థావరంగా రఫా ఉందని, దానిపై దాడి చేస్తేనే వారిని తుడిచిపెట్టగలమని ఇజ్రాయెల్ అంటోంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) అధ్యక్షుడు నవాఫ్ సలామ్ తీర్పు వెలువరిస్తూ ‘రఫాలో సైనిక చర్యపై తాము వెలిబుచ్చిన భయాలు నిజమయ్యాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తక్షణం రఫాలో సైనిక చర్య నిలిపివేయకుంటే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు వారాల కిందట రఫాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీచేసింది. సైన్యాన్ని రఫా దిశగా నడిపించి కీలకమైన సరిహద్దు మార్గాన్ని తమ ఆ«దీనంలోకి తీసుకొంది. మానవతాసాయం అందడానికి రఫా క్రాసింగ్ అత్యంత కీలకం. అందుకే రఫా క్రాసింగ్‌ను తెరిచి ఉంచాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బే అయినా .. రఫాపై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిలువరించలేవు. ఎందుకంటే ఐసీజే వద్ద తమ ఆదేశాలను అమలుచేయడానికి అవసరమైన పోలీసు, సైనిక బలగాలేమీ లేవు. -
చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం?
తైపీ: పొరుగు దేశాల విషయంలో ఆధిపత్య ప్రదర్శన కోసం చైనా చేసే యత్నాల గురించి తెలియంది కాదు. ఈ క్రమంలో.. తైవాన్‌పై అది మిలిటరీ వేధింపులకు పాల్పడుతూ వస్తోంది. తాజాగా.. ఏకంగా వందకి పైగా యుద్ధవిమానాలను తైవాన్ వైపు పంపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యింది. చైనా చర్యలను కవ్వింపుగా అభివర్ణిస్తోంది తైవాన్ రక్షణశాఖ.. చైనా ఇప్పటివరకు పంపిన యుద్శ విమానాల్లో.. 40 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధి(అనధికార సరిహద్దు రేఖ) మధ్య రేఖను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద దుందుడుకు చర్యగా తైవాన్ చెబుతోంది. యుద్ధవిమానాలతో పాటు తొమ్మిది చైనా నౌకలనూ గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు.. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. అక్కడ ‘మధ్య రేఖ’ అంటూ ఏదీ లేదని, తైవాన్ కూడా చైనాలో భాగమేనని పేర్కొనడం గమనార్హం. మరోవైపు తాజాగా తైవాన్ను విలీనం చేసుకునేందుకు బీజింగ్ ఇటీవల ఓ ప్రణాళికను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ ప్రణాళికను ఆవిష్కరించడం గమనార్హం. -
Colonel Manpreet Singh Funeral: జై హింద్ పాపా!
చండీగడ్: వయసు నిండా ఆరేళ్లే. ఇంకా ముక్కు పచ్చలే ఆరలేదు. కళ్లెదుట కన్న తండ్రి పార్థివ దేహం. అయినా సరే, వీర మరణం పొందిన తండ్రికి అంతే వీరోచితమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. అంతటి అంతులేని దుఃఖాన్నీ పళ్ల బిగువున అదిమిపెట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యే సైనిక వీరుల యూనిఫాం ధరించాడు. త్రివర్ణ పతాకం కప్పి ఉన్న తండ్రి శవపేటికను మౌనంగా సమీపించాడు. ఆ పేటికనే చిట్టి చేతులతో బిగియారా కౌగిలించుకున్నాడు. ఆ సమయాన ఆ చిన్ని మనసులో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో! ఎన్నెన్ని భావాలు చెలరేగాయో! ఎంతటి దుఃఖం పొంగుకొచ్చిందో! అవేవీ పైకి కనిపించనీయలేదు. కన్నీటిని కనీసం కంటి కొసలు కూడా దాటి రానివ్వలేదు. తండ్రి పార్థివ దేహం ముందు సగౌరవంగా ప్రణమిల్లాడు. రుద్ధమైన కంఠంతోనే, ‘జైహింద్ పాపా‘ అంటూ తుది వీడ్కోలు పలికాడు. అందరినీ కంట తడి పెట్టించాడు...! చండీగఢ్: కశ్మీర్ లోయలో ఉగ్ర ముష్కరులను ఏరిపారేసే క్రమంలో వీర మరణం పొందిన సైనిక వీరులు కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ దోంచక్ అంత్యక్రియలు శుక్రవారం అశ్రు నయనాల నడుమ ముగిశాయి. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో మన్‌ప్రీత్ స్వగ్రామం బహరౌన్ జియాన్‌లో ఉదయం నుంచే సందర్శకుల ప్రవాహం మొదలైంది. చూస్తుండగానే జనం ఇసుకేస్తే రాలనంతగా పెరిగిపోయారు. వారందరి సమక్షంలో పూర్తి సైనిక లాంఛనాల నడుమ మన్ ప్రీత్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ సందర్భంగా కుమారుడు కబీర్ సింగ్ కనబరిచిన గుండె దిటవు, ’జైహింద్ పాపా’ అంటూ తండ్రికి తుది సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంట తడి పెట్టించింది. గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ తో పాటు రాష్ట్ర మంత్రులు, మాజీ సైనికాధిపతి వేదప్రకాశ్ మాలిక్, సైనిక ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మేజర్ ఆశిష్ అంత్యక్రియలు కూడా హరియాణాలోని పానిపట్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. బుధవారం కశ్మీర్‌లోని కోకొర్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశిష్‌తో పాటు మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక డీఎస్పీ అసువులు బాయడం తెలిసిందే. గుండెలవిసేలా రోదించిన భార్య మన్ ప్రీత్ అంత్యక్రియల సందర్భంగా గుండెలవిసేలా రోదించిన ఆయన భార్యను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గవర్నర్, మంత్రులు తదితరులు మన్ ప్రీత్ భార్య, తల్లి తదితరులను ఓదార్చారు. అంత్యక్రియల సందర్భంగా భారత్ మాతా కీ జై నినాదాలతో ఊరంతా మారుమోగింది. మన్ ప్రీత్ చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రతిభావంతుడని ఆయన చిన్ననాటి గురువులు గుర్తు చేసుకున్నారు. తమ అభిమాన శిష్యుని అంత్యక్రియల సందర్భంగా వారంతా వెక్కి వెక్కి రోదించారు. ‘మేము వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తున్నాం. అదే సమయంలో, దేశం కోసం ప్రాణాలను ధార పోసిన మా శిష్యుణ్ణి చూసి గర్వంగానూ ఉంది‘ అని మన్‌ప్రీత్‌కు ఒకటో తరగతిలో పాఠాలు చెప్పిన ఆశా చద్దా అనే టీచర్ చెప్పారు. మూడో తరం సైనిక వీరుడు మన్‌ప్రీత్ తన కుటుంబంలో మూడో తరం సైనిక వీరుడు. ఆయనత తాత సైన్యంలో పని చేశారు. ఆయన తండ్రి సైన్యం నుంచి రిటైరయ్యాక తొమ్మిదేళ్ల క్రితం మరణించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న తల్లి తన కుమారుని పార్థివ దేహం కోసం ఉదయం నుంచే ఇంటి ముందు వేచి చూస్తూ గడిపింది. సైనిక వాహనం నుంచి శవపేటిక దిగగానే కుప్పకూలింది! -
గర్జించిన చెఫ్
ఉక్రెయిన్ సహా వివిధ దేశాల మిలటరీ ఆపరేషన్లలో రష్యా అధినేత పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ హఠాత్తుగా రష్యన్ సైన్యంపై తిరుగుబాటు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలోవాగ్నర్ సంస్థకి తగిన గుర్తింపు రాలేదు. గుర్తింపు అంతా రక్షణ మంత్రి షొయిగు కొట్టేస్తున్నారని రగిలిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్‌లో డొనెట్స్క్ ప్రాంతంలో సొలెడార్‌ను ఆక్రమించడంలో వాగ్నర్ సైనికులు ప్రాణాలు పణంగా పెడితే రష్యా రక్షణ శాఖ దానిని తమ ప్రతిభగా ప్రచారం చేసుకోవడం ప్రిగోజిన్ సహించలేకపోయారు. ఉక్రెయిన్‌లో ఇతర నగరాలు స్వా«దీనం చేసుకోవడానికి తాను సైన్యాన్ని సిద్ధం చేసినప్పటికీ రష్యా టాప్ జనరల్ వలెరి గెరసిమోవ్ మారణాయుధాల్ని సరఫరా చేయడంలో విఫలం కావడం కూడా ఆయనని అసహనానికి లోను చేసింది. రక్షణ మంత్రి షొయిగు ఆదేశాల మేరకు వాగ్నర్ సంస్థ సైనిక శిబిరాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యానని ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల్లో ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా సమరి్థంచుకునే స్థితిలో లేదని అందుకే మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చారు. ‘యుద్ధం అవసరం ఉంది. అందుకే సెర్గీ మార్షల్ అయ్యారు. ఆయన రెండో హీరోగా పతకాలు అందుకోవచ్చు. కానీ ఉక్రెయిన్ నిస్సైనీకరణ కు యుద్ధం అవసరం లేదు’అని ప్రిగోజిన్ చెబుతున్నారు. తాను చేస్తున్నది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయ పోరాటమన్నది ప్రిగోజిన్ వాదనగా ఉంది. ఎవరీ ప్రిగోజిన్? ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్ దగ్గర చెఫ్. విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే స్వయంగా గరిటె పట్టి వండి వడ్డించేవారు. ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. ఒక రెస్టారెంట్‌తో మొదలైన ఆయన ప్రయాణం ఒక దేశంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగింది. ► 1961 జూన్ 1న లెనిన్గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్)లో జని్మంచారు. ► టీనేజీలోనే దొంగతనాలు, దోపిడీలు చేసి 13 ఏళ్లపాటు జైల్లో ఉండి 1990లో బయటకు వచ్చాడు. ► జైలు నుంచి బయటకి వచ్చాక ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ధనికులు ఉండే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ► సంపన్నులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో ఎదిగారు. ► ప్రిగోజిన్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌కు పుతిన్ వస్తూ ఉండడంతో ఆయనతో పరిచయమైంది. ఆ తర్వాత ప్రొగోజిన్ జీవితమే మారిపోయింది. ► అప్పట్లో రష్యా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుతిన్ ద్వారా రష్యా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుల్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ లభించింది. ► 2001లో పుతిన్ అధ్యక్షుడయ్యాక ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాలల్లో ఫుడ్ కాంట్రాక్ట్‌లు కూడా ప్రిగోజిన్కే దక్కాయి. అధికారంలో ఉన్న వారితో ఎలా మెలగాలో ప్రిగోజిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ► 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ రష్యాలో పర్యటించి విందుని ఆస్వాదించాక ప్రిగోజిన్‌ను ‘పుతిన్ చెఫ్’అని పిలిచారు. అప్పట్నుంచి అదే పేరు స్థిరపడింది. ► రష్యా సందర్శనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచి్చనా పుతిన్‌తో వారు దిగిన ఫొటోల్లో ప్రొగోజిన్ తప్పనిసరిగా కనిపించేవారు. ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్‌లు అతని సొంతమయ్యాయి. ► 2012లో ప్రభుత్వ స్కూళ్లకు కేటరింగ్ నడపడం కోసమే 105 కోట్ల రూబుల్స్ కాంట్రాక్ట్ దక్కింది. ► అలా వచి్చన డబ్బులతో ప్రిగోజిన్ వాగ్నర్ అనే కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ► మొదట్లో వాగ్నర్ సంస్థ తనదేనని ఆయన బాహాటంగా చెప్పుకోలేదు. చిట్టచివరికి 2021లో వాగ్నర్ సంస్థ తనదేనని అంగీకరించారు. ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది ప్రొగోజిన్ అనే అనుమానాలున్నాయి. అప్పట్నుంచి అమెరికా అతనిపై నిషేధం విధించింది. వాగ్నర్ సంస్థ ఏం చేస్తుందంటే..? ► 2014లో క్రిమియాని ఆక్రమించాలని పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు యెవ్గెనీ ప్రిగోజిన్‌తో తానే ఈ సంస్థను ఏర్పాటు చేయించారన్న ప్రచారమైతే ఉంది. ► క్రిమియా ఆక్రమణలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికే ఈ ప్రైవేటు సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది. ► రష్యాలో ప్రైవేటు సైన్యం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రష్యా రక్షణ శాఖ కిరాయి సైన్యాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేది. ► క్రిమియా తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లో దాన్బాస్లో రష్యా అనుకూల వర్గానికి మద్దతుగా పని చేసి ఆ ఆపరేషన్‌లో విజయం సాధించింది.అలా వాగ్నర్ కార్యకలాపాలు విస్తరించాయి. ► సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. ► లిబియా, మొజాంబిక్, మాలి, సూడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజులా ఇలా ఎక్కడ ఘర్షణలు అట్టుడికినా రష్యా జోక్యం ఉంటే అక్కడ తప్పకుండా వాగ్నర్ గ్రూప్ ప్రత్యక్షమయ్యేది. ► ఓ రకంగా వాగ్నర్ పుతిన్‌కు చెందిన కిరాయి సైన్య#గామారింది. ► ఈ గ్రూపులో మాజీ సైనికులే సభ్యులుగా ఉంటారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ గ్రూపులో 60 వేల మంది సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకం ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచి వార్నర్ సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రెండు వారాల్లో నెగ్గేస్తామన్న పుతిన్ భ్రమలు తొలగిపోవడంతో వాగ్నర్ సైనికులు మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ప్రొగోజిన్ వారు తన సైనికులేనంటూ బహిరంగంగా అంగీకరించడమే కాకుండా యుద్ధాన్ని ముమ్మరం చేశారు. ౖ ఖైదీలను సైనికులుగా చేర్చుకున్నారు. ఈ యుద్ధంలో సంస్థకు చెందిన 50 వేల మంది పాల్గొన్నారు. కీలక నగరాల స్వా«దీనంలో వీరే ముందున్నారు. బఖ్ముత్æ కోసం జరిగిన పోరులో 20 వేల మంది మరణించారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
కిమ్‌కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
భారీ సైనిక విన్యాసాలు.. అణుక్షిపణుల ప్రయోగం
సియోల్: కొరియా ద్వీపకల్పం వేడెక్కుతోంది. ఒకవైపు అమెరికా– దక్షిణకొరియా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభం కాగా, వీటిని సవాల్ చేస్తూ జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యమున్న క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దక్షిణకొరియా, అమెరికా సైనిక బలగాలు సోమవారం నుంచి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. 2018 తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఉమ్మడి విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే, దక్షిణకొరియా, అమెరికాల చర్యలు తమ దేశ దురాక్రమణకు రిహార్సల్ వంటివని ఆరోపిస్తున్న ఉత్తరకొరియా దీనికి నిరసనగా ఆదివారం జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులు వ్యూహాత్మక ఆయుధాలని అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ అభివర్ణించింది. దేశ అణు సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని తెలిపింది. ఇవి రెండు గంటలపాటు గాలిలోనే ఉన్నాయని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. అయితే, ఉత్తరకొరియా జలాంతర్గామి నుంచి అణు వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల పరిజ్ఞానాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
డ్రాగన్ సైనిక విన్యాసాలు
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు కొనసాగుతాయని హైనన్ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. -
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ
లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్‌లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది. -
దద్దరిల్లుతున్న తూర్పు ఉక్రెయిన్
కీవ్: యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. వీటికి తోడు గత 24 గంటల్లో ఇరువైపులా కనీసం 1,500కు పైగా పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. దాంతో రెబల్స్ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి. శనివారం నాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఆదివారం ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపించారు. దాన్ని నివారించేందుకు పుతిన్‌తో ఎక్కడైనా, ఎలాంటి రూపంలోనైనా చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రత ప్రమాదంలో పడిందనే నెపంతో యుద్ధానికి దిగవచ్చని నాటో దేశాలంటున్నాయి. అక్కడ రష్యన్లను ఊచకోత కోస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ఆరోపిస్తుండటమే ఇందుకు రుజువంటున్నాయి. పుతిన్ చెప్పిన చోట చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించినా రష్యా స్పందించలేదు. రష్యా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా అన్నది అసలు ప్రశ్న అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ అన్నారు. దూకుడుగా క్షిపణి పరీక్షలు, దళాల మోహరింపులకు దిగుతున్న వాళ్లముందు చర్చల మంత్రం పఠించడం వృథా అని అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రు లు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ 24న భేటీ కానున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు యూరప్ అంతటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొం టోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగబడితే దానిపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే విషయంలో యూరప్ దేశాలన్నీ కలిసి రావాలి. – అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వెనక్కు వచ్చేయండి ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారత దౌత్య సిబ్బంది కుటుంబీకులంతా వెంటనే వచ్చేయాలని కేంద్రం సూచించింది. అక్కడున్న భారతీయులంతా కూడా తక్షణం స్వదేశానికి వచ్చేయాలని మరోసారి చెప్పింది. ‘‘అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ ఫ్లైట్లలో బయల్దేరండి. వివరాల కోసం ఎంబసీని సంప్రదించండి.’’ అని పేర్కొంది. మంగళ, గురు, శనివారాల్లో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ఎయిరిండియా విమానాలున్నందున సిబ్బంది కుటుంబీకుల కోసం ప్రత్యేక విమానం పంపే ఆలోచనేదీ లేదని అధికారులు చెప్పారు. -
రష్యా దళాల... భారీ మోహరింపు
మాస్కో/బెర్లిన్: ఉక్రెయిన్ సమీపంలో సరిహద్దుల వెంబడి రష్యా సైనిక మోహరింపులు భారీగా పెరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాల్లో సైనిక దళాలు కదం తొక్కుతుండటం ఆ ఫొటోల్లో కన్పిస్తోంది. క్రిమియాలోని ఆక్టియాబ్రిస్కోయ్ ఎయిర్ ఫీల్డ్, లేక్ డొనుజ్లావ్ తదితర చోట్ల వేలాది సైనిక శిబిరాలు, భారీగా మిలిటరీ వాహనాలు కన్పించాయి. బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు మోహరించాయి. వీటికి తోడు సరిహద్దులకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోని రెచిస్టాకు కూడా సేనలు భారీగా చేరుకుంటున్నాయి. పశ్చిమ రష్యాలో కూడా ఉక్రెయిన్ సరిహద్దులకు 110 కిలోమీటర్ల సమీపంలో సైనిక సందడి నానాటికీ పెరుగుతున్నట్టు ఫొటోలు వెల్లడించాయి. యుద్ధ మేఘాలు నానాటికీ దట్టమవుతుండటంతో పలు ఎయిర్‌లైన్స్ ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉత్తర ఉక్రెయిన్ భూభాగంపై రెబెల్స్ కూల్చివేసిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రిస్కు తీసుకోవడం లేదు. రష్యాకు జర్మనీ చాన్స్‌లర్ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్‌లో, మంగళవారం రష్యాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. యూరప్‌లో యుద్ధాన్ని నివారించడం జర్మనీ బాధ్యత అని పార్లమెంటులో ఆయన చెప్పారు. యుద్ధానికి దిగితే రష్యా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. -
సూడాన్ ప్రధానమంత్రిగా మళ్లీ అబ్దల్లా హమ్దోక్
కైరో: సూడాన్ ప్రధానమంత్రిగా అబ్దల్లా హమ్దోక్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సూడాన్ సైన్యం, రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అక్టోబర్ 25 నుంచి అరెస్టు చేసిన ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను విడుదల చేసేందుకు సైన్యం అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కుదరడం వెనుక ఐక్యరాజ్యసమితి, అమెరికా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గత నెలలో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా హమ్దోక్ పదవి నుంచి దిగిపోయారు. అయితే, సైన్యంతో కుదిరిన ఒప్పందంపై తాము సంతకం చేయలేదని సూడాన్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన ‘ఉమ్మా పార్టీ’ ప్రకటించింది. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!
బీజింగ్: తైవాన్ను ఆక్రమించేందుకు మిలటరీ చర్యకు చైనా సిద్ధమవుతోందని మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటంతో తైవాన్‌పై దాడికే ఈ మోహరింపు అని వివరిస్తున్నారు. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న పాత డీఎఫ్ 11, డీఎఫ్ 15 క్షిపణుల స్థానంలో ఆధునిక ఢీఎఫ్ 17 క్షిపణులను చైనా మోహరిస్తోంది. ఈ ఆధునిక హైపర్సోనిక్ క్షిపణి అత్యంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను చేధిస్తుంది. స్వీయ పాలనలో ఉన్న ద్వీప దేశం తైవాన్ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్ను ఆక్రమించేందుకు అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గ్వాంగ్డాంగ్, ఫ్యుజియన్ ప్రాంతాల్లో చైనా బలగాల, ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కెనడాకు చెందిన ‘కన్వా డిఫెన్స్ రివ్యూ’ పేర్కొంది. తైవాన్ లక్ష్యంగా యుద్ధం చేసేందుకు తూర్పు, దక్షిణ కమాండ్స్ల క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు మంగళవారం చైనా అధ్యక్షుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. -
దక్షిణ కొరియాకు కిమ్ సోదరి హెచ్చరిక
సియోల్: తమ దేశానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం సాగించడం ఇకనైనా ఆపకపోతే సైనిక చర్య తప్పదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ దక్షిణ కొరియాను హెచ్చరించారు. దక్షిణ కొరియాకు చెందిన మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు గాలిబుడగల్లో కరపత్రాలు నింపి, ఉ.కొరియా– ద.కొరియా సరిహద్దుల్లో వదులుతున్నారు. ఉత్తర కొరియాలో నియంతృత్వం రాజ్యమేలుతోందని, అక్కడ ప్రజలకు ఎలాంటి హక్కులు లేవని, బానిసల్లా బతుకుతున్నారని ఈ కరపత్రాల్లో రాస్తున్నారు. ఈ చర్యను ఉత్తర కొరియా తీవ్రంగా పరిగణిస్తోంది. ద.కొరియాపై తదుపరి ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశాన్ని తమ సైనికాధికారులకే వదిలేస్తామని చెప్పారు. -
సానుకూలంగా భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివాదాస్పద ప్రాంతానికి చేరువలో ఉన్న తమ తమ స్థావరాలకు రెండు దేశాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని బేస్‌ల వద్దకు చైనా శతఘ్నులను, పదాతిదళ పోరాట వాహనాలు, భారీ సైనిక సామగ్రిని చేరుస్తోంది. భారత్ సైతం శతఘ్నులు, బలగాలను అక్కడికి పంపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో మునుపటి స్థితిని నెలకొల్పే వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. వైమానిక దళాలు వివాదాస్పద ప్రాంతంలో కదలికలపై కన్నేసి ఉంచాయి. మే మొదటి వారంలో చైనా 2,500 బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన మొదలైంది. తరచూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ చైనా తన బలగాల సంఖ్యను పెంచింది. కాగా, తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత్ సైనికులకు గాయాలయ్యాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సైన్యం స్పందించింది. ‘ఆ వీడియోకు ఎలాంటి ప్రామాణికత లేదు. అక్కడ ఎలాంటి హింస జరగలేదు’అని సైన్యం ప్రకటించింది. -
ఇరాన్ బలంగా తయారవ్వాలి: ఖమేనీ
టెహ్రాన్: యుద్ధాన్ని నిరోధించడానికి, శత్రువుల బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇరాన్ ఇంకా బలంగా తయారు కావాలని ఆ దేశ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దశాబ్దాలుగా అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ బలమైన వైమానిక దళాన్ని తయారు చేసుకోగలిగిందన్నారు. శనివారం వైమానిక దళం కమాండర్స్, సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ భయం, శత్రు భయం లేకుండా మనం పటిష్టంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. -
ఒక్క బుల్లెట్ తగిలినా మసే
టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ ఇంకా మాట లు తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించి మరీ ఆఖరి నిముషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై యుద్ధంప్రకటిస్తే మధ్యప్రాచ్య దేశాలన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ‘ఇరాన్‌కి ఒక్క బుల్లెట్ గాయమైనా ఈ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలన్నీ మంటల్లో కలుస్తాయి‘‘ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ‘‘మా శత్రువులు ఎవరైనా ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ప్రాంతంలో సైనికచర్యలకు దిగితే ఈ ప్రాంతం అంతా మండిపోతుంది‘‘ అని అన్నారు. గత ఏడాది ఇరాన్‌తో అణు ఒప్పందా న్ని అమెరికా ఏకపక్షంగా రద్దు చేసుకోవడంతో పాటు వివిధ దేశాలపై ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు వద్దంటూ ఆంక్షలు విధించిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ని ఇరాన్ కూల్చి వేసిన అవి మరింత పెరిగిపోయాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాల్ని పంపించిన అధ్యక్షుడు ట్రంప్ 150 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిసే ఆఖరి క్షణంలో వెనకడుగు వేశారని కథనాలు వెలువడ్డాయి. అమెరికా సిబ్బందికి భద్రత పెంపు అమెరికా, ఇరాన్ ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండడంతో ఇరాక్ కూడా అప్రమత్తమైంది. ఇరాక్‌లోని అతి పెద్ద వైమానిక స్థావరం బాలాద్లో అమెరికా సిబ్బందికి భద్రతను పెంచింది. రాత్రి పూట నిఘా పెంచింది. తనిఖీలు చేపడుతోంది. ఇరాన్‌కు ప్రాణస్నేహితుడినవుతా: ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను త్యజిస్తే గొప్ప దేశంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అణ్వాయుధాలను వదిలిస్తే ఇరాన్‌కు ప్రాణ స్నేహితుడిని అవుతా. ఇదే జరిగితే ఇరానియన్లు ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటారు. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేద్దాం’ అని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటాన్ని అంగీకరించబోమన్నారు. యుద్ధపిపాసి అన్న వారే తనను ఇప్పుడు శాంతి కపోతంగా అభివర్ణిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. విమానాలు దారి మళ్లిస్తున్న భారత్ న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్ గగనతలంలోకి మన దేశానికి చెందిన విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించారు. ఆ విమానాలన్నింటినీ దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని విమానయాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విమానాలను దారి మళ్లిస్తాం‘‘ అని ట్వీట్ చేశారు. బాలాకోట్ దాడుల తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ గగనతలం మీదుగా మన విమానాలేవీ ప్రయాణించడం లేదు. ఇప్పుడు ఇరాన్ మీదుగా వెళ్లకుండా నియంత్రణలు విధిస్తే అమెరికా, యూరోప్ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల పరిస్థితి గందరగోళంలో పడుతుందని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహాని వ్యాఖ్యానించారు. -
బలమైన సైనిక శక్తిగా భారత్
న్యూఢిల్లీ: తాజాగా దక్కిన అధికారం ప్రధాని నరేంద్ర మోదీ పెట్టుబడి నిబంధనలను మరింత సడలించేందుకు అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగైతే రిలయన్స్, మహీంద్రా, టాటా వంటి భారత ప్రైవేట్ రంగ దిగ్గజాలు వేల కోట్లు రక్షణ రంగంలో పెట్టుబడులుగా పెడతాయి. అప్పుడు భారత్‌ను ఓ పెద్ద సైనిక శక్తిగా తీర్చిదిద్దాలనే మోదీ ఆకాంక్ష నెరవేరుతుంది. స్వాతంత్య్రా నంతరం భారత రాజకీయ నాయకత్వం ముసాయిదా విధాన రూపకల్పనలో సైన్యాన్ని పక్కనపెట్టి ఔత్సాహికులకు, ఆ రంగంతో సంబంధం లేనివారికి, పిరికివాళ్లకు స్థానం కల్పించింది. ఫలితంగా భారత వ్యూహాత్మక లక్ష్యాలు ఎదుగూబొ దుగూ లేకుండా ఉండిపోయాయి. మోదీ రంగంలోకి దిగేవరకు ఇదే కొనసాగింది. యుద్ధాలు గెలవడానికి అవసరమైన విధులు నిర్వర్తించడానికి వీలుగా సాయుధ దళాల్లోకి వృత్తి నిపుణులను అనుమతించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్రానంతరం మొదటిసారిగా పాకిస్తాన్ ఉగ్ర దాడులకు భీకర ఎదురుదాడులతో భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. ఒక దెబ్బకు రెండు దెబ్బలు తీయాలనే మోదీ విధానానికి బాలాకోట్ దాడులు ఓ చక్కని ఉదాహరణ. జమ్మూకశ్మీర్‌లో 40 మంది జవాన్లను ఆత్మా హుతి బాంబర్ పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో బాలాకోట్‌లో భారత సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. 12 యుద్ధవిమానాలు పాక్‌లోని అంతర్జా తీయ సరిహద్దు వెంబడి ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. భారత్ దాడులను ఆపడంలో పాక్ అసమర్ధత బట్టబయలైంది. మోదీ దూకుడు గా వ్యవహరించిన తీరు ఓ సైనిక శక్తిగా పాక్‌ను బాగా క్షీణింపజేసింది. ఈ పరిస్థితుల్లో మోదీ మళ్లీ ప్రధాని కావడమనేది పాకిస్తాన్‌కు రుచించని వార్తే. -
భారత్–ఉజ్బెకిస్తాన్ల మధ్య 17 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకఘట్టం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రసుత్తం భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మేం పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. దీర్ఘకాల ప్రయోజ నాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. శాంతియుత, ప్రజాస్వామ్య, సుసంపన్న అఫ్గానిస్తాన్తోనే అందరికీ లాభం కలుగుతుంది’ అని ఈ విషయంలో సహకరించుకోవాలని భారత్, ఉజ్బెకిస్తాన్‌లో ఓ అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు. -
వెనెజులాను ఆక్రమిస్తే పోలా?
బొగోటా: ‘ప్రాంతీయ భద్రతకు సవాల్‌గా మారిన వెనెజులాను ఆక్రమించేస్తే సమస్య పరిష్కారమవుతుంది కదా?’ ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. గత ఆగస్టులో వెనెజులాపై ఆంక్షల గురించి చర్చించిన సందర్భంగా ట్రంప్ వేసిన ఈ ప్రశ్నకు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, జాతీయ భద్రత సలహాదారు మెక్ మాస్టర్ తదితరులు అవాక్కయ్యారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. చర్చ సందర్భంగా మెక్‌మస్టర్ తదితరులు వెనెజులాపై సైనిక చర్యతో కలిగే పరిణామాలను ట్రంప్‌నకు వివరించారు. అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దెదించే లక్ష్యంతో చేపట్టే ఈ చర్య ఫలితంగా లాటిన్ అమెరికా దేశాధినేతల మద్దతు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కు తగ్గలేదు. సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చే విషయమై ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ.. గతంలో పనామా (1989), గ్రెనడా(1982)లపై విజయవంతంగా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారని ఆ అధికారి తెలిపారు. ఈ సమావేశం తర్వాత రెక్స్ టిల్లర్సన్, మెక్ మస్టర్ ఇద్దరూ పదవుల నుంచి వైదొలగటం గమనార్హం. ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 11న, వెనెజులాపై సైనిక చర్యకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ హఠాత్తుగా ప్రకటించి కలకలం రేపారు. ఆపై కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ సాంటోస్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ దేశ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు వాషింగ్టన్ చేరుకున్న కొలంబియా, మరో మూడు లాటిన్ అమెరికా దేశాధినేతలతో ట్రంప్ ఇదే విషయంపై చర్చించారు. వారు కూడా ఆయన ఆలోచనను వ్యతిరేకించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘పొలిటికో’ పత్రిక పేర్కొంది. వెనెజులా రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఒబామా హయాంలో ఇవ్వని ప్రాధాన్యాన్ని ట్రంప్ ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అం టున్నారు. కానీ, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానం అమెరికా విరోధులకు మరింత ఊతమిచ్చేలా ఉందని విమర్శిస్తున్నారు. -
సిరియాపై సైనిక చర్యకు భారత్ అభ్యంతరం
సమస్యలకు రాజకీయ పరిష్కారమే సరి: ఖుర్షీద్ బిష్కెక్: సిరియాపై విదేశాల సైనిక చర్యకు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సంక్షోభ నివారణకు సమగ్ర రాజకీయ పరిష్కారమే మేలని స్పష్టం చేసింది. ఇందుకోసం అక్కడి అన్ని పార్టీలు రాజకీయ చర్చల్లో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. సిరియాలో రసాయన ఆయుధాల దాడిలో వెయ్యి మందికిపైగా ప్రజలు మృతి చెందిన నేపథ్యంలో అక్కడ సైనిక చర్యకు అమెరికా యత్నిస్తున్న సంగతి విదితమే. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న షాంఘై సహకార మండలి సదస్సులో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం ప్రసంగిస్తూ, సిరియాలోని రసాయనాల నిల్వలను అంతర్జాతీయ నియంత్రణలోకి తీసుకురావాలన్న రష్యా ప్రతిపాదనకు మద్దతిస్తున్నామన్నారు. అలాగే త్వరలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత్, పాక్ ప్రధానులు చర్చలు జరిపేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత్ వైఖరి వెల్లడించారు. ఉన్నతస్థాయి చర్చలకు ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు తగిన సుహృద్భావ వాతావరణం అవసరమని అన్నారు. ముంబై దాడుల కేసులో కొత్త ప్రాసిక్యూటర్ నియామకం, విచారణకు జ్యుడీషియల్ కమిషన్‌ను భారత్‌కు పంపడం, నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను పాక్ గౌరవించడం తదితర చర్యలు అవసరమని ఇవేవీ సాకారం కానప్పుడు ఈ ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే అవుతుందని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌కు చెప్పినట్లు ఖుర్షీద్ వెల్లడించారు.