మాస్కో/బెర్లిన్: ఉక్రెయిన్ సమీపంలో సరిహద్దుల వెంబడి రష్యా సైనిక మోహరింపులు భారీగా పెరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాల్లో సైనిక దళాలు కదం తొక్కుతుండటం ఆ ఫొటోల్లో కన్పిస్తోంది. క్రిమియాలోని ఆక్టియాబ్రిస్కోయ్ ఎయిర్ ఫీల్డ్, లేక్ డొనుజ్లావ్ తదితర చోట్ల వేలాది సైనిక శిబిరాలు, భారీగా మిలిటరీ వాహనాలు కన్పించాయి. బెలారస్‌లో ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు మోహరించాయి.
వీటికి తోడు సరిహద్దులకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోని రెచిస్టాకు కూడా సేనలు భారీగా చేరుకుంటున్నాయి. పశ్చిమ రష్యాలో కూడా ఉక్రెయిన్ సరిహద్దులకు 110 కిలోమీటర్ల సమీపంలో సైనిక సందడి నానాటికీ పెరుగుతున్నట్టు ఫొటోలు వెల్లడించాయి. యుద్ధ మేఘాలు నానాటికీ దట్టమవుతుండటంతో పలు ఎయిర్‌లైన్స్ ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉత్తర ఉక్రెయిన్ భూభాగంపై రెబెల్స్ కూల్చివేసిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రిస్కు తీసుకోవడం లేదు.
రష్యాకు జర్మనీ చాన్స్‌లర్
ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్‌లో, మంగళవారం రష్యాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. యూరప్‌లో యుద్ధాన్ని నివారించడం జర్మనీ బాధ్యత అని పార్లమెంటులో ఆయన చెప్పారు. యుద్ధానికి దిగితే రష్యా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment