![India and China generals hold meeting to defuse border standoff - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/7/IBDIA-CHINA.jpg.webp?itok=aTjRXB9Z)
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు.
Comments
Please login to add a commentAdd a comment