
వెల్లడించిన అమెరికా
వాషింగ్టన్: ప్రపంచదేశాలపై టారిఫ్‌ల కొరడా ఝళిపించిన ట్రంప్ సర్కార్‌ను ఎలాగోలా ఒప్పించి టారిఫ్ వాతల నుంచి తప్పించుకోవాలని దాదాపు 50కిపైగా దేశాలు ప్రయత్నంచేశాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేళ్లుగా పలు దేశాల టారిఫ్‌ల భారాన్ని మోస్తున్న తామూ ఇకపై పరస్పర టారిఫ్‌లను విధిస్తామని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటిని అమల్లోకి తెచ్చిన విషయం తెల్సిందే.
అయితే ఇవి అమల్లోకిరాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, సంప్రదింపుల ద్వారా టారిఫ్‌ల భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నించాయని వైట్‌హౌస్‌లో జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హసెట్ చెప్పారు. 50కిపైగా దేశాలు అమెరికాతో టారిఫ్ సంబంధ మంతనాలు జరిపేందుకు ఆసక్తిచూపాయని కెవిన్ ఓవైపు చెబుతుంటే ఇండోనేసియా, తైవాన్ మాత్రం తాము అమెరికాపై ప్రతీకార టారిఫ్‌లు విధించబోమని ప్రకటించడం విశేషం.
అయితే తమపై పడే పన్నుల భారాన్ని కాస్తయినా తగ్గించుకునే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్ డీసీలో ట్రంప్‌తో చర్చలకు బయల్దేరారు. సోమవారం ట్రంప్‌తో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికాలోకి దిగుమతి అయ్యే అత్యధిక దిగుమతులపై సాధారణంగా కనీసం 10 శాతం అదనపు టారిఫ్‌ను శనివారం ట్రంప్ అమల్లోకి తెచి్చన నేపథ్యంలో పలు దేశాలు సంప్రదింపుల పర్వానికి తెరలేపాయి.
కనీసం 45 రోజులపాటు పెంపు నిర్ణయాన్ని వాయిదావేసుకోవాలని వియత్నాం నేత టో లామ్ కోరారు. పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ ఆర్థికవ్యవస్థ పరిరక్షణే తొలి ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. దిగుమతులపై టారిఫ్‌ల కారణంగా ఆయా ఉత్పత్తుల ధరలకు అమెరికా రెక్కలు రానున్నాయి. పెరిగే ధరలతో అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లుపడనుంది. అయితే తొలినాళ్లలో జనం ఇబ్బందులుపడ్డాసరే కొంతకాలానికి ఆయా వస్తువుల ఉత్పత్తి స్థానికంగా మొదలై ధరలు దిగొస్తాయని ట్రంప్ నమ్మబలుకుతున్నారు.
ద్రవ్యోల్బణం తప్పదు: ‘‘వస్తువులకు డిమాండ్ పెరగడంతో ద్రవ్యోల్బణం సమస్య ఎదురవుతుంది. దీనిని నివారించలేం. ఇలా టారిఫ్‌లతో సొంతంగా అమెరికా అతిపెద్ద ఆర్థికగాయాలు చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి ల్యారీ సమ్మర్స్ ఆందోళన వ్యక్తంచేశా రు. ‘‘టారిఫ్ భయాలతో స్టాక్‌మార్కెట్ మదుపరులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. మార్కె ట్లు చరిత్రాత్మక కనిష్టస్థాయిలకు ఒకవేళ పడినా మళ్లీ ఊహించనంత పెరుగుతాయి’’ అని ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవరో భరోసా ఇచ్చారు.
పెంగ్విన్లు, సీల్స్‌కూ టారిఫ్ సెగ
అంటార్కిటికా ఖండంలో చివర్లో ఉన్న రెండు మారుమూల బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ ఎందుకు విధించారని మీడియా ప్రశ్నించగా లుట్నిక్ అసలు విషయం బయటపెట్టారు. ‘‘ ఏ దేశంపై ఎంత టారిఫ్ వేయాలనేది అధికారులు పూర్తిగా నిర్ణయించలేదు. ఈ పనిని చాలావరకు కృత్రిమ మేథ(ఏఐ) చేసింది. అందుకే బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ బాంబు పడింది’’ అని అన్నారు. వాస్తవానికి ఈ హెర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ ద్వీపాల్లో జనం కంటే పెంగ్విన్లు, సీల్స్ ఎక్కువగా ఉంటాయి. శివారు ద్వీపాలపైనా టారిఫ్ వేయడం చూస్తుంటే ఈ విధానం హేతుబద్ధంగా జరగలేదని, గంపగుత్తగా టారిఫ్ వేశారని కొందరు వాణిజ్యవేత్తలు విమర్శించారు.