ఎయిర్పోర్ట్ @ రూ. కోటి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద రన్వే, భారీ నిర్మాణం, కనీవినీ ఎరుగని రీతిలో భద్రత, విమానాల రణగొణ ధ్వనులు, ప్రయాణికుల హడావుడీ, వారి కోసం వచ్చే వాహనాలు.. ఇదీ స్థూలంగా విమానాశ్రయం అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది. విమానాశ్రయం అంటేనే వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడుకున్నది. ఇక టికెట్ల ధర అంటారా వేరేగా చెప్పక్కర లేదు. మరి చిన్న విమానాశ్రయాలు నిర్మిస్తే.. అదీ కోటి రూపాయలతో! ఏంటి ఇది సాధ్యమేనా అన్నదే మీ సంశయమా. సుసాధ్యమేనని అంటోంది కర్నాటక ప్రభుత్వం. ఏరోస్పేస్ పాలసీని ప్రకటించిన కర్ణాటక.. విమానయాన రంగంలో దేశంలో సరికొత్త రికార్డులు నమోదు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. చిన్న నగరాలకు విమాన సర్వీసుల్లో ఇతర రాష్ట్రాలు తమను అనుసరించాల్సిందేనని చెబుతోంది.
అతి చిన్న రన్వే..
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో చిన్న విమానాశ్రయం(ఎయిర్ స్ట్రిప్) ఏర్పాటు చేయడం ద్వారా సామాన్యులకు విమాన సర్వీసులను చేరువ చేయొచ్చు. ఇందుకు భారీ పెట్టుబడి అవసరమే లేదు. కొన్ని ఎకరాలను సేకరించి విమానం అనువుగా దిగేలా ఒక కిలోమీటరు పొడవులో క్రికెట్ పిచ్ మాదిరిగా రన్వే నిర్మిస్తే చాలు. రన్వేకు రూ.1 కోటి రూపాయల లోపే ఖర్చు వస్తుంది. ఆఫ్రికాలో ఇటువంటి ఎయిర్ స్ట్రిప్లకు కొదవే లేదు. అడవిలోనూ వీటిని నిర్మించొచ్చు.
ఇక విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కోసం భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్(గగన్) వ్యవస్థ ఎలాగూ ఉంది. భారత్లో టికెట్లు విక్రయించి విమాన సర్వీసులు అందించాలంటే డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిబంధనలు పాటించాల్సిందేనని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి తెలిపారు. ఇందుకోసం కొన్ని మౌలిక వసతులు, సాంకేతిక ఏర్పాట్లు తప్పనిసరి అన్నారు.
ఖర్చులూ తక్కువే..
చిన్న విమానాశ్రయాలకు టర్బో ప్రొపెల్లర్ విమానాలకు ఉత్తమం. విమానాశ్రయాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ అధికారిని ఒకరిని నియమిస్తే చాలు. విమానం ఆగడం, ప్రయాణికులు దిగడం, కొత్త ప్రయాణికులు ఎక్కడం అంతా కొన్ని నిముషాల వ్యవధిలో జరుగుతుంది. ఇక అక్కడి నుంచి విమానం గమ్య స్థానానికి వెళ్తుంది. అంటే విమానాశ్రయంలో పార్కింగ్ సమస్య లేదన్నమాట. భద్రతా పరంగా క్షేమమనుకునే ప్రభుత్వ భవనాలు, లేదా బేగంపేట వంటి విమానాశ్రయాల్లో విమానాన్ని పార్క్ చేయవచ్చు. ఇక ల్యాండింగ్ ఖర్చు ఇటువంటి విమానాశ్రయాల్లో ఒక్కో విమానానికి రూ.800లకు మించకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు అంటున్నారు. సెస్నా, పైపర్ సెనెకా, పైలటస్ వంటి కంపెనీలు టర్బో ప్రొపెల్లర్ విమానాలను తయారు చేస్తున్నాయి. విమానాలు ఒక్కొక్కటి రూ.3 కోట్ల నుంచి లభిస్తాయి.
11 ప్రాంతాలను గుర్తించాం..
స్మాల్ ప్లేన్ ఎయిర్ నెట్వర్క్(స్పాన్) పేరుతో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కర్ణాటక ప్రభుత్వ ఏవియేషన్ వ్యవహారాల కమిషనర్ నవీన్ రాజ్ సింగ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. స్పాన్లో భాగంగా 11 ప్రాంతాలను గుర్తించామన్నారు. ఈ కేంద్రాల్లో ఎయిర్స్ట్రిప్తో పాటు హెలీప్యాడ్లను నిర్మిస్తామన్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం చిన్న విమానాశ్రయాల విషయంలో విజయవంతం కాదని, తామే చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. విమానాలనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా అన్న ప్రశ్నకు... కొద్ది రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు. విమాన ఇంధనంపై వ్యాట్, పార్కింగ్ చార్జీలు తగ్గితే మంచిదని... సామాన్యుడికి విమాన సేవలు చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
బేగంపేట ఎయిర్పోర్ట్లో ‘ఈడీసీ’ విధానం షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు విమానాలు దిగడానికి చేసే చెల్లింపులను దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రానిక్ రూపంలో చేసే విధానం బేగంపేట ఎయిర్పోర్టులో అందుబాటులోకి వచ్చింది. షెడ్యూల్లో లేని విమానాలు ఏదైనా ఎయిర్పోర్ట్లో దిగినందుకు గాను ఫీజులు చెల్లించాలి. ఇప్పుడు విమానం దిగకుండానే జీపీఆర్ఎస్ ఆధారంగా క్రెడిట్ కార్డులు ద్వారా చెల్లించే విధంగా ఎలక్ట్రానిక్ డాటా క్యాప్చర్ (ఈడీసీ)ని ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇండియా ఏవియేషన్ 2014 ప్రదర్శన సందర్భంగా శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం బేగంపేట విమానాశ్రయంలో దిగాలంటే ప్రైవేట్ కారియర్స్ భారీ మొత్తాన్ని కూడా తీసుకురావాల్సి ఉండేదని, అలాగే కరెన్సీ ఎక్స్ఛేంజ్ వంటి వాటికి చాలా సమయం పడుతుందని, ఇప్పుడు ఈడీసీ విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అంతే కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం ద్వారా లభించే 45 రోజుల వడ్డీ రహిత రుణ ప్రయోజనాన్ని పొందచ్చన్నారు.
2021 కల్లా స్వదేశీ విమాన నమూనా...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మేడ్ ఇన్ ఇండియా’ విమానం తొలి నమూనా 2021-22కల్లా సిద్ధం కానుంది. విమానం ప్రత్యేకతలు ఏమిటన్నది స్పెషల్ పర్పస్ వెహికిల్ రెండు మూడు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ శుక్రవారమిక్కడ వెల్లడించారు. పౌర విమానం రూపకల్పన, అభివృద్ధికై హిందుస్తాన్ ఏరోనాటికల్స్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లు ఎస్పీవీగా ఏర్పాటయ్యాయి. ఇంజిన్ ఎలా ఉండాలి, ఎన్ని సీట్లు అన్నది ఎస్పీవీ నిర్ణయిస్తుందని వివరించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని సివిల్ ఏవియేషన్ ప్రొడక్ట్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏవియేషన్ షో సందర్భంగా చర్చించింది. పౌర విమానం అభివృద్ధికి రూ.4,355 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.