border disputes
-
ఒక ముందడుగు!
నాలుగేళ్ళ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు తొలి అడుగు పడింది. హిమాలయ సరిహద్దు వెంట కొన్ని వివాదాస్పద ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత, చైనాల మధ్య అంగీకారం కుదిరింది. విస్తృతమైన సరిహద్దు వివాదం అలాగే అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయ ఘర్షణలకు ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడుతోంది. చైనా సైతం పాల్గొన్న ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని వెళ్ళే ముందు గత వారమే ఈ ఒప్పందం గురించి వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ చర్యలు తుది రూపానికి వచ్చాయి. ఒప్పందంలోని మరిన్ని వివరాలు విశదం కావాల్సి ఉన్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఫలితంగా నెలకొనే ప్రాంతీయ సుస్థిరతకు ఇది ఓ సానుకూల పరిణామమని చెప్ప వచ్చు. ఆసియా ఖండంలోని రెండు భారీ శక్తుల మధ్య రాజకీయ, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు మళ్ళీ మార్గం సుగమం కానుందని భావించవచ్చు.2020 జూన్‌లో చైనా సైనిక బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. భారత బలగాలు సైతం త్వరితగతిన అందుకు దీటుగా బదులిచ్చాయి. బాహాబాహీ సాగిన ఆ ఘర్షణల్లో రెండు పక్షాల నుంచి గణనీయమైన సంఖ్యలో సైనికులు మరణించారు. గాయపడ్డారు. 1975 తర్వాత రెండు దేశాల మధ్య మళ్ళీ అంతటి ఉద్రిక్తతకు అది కారణమైంది. సరిగ్గా ఆ ఘర్షణలు జరిగిన గాల్వాన్ లోయ ప్రాంతం వద్దే ఇప్పుడు శాంతి, సాంత్వన యత్నానికి శ్రీకారం చుట్టడం ఒక రకంగా శుభపరిణామం. నాలుగేళ్ళ ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో కొంత మెరుగయ్యేందుకు ముందడుగు వేసినందుకు ఇరుపక్షాలనూ అభినందించాల్సిందే. ఇరు పక్షాల మధ్య అనేక వారాలుగా సాగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా భారత, చైనా భూభాగాలను విభజించే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట, తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని దెప్సాంగ్, దెమ్ఛోక్ మైదాన ప్రాంతాల్లో భారత, చైనా సైనిక బలగాలను తగ్గించడం ఇప్పటికే మొదలైంది. అలాగే, గతంలో అంగీకరించిన పద్ధతిలోనే గస్తీ పునఃప్రారంభం కానుంది.వ్యూహాత్మకంగా ఇటీవల ‘బ్రిక్స్’ సమిట్ సమయంలోనే ఈ గస్తీ ఒప్పందాల గురించి బయటకు చెప్పడం గమనార్హం. తద్వారా రెండు దేశాల మధ్య వైషమ్యాలను దూరం పెట్టి, ఆర్థిక సహకార పునరుద్ధరణకు బాటలు పరవాలనుకోవడం మంచిదే. అందుకు తగ్గట్లుగా ‘బ్రిక్స్’ సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 50 నిమిషాల పాటు సుహృద్భావ పూర్వక భేటీ జరిగింది. సమావేశానికి కొద్ది రోజుల ముందే కుదిరిన ఈ సరిహద్దు గస్తీ ఒప్పందం, దరిమిలా ఆ భేటీ వల్ల ఉద్రిక్తతలు కొంత సడలడం ఖాయం. అలాగని ఈ ఒప్పందాన్ని కేవలం సైనిక సమన్వయ చర్యగా తక్కువ చేసి చూడడం సరికాదు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధాలనూ, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలనూ పునర్ నిర్వచించే సామర్థ్యం కూడా ఈ ఒప్పందానికి ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందంతో భారత, చైనాల మధ్య రాత్రికి రాత్రి అపూర్వ సత్సంబంధాలు నెలకొంటాయని అనుకొంటే అత్యాశే. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నిజానికి, భారత – చైనాలది సుదీర్ఘమైన 3440 కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దు. నదులు, సరస్సులు, హిమఖండాలతో కూడిన ఆ దోవలో విభజన రేఖను నిర్దుష్టంగా పేర్కొనడమూ చిక్కే. ఈ పరిస్థితుల్లో భూటాన్ – నేపాల్‌ల మధ్య సిక్కిమ్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇరుపక్షాల సైనికులు ముఖాముఖి ఎదురుపడి, ఘర్షణకు దిగడం జరుగుతున్నదే. దానికి తోడు భారత భూభాగంలోకి పదేపదే జొరబడుతూ చైనా చూపుతున్న విస్తరణ కాంక్ష తెలియనిదీ కాదు. ఈ పరిస్థితుల్లో ఎల్ఏసీ వెంట రోడ్లు, నివాసాల సహా ప్రాథమిక వసతి సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచి, ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనే ప్రయత్నం రెండు వైపులా సాగింది. ఆ నేపథ్యమే గాల్వాన్ ఘర్షణకూ దారి తీసింది. రెండు దేశాల మధ్య సాధారణ స్థితి రావాలంటే, తూర్పు లద్దాఖ్కే పరిమితమైన ఒప్పందంతో సరిపోదు. మొత్తం ఎల్ఏసీ వెంట సాధారణ పరిస్థితులకు కృషి సాగాలి. దానికి ఇరుపక్షాలలోనూ చిత్తశుద్ధి ముఖ్యం. డ్రాగన్ సైతం చెప్పేదొకటి, చేసేదొకటి విధానాన్ని ఇకనైనా మానుకోవాలి. భారత్, చైనాలు కేవలం పొరుగుదేశాలే కాదు, ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశాలు. కాబట్టి, పరస్పర స్నేహ సౌహార్దాల వల్ల రెండిటికీ లాభమే. భారత అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వా ముల్లో అమెరికాతో పాటు చైనా ఒకటి. సరుకుల నుంచి టెలికమ్యూనికేషన్ల హార్డ్‌వేర్, భారతీయ ఫార్మా రంగానికి ముడి పదార్థాల దాకా అనేకం భారత్‌కు అందించే అతి పెద్ద వనరు చైనాయే. గాల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులు, వీసాలు, యాప్‌లపై మన దేశం సహజంగానే తీవ్ర షరతులు పెట్టింది. అవన్నీ తొలగాలంటే, మళ్ళీ పరస్పరం నమ్మకం పాదుకొనే చర్యలు ముఖ్యం. గస్తీ ఒప్పందం కుదిరింది కదా అని నిర్లక్ష్యం వహించకుండా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిందే. అవతలి పక్షాన్ని విశ్వసిస్తూనే, అంతా సజావుగా సాగుతున్నదీ లేనిదీ నిర్ధరించుకోవాల్సిందే. ఒప్పందాల మాట ఎలా ఉన్నా... సరిహద్దు వెంట సన్నద్ధతను మానరాదు. సరిహద్దులో ప్రాథమిక వసతి సౌకర్యాల నిర్మాణాలను కొనసాగించడమే దీర్ఘకాలంలో మన దేశానికి ఉపకరిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే భారత్ బలీయంగా తయారైందని గాల్వాన్‌లో మన సైన్యాల దీటైన జవాబు రుజువు చేసింది. ఆ బలాన్ని కాపాడుకుంటూనే, డ్రాగన్‌తో బంధాన్ని పటిష్ఠం చేసుకోవడమే మార్గం. -
ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలే కీలకం: జై శంకర్
భారత్-చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో జై శంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని అన్నారు. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.తూర్పు లఢక్‌లో సైన్యం తొలగింపు విషయంలో భారత్-చైనా సరిహద్దు వివాద చర్చల్లో 75 శాతం పురోగతి సాధించినట్లు చెప్పారు.సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. చైనాతో భారత్‌కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ 2020లో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందని జైశంకర్ అన్నారు.‘చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్‌తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్ఏసీ కి తరలించడాన్ని మనం చూశాం. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగింది కూడా. తద్వారా ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.కాగా ఈ నెల ప్రారంభంలో జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించిందని, ఆ దేశ బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | New York: During the Asia Society at the Asia Society Policy Institute, EAM Dr S Jaishankar says, "We have a difficult history with China... Despite the explicit agreements we had with China, we saw in the middle of covid that the Chinese moved large number of forces in… pic.twitter.com/vNyfWTZrJY— ANI (@ANI) September 24, 2024 ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. చైనాతో సరిహద్దు విషయంలో 75 శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు.. అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని,. తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ఇది కేవలం ఖండంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. రెండు దేశాల సమాంతర పెరుగుదల నేటి ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఆసియా, ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చడానికి భారతదేశం- చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు. -
తంపులమారి చైనా..15 దేశాలతో కయ్యం
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి: చైనా పీపుల్స్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడిన నాటి నుంచి సరిహద్దుల విషయంలో భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దుకు సంబంధించి అనేక చోట్ల వివాదాలు సృష్టిస్తోంది. మన దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో అనేక భూభాగాలు తమవేనంటూ చైనా వాదిస్తోంది. 1950లో టిబెట్‌ను ఆక్రమించుకున్న చైనా అటుపిమ్మట భారత్‌లోని అనే భాగాలు టిబెట్‌కు చెందినవని, వాటిని తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. 1962లో భారత్‌తో జరిపిన యుద్ధం ఫలితంగా ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని భాగమైన 37,244 చదరపు కిలోమీటర్ల అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అంతేకాదు జమ్మూకశీ్మర్ లోయలోని మరో 5,300 చదరపు కిలోమీటర్ల భూభాగం కూడా తమదేనంటూ ఘర్షణలకు దిగుతూనే ఉంది. 2020 మే నెలాఖరులో చైనా సైన్యం గల్వాన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడినప్పుడు జరిగిన ఘర్షణలో ఇరువైపులా అనేకమంది సైనికులు మరణించారు. 1967లో సిక్కింలోని నాథులా, చోవా ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం సరిహద్దుల వెంబడి అనేక చోట్ల భారత సైన్యంతో ఘర్షణలకు దిగింది. ఆ తరువాత కూడా చైనా ఘర్షణలకు పాల్పడుతూనే ఉంది. మరోవైపు అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశ అంతర్భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోంది. మొదట్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు.. అంటే మొత్తం అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని అని వాదించిన చైనా ఇప్పుడు తొలుత 8,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై వివాదాన్ని పరిష్కరించుకుందామని భారత్‌తో బేరాలాడుతోంది. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాల పేర్లను చైనా భాష మాండరిన్‌లోకి మార్చేసింది. వీటిలో 8 పేర్లు పట్టణాలు, 2 పేర్లు నదులు, 5 పేర్లు పర్వతాలకు సంబంధించినవి ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా తన భూభాగమైన జంగ్నన్గా సంబోధిస్తోంది. అర్థం లేని ఆధారాలు పొరుగు దేశాలతో నెలకొన్న వివాదాలకు చైనా ప్రత్యక్ష ఆధారాలు చూపడం లేదు. తన విస్తరణవాదానికి పూర్వకాలం నాటి రాజవంశçస్తుల పాలనా క్షేత్రాన్ని రుజువుగా చూపిస్తోంది. మధ్య యుగాలనాటి హన్, తంగ్, యువాన్, క్వింగ్ రాజవంశీకులు పరిపాలించిన ప్రాంతాలంటూ ఇతర దేశాలతో సరిహద్దుల విషయంలో జగడానికి దిగుతోంది. అందుకోసం ఆయా ప్రాంతాల పేర్లను పూర్వకాలంలో పేర్కొన్న పేర్లుగా మార్చేస్తోంది. అంతర్జాతీయంగా జరిగిన ఏ ఒక్క ఒప్పందాన్ని కూడా చైనా అంగీకరించడం లేదు. దక్షిణ చైనా సముద్ర జలాలపై, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఆధిపత్యం తమదేనంటూ తాను సృష్టించిన గీతల మ్యాప్‌లను చారిత్రక ఆధారాలుగా చూపుతోంది. ఆరు మహాయుద్ధాలు! 2020 నుంచి 2050 మధ్యకాలంలో ఆరు మహాయుద్ధాలు జరుగుతాయని చైనాకు చెందిన సోహు అనే పోర్టల్‌లో గతంలో పేర్కొన్నట్లు యురేíÙన్ టైమ్స్ అనే ఆన్లైన్ పత్రిక వెల్లడించింది. దాని ప్రకారం 2025 నాటికి తైవాన్, 2030 నాటికి అన్ని దీవులను, 2040 నాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ను, 2050 నాటికి జపాన్‌కు చెందిన దీవులను స్వా«దీనం చేసుకోవడానికి యుద్ధా్దలు జరుగుతాయని పోర్టల్ చెబుతోంది. తంపులమారి చైనా మాదిరిగానే భారతదేశం కూడా మౌర్య, చోళ వంశçస్తుల పరిపాలనా క్షేత్రాన్ని ఆధారంగా చూపితే అనేక దేశాలను అఖండ్ భారత్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. మౌర్య, చోళ వంశస్థుల పరిపాలనకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అందరితోనూ తగువే భారత్ మాత్రమే కాకుండా 15 దేశాలతో చైనాకు సరిహద్దు తగాదాలు కొనసాగుతున్నాయి. వీటిలో తైవాన్, ఫిలిప్పైన్స్, ఇండోనేíసియా, వియత్నాం, జపాన్, ద.కొరియా, కొరియా, సింగపూర్, బ్రూనై, నేపాల్, భూటాన్, లావోస్, మంగోలియా, మయన్మార్ తదితర దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఏలుబడిలోనే ఉండాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని డ్రాగన్ సవాలు చేస్తోంది. ► తైవాన్ విషయంలో ఆ దేశమంతా తమకు చెందినదేనన్నది చైనా వాదన. అయితే, ప్రస్తుతానికి మెకలిస్ బ్యాంక్, చైనా ఆక్రమణలో ఉన్న దీవులు, సౌత్‌చైనా సముద్రంలో కొంత భూభాగం విషయంలో రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ► ఫిలిప్పైన్స్ విషయంలో కూడా స్కార్బరో కొండలు, మరికొన్ని దీవులపై చైనా వివాదం సృష్టించింది. వీటివిషయంలో ఫిలిప్పైన్స్‌తో తరచుగా ఘర్షణలకు పాల్పడుతోంది. ► ఇండోనేసియాకు సంబంధించి నతునా దీవులు, సౌత్ చైనా సముద్రంలో కొంతభాగం తమదేనంటూ చైనా తగువులు సృష్టిస్తోంది. ► వియత్నాం విషయానికి వస్తే అనేక భాగాలను తమకు అప్పగించాలని చైనా ఒత్తిడి పెంచుతోంది. పలు ద్వీపాలతోపాటు సముద్ర జలాల్లో ఆధిపత్యం కోసం కాలుదువ్వుతోంది. చైనా నౌకాదళం ఇటీవల వియత్నాంకు చెందిన చేపల వేట పడవను సముద్రంలో ముంచేసింది. ► మలేíసియాతోనూ కొన్ని దీవులు, సముద్ర జల్లాల విషయంలో చైనా జగడం ఆడుతోంది. మలేíÙయా చమురు అన్వేషణ నౌకలను అడ్డుకుంటోంది. ఇటీవల అమెరికా, ఆ్రస్టేలియా యుద్దనౌకలు మలేíÙయాకు అండగా రావడంతో చైనా నౌకాదళం తోకముడిచి వెనక్కి వెళ్లిపోయింది. ► జపాన్‌కు చెందిన రెండు ద్వీప సముదాయాలపై చైనా కన్నుపడింది. అవి సెన్కాకు దీవులు, ర్యూక్యు దీవులు. ఈ దీవుల్లో చమురు నిక్షేపాలు బయటపడినప్పటి నుంచి చైనా వీటి విషయంలో జపాన్‌తో తగువు పడుతోంది. ► దక్షిణ చైనా సముద్రంలో కొంతమేరకు మునిగిపోయిన సొకొట్రా రాక్‌పై దక్షిణ కొరియాతో వివాదానికి దిగింది చైనా. ఈ రాక్ కొరియాకు 149 కిలోమీటర్ల దూరంలో ఉండగా, చైనాకు 287 కిలోమీటర్ల దూరంలో ఉంది. ► దాదాపు 1,400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఉత్తర కొరియాతో సీ ఆఫ్ జపాన్ సముద్ర జలాల్లో హద్దుల అంశంపై చైనా వివాదం సృష్టించింది. ► దక్షిణ చైనా సముద్ర జలాల విషయమై సింగపూర్‌తో చైనా తగువులాడుతోంది. ► అతిచిన్న ఇస్లామిక్ దేశమైన బ్రూనైతో కూడా కొన్ని దీవులు, సముద్ర జలాలపై చైనా గొడవ పెట్టుకుంది. ► తమ భూభాగంలో కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. పశి్చమ నేపాల్‌లోని హుమ్లా జిల్లాలో చైనా ఆక్రమణలకు పాల్పడింది. ► దాదాపు 290 మైళ్లకుపైగా సరిహద్దు ఉన్న భూటాన్‌తో అనేక చోట్ల హద్దుల విషయంలో చైనా వివాదాలు సృష్టించింది. 1980 నుంచి వీటి విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ► లావోస్‌లో అత్యధిక భాగం తమదేనని చైనా వాదిస్తోంది. అందుకు యువాన్ రాజవంశ పరిపాలనను రుజువుగా చూపిస్తోంది. ► సరిహద్దు వివాదం కారణంగా తమ దేశంలోని ఓ చెక్‌పాయింట్‌పై దాడి జరిగిందని చైనా చెబుతోంది. ఈ ప్రాంతం విషయంలో మంగోలియాకు, చైనాలోని గాన్సు ప్రాంత ప్రజలకు మధ్య వివాదం ఉంది. -
అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..
న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్‌తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్‌తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్ గాంధీ సోమవారం ట్వీట్ చేశారు. ‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్‌లోకి వస్తామంటోంది. అరుణాచల్‌లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్ గాంధీకి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్ ప్లీనరీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
సరిహద్దుపై మహారాష్ట్రతో ఢీ అంటే ఢీ.. కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇటీవల తారస్థాయికి చేరింది. తమ భూభాగాన్ని ఇచ్చేదే లేదంటూ ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదంపై కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకే కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. సరిహద్దు వివాదాన్ని మహారాష్ట్రనే సృష్టించిందని ఖండించింది. ఈ తీర్మానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సభలో ప్రవేశపెట్టగా మూజువాణి ఓటు ద్వారా ఆమోదం తెలిపారు. ‘కర్ణాటక భూభాగం, నీళ్లు, భాష, కన్నడ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కర్ణాటక ప్రజలు, అసెంబ్లీ సభ్యుల మనోభావాలు ఈ అంశంలో ఒకటి. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి మనమందరం ఐక్యంగా రాజ్యాంగ, చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి కట్టుబడి ఉన్నాం. అనవసరంగా సరిహద్దు వివాదాన్ని సృష్టిస్తున్న మహారాష్ట్ర ప్రజల తీరును ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు సిద్ధమని తెలిపే ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.’ అని సభలో తీర్మానాన్ని చదవి వినిపించారు సీఎం బసవరాజ్ బొమ్మై. అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో సరిహద్దు వివాదంపై మాట్లాడారు సీఎం బొమ్మై. అది కర్ణాటక ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, ఒక్క అంగుళం కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ చదవండి: కరోనా కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ లక్షణాలివే.. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
ఇద్దరు దుష్టుల మధ్య స్నేహం ఎక్కువ కాలం నిలవదంటారు పెద్దలు. పాక్, అఫ్గాన్ మధ్య తాజా వైరం ఈ సామెతను నిజం చేస్తోంది. తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేనొకటంటానని ప్రస్తుతం రెండు దేశాలు సిగపట్లు పడుతున్నాయి. సంవత్సరం క్రితం జాన్జిగిరీలుగా ఉన్న ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. దాదాపు ఏడాది క్రితం అఫ్గాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు మట్టుబెట్టి పాలనా పగ్గాలు చేపట్టారు. అ సమయంలో ప్రపంచమంతా తాలిబన్ల దాష్టికాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తే పాక్ మాత్రం సంబరాలు చేసుకుంది. గిర్రున ఏడాది తిరగకముందే పాక్ సంతోషం ఆవిరైంది. తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం అఫ్గాన్‌లో ఉంటుందని ఆశించిన పాకిస్తాన్‌కు అశనిపాతం తగిలింది. స్నేహం మాట దేవుడెరుగు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంటోంది. ‘‘అఫ్గనిస్తాన్ బానిస సంకెళ్లు తెంచుకుంటోంది’’ అని తాలిబన్ల తిరుగుబాటు సమయంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ సంతోషంతో వ్యాఖ్యానించారు. ఆయన మంత్రుల్లో ఒకరైతే ఆగస్టు 15కు భారత్‌కు తగిన బహుమతి లభిస్తోందని ఎద్దేవా చేశారు. ఓడలు బండ్లుగా మారిన చందాన ప్రస్తుతం పాక్‌లో ఇమ్రాన్ లేడు, పాక్‌తో తాలిబన్లకు సయోధ్యా లేదు, పైగా ఇండియాతో తాలిబన్లు సమతుల్య సంబంధాలనే పాటిస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత.. అని ఇదంతా పాక్ స్వయంకృతాపరాధమేనంటున్నారు నిపుణులు. ఎందుకీ వైరం? అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ దేశంతో పాక్‌కు సరిహద్దు వివాదం ఉంది. తమకు అనుకూల తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని, తాము కోరినట్లు సరిహద్దు మార్చుకోవచ్చని పాకిస్తాన్ భావించింది. దీనికితోడు పాక్‌లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే టీటీపీ (తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్)కు తాలిబన్లు పగ్గాలు వేస్తారని ఆశించింది. అయితే ఈ రెండు ఆశలు ఆడియాసలయ్యాయి. పౌర ప్రభుత్వ హయంలో కన్నా తాలిబన్ హయంలో సరిహద్దు రేఖ (డ్యురాండ్ రేఖ) వద్ద ఘర్షణలు పెరిగాయి. పాకిస్తాన్లో టీటీపీ ఉగ్రదాడులు మరింతగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో పాక్ 100మంది సైనికులను కోల్పోయింది. డ్యురాండ్ రేఖ వద్ద పాక్ కంచె నిర్మాణాన్ని తాలిబన్లు అంగీకరించడంలేదు. అక్కడున్న పష్తూన్ జనాభాను ఈ కంచె విభజిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అమెరికా పరోక్ష పాలన సాగిన రోజుల్లో అఫ్గాన్ రహస్యాలను పాక్ అమ్ముకున్నదని అఫ్గన్లు నమ్ముతున్నారు. దీంతో అఫ్గన్‌లో ఇటీవల కాలంలో పాక్‌పై వ్యతిరేకత ప్రబలుతోంది. పాక్ అంటేనే అస్థిరతకు మారురూపమని, పాక్ స్నేహం వద్దని పలు అఫ్గాన్ నగరాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. టీటీపీని అదుపు చేయడానికి కూడా తాలిబన్లు ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ నిష్క్రమణ జరగింది. తాలిబన్లతో ఇమ్రాన్‌కు కొంత మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగించేవాళ్లు కరువయ్యారని నిపుణులు భావిస్తున్నారు. ఏం జరగవచ్చు?∙ తమ ప్రభుత్వం ఉగ్రవాదంతో పోరాడుతుందని పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. అంటే టీటీపీతో పరోక్షంగా తాలిబన్లతో వైరం కొనసాగవచ్చని ఆయన భావన. దేశంలోని టీటీపీ ఆపరేటర్లను తుడిచిపెడతామని పాక్ మిలటరీ కూడా ప్రకటించింది. అదేవిధంగా సరిహద్దులను పరిరక్షించుకుంటామని తెలిపింది. దీనిపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే పాక్ సరిహద్దులపై జరిపిన దాడుల్లో 20మంది చిన్నారులు సహా 50 మంది అఫ్గాన్లు మరణించారని తాలిబన్లు ఆరోపించారు. తమ దేశస్థుల మరణాలకు యుద్ధం తప్పదని పాక్‌ను హెచ్చరించారు. పాక్ దాడులకు ప్రతిగా సరిహద్దుల్లో 7గురు పాక్ సైనికులను మట్టుబెట్టారు. దీంతో ఇరుదేశాల మధ్య స్నేహం స్థానంలో వైరం మొదలైంది. తాజాగా పాక్ వైఖరిపై తాలిబన్లు ఐరాసలో ఫిర్యాదు చేయడం గమనిస్తే ఇరుపక్షాల మధ్య వైరం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులుండరని, ఉగ్రవాదులంటే ఉగ్రవాదులేనని పాక్‌కు టీటీపీ అంశంతో బోధపడింది. తాను పెంచి పోషించిన తాలిబన్ తండా తనకే సవాలుగా మారడంతో పాక్ పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఈ వైరం మరింత ముదరవచ్చని, చివరకు ఇది మరో సుదీర్ఘ పరోక్ష యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాముకు పాలు పోస్తే... అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడికి బదులుగా వార్ ఆన్ టెర్రరిజం పేరిట రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లపై యుద్ధం చేసి అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే అటు అమెరికాకు సహాయం చేస్తున్నామంటూ నిధులు దండుకున్న పాకిస్తాన్ మాత్రం తాలిబన్లకు, ఐసిస్‌కు, ఆల్‌ఖైదాకు లోపాయికారీ మద్దతు కొనసాగిస్తూనే వచ్చింది. గతేడాది అఫ్గాన్ రక్షణ తమ వల్ల కాదని అమెరికా చేతులెత్తి మొహం చాటేయగానే, పాక్ వత్తాసున్న తాలిబన్లు తలెగరేశారు. అతి స్వల్పకాలంలోనే అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తమకనుకూల ప్రభుత్వం ఏర్పడిందని పాక్ ఆనందించింది. కానీ తాలిబన్ అనుబంధ సంస్థ టీటీపీ పాక్‌లో తరుచూ దాడులకు దిగడం, అటు సరిహద్దు వద్ద కంచెను తాలిబన్లు అడ్డుకోవడంతో పాక్‌కు తత్వం తెలిసివచ్చింది. తాను పాలు పోసి పెంచిన పాము తననే కాటేయడానికి తయారైందని గ్రహించిన పాక్ డామిట్, కథ అడ్డం తిరిగిందని నాలుక్కరుచుకుంటోంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
చైనాతో వివాదం: మా మద్దతు భారత్‌కే.. స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్‌కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్యలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్, చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యూఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్‌కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్‌బేరర్‌గా ఎంపిక చేయడం కచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకూ అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్‌లో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చిబేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ, ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయబోదని ప్రసారభారతి వెల్లడించింది. -
మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం
బీజింగ్: భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం మరో కొత్త డ్రామాకి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా సరిహద్దు భూ చట్టానికి ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది. జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌కి చెందిన స్టాండింగ్ కమిటీ శనివారం ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్ లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది. (చదవండి: చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..) -
అస్సాం, నాగాలాండ్‌ల మధ్య కీలక ఒప్పందం
దిమాపుర్/గువాహటి: అస్సాం, నాగాలాండ్‌ల మధ్య ముదిరిన సరిహద్దు వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడే దిశగా ఇరు రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకున్నాయి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బరువా, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జే ఆలంలు శనివారం భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల బలగాలు మోహరించి ఉన్న దెసోయ్ లోయ అడవి/సురాంగ్‌కాంగ్ లోయ ప్రాంతాల నుంచి పరస్పరం వెనక్కు వెళ్లాలని ఒప్పందం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న పలు గ్రామాల నుంచి బలగాలను వెనక్కు పంపడం ద్వారా అక్కడ శాంతి నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది. 24 గంటల్లోగా బలగాలు వెనక్కు వెళ్లాలని ఇరు ప్రభుత్వాల నేతలు కలసి నిర్ణయించారు. నాగాలాండ్ డిప్యూటీ సీఎం వై పట్టాన్, అస్సాం విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాలు కలసి మానవరహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) ద్వారా ఆయా ప్రదేశాలను మానిటర్ చేయనున్నారు. బలగాలను వెనక్కు తీసుకెళ్లే బాధ్యతలను సరిహద్దు (వివాదమున్న) జిల్లాల ఎస్పీలకు అప్పగించారు. వివాదాలను తగ్గించేందుకు అవసరమైన కీలక పరిష్కారం ప్రధాన కార్యదర్శుల భేటీ ద్వారా జరిగినట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. -
ఏ సవాలునైనా ఎదుర్కోగలం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ అయినా, సరిహద్దు వివాదం అయినా.. ఎలాంటి సవాలునైనా భారత్ ఎదుర్కోగలదని గత సంవత్సరం నిరూపితమైందని ప్రధాని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి వల్ల మన ఆర్థిక వ్యవస్థపై పడిన దుష్ప్రభావాలను కూడా అదే విధంగా, అదే దృఢ నిశ్చయంతో పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) ర్యాలీనుద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితి గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ విషయంలో స్వావలంబన సాధించిన విధంగానే, సాయుధ దళాలను ఆధునీకరించే విషయంలోనూ ముందుకు వెళ్తామన్నారు. అన్ని సాయుధ దళాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు తాజాగా వచ్చిన మూడు రఫేల్ యుద్ధ విమానాలకు యూఏఈ, సౌదీ అరేబియాల్లో ఆకాశంలోనే ఇంధనం నింపారని, ఈ విషయంలో ఆ రెండు దేశాలతో పాటు గ్రీస్ కూడా సాయం చేసిందని ప్రధాని తెలిపారు. భారత్‌తో గల్ఫ్ దేశాలకు ఉన్న సత్సంబంధాలను ఇది రుజువు చేస్తుందని వ్యాఖ్యానించారు. రక్షణ ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా భారత్ మారనుందన్నారు. ప్రపంచానికి భారత్ టీకా సాయం కోవిడ్‌పై పోరులో ప్రపంచదేశాలకు భారత్ సహకారం అందిస్తుందని మోదీ అన్నారు. వరల్డ్ఎకనమిక్ఫోరం దావోస్ అజెండా సమిట్‌పై మాట్లాడారు. ‘చాలా దేశాలకు కోవిడ్ టీకాలు పంపించాం. 150పైగా దేశాలకు మందులు అందజేశాం. దేశంలో తయారైన రెండు టీకాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నాం. మరికొన్ని టీకాలను కూడా అందజేయనున్నాం’ అని ప్రధాని అన్నారు. ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న మోదీ -
తీరు మారని చైనా
నిరుడు ఏప్రిల్‌లో గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి మన భూభాగంలోకి ప్రవేశించినప్పటినుంచీ చైనా ఎడతెగకుండా లడాయి కొనసాగిస్తోంది. 3,440 కిలోమీటర్ల ఎల్ఓసీ పొడవునా వేర్వేరుచోట్ల వేర్వేరు సందర్భాల్లో ఒక పథకం ప్రకారం తన దళాలతో అతిక్రమ ణలు చేయించటానికి ప్రయత్నించి ఉద్రిక్తతలను పెంచుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో నిరుడు జూన్‌లో అకారణంగా మన జవాన్లపై రాళ్లు కర్రలతో దాడిచేసి 20మంది సైనికుల ఉసురుతీసింది. 45 సంవత్సరాల్లో ఎల్ఓసీలో నెత్తురొలకటం అదే ప్రథమం. ఆ తర్వాత అంత క్రితంవరకూ మన సైనికుల నియంత్రణలో వున్న డెస్పాంగ్, హాట్ స్ప్రింగ్స్ తదితరచోట్ల ఆక్రమ ణలకు దిగి అక్కడ మన జవాన్లు గస్తీ తిరగటానికి వీల్లేదంటూ పేచీ పెట్టింది. సైనిక కమాండర్ల స్థాయిలో ఇప్పటికి తొమ్మిదిసార్లు రెండు పక్షాలమధ్యా చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి లేదు. బలగాల మోహరింపు, ఉద్రిక్తతలు పెరగటం వంటివి ఆగలేదు. ఈలోగా కొత్త కొత్త ప్రాంతాల్లో చైనా గాల్వాన్‌లోయ తరహా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సిక్కింలో గతవారం ఇదే పునరావృతమైంది. అక్కడ కూడా చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే మన జవాన్లు అడ్డగించారు. మొత్తమ్మీద మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి, మన జవాన్లను రెచ్చగొట్టి దాడి చేయటమో, మానటమో నిర్ణయించుకోక తప్పని స్థితిలోకి మనల్ని నెడుతోంది. ఎల్ఓసీలో యధా తథ స్థితిని నెలకొల్పాలంటే అక్కడ సైనిక దళాలను మోహరించటం, మన భూభాగాన్ని వెనక్కి తీసుకొనే ప్రయత్నం చేయటం తప్ప మనకు మార్గాంతరంలేని స్థితిని సృష్టించింది. ఇదంతా పద్ధతి ప్రకారం చేస్తోంది. అందుకే గత తొమ్మిది దఫాలుగా చర్చలు విఫలమవుతూ వస్తున్నాయి. చొర బాటు ప్రాంతం నుంచి వెనక్కెళ్లి, యధాతథ స్థితి పునరుద్ధరణకు సహకరించమని మన దేశం కోరటం... కాదు, ఆ ప్రాంతంలో మోహరించిన దళాలను మీరే వెనక్కి తీసుకోమని చైనా చెప్పటం రివాజుగా మారింది. సిక్కింలో తాజాగా జరిగిన తంతు ఆ పరంపరలో భాగమే. సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరినప్పుడు రెండు పక్కలా సైన్యాలు మోహరించి తలపడతాయి. ఎదుటివారి భూభాగంలోకి ప్రవేశించి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎల్ఓసీ పొడవునా పరిమిత ప్రాంతాల్లో అక్కడక్కడ తమ సైన్యంతో చడీచప్పుడూ లేకుండా చొరబాట్లు చేయించి, అక్కడినుంచి కదలకపోవటమనే కొత్త ఎత్తుగడకు చైనా తెరతీసిందని గత ఏడాది అనుభవం చెబుతోంది. అలా ప్రవేశించినచోట శిబిరాలు నిర్మించటం, అక్కడ సైనికుల్ని వుంచటం రివాజైంది. తాను సన్నిహితం చేసుకోవాలనుకుంటున్న నేపాల్ విషయంలోనూ చైనాది ఇదే ఎత్తుగడ. నిరుడు తమ భూభాగంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చైనాను ఏం చేయలేక అది నిస్సహాయంగా వుండి పోయింది. మన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబాన్సిరి జిల్లాలో ఒక చిన్న గ్రామాన్నే అది సృష్టించింది. అక్కడ 120 ఆవాసాలతో రెండువేలమంది జనాన్ని పోగేసింది. ఈ క్రమంలో అది ఏ మర్యాదలూ పాటించటం లేదు. అరుణాచల్‌లోని చుశాల్ గ్రామానికి సమీపం లోనే మన భూభాగంలో చైనా సైనికులు శిబిరాలు వేసుకుని, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారని తూర్పు లద్దాఖ్ కౌన్సిలర్ ఒకరు ఇటీవలే చెప్పారు. దక్షిణ చైనా సముద్రం ప్రాంతంలో అమెరికా సైనిక విమానమో, మరొకటో గగనతలంలో కనిపిస్తే రెచ్చిపోయి ప్రకటనలు చేసే చైనా భారత్ విషయంలో మాత్రం చడీచప్పుడూ లేకుండా వుండిపోతుంది. ఎల్ఏసీలో చైనా ఏదో ఒక చేష్టకు పాల్పడినప్పుడల్లా మనవైపు నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆక్రమణదారులకు సరైన గుణపాఠం చెబుతామన్న హెచ్చరికలుంటున్నాయి. కానీ అందులో చైనా ప్రస్తావన వుండదు. చైనా కూడా ఆ హెచ్చరికలు తమనుద్దేశించినవే అన్న అభిప్రాయం ప్రపంచానికి కలగనీయదు. తనను కానట్టు వుండిపోతుంది. దాని చెప్పుచేతల్లో పనిచేసే ‘గ్లోబల్ టైమ్స్’ అనే పత్రిక మాత్రం తననే హెచ్చరించినంతగా బాధపడుతూ భారత్‌కు జవాబిస్తుంటుంది. 1962నాటి భంగపాటు గుర్తులేదా అంటూ ఎత్తిపొడుస్తుంది. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలొస్తుంటాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలూ జరుగుతుంటాయి. అయితే రెండు పక్షాల్లోనూ చిత్తశుద్ధి వున్నప్పుడే ఎంతో కొంత ఫలితం వుంటుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో అయిదారు నెలలక్రితం ఎలాంటి పరిస్థితి వుందో, ప్రస్తుతం ఎలావుందో చెప్పే ఉపగ్రహ ఛాయాచిత్రాలు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నా చైనా మాత్రం తన మంకుపట్టు మానటం లేదు సరిగదా... కొత్త కొత్త ప్రాంతాల్లో అదే మాదిరి ఎత్తుగడలకు పాల్పడుతోంది. శాంతి కేవలం ఒక పక్షం మాత్రమే కోరుకుంటే ఏర్పడేది కాదు. వివాదంలో భాగస్వాములైన రెండు పక్షాలూ అందుకు సిద్ధపడాలి. చైనా పోకడలు చూస్తుంటే అందుకు సిద్ధపడుతున్న దాఖలా లేదు. వచ్చే జూలైలో చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుగు తున్నాయి. అందుకోసం భారీయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం కూడా అందులో తలమునకలై వున్నాయి. తన హయాంలో కమ్యూనిస్టు పార్టీ, చైనా కూడా సమర్థవంతంగా వున్నాయన్న అభిప్రాయం శ్రేణుల్లో కలగజేయటం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు అవసరం కాబట్టే ఆయన దూకుడుగా వున్నట్టు కనబడుతున్నారని ఆసియాలో ఆధిపత్యాన్ని స్థిరపరుచు కుంటున్నామన్న భావన కలగజేయటానికి ప్రయత్నిస్తున్నారని కొందరు నిపుణుల అంచనా. ఆ తర్వాత చైనా వైఖరి సడలే అవకాశం వున్నదని వారి విశ్లేషణ. వాటి సంగతలా వుంచితే చైనా పోకడలను ప్రపంచానికి తెలియజెప్పటానికి, ఇలాంటి ఘర్షణాత్మక పోకడల వల్ల సమస్యలేర్పడతాయని నేరుగా చెప్పటానికి అంతర్జాతీయ వేదికల ద్వారా మన దేశం ప్రయత్నించాలి. -
'ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది'
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని చైనా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోందని బీజేపీ నేత, ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ రామ్ మాధవ్ అన్నారు. ఇండియా- చైనా మధ్య వివాదం ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం అనే అంశంపై హోటల్ క్షత్రియాలో అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేత రామ్ మాధవ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. కార్యక్రమంలో రామ్ మాధవ్ మాట్లాడుతూ.. 'చైనా మనకు రెండు విధాలుగా సవాల్ విసురుతోంది. ఒకటి ఆర్థికంగా ఎదిగిన చైనా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందుకే మన దేశంలాంటి దేశాలు అన్నీ కలిసి ఆర్థికంగా ఎదగాలి. అందుకే ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాం' అని తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ.. 'చైనా అనేక కుయుక్తులు పన్నుతోంది. పాకిస్తాన్‌తో ఏకమై పనిచేస్తూ ఆ దేశాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో లాబీయింగ్ చేస్తోంది. శ్రీలంకలో చైనా అనేక నిర్మాణాలు చేస్తోంది. ఇది భారతదేశానికి చాలా ఇబ్బంది కలిగించేదే. నేపాల్‌లో చైనా మధ్యవర్తిత్వంలో అక్కడి రాజకీయాల్లో మార్పు వస్తోంది. చైనా వల్ల ఇండియన్ ఓసియన్‌లో ఉన్న అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చైనా వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. చదవండి: (ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్) దేశ విస్తరణ కాంక్షతో చైనా ఇలా వ్యవహరిస్తోంది. భారతదేశం ఏనాడు టెరిటరీ బార్డర్‌ను పెంచుకోవాలని కోరుకోలేదు. చైనా యాప్‌ల బ్యాన్ ద్వారా మన దేశ యువకులకు మంచి అవకాశం వచ్చింది. చైనాను కమ్యూనిస్టు దేశం అనేందుకు ఏ దేశం ఇష్టపడటం లేదు. భారత్ ఎప్పుడూ చైనాతో యుద్ధం కోరుకోవడం లేదు. కానీ చైనా మన దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఎప్పుడూ స్నేహ హస్తం ఇస్తుంది. కవ్వింపులకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నాం. దేశ వ్యవహారాల్లో ఎవరి ప్రమేయం ఒప్పుకోం. నేపాల్ లాంటి దేశాలు చైనా వలలో పడకూడదు' అని కోరుకుంటున్నట్లు వివరించారు. -
ముదురుతున్న సరిహద్దు వివాదం
సాక్షి, కొరాపుట్: ఆంధ్ర–ఒడిశా బోర్డర్ వివాదాలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. ఇదివరకు ఉన్న కొఠియా, నారాయణపట్నం సమితిలోని చినకరిభద్ర గ్రామాల సరిహద్దుల వివాదం కంటే ఇటీవల బయటపడిన పొట్టంగి సమితి, సంబయి పంచాయతీలోని సునాబెడ గ్రామ సరిహద్దు వివాదంపై ఉభయ రాష్ట్రాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అధికంగా దృష్టి పెడుతున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఓ ప్రాంతం వారు పెట్టిన సైన్ బోర్డును ఇంకొక ప్రాంతం వారు తొలగించడం వంటి చర్యలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన ఒడిశా అధికారులు, ప్రజాప్రతి నిధులు వివాదాస్పద గ్రామమైన సునాబెడకి వెళ్లి, ఆంధ్రప్రదేశ్ డుంబిరిగుడ మండలం పేరిట ఏర్పాటు చేసిన సరిహద్దు బోర్డును తొలగించారు. మళ్లీ అదే ప్రాంతంలో ఒడిశా తరఫున బోర్డును ఏర్పాటు చేశారు. దీనిని వ్యతిరేకించిన సరిహద్దు ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజలు ఆ మరుసటి రోజే ఒడిశా తరఫున ఏర్పాటు చేసిన బోర్డును తీసివేసి, ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఉభయ రాష్ట్రాల మధ్య సరిహద్ద వివాదం ముదురుతోంది. ఇటీవల ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పార్టీల నేతలు విశాఖపట్నంలో దగ్గరి ఏఓబీలోని 4 గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, అక్కడి అడవులు, అటవీ భూములు తమవని, ప్రాణత్యాగానికైన సిద్దమవుతాము కానీ ఆ భూభాగాన్ని విడిచేది లేదని నినాదాలు చేసినట్లు సునాబెడ వార్డు మెంబరు ముసురు తవుడు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వివాదంపై సునాబెడ గ్రామస్తులు పొట్టంగి బ్లాక్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారికి తగిన రీతిలో మద్దతు, రక్షణ లేదని ఆక్కడి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివాదం నెలకొన్న గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ అధికారులు, ప్రజాపతినిధులు తమ మద్దతు తెలుపుతున్నారని, కానీ ఒడిశా తరఫున అటువంటి ఆసరా తమకు దొరకడం లేదని అక్కడి వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ గ్రామస్తులు తమపై జరుపుతున్న బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని అక్కడి సునాబెడ తదితర సరిహద్దులోని గ్రామస్తులు కోరుతున్నారు. -
చైనాతో ఉద్రిక్తతలకు చెక్!
న్యూఢిల్లీ: భారత్–చైనాల సరిహద్దుల్లో 6 నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన త్వరలోనే ముగింపునకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్రిక్తతలను తొలగించుకునే క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు ఇప్పటి వరకు 8 దఫాలుగా చర్చలు జరిపారు. వారం క్రితం కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన 8వ విడత చర్చల్లో సరిహద్దుల్లో శాంతి స్థాపన సాధన దిశగా కీలక ముందడుగు పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటిపై త్వరలోనే జరిగే 9వ విడత కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని నిర్ణీత కాల వ్యవధిలో మూడు విడతలుగా ఉపసంహరించుకునేందుకు స్థూలంగా ఒక అంగీకారం కుదిరింది. ఇది అమల్లోకి వస్తే వాస్తవ ఆధీన రేఖ(ఎల్ఏసీ) వెంట తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఏప్రిల్ నాటి పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని బుధవారం అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం మొదటి దశలో ఒప్పందం కుదిరిన మూడు రోజుల్లోనే రోజుకు 30 శాతం చొప్పున బలగాలను రెండు దేశాలు ఉపసంహరించుకోవాలి. -
మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపథ్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నవంబర్‌లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ సోమవారం ప్రకటించింది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీని ద్వారా చైనాకు బలమైన హెచ్చరికలు పంపినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబార్ ఎక్సర్సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
అసంపూర్ణ చర్చలు
భారత–చైనాల మధ్య కోర్ కమాండర్ల స్థాయిలో జరిగిన ఆరో దఫా చర్చలు యధావిధిగా అసంపూర్తిగా ముగిశాయి. ఆ తర్వాత ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడింది. అయితే ఎప్పటిలాగే అది కూడా అస్పష్టంగానే వుంది. చైనా సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటుకు దిగడానికి ముందున్న యధాపూర్వ స్థితి పునరుద్ధరణకు రెండు పక్షాలూ ఏం చర్యలు తీసుకో బోతున్నాయో, ప్రతిష్టంభన తొలగింపు కోసం తిరిగి చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తాయో అందులో చెప్పలేదు. సోమవారం ఉదయం 9.30 ప్రాంతంలో మొదలైన చర్చలు రాత్రి 10.30 వరకూ సాగాయంటే చాలా అంశాల విషయంలో ప్రతినిధి బృందాల మధ్య వాదోపవాదాలు జోరుగానే సాగివుంటాయనుకోవాలి. నెలన్నర వ్యవధి తర్వాత ఈ చర్చలు చోటుచేసుకున్నాయి. ఈసారి చర్చల్లో మన విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి హోదా స్థాయి అధికారి పాల్గొనడమే విశేషం. ఎల్ఏసీలో ప్రస్తుతం ఎలాంటి ఘటనా జరగటంలేదన్న మాటేగానీ.. ఉద్రిక్తతలు ఎక్కువే. ఎందుకంటే ఇరుపక్కలా చెరో 40,000మంది సైనికులు సర్వసన్నద్ధంగా వున్నారు. వారి వద్ద శతఘ్నులు, తుపాకులు, క్షిపణులు వున్నాయి. ఏ పక్షంనుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను ఘర్షణలకు దారితీసే ప్రమాదం వుంది. కనుకనే చర్చలు త్వరగా కొలిక్కి వచ్చి సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎల్ఏసీ వద్ద రెండు దేశాల మధ్యా ఖచ్చితమైన, పరస్పర ఆమోదయోగ్యమైన సరిహద్దు లేనిమాట వాస్తవమే అయినా... దశాబ్దాలుగా ఇరు సైన్యాలు గస్తీ కాస్తున్న ప్రాంతాలు స్పష్టంగానే వున్నాయి. సైన్యం కదలికలు పూర్తిగా భౌగోళిక మ్యాప్‌లపై ఆధారపడి వుంటాయి గనుక పొరబడే అవకాశం లేనేలేదు. అందువల్లే మన దేశం చైనా సైన్యం తమ పాత ప్రాంతానికే పరిమితమై వుండాలని పట్టుబడుతోంది. ప్యాంగాంగ్ సో, చుశాల్, గోగ్రా హాట్ స్ప్రింగ్స్, డెస్పాంగ్ ప్రాంతాలనుంచి చైనా వైదొలగాలని కోరుతోంది. అలా వైదొలగడానికి సంబంధించిన పథకమేమిటో చెప్పాలంటోంది. మిగిలిన ప్రాంతాల్లోకన్నా డెస్పాంగ్ వద్ద చైనా సైన్యం బాగా లోపలికి చొచ్చుకొచ్చింది. అది దాదాపు 15 కిలోమీటర్ల వరకూ వుంటుందంటున్నారు. అయితే మీరే ప్యాంగాంగ్ సో సరస్సు సమీపంలోని ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాల నుంచి వైదొలగాలని చైనా డిమాండ్ చేస్తోంది. ఆ తర్వాతే తాము ఆక్రమిత ప్రాంతాల నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామంటోంది. ఉమ్మడి ప్రకటనలో వీటి ప్రస్తావన ఎక్కడా లేదు. చైనా వెనక్కు తగ్గడానికి నిరాకరించడాన్ని చూశాక మన సైన్యం గత నెలాఖరున ప్యాంగాంగ్ సో సరస్సు వద్ద వున్న కైలాష్ రేంజ్ శిఖరాల్లో భాగమైన ఫింగర్–5, ఫింగర్–6 శిఖరాలపై పట్టు సాధించింది. వ్యూహాత్మకంగా మన సైన్యం పైచేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. చైనా సైన్యం కదలికలు, వారు చేరేసుకుంటున్న ఆయుధాలు వగైరా సులభంగా తెలుస్తాయి. పశ్చిమంవైపు విస్తరించకుండా అడ్డుకునేందుకు అది దోహదపడుతుంది. కనుకనే ఇక్కడినుంచి వెనక్కు వెళ్లాలని చైనా పట్టుబడుతోంది. ఉద్రిక్తతలు, ఘర్షణలు ఇరు దేశాలకూ ఏమాత్రం మేలు చేయబోవన్న అంశంలో రెండు దేశాలదీ ఒకే మాట. ఈ నెల 10న ఉభయ దేశాల విదేశాంగమంత్రులూ మాస్కోలో సమావేశమైనప్పుడు దీన్ని అంగీకరించారు. కనుకనే ఈసారి జరిగే కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో పురోగతి వుంటుందనుకున్నారు. అయితే ఈ స్థాయి చర్చలు ఎక్కువ సందర్భాల్లో దేశాధినేతలు వాస్తవ పరిస్థితిపై లోతైన అవగాహన పెంచుకోవడానికి, సరిహద్దు వివాదంలో అవతలి పక్షం ఉద్దేశాలేమిటో తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. తుది పరిష్కారం లభించాలంటే అది అధినేతల మధ్య జరిగే చర్చల్లో మాత్రమే సాధ్యం. అధినేతలు కేవలం సైనిక కోణంలో మాత్రమే సమస్యను చూడరు. మొత్తంగా అంతర్జాతీయ పరిస్థితులు, పరిణామాలు చూసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దేశానికి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందో తేల్చుకుంటారు. ఆ మేరకు తమ తమ సైన్యాలకు సూచనలిస్తారు. ఇప్పుడున్న సైనిక దళాల సంఖ్యను రెండు దేశాలూ పెంచకూడదన్న అంశంలో కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ఉమ్మడి ప్రకటన చెబుతోంది. అయితే ఇప్పటికే అక్కడ చైనా అవసరమైనమేర సైన్యాన్ని పెంచుకుందనేది మరిచిపోకూడదు. అన్ని దేశాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ విభేదాలను తగ్గించుకోవాలని, వివాదాలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈమధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలనుద్దేశించి పంపిన వీడియో ప్రసంగంలో చెప్పారు. ఆ మాటల్లో చిత్తశుద్ధి ఎంతవుందో మన దేశమే కాదు... ప్రపంచమంతా గమనిస్తుంది. రెండు దేశాల రక్షణమంత్రులు, విదేశాంగమంత్రులు చర్చించుకున్నా కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో మెరుగైన పురోగతి లేకపోవడం అందరూ చూస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా దూకుడుకు కారణాలేమిటో తెలియనివారెవరూ లేరు. జమ్మూ–కశ్మీర్ ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటినుంచీ చైనా, పాకిస్తాన్లకు అది కంటగింపుగా వుంది. చైనా లద్దాఖ్‌లో చొచ్చుకొస్తే, పాకిస్తాన్ గిల్గిత్–బాల్టిస్తాన్‌కు సంబంధించిన కొత్త మ్యాప్ విడుదల చేసి వివాదం రేపాలని చూసింది. వారి ఉమ్మడి ఎజెండా సుస్పష్టం. 1979లో ఆనాటి చైనా అధినేత డెంగ్ జియావో పెంగ్ ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఉదారవాద విధానాలు ప్రారంభించినప్పుడు చైనాలో ఏకస్వామ్య వ్యవస్థ బద్దలు కావడానికి అవి దోహదపడతాయని పాశ్చాత్య దేశాలు భావించాయి. కానీ తూర్పు చైనా సముద్రంలోనైనా, తూర్పు లద్దాఖ్లోనైనా చైనా తీరు చూస్తుంటే ఆ ఆర్థికాభివృద్ధి ఆంతర్యం ప్రపంచంపై పట్టు సాధించడానికేనన్న సంశయాలు కలుగుతున్నాయి. తమకా ఉద్దేశం లేదని నిరూపించుకునే బాధ్యత ఇప్పుడు చైనాదే. -
సైన్యం శీతాకాలం కోసం..
లేహ్: త్వరలో ప్రారంభం కానున్న సుదీర్ఘ శీతాకాలంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా భారత సైన్యం సిద్ధమవుతోంది. చైనాతో సరిహద్దు వివాదాలు పెరిగిపోతున్న సమయాన లద్దాఖ్ ప్రాంతంలో సదా సంసిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. శీతాకాలంలో లద్దాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. నెలలపాటు లడఖ్‌కు దేశంలోని ఇతర ప్రాంతాలతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆర్మీకి అవసరమైన అన్ని వస్తువులను ఫార్వార్డ్ పోస్టుల వద్దకు చేరుస్తున్నట్లు మేజర్ జనరల్ అరవింద్ కపూర్ చెప్పారు. చలికాలం గడిపేందుకు కావాల్సిన సరుకులు, ఇంధనం, ఆయుధాలు, మందుగుండు, టెంట్లు, ఉన్ని దుస్తులు, హీటర్లు, ఆహార పదార్థాల్లాంటివన్నీ సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. దేశీయంగా తయారైన ఆర్కిటెంట్లు మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతను, హై ఆల్టిట్యూడ్ టెంట్లు మైనస్ 40– 50 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటాయన్నారు. లద్దాఖ్ ప్రాంతం గుండా రెండు ప్రధాన రహదారులు(మనాలీ– లేహ్, జమ్ము–శ్రీనగర్–లేహ్) పోతుంటాయి. గతంలో చలికాలం రాగానే ఈ రెండు మార్గాలు దాదాపు 6 నెలలు మూతపడేవి. కానీ ప్రస్తుతం మౌలికసదుపాయాలు మెరుగుపరిచి ఈ సమయాన్ని 4నెలలకు తగ్గించినట్లు కపూర్ చెప్పారు. అటల్ టన్నెల్, డార్చా– నీము– పదమ్ రహదారి అందుబాటులోకి వస్తే ఇక లద్దాఖ్‌కు సంవత్సరం పొడుగునా రవాణా సౌకర్యం ఉంటుందని వివరించారు. -
వ్యూహాత్మక మోహరింపు
న్యూఢిల్లీ: అదనపు బలగాలను తరలించడం ద్వారా తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో మూడు వ్యూహాత్మక పర్వత ప్రాంతాలపై భారత్ పట్టుబిగించింది. ఈ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దుస్సాహం చేయగా... భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత భూభాగంలో పాంగాంగ్ సరస్సుకు ఉత్తరవైపు కూడా బలగాల మోహరింపులో వ్యూహాత్మక మార్పులు చేసినట్లు రక్షణశాఖ వర్గాలు బుధవారం తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్, చైనా చూశుల్లో వరుసగా మూడోరోజు బుధవారం మిలిటరీ కమాండర్ స్థాయి చర్చలు జరిపినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. భారత బలగాలు కొన్ని కీలక పర్వత ప్రాంతాలపై మోహరించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రాంతాలన్నీ తమ భూభాగంలోనే ఉన్నాయని, బలగాలను ఉపసంహరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమని, ఒకవేళ చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా దీటుగా బదులిస్తామని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. గత కొద్ది రోజుల్లో భారత్ తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక పర్వత ప్రాంతాల్లో బలగాలను మోహరించి వ్యూహాత్మక ఫలితాలు సాధించిందని చెప్పాయి. 3,400 కిలోమీటర్ల పొడవున్న వాస్తవధీన రేఖ వెంబడి 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని భారత బలగాలను ఆదేశాలు వెళ్లాయి. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద సున్నిత ప్రాంతాల్లో చైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ దూకుడుగానే స్పందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో మరిన్ని బలగాలను మోహరించడంతోపాటు, క్షిపణి నిరోధక ట్యాంకులను, ఇతర ఆయుధాలను తరలించాలని నిర్ణయించారని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ బెటాలియన్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. తూర్పువైపు బలగాలు సరిహద్దులో డ్రాగన్ దేశం కవ్వింపునకు పాల్పడుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. పశ్చిమ హిమాలయాల వైపు చైనా బలగాలు దురాక్రమణకు యత్నించి ఉద్రిక్తత సృష్టించిన నేపథ్యంలో తూర్పు వైపు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలలో సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచింది. పెద్ద ఎత్తున బలగాలను తరలించింది. సరిహద్దులో అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో భారత బలగాలు కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం తనదేనని చైనా చెప్పుకుంటుండటంతో ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చెలరేగుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే బలగాల బాహాబాహీకి ఎంతమాత్రం అవకాశం లేదంటూ ప్రభుత్వ, మిలిటరీ వర్గాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జరగని రీతిలో గత జూన్‌లో లద్దాఖ్‌లో ఘర్షణ జరిగింది. ఇప్పడిప్పడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న సమయంలో చైనా బలగాలు మరోసారి పాంగాంగ్ దక్షిణ తీరంలో దురాక్రమణకు యత్నించి మరింత అగ్గిని రాజేశాయి. దీంతో చైనా సరిహద్దులో తూర్పువైపునకు భారత్ బలగాలను తరలించిందని ఓ అధికారి చెప్పారు. పెద్ద ఎత్తున ఆర్మీ బెటాలియన్లు మోహరించాయి. అయితే దాడులకు సంబంధించి ఎలాంటి నిర్దేశిత ఆధారాలు లేవు అని అంజా జిల్లా సీనియర్ అధికారి ఆయుషి సుడాన్ చెప్పారు. జూన్‌లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన తర్వాత భారత బలగాల మోహరింపు మాత్రం చాలా పెరిగిందన్న విషయాన్ని ఆమె స్పష్టంచేశారు. ఆయా గ్రామాల్లోని వారికి మరిన్ని సదుపాయాలు, అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆందోళన అక్కర్లేదు 1962లో అరుణాచల్‌ప్రదేశ్ (ఈ ప్రాంతాన్ని చైనా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది) లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగిందని, ఇక్కడ మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ జరగవచ్చని భద్రతారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత బలగాల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. తూర్పు వైపు భద్రంగా ఉంచేందుకే ఈ చర్య అని భావిస్తున్నారు. భారత మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ హర్షవర్దన్ పాండే మాత్రం బలగాల మోహరింపు సాధారణంగా జరిగే రొటేషన్ ప్రక్రియ అని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్మీ యూనిట్లు మారుతుంటాయి. ఇది నిరంతం జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. చైనా బలగాలు మాత్రం భారత్‌లోకి చొరబడుతూనే ఉన్నాయని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తపిర్ గవో అన్నారు. అంజా జిల్లాలోని వలోంగ్, ఛగ్లాగామ్లు చాలా సున్నితమైన ప్రాంతాలని పేర్కొన్నారు. -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
చైనాకు దీటుగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా సుమారు 17 వేల సైనికులను, యుద్ధ వాహనాలను మోహరించింది. ఏప్రిల్, మేల నుంచే చైనా ఆ ప్రాంతాలకు బలగాల తరలింపు ప్రారంభించింది. అలాగే, అక్కడ పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 10 నుంచి పీపీ 13 వరకు భారత బలగాల గస్తీ విధులను చైనా సైనికులు అడ్డుకోవడం ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాంతో, భారత్ కూడా అదే స్థాయిలో స్పందించిందని, టీ 90 రెజిమెంట్స్ సహా భారీగా బలగాలను ఆ ప్రాంతాలకు తరలించిందని వెల్లడించాయి. కారకోరం పాస్ దగ్గర్లోని పీపీ 1 దగ్గర్నుంచి పెద్ద ఎత్తున భారత్ బలగాలను దెప్సాంగ్‌కు తరలించిందని తెలిపాయి. ఏదైనా దుస్సాహసానికి పాల్పడాలంటే చైనా పలుమార్లు ఆలోచించే స్థాయిలో 15 వేల మంది భారత జవాన్లు అక్కడ సిద్ధంగా ఉన్నారన్నాయి. టీడబ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారకోరం కనుమ వరకు రోడ్డు నిర్మించాలని చైనా భావిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంతో రెండు బెటాలియన్ల మధ్య దూరం చాలా తగ్గుతుంది. భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో చిన్న వంతెనను నిర్మించగా భారత సైనికులు దాన్ని కూల్చేశారు. భౌగోళిక సమగ్రతలో రాజీ లేదు చైనాకు మరోసారి స్పష్టం చేసిన భారత్ దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ లేదని చైనాకు భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సొ, ఇతర ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి బలగాల ఉపసంహరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఇరుదేశాల మిలటరీ కమాండర్ స్థాయి ఐదో విడత చర్చల సందర్భంగా స్పష్టం చేసింది. సీనియర్ కమాండర్ స్థాయి అధికారుల నేతృత్వంలో ఆదివారం చైనా భూభాగంలోని మోల్డో వద్ద 11 గంటల పాటు చర్చించారు. రెండు దేశాల మధ్య సౌహార్ధ సంబంధాలు నెలకొనాలంటే.. వాస్తవాధీన రేఖ వెంట గతంలో ఉన్న యథాతథ స్థితి నెలకొనడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ‘గల్వాన్ లోయ, పలు ఇతర ప్రాంతాల నుంచి చైనా తన బలగాలను ఉపసంహరించుకుంది. కానీ పాంగాంగ్ సొ ప్రాంతంలోని ఫింగర్ 4, ఫింగర్ 8 ల్లో, గొగ్రా వద్ద బలగాలను ఉపసంహరించకపోవడంపై భారత్ గట్టిగా ప్రశ్నించింది’ అని వివరించాయి. 1.75 లక్షల కోట్ల టర్నోవర్ లక్ష్యం 2025 నాటికి రక్షణ ఉత్పత్తుల టర్నోవర్ రూ. 1.75 లక్షల కోట్లకు చేరాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థకే చోదక శక్తిగా మారే సామర్ధ్యం ఈ రంగానికి ఉందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ–2020’ ముసాయిదాను రక్షణ శాఖ రూపొందించింది. అందులో, రానున్న ఐదేళ్లలో అంతరిక్ష రక్షణ రంగ ఉత్పత్తులు, సేవల ఎగుమతుల లక్ష్యమే రూ. 35 వేల కోట్లని అందులో పేర్కొంది. -
పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందే
న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని పాన్‌గాంగ్ త్సో నుంచి చైనా సైనికులు పూర్తిగా వెనక్కి మళ్లాల్సిందేనని భారత్ తేల్చిచెప్పింది. మరో రెండు వివాదాస్పద ప్రాంతాల్లో తిష్టవేసిన చైనా బలగాలు సైతం వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసింది. ఆదివారం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనా భూభాగం వైపు భారత్–చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య 11 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇవి ఐదో దఫా చర్చలు. సాధ్యమైనంత త్వరగా చైనా సైనికులు వెనక్కి తగ్గితేనే సరిహద్దుల్లో శాంతి సాధ్యమని భారత అధికారులు స్పష్టం చేశారు. మే 5వ తేదీ ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చర్చల్లో భారత్ తరపు బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించారు. సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగా, తూర్పు లద్ధాఖ్లోని కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. రానున్న శీతాకాలంలో చైనా నుంచి కవ్వింపు చర్యలు తప్పకపోవచ్చని అంచ నా వేస్తున్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు ఇప్పట్లో పరిష్కార మార్గాలు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తూర్పు లద్ధాఖ్‌లో సైన్యాన్ని కొనసాగించడమే మేలని భారత సైనిక అధికారులు చెబుతున్నారు. -
చైనా సరిహద్దులకు మరిన్ని బలగాలు
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. తూర్పు లద్దాఖ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో చైనా తరచూ సరిహద్దు వివాదాలు సృష్టిస్తూండటం, ఇటీవల గల్వాన్ లోయలో పొరుగుదేశపు సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీరమరణం పొందడం ఈ నిర్ణయానికి కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడం ఇంకో కారణం. భారత్ చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది. రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు’’అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్’డైరెక్టర్ విశ్రాంత మేజర్ జనరల్ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. సైన్యం ఉపసంహరణ పూర్తి కాలేదు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా దళాల ఉపసంహరణ ఇంకా పూర్తి కాలేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దళాల ఉపసంహరణ అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దాదాపు పూర్తయిందని చైనా రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఈ స్పష్టత ఇచ్చింది. ‘బలగాల ఉపసంహరణకు సంబంధించి కొంత పురోగతి ఉంది. కానీ, పూర్తిగా ఉపసంహరణ జరగలేదు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో శాంతి.. విషయాల్లో చైనా నిజాయతీగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య మరో విడత మిలటరీ కమాండర్ స్థాయి చర్చలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. స్మారకంపై గల్వాన్ అమరులు తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైన్యంతో పోరాడి, వీరమరణం పొందిన 20 మంది అమరజవాన్ల పేర్లను ఢిల్లీలోని నేషనల్ వార్‌మెమొరియల్‌పై లిఖించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేర్లు చేర్చడానికి కొద్ది నెలల సమయం పట్టనున్నట్టు తెలిపారు. ఐదు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైనికులతో భీకర పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 16 బిహార్ రెజిమెంట్‌కి చెందిన కల్నల్ బి.సంతోష్ బాబుతో పాటు, 20 మంది సైనికులు అసువులు బాశారు. చైనా వైపు ఈ ఘర్షణలో ఎంత మంది చనిపోయారనేది ప్రకటించలేదు. అమెరికా నిఘా వర్గాల ప్రకారం 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. -
అంగుళం భూమినీ ముట్టుకోలేరు
లద్దాఖ్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు. సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్ లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్లో రాజ్నా«ద్ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఏమైనా చేస్తా భారత్ చైనా పరిస్థితిపై ట్రంప్ భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యను ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహాధ్యక్షుడు అల్ మాసన్ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. -
వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఉపసంహరణ ప్రక్రియ మంగళవారమే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి. ఇరుదేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య ఆదివారం జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. పలు ప్రదేశాల్లో నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను సోమవారం నుంచి చైనా తొలగించడం ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ‘ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి’ అని వెల్లడించాయి. చైనా ఉపసంహరణ ప్రక్రియను భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోందన్నాయి. బలగాలు వెనక్కు వెళ్తున్నప్పటికీ.. భారత సైన్యం అప్రమత్తంగానే ఉందని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందని తెలిపాయి. గల్వాన్ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్‌ను తొలగించాయని తెలిపాయి. పాంగాంగ్ సొ ప్రాంతంలో మాత్రం చైనా బలగాల సంఖ్య స్వల్పంగా తగ్గడాన్ని గమనించామని పేర్కొన్నాయి. ఘర్షణ జరిగిన, జరిగే అవకాశమున్న ప్రాంతాల వద్ద మూడు కిలోమీటర్ల వరకు ‘బఫర్‌జోన్’ను ఏర్పాటు చేయాలని జూన్ 30న ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో నిర్ణయించారు. ఈ చర్చల సందర్భంగా.. క్షేత్రస్థాయి సైనికుల సంఖ్యలో తగ్గింపు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు, మొత్తంగా ఉద్రిక్తతల సడలింపులో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా తెలిపింది. లద్దాఖ్‌లో వాయుసేన రాత్రి గస్తీ తూర్పు లద్దాఖ్ పర్వతాలపై సోమవారం రాత్రి భారత వైమానిక దళ విమానాలు గస్తీ నిర్వహించాయి. ఒప్పందం ప్రకారం.. ఇరుదేశాల మధ్య ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటికీ.. వైమానిక దళ సన్నద్ధతను, అప్రమత్తతను కొనసాగించాలని అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ పెట్రోలింగ్ జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగాంగ్ సొ, గొగ్రా, హాట్ స్ప్రింగ్స్ సహా అన్ని వివాదాస్పద ప్రదేశాల్లో య«థాతథ స్థితి నెలకొనే వరకు చైనాపై ఒత్తిడి తెవాలన్న వ్యూహంలో భాగంగా, రాత్రి, పగలు యుద్ధ విమానాల గస్తీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ‘ఈ పరిస్థితుల్లో మన సన్నద్ధతపై రాజీ ఉండకూడదు’ అని వ్యాఖ్యానించాయి. కొన్ని రోజులుగా భారత్ ఫైటర్ జెట్స్‌ను, ఎటాక్ చాపర్లను, రవాణా విమానాలను లద్దాఖ్‌లో మోహరిస్తోన్న విషయం తెలిసిందే. -
వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: దాదాపు రెండు నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో శాంతి, సంయమనం దిశగా తొలి అడుగులు పడ్డాయి. ఉద్రిక్తతలకు కేంద్ర స్థానమైన గల్వాన్‌లోయ నుంచి సోమవారం చైనా దళాలు వెనక్కు వెళ్లాయి. పెట్రోలింగ్ పాయింట్(పీపీ) 14 వద్ద నిర్మించిన తాత్కాలిక శిబిరాలు, ఇతర నిర్మాణాలను తొలగించాయి. దాదాపు కిలోమీటరుకు పైగా చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే, ఎంత దూరం వెనక్కు వెళ్లాయో కచ్చితంగా తెలియదన్నాయి. ఇరుదేశాల కమాండర్ స్థాయి ఆర్మీ అధికారుల మధ్య జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని వెల్లడించాయి. అయితే, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగిన తరువాతే ఈ ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ధోవల్ ఆదివారం ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. బలగాల ఉపసంహరణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈ చర్చల సందర్భంగా నిర్ణయించారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనాలంటే ముందు బలగాల ఉపసంహరణ జరగాలని, అభిప్రాయభేదాలు ఘర్షణలుగా మారకుండా జాగ్రత్త పడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు. ధోవల్, వాంగ్ యి భారత్, చైనాల తరఫున సరిహద్దు చర్చల్లో ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. రెండు దేశాల ఆర్మీలకు భారీగా ప్రాణనష్టం సంభవించిన జూన్ 15 నాటి గల్వాన్ ఘర్షణల తరువాత ఈ ఇద్దరు చర్చించుకోవడం ఇదే ప్రథమం. సరిహద్దుల్లో ఇటీవలి పరిణామాలపై ఆదివారం నాటి చర్చల్లో ధోవల్, వాంగ్ నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఇరుదేశాలు గౌరవించాలని, య«థాతథ స్థితిని ఏకపక్షంగా ఎవరూ ఉల్లంఘించరాదని అంగీకారానికి వచ్చారని తెలిపింది. సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేవరకు దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగించాలని ధోవల్, వాంగ్ యి నిర్ణయించారని పేర్కొంది. వేగంగా, దశలవారీగా వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇరు దేశాల ఆర్మీ కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయించారని పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత సానుకూలంగా ముందుకు సాగాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనడం ఆవశ్యకమని ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది. ధోవల్, వాంగ్ యి మధ్య జరిగిన చర్చలపై చైనా విదేశాంగ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇరువురి మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి లోతైన చర్చ జరిగిందని పేర్కొంది. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు అవుతున్న విషయాన్ని వాంగ్ చర్చల్లో ప్రస్తావించారని వెల్లడించింది. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచి వెనక్కు.. పీపీ 14, పీపీ 15, పీపీ 17ల నుంచే కాకుండా, గొగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి కూడా చైనా బలగాలు, వాహనాలు సోమవారం వెనక్కు వెళ్లాయి. పాంగాంగ్ సొ నుంచి వెనక్కు వెళ్లాయా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా భారత్‌కు పెరిగిన మద్దతు, ఇటీవల లేహ్ పర్యటనలో ప్రధాని మోదీ ఇచ్చిన స్పష్టమైన సందేశం.. చైనా తాజా నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. సరిహద్దు వివాదంపై చైనాతో దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చర్చలే ప్రారంభం కానట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారి సమయంలో దౌత్య సంబంధాలు’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ‘దేశాలు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి. చర్చలు జరగాలి. అలా జరగని పక్షంలో, సమస్యలు, ఘర్షణలు పెరుగుతాయి. ఉదాహరణకు, చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరగనట్లయితే, పరిస్థితి మరింత దారుణంగా మారేది’ అని వివరించారు. -
చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి
శ్రీనగర్: సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో తాడోపేడో తేల్చుకోవాలని ఇండియా భావిస్తోందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? తాజాగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కశ్మీర్ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసి పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ జూన్ 27న ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసరమైన ఆదేశాలుగా పేర్కొన్నారు. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!) చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉంటుందని, అందుకే గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనంటున్నాయి. కాగా, చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తాజాగా వెల్లడైంది. జూన్ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియానే స్వయంగా తెలిపింది. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి: ప్రధాని మోదీ) -
చైనా మైండ్ గేమ్
న్యూఢిల్లీ: భారత్, చైనా ఘర్షణల్లో డ్రాగన్ దేశం చేసిన అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 15 రాత్రి హింసాత్మక ఘటనల తర్వాత గాయపడిన మన దేశ జవాన్లను అప్పగించడంలో చైనా తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. మొత్తం 10 మంది సైనికుల్ని తమ నిర్బంధంలో ఉంచుకున్న చైనా భారత్‌కు అప్పగించడానికి మీన మేషాలు లెక్కించింది. చివరికి మూడు రోజుల తర్వాత వారిని అప్పగించింది. ఈ వివరాలను ఆర్మీ అధికారి ఒకరు జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. జూన్ 15 రాత్రి ఇరు దేశాల మధ్య భీకరమైన పోరాటం జరిగాక అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. అప్పటికింకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. ఒకవైపు గల్వాన్ నదిలో నిర్జీవంగా మారిన అమరవీరులు, మరోవైపు తీవ్రంగా గాయపడి నేలకొరిగిన జవాన్లతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆ చీకట్లోనే ఇరువైపులా సైనికులు తమ తోటివారి కోసం వెతుకుతున్నారు. కల్నల్ స్థాయి అధికారి సహా ఇతర చైనా సైనికుల్ని మరుక్షణంలోనే భారత్ ఆ దేశానికి అప్పగించింది. కానీ చైనా వారి భూభాగంలో గాయపడిన 50 మంది భారత్ సైనికుల్ని 24 గంటల తర్వాతే అప్పగించింది. మరో నలుగురు అధికారులు సహా 10 మంది సైనికుల్ని తమ దగ్గర నిర్బంధించింది. మూడు రోజులపాటు చర్చలు మన ఆర్మీ సిబ్బంది పదుగురిని క్షేమంగా వెనక్కి తెచ్చుకోవడానికి భారత్ ఎంతో శ్రమపడాల్సి వచ్చింది. మూడు రోజులు చైనా అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఆ పది మంది సైనికులు తమ వద్దే ఉన్నారని చెప్పిన చైనా వారిని అప్పగించడానికి ఆలస్యం చేస్తూ వచ్చింది. చర్చల సందర్భంగా సైనికుల్ని అప్పగించడానికి ఏదో వంక చెప్పేది. చివరికి ఎలాగో జూన్ 18న విడుదల చేసింది. చైనా ఎందుకిలా చేసింది? మూడు రోజుల పాటు తమ దగ్గరే చైనా ఎందుకు వారిని ఉంచింది ? విడుదల చేయడంలో ఎందుకీ జాప్యం ? అన్న ప్రశ్నలకు మన ఆర్మీ సైనికులు అదంతా చైనా మైండ్ గేమ్‌లో భాగం అని అంటున్నారు. భారత్ అలా నిరీక్షిస్తే మానసికంగా బలహీనంగా మారుతుందని తద్వారా చర్చల్లో పైచేయి సాధించవచ్చునని చైనా కుయుక్తులు పన్నిందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ సరిహద్దుల్లో నివురుగప్పిన నిప్పులాగే పరిస్థితులు ఉన్నాయి. పాంగాంగ్ లేక్ ద్వారా చైనా ఏ క్షణమైనా మనపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. చైనా ఏ రకమైన కుట్ర పన్నినా ఎదుర్కోవడానికి భారత్ బలగాలు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్టుగా ఆర్మీ వర్గాలు వివరించాయి. -
చైనా బలగాలు వెనుదిరగాలి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా భారత్, చైనాల మధ్య రెండో విడత లెఫ్ట్‌నెంట్ జనరల్ స్థాయి చర్చలు సోమవారం జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లోని చూశుల్ సెక్టార్లో చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఉదయం 11.30 గంటలకు ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న జరిగిన తొలి విడత చర్చల్లో కుదిరిన ఒప్పందాల అమలు సహా ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెరిగేందుకు చేపట్టాల్సిన పలు చర్యలపై ఈ భేటీలో చర్చించారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. అలాగే, అన్ని ప్రాంతాల నుంచి మే 4 నాటి యథాతథ స్థితికి చైనా బలగాలు వెనుదిరగాలని భారత్ డిమాండ్ చేసిందని వెల్లడించాయి. ఏ రోజు నాటికి వెనక్కు వెళ్తారో వివరిస్తూ.. టైమ్‌లైన్ కూడా చెప్పాలని భారత్ కోరినట్లు తెలిపాయి. అయితే, ఆ భేటీలో గల్వాన్ ఘర్షణల అంశం చర్చించారా? లేదా అనే విషయంపై స్పష్టత లేదన్నాయి. ఈ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి 14 కారŠప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ నేతృత్వం వహించారు. దళాల ఉపసంహరణకు విధి విధానాలను రూపొందించే దిశగా చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని జూన్ 6న ఇదే ప్రదేశంలో జరిగిన చర్చల్లో ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే, ఆ తరువాత జూన్ 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల మధ్య తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు జరిగి, భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఆ ఘర్షణల్లో కల్నల్ సహా 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తమ సైనికుల మరణాలపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ 35 మంది చైనా సైనికులు చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. తాజాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆ ఘర్షణల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఆర్మీ చీఫ్ సమీక్ష మరోవైపు, చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న క్షేత్ర స్థాయి పరిస్థితులపై సోమవారం జరిగిన సదస్సులో ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సైన్యం కదలికలు, భారత సైన్య సన్నద్ధతపై చర్చించారు. రెండు రోజుల పాటు ఈ సదస్స కొనసాగనుంది. ఈ సందర్భంగా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సరిహద్దుల వెంట భారత సైన్యం సన్నద్ధతపై సమగ్ర సమీక్ష జరిపారు. ఆ సమాచారం తెలియదు: చైనా గల్వాన్ లోయలో చోటు చేసుకున్న జూన్ 15 నాటి ఘర్షణల్లో భారత సైనికుల చేతిలో 40 మంది చైనా జవాన్లు చనిపోయారని కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు చైనా నిరాకరించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ సోమవారం మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. భారత్‌లో సరిహద్దు వివాద పరిష్కారానికి దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని మరోసారి చెప్పారు. -
ఆయుధాలు వాడొచ్చు: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: చైనాతో ఉన్న దాదాపు 3500 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైనా సైనికులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చింది. అందులో భాగంగా, అరుదైన, తప్పనిసరి సందర్భాల్లో ఆయుధాలను సైతం ఉపయోగించే వెసులుబాటును కల్పించింది. సీడీఎస్, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కలిసిన తూర్పు లద్దాఖ్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా.. చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు తప్పని సరైతే ఆయుధాలను కూడా ఉపయోగించే నిర్ణయం క్షేత్రస్థాయి కమాండర్లు తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని త్వరలో చైనాకు అధికారికంగా తెలియజేయనున్నట్లు చెప్పాయి. సరిహద్దుల్లో సైనికుల మధ్య నెలకొనే ఘర్షణల్లో ఆయుధాలను ఉపయోగించకూడదని పేర్కొంటూ భారత్, చైనాల మధ్య 1996, 2005ల్లో కుదిరిన ఒప్పందాలను పక్కనబెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి. ‘ఇకనుంచి మన తీరు మారనుంది. పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు క్షేత్రస్థాయి కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను రాజ్‌నాథ్ ఈ భేటీలో లోతుగా సమీక్షించారని వెల్లడించాయి. ఈ భేటీలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలను నిశిత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా త్రివిధ దళాలకు రక్షణ మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. సరిహద్దుల్లో కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. ఆయుధాలకు అదనంగా రూ. 500 కోట్లు ఆయుధ వ్యవస్థ, మందుగుండు తదితర యుద్ధ సన్నద్ధతకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం రూ.500 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది. సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదించి, అత్యవసర ప్రాతిపదికన ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అవసరమైన ఆయుధ వ్యవస్థ, ఇతర సామగ్రి జాబితాను రూపొందించే పనిని ఇప్పటికే త్రివిధ దళాలు ప్రారంభించాయని సమాచారం. ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ సమీప సైనిక కేంద్రాల్లోకి భారత్ భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను, వాహనాలను ఇతర సామగ్రిని తరలించింది. లేహ్, శ్రీనగర్ సహా పలు కీలక వైమానిక కేంద్రాలకు సుఖోయి 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను, అపాచీ చాపర్లను ఎయిర్ ఫోర్స్ తరలించింది. -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
సరి‘హద్దు’ దాటకండి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు అటు(చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో మార్పులు చేసే దిశగా ఏకపక్ష చర్యలకు తెగబడవద్దని తేల్చిచెప్పింది. అలాగే, గాల్వన్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టింది. అలాంటి అహేతుక, సమర్థనీయం కాని వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికింది. తమదికాని భూభాగాన్ని తమదే అని.. ఎక్కువ చేసి చెప్పుకునే తీరును మార్చుకోవాలని పేర్కొంద జూన్ 6న ఇరుదేశాల ఉన్నతస్థాయి మిలటరీ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందానికి ఈ వ్యాఖ్య విరుద్ధంగా ఉందని పేర్కొంది. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. సోమవారం రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల సందర్భంగా భారతీయ సైనికులెవరూ గల్లంతు కాలేదని స్పష్టం చేశారు. ‘సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత్ స్పష్టంగా ఉంది. తమ కార్యకలాపాలన్నీ ఎల్ఏసీకి ఇటు(భారత్) వైపే, భారత భూభాగంలోనే కొనసాగిస్తోంది. చైనా కూడా అదే తీరున వారి భూభాగంలోనే తమ కార్యకలాపాలు జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్చలే మార్గమని భారత్ విశ్వసిస్తుంది.అదే సమయంలో, దేశ సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో రాజీ లేదు’ అన్నారు. జూన్ 23న జరిగే రిక్(రష్యా–ఇండియా–చైనా) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాల్గొంటారన్నారు. కొనసాగుతున్న మేజర్ జనరల్ స్థాయి చర్చలు సరిహద్దు ఉద్రిక్తతలను తొలగించుకునే దిశగా భారత్, చైనాల మధ్య జరుగుతున్న మేజర్ జనరల్ స్థాయి చర్చలు గురువారం కొనసాగాయి. అయితే, మంగళ, బుధ వారాల్లో ఎలాంటి ఏకాభిప్రాయానికి రాకుండానే చర్చలు నిలిచిపోయాయి. కాగా, గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా సైనికులతో తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల అనంతరం కొందరు భారత సైనికులు గల్లంతయ్యారని, సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని వచ్చిన వార్తలను ఇండియన్ ఆర్మీ తోసిపుచ్చింది. -
అదే చైనా వ్యూహం: జిజి ద్వివేదీ
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ఏ నిర్మాణమూ చేపట్టకుండా చూడటం, లద్దాఖ్‌ను సొంతం చేసుకోవటమే చైనా లక్ష్యమని భారత సైన్యపు మాజీ మేజర్ జనరల్ జిజి ద్వివేదీ వ్యాఖ్యానించారు. చైనా ఓ వైపు చర్చలు జరుపుతూనే మరో వైప కొంచెం కొంచెంగా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని అన్నారు. బుధవారం జిజి ద్వివేదీ మీడియాతో మాట్లాడుతూ.. చైనా, భారత్‌తో గొడవ పెట్టుకోవటానికి గల ఉద్దేశ్యాన్ని వివరించారు. చైనా నిర్లక్ష్యం కారణంగానే ప్రపంచ దేశాలకు కరోనా విస్తరించిందన్న అమెరికా వాదనలకు భారత్ వంతపాడటమే ఇందుకు కారణమన్నారు. సైనిక బలంతో రాజకీయ లక్ష్యాలను సాధించటమే కాకుండా భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటమే చైనా వ్యూహంగా పేర్కొన్నారు. ( చైనా వాదనలపై అనురాగ్ శ్రీవాస్తవ ఫైర్!) ఆయన కమాండర్‌గా పనిచేసిన 1992నాటి కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుంటూ..‘‘ అప్పుడు ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. మేము.. మాలాగే వాళ్లు కూడా హాట్ స్ప్రింగ్స్ వరకు పాట్రోలింగ్ చేసుకునే వాళ్లం. లద్దాఖ్‌లోని భారత సైన్యం గాల్వన్ లోయను పర్యవేక్షించేది. వారికప్పుడు ఏలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఆ సమయంలో చైనా సైన్యం అక్కడి రాళ్లపై ‘‘ చుంగ్ కో( ఇది చైనా)’’ అని రాశారు. వెంటనే భారత సైనం వాటిని చెరిపేసి ‘ఇది భారత్’ అని రాసింది’’ అని చెప్పుకొచ్చారు. -
అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం
న్యూఢిల్లీ: చైనా, భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలోని ఒక చిన్న పర్వత పాదంపై నిఘా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయడమే తాజా ఘర్షణలకు కారణమని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్, చైనాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత భూభాగంలో గాల్వన్ నది దక్షిణ తీరంలో చైనా ఆ పోస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని కల్నల్ సంతోష్ నాయకత్వంలోని భారత దళాలు అడ్డుకున్నాయి. ఆ పోస్ట్ ను తొలగించేందుకు సోమవారం సాయంత్రం ప్రయత్నించాయి. ఆ కేంద్రంలో ఉన్న కొద్దిమంది చైనా సైనికులు భారత సైనికులను అడ్డుకున్నారు. కానీ, కాసేపటికి వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న చైనా భూభాగం వైపు వెళ్లిపోయారు. ఈలోపు, భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని చైనా ఏర్పాటు చేసిన పోస్ట్‌ను కూల్చేయడం ప్రారంభించాయి. కాసేపటికి, మరిన్ని బలగాలతో చైనా సైనికులు మళ్లీ వచ్చారు. రాళ్లు, మేకులు కుచ్చిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు పరస్పర దాడులు కొనసాగాయి. దాడుల సమయంలో రెండు దేశాలకు చెందిన కొందరు సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరున్న గాల్వన్ నదిలో పడిపోయారు. చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ చనిపోయారు. కొందరు భారత సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని, అయితే, కాసేపటికి వారిని వదిలివేసిందని సమాచారం. అయితే, ఇంకా పది మంది భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు. -
రేపు అఖిలపక్షం భేటీ
చైనా ఆర్మీ దాడిలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు మరణించడం, తదనంతర పరిణామాలపై సమాచారం పంచుకునేందుకు ప్రధాని శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆ భేటీలో విపక్ష, మిత్రపక్ష నేతలకు వివరించనున్నారు. ‘చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని చర్చించేందుకు జూన్ 19 సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమవనున్నారు’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి దేశమంతా ప్రభుత్వం వెనుక ఉందని, ఘర్షణలకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు. -
సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!
న్యూఢిల్లీ: లదాఖ్ ప్రతిష్టంభన చర్చల ద్వారా తొలగిపోతుందని భారత్ చెప్తున్న క్రమంలో.. చైనా కవ్వింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషర్ ఆర్మీకి చెందిన వేలాది పారా ట్రూపర్లు ఆ దేశ వాయువ్య సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కవాతు నిర్వహించినట్టు గ్లోబల్ టైమ్స్ మీడియా తన కథనంలో వెల్లడించింది. వాయువ్య సరిహద్దుల్లో చైనా భారీ స్థాయిలో సైనిక, రక్షణ సామాగ్రిని తరలిస్తోందని, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకే ట్రూపర్లతో డ్రిల్ జరిగిందని తెలిపింది. దానికి సంబంధించి వీడియోను సైతం విడుదల చేసింది. హుబెయి నుంచి ఆ ప్రాంతానికి కొద్దిగంటల్లోనే బలగాలు చేరుకున్నాయని, అవసరమైనప్పుడు వేగంగా బలగాలను చేరవేయగలమని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన చర్చల ద్వారా పరిష్కారమవుతుందని భారత్ చెప్పిన మరునాడే ఈ వార్త వెలువడటం గమనార్హం. అయితే, భారత్‌ను మానసికంగా దెబ్బకొట్టేందుకే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: చైనాతో శాంతియుత పరిష్కారం) శత్రుదేశ బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తేలా చేయడం.. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా అధికార మీడియాలో కథనాలు ప్రచురించడం ఎత్తుగడలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచం దృష్టిని మరల్చేందుకు డ్రాగన్ ఇలాంటి చర్యలకు పూనుకుందని మరికొంత మంది వాదిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలు, మ్యాపులు సోషల్ మీడియాలో విడుదల చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారత్, చైనా సైనికాధికారుల మధ్య శనివారం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
చైనాతో శాంతియుత పరిష్కారం
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌లో సరిహద్దుల వద్ద తలెత్తిన విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా అంగీకారానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. రెండు దేశాల మధ్య అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలకు లోబడి చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఏకాభిప్రాయం కుదిరిందని విదేశాంగ శాఖ తెలిపింది. లదాఖ్ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆదివారం రెండు దేశాల సైనికాధికారులు జరిపిన ఉన్నత స్థాయి చర్చలపై ఈ మేరకు స్పందించింది. ‘ఈ భేటీ స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో జరిగింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తవుతున్నందున విభేదాలకు త్వరగా పరిష్కారం కనుగొనాలి. ఇండో–చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్య పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలు మరింత అభివృద్ది చెందేందుకు దోహదపడతాయి’అని విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు, సరిహద్దుల్లో శాంతి, సామరస్య పూర్వక పరిస్థితులను నెలకొల్పేందుకు సైనిక, దౌత్యపరమైన సంబంధాలను రెండు దేశాలు కొనసాగిస్తాయని తెలిపింది. శనివారం నాటి భేటీతో కచ్చితమైన ఫలితాలు వస్తాయని తాము అనుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఉన్నత స్థాయి సైనిక సంభాషణలు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం చేస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనవని పేర్కొన్నాయి. -
సానుకూలంగా భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో శనివారం రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు సానుకూలంగా ముగిశాయి. లదాఖ్‌లోని గాల్వాన్ లోయ, పాంగోంగ్ త్సో, గోగ్రా ప్రాంతాల్లో సరిహద్దులకు సమీపంలో మునుపటి పరిస్థితులను నెలకొల్పాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ కోరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయన్నారు. మున్ముందు కూడా సంప్రదింపులు జరుపుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను సైనిక, దౌత్యపరమైన మార్గాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే, భారత్ గానీ, చైనా గానీ ఈ చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చైనా భారీగా సైన్యాన్ని తరలించడం, సైనిక నిర్మాణాలను చేపట్టడంతో నెల రోజులుగా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో చైనా భూభాగంలోని చెషుల్ సెక్టార్ మాల్దోలో జరిగిన ఈ చర్చలకు భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. ఉదయం 8.30 గంటలకే సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు గంటలు ఆలస్యంగా మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజ ర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి: చైనా
బీజింగ్: చైనా- భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని.. ఇరు దేశాలు చర్చలకే మొగ్గుచూపే అవకాశం ఉందని చైనా సోమవారం వెల్లడించింది. పరస్పర సంప్రదింపులతో సామరస్యపూర్వకంగా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ.. ‘‘మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే సరిహద్దు వివాదాల్లో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.(సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన) కాగా చైనాతో శాంతియుత చర్చల ద్వారానే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుంటామన్న భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించిన నేపథ్యంలో జావో ఈ పైవిధంగా బదులిచ్చారు. ఇక గత కొన్నిరోజులుగా తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తమ తమ స్థావరాలకు భారత్- చైనాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో పూర్వపు పరిస్థితులు నెలకొనే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరు దేశాలు స్పష్టం చేసిన క్రమంలో జావో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.(కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు?) -
సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివాదాస్పద ప్రాంతానికి చేరువలో ఉన్న తమ తమ స్థావరాలకు రెండు దేశాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని బేస్‌ల వద్దకు చైనా శతఘ్నులను, పదాతిదళ పోరాట వాహనాలు, భారీ సైనిక సామగ్రిని చేరుస్తోంది. భారత్ సైతం శతఘ్నులు, బలగాలను అక్కడికి పంపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. పాంగోంగ్ త్సో, గాల్వాన్ లోయ తదితర ప్రాంతాల్లో మునుపటి స్థితిని నెలకొల్పే వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. వైమానిక దళాలు వివాదాస్పద ప్రాంతంలో కదలికలపై కన్నేసి ఉంచాయి. మే మొదటి వారంలో చైనా 2,500 బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన మొదలైంది. తరచూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ చైనా తన బలగాల సంఖ్యను పెంచింది. కాగా, తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత్ సైనికులకు గాయాలయ్యాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సైన్యం స్పందించింది. ‘ఆ వీడియోకు ఎలాంటి ప్రామాణికత లేదు. అక్కడ ఎలాంటి హింస జరగలేదు’అని సైన్యం ప్రకటించింది. -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమం తెరపైకొచ్చింది. 3ఇడియట్స్ సినిమాకు ప్రేరణగా నిలిచిన విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో ఈ పరిణామానికి ఊపిరిపోసింది. వాంగ్చుక్కు పలువురు నెటిజన్లు, సెలిబ్రిటీలు మద్దతు పలికారు. వీరిలో అర్షద్ వార్సి, మిలింద్ సోమన్, రణ్వీర్ షోరే తదితరులున్నారు. చైనా వస్తువుల వాడకం మానేయాలని వీరు కోరుతున్నారు. ‘చైనా వస్తువులను వాడటం నేను ఆపేస్తున్నా. మీరూ ఆపండి’అని అర్షద్ వార్సీ కోరారు. చైనా వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌ను వాడబోనంటూ యాక్టర్, మోడల్ మిలింద్ ఉషా సోమన్ ట్వీట్ చేశారు. నటుడు రణ్వీర్ షోరే ఆమెకు మద్దతు ప్రకటించారు. భారత్ తయారీ వస్తువులనే వాడాలంటూ టీవీ నటి కామ్య పంజాబీ కోరారు. చైనా ఉత్పత్తులతో వాణిజ్య సంబంధాలున్న వారంతా ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలన్నారు. రచయిత రాజ్ శాండిల్య కూడా ‘బాయ్‌కాట్ చైనా’ ఆన్లైన్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు ఇచ్చిన విధంగా ప్రపంచం చైనాను ఏకాకిగా చేయాలని ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ కోరారు. -
ట్రంప్ ప్రకటనను ఖండించిన కేంద్రప్రభుత్వ వర్గాలు
-
‘థర్డ్ పార్టీ’ ప్రమేయం వద్దు
బీజింగ్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భంగపాటు ఎదురైంది. భారత్–చైనా మధ్య ప్రస్తుతం తలెత్తిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను చైనా తిరస్కరించింది. భారత్–చైనా నడుమ నెలకొన్న భేదాభిప్రాయాలను పరిష్కరించుకునేందుకు ‘థర్డ్ పార్టీ’ ప్రమేయం అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. ట్రంప్ ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జవో లిజియాన్ తొలిసారి స్పందించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఉన్న వివాదాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్–చైనా ఎంతమాత్రం కోరుకోవడం లేదని తేల్చి చెప్పారు. పరస్పరం చర్చించుకోవడానికి, అభిప్రాయ భేదాలను తొలగించుకోవడానికి రెండు దేశాల మధ్య సరిహద్దు సంబంధిత అధికార యంత్రాంగం, కమ్యూనికేషన్ చానళ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోగల సామర్థ్యం రెండు దేశాలకు ఉందన్నారు. భారత్–చైనా మధ్య మధ్యవర్తిగా పనిచేస్తానంటూ గురువారం చెప్పిన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కూడా ఆదే విషయం పునరుద్ఘాటించారు. మిలటరీ ఉద్రిక్తతలపై ట్రంప్–మోదీ చర్చించుకోలేదు తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఉద్రిక్తతలపై తాను, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే మాట్లాడుకున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు ఖండించాయి. ఈ విషయంలో ట్రంప్–మోదీ ఇటీవల చర్చించుకోలేదని స్పష్టం చేశాయి. ఏప్రిల్ 4న ట్రంప్–మోదీ మధ్య హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల విషయంలో మాత్రమే సంభాషణ జరిగిందని, ఆ తర్వాత ఇరువురు నేతలు ఎప్పుడూ చర్చించుకోలేదని వెల్లడించాయి. తాను మోదీతో మాట్లాడానని, భారత్–చైనా మధ్య ఉద్రిక్తతల విషయంలో ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనం’ ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ ద్వారా ఈ ఏడాది చైనాతో సరిహద్దు వాణిజ్యంలో పాల్గొనకూడదని స్థానికులు నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి సైతం తెలియజేశారు. కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో అడుగుపెట్టడం ప్రమాదకరమని గిరిజన వ్యాపారుల సంఘం నాయకుడు, భారత్–చైనా వ్యాపార్ సంఘటన్ ప్రతినిధి విశాల్ గార్బియాల్ చెప్పారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ప్రతియేటా జూన్ నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది. -
భారత్‌పై పాక్ వివాదాస్పద వ్యాఖ్య
ఇస్లామాబాద్: భారత్–చైనా సరిహద్దుల మధ్య వివాదాలు ముదురుతున్న వేళ పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న దురహంకారపూరిత విస్తరణ విధానాల వల్ల పొరుగు దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ విషయంలో భారత్ తనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలకు ముప్పుగా మారిందని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. పౌరసత్వ చట్టం వల్ల బంగ్లాదేశ్ కు, నేపాల్, చైనాలతో సరిహద్దు వివాదాలు, ఫ్లాగ్ ఆపరేషన్‌తో పాక్‌కు భారత్ ముప్పుగా మారిందని అన్నారు. పాకిస్తాన్‌కు చైనా మిత్రదేశం కావడంతో పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. -
నేపాల్ కన్నెర్ర
మన దేశానికి సంబంధించినంతవరకూ ఇది సరిహద్దు వివాదాల సీజన్‌లా కనబడుతోంది. ఈనెల 5న సిక్కింలోవున్న నుకా లా ప్రాంతంలో భారత–చైనా సరిహద్దుల వద్ద గస్తీలో వున్న మన సైని కులతో చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అందులో భారత జవాన్లు నలుగురు, చైనా సైనికులు ఏడుగురు గాయపడ్డారు. చివరకు ఇరుపక్షాల సైనికాధికారులు చర్చించుకోవడంతో వివాదం సమసిపోయింది. తాజాగా ఇప్పుడు నేపాల్ పేచీ మొదలుపెట్టింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ అది కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. అంతేకాదు... ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్ కంటే, ఇటలీ వైరస్ కంటే ఇండియా వైరస్ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడారు. ఈ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారంటూ మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవానె మొన్న శుక్రవారం చేసిన ప్రకటన నేపాల్‌కు తగ లవలసిన చోటే తగిలింది. త మను పరోక్షంగా చైనా కీలుబొమ్మగా అభివర్ణించడం అది తట్టు కోలేకపోయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా మన దేశాన్ని ఈ స్థాయిలో విమర్శించ డానికి పూనుకొంది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నా మని నేపాల్ విదేశాంగమంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి అనడం, ఆ తర్వాత లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను వెనక్కివ్వాలంటూ పార్లమెంటులో అధికార పక్షం తీర్మానం ప్రవేశ పెట్టడం గమనిస్తే అది లోగడ కంటే దూకుడు పెంచిందని సులభంగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఈనెల 11న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ మీదుగా లిపులేఖ్ వరకూ మానస సరోవర్ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది. అందుకే నేపాల్ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారని జనరల్ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్‌కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే. భారత్–నేపాల్ సరిహద్దు వివాదానికి 200 ఏళ్ల చరిత్ర వుంది. రెండు దేశాల మధ్యా 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్ పాలకులు భారత్ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో అయోమయం ఏర్పడింది. ఇది చాలదన్నట్టు రెండు దేశాల వద్దా అప్పటి మ్యాప్‌లు కూడా లేవు. మన పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమాబల్ జవాన్లు అక్కడి సరిహద్దుల్ని పహారా కాస్తారు. నేపాల్ వైపు నుంచి మొదటినుంచీ అలాంటి పహారా లేదు. దీన్ని ఉపయోగించుకుని భారత్ తమ 60,000 హెక్టార్ల భూమిని ఆక్రమించిందన్నది నేపాల్ ఆరోపణ. ఈ విషయంలో నేపాల్ జాతీయవాదులు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే రెండు దేశాల ప్రభుత్వాల మధ్యా ఎప్పుడూ సత్సంబంధాలే వుండేవి గనుక ఇరు పక్షాలూ ఈ సమస్యపై బాహాబాహీకి దిగలేదు. అయితే సరిహద్దుల్ని ఖరారు చేయడానికి ఉమ్మడిగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అదింకా ఎటూ తేలకుండానే వుంది. నేపాల్‌లో భారత్‌పై అంతకుముందునుంచీ వున్న అసంతృప్తి 2006లో అక్కడ హిందూ రాజరిక పాలన అంతమైనప్పటినుంచీ బలపడుతూ వచ్చింది. తమకు భారత్ సమాన స్థాయి ఇచ్చి గౌరవించడం లేదని నేపాల్ జాతీయవాదుల అభిప్రాయం. వాటిని పోగొట్టడానికి మనవైపుగా ఎప్పుడూ సరైన ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. మనకు అత్యంత సన్నిహిత దేశంగా, మన కనుసన్నల్లో నడిచే దేశంగా వుండే నేపాల్ క్రమేపీ దూరమవుతున్న సంగతిని మన పాలకులు సకాలంలో పట్టించుకోలేదు. 1997లో అప్పటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆ దేశంలో పర్యటించాక 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకూ మన ప్రధానులెవరూ ఆ దేశం వెళ్లలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1987లో ఆ దేశంతో ఒక ఒప్పందం కుదిరింది. ఇండో–నేపాల్ కమిషన్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రెండేళ్లకూ అది సమావేశమవుతూ పరస్పర ప్రయోజనాలకు తోడ్పడేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒప్పందం సారాంశం. కానీ 2014 వరకూ మన దేశం దాని జోలికే పోలేదు. నరేంద్ర మోదీ వచ్చాకైనా ఆ దేశంతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు. రెండేళ్లక్రితం శర్మ ఓలి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన కోసం మన దేశాన్నే ఎంచుకున్నారు. వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అది చిన్న దేశమే కావొచ్చు...దానితో కుదుర్చుకోదగ్గ భారీ వాణిజ్య ఒప్పందాలు వుండకపోవచ్చు. కానీ దానికీ, మనకీ పొరుగునున్న చైనాతో మనకు అనేకానేక సమస్యలున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేపాల్ విషయంలో మన దేశం చొరవ ప్రదర్శించివుంటే బాగుండేది. తాజా వివాదంలో నేపాల్ వాదన సరికాదని మన దేశం ఇప్పటికే జవాబిచ్చింది. ఈ వివాదం ముదర కుండా చూడటం, సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించడం అన్నివిధాలా శ్రేయస్కరం. -
ఫారెస్ట్, రెవెన్యూ ‘బార్డర్ వార్’
సాక్షి, హైదరాబాద్: అటవీ, రెవెన్యూ శాఖల మధ్య హద్దుల వివాదాలు ఎంతకీ తెగడం లేదు. ఏవి అటవీ భూములు, ఏవి రెవెన్యూ భూములు అన్న దానిపై స్పష్టత సాధించే ప్రయత్నాలు కొలిక్కి రావడంలేదు. ఈ రెండు శాఖల మధ్య భూవివాదాలకు సంబంధించి రికార్డుల రూపంలో స్పష్టత సాధించకపోవడం సమస్యగా మారింది. వివాదాల పరిష్కారానికి రెవెన్యూ శాఖ తగిన చొరవ తీసుకోవడం లేదని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ పంచాయతీకి తాము తెరదించాలని చూస్తున్నా రెవెన్యూశాఖ పెద్దగా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని అటవీశాఖ అధికారులు మండిపడుతున్నారు. గ్రామస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు భూములకు సంబంధించి అటవీశాఖ వద్ద పక్కా రికార్డులున్నా, వివాదాలుగా పేర్కొంటున్న భూముల్లో సమస్య పరిష్కారానికి రెవెన్యూశాఖ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.అయితే ఏ శాఖకు ఆ శాఖ వేర్వేరుగా రికార్డులను నిర్వహించడంతో పాటు, వాటి నమోదు కూడా సరిగా చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పూరిస్థాయిలో అటవీ భూముల సర్వే చేయకపోవడం, తమ భూమి అంటే తమ భూమి అని రెండుశాఖలు రికార్డులకు ఎక్కించడం వల్ల వివాదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. మొత్తం 60 లక్షల ఎకరాల్లో... తెలంగాణలో మొత్తం 60 లక్షల 646 ఎకరాల మేర అటవీశాఖ భూమి ఉన్నట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 49.80 లక్షల ఎకరాలు ఎలాంటి వివాదాలు లేకుండా, రికార్డుల పరంగా క్లియర్‌గా ఉన్నాయి. ఇటీవల వరకు సిద్ధం చేసిన లెక్కల ప్రకారం ప్రధానంగా పదిన్నర లక్షల ఎకరాల్లోని భూముల పరిధిలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 3.44 లక్షల ఎకరాలుండగా అందులో అత్యధికంగా 2.89 లక్షల ఎకరాలు ఈ వివాదాల్లో ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 38 వేల ఎకరాలుండగా, వాటిలో 26 వేల ఎకరాల్లో.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 5.29 లక్షల ఎకరాలుండగా వివాదాల్లో 1.86 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 4.33 లక్షల ఎకరాలకుగాను 1.50 లక్షల ఎకరాల్లో వివాదాలు, వికారాబాద్ జిల్లాలో 1.08 లక్షల ఎకరాలకు గాను 42వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 3.16 లక్షల ఎకరాలకు గాను 70 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 1.42 లక్షల ఎకరాలుండగా వాటిలో 35 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 52 వేల ఎకరాలకు గాను 13 వేల ఎకరాలు భూ వివాదాల్లో ఉన్నట్టుగా ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే అటవీ శాఖకు చెందిన ఎలాంటి వివాదాలకు తావులేని భూమిగా గుర్తించిన 49.80 లక్షల ఎకరాలకు సంబంధించి గత నెల చివరి వరకు ఇంటిగ్రేటెడ్Š ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్–నోషనల్ ఖాటా మార్కింగ్)లో 28.50 లక్షల ఎకరాలు రికార్డ్ అయ్యాయి. ఇంకా 21.30 లక్షల ఎకరాలు నోషనల్ ఖాటా మార్కింగ్ చేపట్టాల్సి ఉంది. -
అటూఇటు.. మన ఓటు!
సాక్షి, ఆసిఫాబాద్: ఆ గ్రామాల్లో అన్ని డబుల్ ధమాకే. రెండు ప్రభుత్వాల రేషన్ కార్డులు, రెండు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటరు ఐడీలు, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా అన్నీ డబులే. ఏళ్లుగా సరిహద్దు వివాదాలతో నలుగుతున్న కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న 12 గ్రామాల పరిస్థితి ఇది. 23 ఏళ్లుగా ఆ గ్రామాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ.. మహారాష్ట్ర మధ్య భూ సరిహద్దు వివాద గ్రామాలుగా మారి అన్ని డబుల్‌గా మారాయి. అటు మహారాష్ట్ర ఆ గ్రామాలను మావి అంటే.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అవి మా భూభాగంలో ఉన్న గ్రామాలని వాదిస్తుండటంతో ఏళ్లుగా ఈ పంచాయితీ తెగడంలేదు. తేలని సరిహద్దు సమస్య దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సమయంలో ఈ 12 గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ భూభాగం ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర భూభాగంలోనే వీరంతా కొనసాగుతూ వచ్చారు. మొదటిసారిగా 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 12 గ్రామాల పరి«ధిలో పరందోళి, అంతపూర్లను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అయితే దీనిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో 1988లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేకే.నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నప్పటికీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవనే ఈ కమిటీ తేల్చింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో ఇక్కడ మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిపింది. మొదటిసారిగా పరందోళి, అంతాపూర్లో ఇద్దరు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. దీంతో తెలంగాణ సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చేసింది. దీంతో చంద్రాపూర్ కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఈ గ్రామాలపై పోటాపోటీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉండగా, ఇతర అన్ని సంక్షేమ పథకాలను ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అయితే.. రెండు ప్రభుత్వాల పర్యవేక్షణలోనూ కనీస వసతులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల వివరాలివీ.. - ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న పరందోళి గ్రామ పంచాయతీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్‌లొద్ది, లెండిజాల, పరందోళి తండా, మహారాజ్‌గూడ ఉన్నాయి. ఇందులో ముకదంగూడ గ్రామ సగ భూభాగం మహారాష్ట్ర భూభాగంలో వివాదంలో లేకుండా ఉంది. మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ మొదట అప్పటి తొలి తెలుగు సర్పంచ్. అనంతరం మళ్లీ ఆయన తెలుగు సర్పంచ్‌గా ఎన్నిక కాగా, మరల ఆయనే మూడోసారి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. - రెండో గ్రామపంచాయతీ అంతాపూర్ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్‌ను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అంతాపూర్ సర్పంచ్‌గా అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కోటాలో పరమేశ్వర్ ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు మాత్రం రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ రెండు ప్రభుత్వాల్లోనూ ఎంపిక అవుతున్నారు. 2,600 మంది ఓటర్లు ఈ రెండు గ్రామపంచాయతీల పరిధిలో 4 వేల జనాభా వరకు ఉంది. ఓటర్లు 2,600 వరకు ఉన్నారు. ఒక్క పరందోళిలోనే రెండు వేల జనాభా ఉంది. ఇక్కడ అధికంగా 80 శాతం (మహర్, మాంగ్) ఎస్సీలు ఉన్నారు. మిగతా ఎస్టీలు (లంబాడ), ఆదివాసీలు, బీసీలు ఉన్నారు. రెండు చోట్లా ఓటేస్తాం మేం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేస్తాం. అయితే మాకు అన్ని డబుల్ ఉన్నట్లే కానీ మా పరిస్థితులు మాత్రం ఏమీ మారడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కానీ అందరూ అర్హులు కావడం లేదు. –కడ్సే, తులసీరాం, పరందోళి -
27న మోదీ, జిన్‌పింగ్ భేటీ
బీజింగ్: చైనాతో సుహృద్భావ సంబంధాల దిశగా మరో అడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 27, 28 తేదీల్లో వారిరువురు సమావేశం కానున్నారు. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్ నగరంలో ఈ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారం, అంతర్జాతీయ సమస్యలు.. తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రెండు దేశాలకు దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు వీలు కల్పించే దిశగా చర్చలు కొనసాగనున్నాయి. అయితే, ఈ సందర్భంగా ఎలాంటి ప్రతినిధుల స్థాయి చర్చలుండబోవని, ఎలాంటి ఒప్పందాలు కుదరబోవని, కేవలం ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డోక్లాం సహా పలు సరిహద్దు వివాదాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, ఉగ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మోకాలడ్డడం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు మోదీ చైనా పర్యటనకు వస్తున్నారని భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, వాంగ్ యి ఆదివారం సంయుక్తంగా ప్రకటించారు. ‘భారత్, చైనాల మధ్య విబేధాల కన్నా ప్రయోజనాలే ముఖ్యమైనవి. పరస్పర ప్రయోజనపూరిత అభివృద్ధికి రెండు దేశాల మధ్య సహకారం అవసరం’ అని వాంగ్ యి పేర్కొన్నారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య భేటీ ఏర్పాట్లపై వాంగ్ యితో చర్చించినట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం సుష్మ చైనాలో పర్యటిస్తున్నారు. జూన్ 9, 10 తేదీల్లోనూ ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్తారు. మానస సరోవర యాత్రకు చైనా ఓకే వాంగ్ యితో భేటీ అనంతరం సుష్మ మాట్లాడుతూ సిక్కింలోని నాథూ లా కనుమ మార్గంలో కైలాశ్ మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు. డోక్లాం వివాదం తర్వాత నాథూ లా మార్గం గుండా మానస సరోవర యాత్రను నిలిపివేయడం తెలిసిందే. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సుష్మ కరచాలనం -
రక్షణకు 11 లక్షల కోట్లు
బీజింగ్: భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు– దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. బహుళ పార్టీ వ్యవస్థతో అర్థం లేని పోటీ బహుళ పార్టీ ప్రజాస్వామ్యంతో పార్టీల మధ్య ‘అనారోగ్యకర పోటీ’ నెలకొంటుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. చైనా అనుసరిస్తున్న ఏక పార్టీ వ్యవస్థే మంచిదన్నారు. చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సదస్సులో జిన్‌పింగ్ మాట్లాడారు. ‘చైనా వ్యవస్థ కొత్తది. ఎందుకంటే ఇది అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రమేయం లేని ప్రజలను ఉమ్మడి లక్ష్యం కోసం ఏకం చేస్తుంది. అధికార మార్పి డి, పార్టీల మధ్య అనారోగ్యకర పోటీతో వచ్చే నష్టాలు లేకుండా చేస్తుంది’అని అన్నారు. -
అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. యుద్ధానికి దిగితే ఇరు దేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి గ్యారీ రోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగుదేశం చైనా దురాక్రమణలను ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకపోయింది. చైనా పదేపదే సరిహద్దు విషయాల్లో కయ్యానికి కాలుదువ్వడాన్ని ఆమెరికా సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిక్కింలోని డోక్లామ్ లో చైనా రోడ్డు నిర్మించ తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా, సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని భావించిన పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే యత్నాల్లో బిజీగా ఉందని ఓ టాప్ కమాండర్ చెప్పారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని గ్యారీ రోస్ చెప్పారు. బీజింగ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. ఆ పర్యటనలో భాగంగా డోక్లామ్ వివాదంపై చైనా ప్రతినిధులతో దోవల్ చర్చించనున్నట్లు సమాచారం. నేరుగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించి, సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేని పక్షంలో ఇరుదేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. -
సరిహద్దుపై అర్థవంతమైన చర్చలు సాగాలి: చైనా
బీజింగ్: చైనాతో సరిహద్దు వివాద పరిష్కారం కోసం ప్రశాంత వాతావరణంతో కూడిన అర్థవంతమైన విధానాన్ని భారత్ అవలంభించాలని ఆ దేశం సూచించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వివాదంపై చైనా వైఖరి స్పష్టమని, ఎప్పటికీ మారదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. ఇటీవల అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే బ్రిడ్జిని భారత ప్రధాని ప్రారంభించడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా భారత్‌లు సరిహద్దు సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. సినో-ఇండియా సరిహద్దు తూర్పు భాగంపై తమ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు.