
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.
#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."
(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్‌స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్‌స్కీ ప్రశంసించారు.