17 హెక్టార్లలో నిర్మాణాలు.. 100 పైగా భవనాలు
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో చైనా మళ్లీ భారీ నిర్మాణాలు చేపట్టింది. పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తరముఖాన ఏకంగా 100 పైగా నిర్మాణాలను చేపట్టింది. సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే దిశగా చైనా ఈ నిర్మాణాలను చేపట్టిందని భావిస్తున్నారు. శిఖరాల మాటున తమ నియంత్రిత టిబెట్ భూభాగంలో నిర్మిస్తున్న ఈ సైనిక స్థావరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. చట్టూ కొండలు ఉండటం మూలాన.. భూమి పైనుంచి దీనిపై నిఘా వీలుకాదు. చైనా సైన్యానికి ఫార్వర్డ్ బేస్ (సరిహద్దులకు సమీపంలో సైనిక మొహరింపునకు వీలు కల్పించే నిర్మాణం)గా పనికి వస్తుంది.
టిబెట్– భారత్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు వద్ద 2020లో భారత్, చైనా సైన్యానికి ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ప్రతిష్టంభన నెలకొన్న ప్రదేశానికి తూర్పున 38 కిలోమీటర్ల దూరంలో చైనా 100 పైగా నిర్మాణాలను చేపట్టినట్లు ఉపగ్రహచిత్రాల్లో తేలింది. అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ తీసిన ఈ ఉపగ్రహచిత్రాల్లో 17 హెక్టార్ల విస్తీర్ణంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తక్షశిల ప్రొఫెసర్ వై.నిత్యానందం వెల్లడించారు. యెమగౌ రోడ్డులో 4,347 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
దీర్ఘచతురస్రాకారంలో 150 మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్ ఉందని, దీన్ని హెలికాప్టర్ల రాకపోకలకు వాడే ఉద్దేశం ఉండొచ్చని నిత్యానందం తెలిపారు. ఒక్కో దాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది నివసించే విధంగా భవనాలను కడుతున్నారని వివరించారు. రెండు పెద్ద భవనాలు ఉన్నాయని.. వీటిలో ఒకటి పాలనా కార్యాలయంగా, మరొకటి గిడ్డంగిగా వాడే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక వరుస క్రమంలో కాకుండా గజిబిజిగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని, భవిష్యత్తులో క్షిపణిదాడులు జరిగితే నష్టం తీవ్రత తగ్గించేందుకే ఇలా చేస్తుండవచ్చని వివరించారు. పాంగాంగ్ సరస్సు భారత్– టిబెట్‌లను వేరు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పునీటి సరస్సు.
Comments
Please login to add a commentAdd a comment