డొనాల్డ్ ట్రంప్
బొగోటా: ‘ప్రాంతీయ భద్రతకు సవాల్‌గా మారిన వెనెజులాను ఆక్రమించేస్తే సమస్య పరిష్కారమవుతుంది కదా?’ ఉన్నతస్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలివి. గత ఆగస్టులో వెనెజులాపై ఆంక్షల గురించి చర్చించిన సందర్భంగా ట్రంప్ వేసిన ఈ ప్రశ్నకు విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, జాతీయ భద్రత సలహాదారు మెక్ మాస్టర్ తదితరులు అవాక్కయ్యారని పేరు వెల్లడించటానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తాజాగా వెల్లడించారు. చర్చ సందర్భంగా మెక్‌మస్టర్ తదితరులు వెనెజులాపై సైనిక చర్యతో కలిగే పరిణామాలను ట్రంప్‌నకు వివరించారు.
అధ్యక్షుడు నికొలస్ మదురోను గద్దెదించే లక్ష్యంతో చేపట్టే ఈ చర్య ఫలితంగా లాటిన్ అమెరికా దేశాధినేతల మద్దతు కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. అయినప్పటికీ ట్రంప్ వెనక్కు తగ్గలేదు. సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చే విషయమై ఆయన ఎలాంటి వ్యాఖ్య చేయనప్పటికీ.. గతంలో పనామా (1989), గ్రెనడా(1982)లపై విజయవంతంగా చేపట్టిన సైనిక చర్యలను ప్రస్తావించారని ఆ అధికారి తెలిపారు. ఈ సమావేశం తర్వాత రెక్స్ టిల్లర్సన్, మెక్ మస్టర్ ఇద్దరూ పదవుల నుంచి వైదొలగటం గమనార్హం. ఆ తర్వాత రోజు అంటే ఆగస్టు 11న, వెనెజులాపై సైనిక చర్యకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ట్రంప్ హఠాత్తుగా ప్రకటించి కలకలం రేపారు.
ఆపై కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ సాంటోస్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ దేశ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఐరాస సమావేశంలో పాల్గొనేందుకు వాషింగ్టన్ చేరుకున్న కొలంబియా, మరో మూడు లాటిన్ అమెరికా దేశాధినేతలతో ట్రంప్ ఇదే విషయంపై చర్చించారు. వారు కూడా ఆయన ఆలోచనను వ్యతిరేకించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘పొలిటికో’ పత్రిక పేర్కొంది. వెనెజులా రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి ఒబామా హయాంలో ఇవ్వని ప్రాధాన్యాన్ని ట్రంప్ ఇస్తున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అం టున్నారు. కానీ, ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానం అమెరికా విరోధులకు మరింత ఊతమిచ్చేలా ఉందని విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment