satellite picturs
-
పాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా పాగా!
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ భారీ నిర్మాణాలు చేపట్టింది. పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తరముఖాన ఏకంగా 100 పైగా నిర్మాణాలను చేపట్టింది. సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా చైనా ఈ నిర్మాణాలను చేపట్టిందని భావిస్తున్నారు. శిఖరాల మాటున తమ నియంత్రిత టిబెట్ భూభాగంలో నిర్మిస్తున్న ఈ సైనిక స్థావరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. చట్టూ కొండలు ఉండటం మూలాన.. భూమి పైనుంచి దీనిపై నిఘా వీలుకాదు. చైనా సైన్యానికి ఫార్వర్డ్ బేస్ (సరిహద్దులకు సమీపంలో సైనిక మొహరింపునకు వీలు కల్పించే నిర్మాణం)గా పనికి వస్తుంది. టిబెట్– భారత్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు వద్ద 2020లో భారత్, చైనా సైన్యానికి ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన నెలకొన్న ప్రదేశానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో చైనా 100 పైగా నిర్మాణాలను చేపట్టినట్లు ఉపగ్రహచిత్రాల్లో తేలింది. అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ తీసిన ఈ ఉపగ్రహచిత్రాల్లో 17 హెక్టార్ల విస్తీర్ణంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తక్షశిల ప్రొఫెసర్ వై.నిత్యానందం వెల్లడించారు. యెమగౌ రోడ్డులో 4,347 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీర్ఘచతురస్రాకారంలో 150 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ ఉందని, దీన్ని హెలికాప్టర్ల రాకపోకలకు వాడే ఉద్దేశం ఉండొచ్చని నిత్యానందం తెలిపారు. ఒక్కో దాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది నివసించే విధంగా భవనాలను కడుతున్నారని వివరించారు. రెండు పెద్ద భవనాలు ఉన్నాయని.. వీటిలో ఒకటి పాలనా కార్యాలయంగా, మరొకటి గిడ్డంగిగా వాడే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక వరుస క్రమంలో కాకుండా గజిబిజిగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని, భవిష్యత్తులో క్షిపణిదాడులు జరిగితే నష్టం తీవ్రత తగ్గించేందుకే ఇలా చేస్తుండవచ్చని వివరించారు. పాంగాంగ్ సరస్సు భారత్– టిబెట్లను వేరు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు. -
రష్యా దళాల... భారీ మోహరింపు
మాస్కో/బెర్లిన్: ఉక్రెయిన్ సమీపంలో సరిహద్దుల వెంబడి రష్యా సైనిక మోహరింపులు భారీగా పెరిగినట్టు ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యాల్లో సైనిక దళాలు కదం తొక్కుతుండటం ఆ ఫొటోల్లో కన్పిస్తోంది. క్రిమియాలోని ఆక్టియాబ్రిస్కోయ్ ఎయిర్ ఫీల్డ్, లేక్ డొనుజ్లావ్ తదితర చోట్ల వేలాది సైనిక శిబిరాలు, భారీగా మిలిటరీ వాహనాలు కన్పించాయి. బెలారస్లో ఉక్రెయిన్ సరిహద్దులకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో భారీగా రష్యా దళాలు మోహరించాయి. వీటికి తోడు సరిహద్దులకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలోని రెచిస్టాకు కూడా సేనలు భారీగా చేరుకుంటున్నాయి. పశ్చిమ రష్యాలో కూడా ఉక్రెయిన్ సరిహద్దులకు 110 కిలోమీటర్ల సమీపంలో సైనిక సందడి నానాటికీ పెరుగుతున్నట్టు ఫొటోలు వెల్లడించాయి. యుద్ధ మేఘాలు నానాటికీ దట్టమవుతుండటంతో పలు ఎయిర్‌లైన్స్ ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులను నిలిపేస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లిస్తున్నాయి. 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉత్తర ఉక్రెయిన్ భూభాగంపై రెబెల్స్ కూల్చివేసిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రిస్కు తీసుకోవడం లేదు. రష్యాకు జర్మనీ చాన్స్‌లర్ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ సోమవారం ఉక్రెయిన్‌లో, మంగళవారం రష్యాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. యూరప్‌లో యుద్ధాన్ని నివారించడం జర్మనీ బాధ్యత అని పార్లమెంటులో ఆయన చెప్పారు. యుద్ధానికి దిగితే రష్యా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. -
ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆక్వా సాగు
- రైతులకు రాయితీపై సోలార్ పంపుసెట్లు - మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ వెల్లడి సాక్షి, విశాఖపట్నం: ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నట్టు మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ తెలిపారు. విశాఖలో ఆదివారం జరిగిన విశాఖ, విజయనగరం జిల్లాల ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు జనవరి నుంచి మార్చి వరకు ఉపగ్రహం ద్వారా చాయాచిత్రాలను తీశామన్నారు. దీంతో వాగులు వంకలు సముద్రంలో కలిసే ఆయా ప్రాంతాల్లో పూడికలు తీయించి, రోడ్డు, రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 1994లో వచ్చిన తుపానుకు టైగర్ రొయ్యలకు వైరస్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో మంచినీటి రొయ్యల పెంపకంపై దృష్టి సారించారన్నారు. రాష్ట్రం నుంచి రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యం సమకూరుస్తున్నారని తెలిపారు. ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్‌ను వాడవద్దని సూచించారు. నిషేధిత మందులు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో చేపల వృత్తిపై ఆధారపడ్డ 35 వేల స్వయం సహాయ సంఘాల ద్వారా స్థానిక మార్కెట్లో విస్తృతికి వినియోగించుకోవాలని యోచిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడేళ్ల క్రితం మత్స్యశాఖకు మంజూరు చేసిన నిధులను వినియోగించకుండా జిల్లా పరిషత్‌లకు జమ చేశారని, వాటిని మత్స్యశాఖకు జమ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలకు లేఖలు రాశామని తెలిపారు. ఆక్వా రైతులకు 2500 సోలార్ పంపుసెట్లు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వీటిని పొందడానికి బ్యాంకులు రుణాలిస్తాయని చెప్పారు. విశాఖ జిల్లాలో క్వారంటైన్ సెంటర్.. విశాఖ జిల్లాలోని మంగమారిపేట వద్ద క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇలాంటి సెంటర్ దేశంలోకెల్లా చెన్నైలో మాత్రమే ఉందన్నారు. ఈ సెంటర్ ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వెనామీ రకం రొయ్య పిల్లలను పరీక్షించేందుకు వీలవుతుందన్నారు. తామెదుర్కొంటున్న సీడ్, డీజిల్ సబ్సిడీ, విద్యుత్ తదితర సమస్యలను ఆక్వా రైతులు కమిషనర్‌కు వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, డీడీ అప్పారావు, ఏడీలు పి.శంకరరావు, ఫణిప్రకాశ్, ఎంపెడా డీడీ అన్సార్ ఆలీ, నాబార్డ్ ఏజీఎం ప్రసాదరావు, సీఎంఎఫ్ఆర్ఐ, సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.