ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆక్వా సాగు | auqua form usin satellite picturs | Sakshi
Sakshi News home page

ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆక్వా సాగు

Published Sun, Aug 23 2015 7:01 PM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

auqua form usin satellite picturs

- రైతులకు రాయితీపై సోలార్ పంపుసెట్లు
- మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ వెల్లడి

సాక్షి, విశాఖపట్నం:
ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు చర్యలు చేపడుతున్నట్టు మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్ తెలిపారు. విశాఖలో ఆదివారం జరిగిన విశాఖ, విజయనగరం జిల్లాల ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో ఆక్వా సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను తెలుసుకునేందుకు జనవరి నుంచి మార్చి వరకు ఉపగ్రహం ద్వారా చాయాచిత్రాలను తీశామన్నారు. దీంతో వాగులు వంకలు సముద్రంలో కలిసే ఆయా ప్రాంతాల్లో పూడికలు తీయించి, రోడ్డు, రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

 

రాష్ట్రంలో 1994లో వచ్చిన తుపానుకు టైగర్ రొయ్యలకు వైరస్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోవడంతో మంచినీటి రొయ్యల పెంపకంపై దృష్టి సారించారన్నారు. రాష్ట్రం నుంచి రూ.15 వేల కోట్ల విలువైన రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యం సమకూరుస్తున్నారని తెలిపారు.

ఆక్వా సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్‌ను వాడవద్దని సూచించారు. నిషేధిత మందులు విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో చేపల వృత్తిపై ఆధారపడ్డ 35 వేల స్వయం సహాయ సంఘాల ద్వారా స్థానిక మార్కెట్లో విస్తృతికి వినియోగించుకోవాలని యోచిస్తున్నామన్నారు.

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మూడేళ్ల క్రితం మత్స్యశాఖకు మంజూరు చేసిన నిధులను వినియోగించకుండా జిల్లా పరిషత్‌లకు జమ చేశారని, వాటిని మత్స్యశాఖకు జమ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలకు లేఖలు రాశామని తెలిపారు. ఆక్వా రైతులకు 2500 సోలార్ పంపుసెట్లు రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వీటిని పొందడానికి బ్యాంకులు రుణాలిస్తాయని చెప్పారు.

విశాఖ జిల్లాలో క్వారంటైన్ సెంటర్..
విశాఖ జిల్లాలోని మంగమారిపేట వద్ద క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇలాంటి సెంటర్ దేశంలోకెల్లా చెన్నైలో మాత్రమే ఉందన్నారు. ఈ సెంటర్ ద్వారా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వెనామీ రకం రొయ్య పిల్లలను పరీక్షించేందుకు వీలవుతుందన్నారు.

 

తామెదుర్కొంటున్న సీడ్, డీజిల్ సబ్సిడీ, విద్యుత్ తదితర సమస్యలను ఆక్వా రైతులు కమిషనర్‌కు వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, డీడీ అప్పారావు, ఏడీలు పి.శంకరరావు, ఫణిప్రకాశ్, ఎంపెడా డీడీ అన్సార్ ఆలీ, నాబార్డ్ ఏజీఎం ప్రసాదరావు, సీఎంఎఫ్‌ఆర్‌ఐ, సీఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement