ఆపరేషన్‌ స్పైడర్స్‌వెబ్‌...నయా పెరల్‌ హార్బర్‌! | Operation Spidersweb: Ukraine hits air bases thousands of miles inside Russia | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ స్పైడర్స్‌వెబ్‌...నయా పెరల్‌ హార్బర్‌!

Jun 3 2025 4:22 AM | Updated on Jun 3 2025 9:55 AM

Operation Spidersweb: Ukraine hits air bases thousands of miles inside Russia

ఆధునిక యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద సర్జికల్‌ స్ట్రైక్‌

రష్యాకు తీరని అవమానం మిగిల్చిన ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు

మూడు టైమ్‌ జోన్ల పరిధిలో దాడులు 

41 బాంబర్, నిఘా విమానాలు ధ్వంసం 

మూడో వంతు ఫ్లీట్‌ను నష్టపోయిన రష్యా 

నష్టం విలువ రూ.60 వేల కోట్ల పై చిలుకే! 

ఒక్కోటీ రూ.42 వేలు చేసే 117 డ్రోన్లతో కారుచౌకగా పని పూర్తి చేసిన ఉక్రెయిన్‌

నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్‌ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్‌ విమానాలను ఏదో వీడియోగేమ్‌ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్‌ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం.

 ఆ దెబ్బకు రష్యా బాంబర్‌ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్‌ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్‌ స్ట్రైక్‌ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్‌ హార్బర్‌’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. 

రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్‌ హార్బర్‌పై జపాన్‌ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్‌ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్‌ స్పైడర్స్‌వెబ్‌’ పేరిట ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.

ఇంత భారీ ఆపరేషన్‌కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్‌ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్‌ఎస్‌బీ కార్యాలయం పక్కనేనని జెలెన్‌స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. 
→ మొత్తం ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌ సీక్రెట్‌ సరీ్వస్‌ (ఎస్‌బీయూ) పక్కాగా నిర్వహించింది.
→ దీన్ని జెలెన్‌స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.
→ డ్రోన్‌ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్‌ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్‌ పదాతి దళాధిపతి మేజర్‌ జనరల్‌ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.

ఎక్కడెక్కడ దాడులు... 
→ ఒలెన్యా (ముర్మాన్‌స్క్ ), బెలయా (ఇర్కుట్‌స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్‌ ర్యాజాన్‌), ఇవనొవొ 
→ ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! 
→ వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్‌ జోన్ల దూరంలో ఉండటం విశేషం. 
→ అమూర్, ఇవనోవో, ర్యాజన్‌ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్‌ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.

గతంలోనూ... 
మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్‌ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. 
→ 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్‌ యాంటీ షిప్‌ మిసైళ్లతో ఉక్రెయిన్‌ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్‌లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్‌ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్‌ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్‌క్స్‌ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!

ట్రక్కుల్లో తరలించి...
సింపుల్‌ ప్లానింగ్‌. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్‌. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటి స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్‌ విలియనం మెక్‌రావెన్‌ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్‌గా స్పైడర్స్‌ వెబ్‌ నిలిచింది. 
→ మొత్తం ఆపరేషన్‌లో ఉక్రెయిన్‌ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. 
→ ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. 
→ అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్‌బేస్‌లకేసి తరలించారు. 
→ ఒక్కో కంటైనర్‌లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. 
→ దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. 
→ ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. 
→ అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్‌ ద్వారా తెరిచారు. 
→ ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. 
కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.

కారుచౌకే.. కానీ ఖతర్నాక్‌ 
రష్యా ఎయిర్‌బేస్‌లపై దాడుల్లో ఉక్రెయిన్‌ వాడింది ఎఫ్‌పీవీ (ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ) రకం డ్రోన్లు. 
→ ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్‌పీవీ డ్రోన్‌ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. 
→ అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. 
→ డ్రోన్‌కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్‌ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్‌లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్‌గా ఆపరేట్‌ చేయగలడు. 
→ పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్‌ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.

రష్యా అణుదాడి చేస్తుందా...? 
ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. 
→ ఉక్రెయిన్‌ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్‌లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. 
→ ఉక్రెయిన్‌ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్‌ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్‌స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. 
→ నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

రష్యాకు నష్టం ఇలా... 
→ 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్‌ దాడులు జరిగాయి. 
→ వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. 
→ మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! 
→ ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement