ఇద్దరు దుష్టుల మధ్య స్నేహం ఎక్కువ కాలం నిలవదంటారు పెద్దలు. పాక్, అఫ్గాన్ మధ్య తాజా వైరం ఈ సామెతను నిజం చేస్తోంది. తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేనొకటంటానని ప్రస్తుతం రెండు దేశాలు సిగపట్లు పడుతున్నాయి. సంవత్సరం క్రితం జాన్‌జిగిరీలుగా ఉన్న ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది.
దాదాపు ఏడాది క్రితం అఫ్గాన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు మట్టుబెట్టి పాలనా పగ్గాలు చేపట్టారు. అ సమయంలో ప్రపంచమంతా తాలిబన్ల దాష్టికాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తే పాక్ మాత్రం సంబరాలు చేసుకుంది. గిర్రున ఏడాది తిరగకముందే పాక్ సంతోషం ఆవిరైంది. తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం అఫ్గాన్‌లో ఉంటుందని ఆశించిన పాకిస్తాన్‌కు అశనిపాతం తగిలింది. స్నేహం మాట దేవుడెరుగు ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకుంటోంది.
‘‘అఫ్గనిస్తాన్ బానిస సంకెళ్లు తెంచుకుంటోంది’’ అని తాలిబన్ల తిరుగుబాటు సమయంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ సంతోషంతో వ్యాఖ్యానించారు. ఆయన మంత్రుల్లో ఒకరైతే ఆగస్టు 15కు భారత్‌కు తగిన బహుమతి లభిస్తోందని ఎద్దేవా చేశారు. ఓడలు బండ్లుగా మారిన చందాన ప్రస్తుతం పాక్‌లో ఇమ్రాన్ లేడు, పాక్‌తో తాలిబన్లకు సయోధ్యా లేదు, పైగా ఇండియాతో తాలిబన్లు సమతుల్య సంబంధాలనే పాటిస్తున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత.. అని ఇదంతా పాక్ స్వయంకృతాపరాధమేనంటున్నారు నిపుణులు.
ఎందుకీ వైరం?
అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆ దేశంతో పాక్‌కు సరిహద్దు వివాదం ఉంది. తమకు అనుకూల తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం సమసిపోతుందని, తాము కోరినట్లు సరిహద్దు మార్చుకోవచ్చని పాకిస్తాన్ భావించింది. దీనికితోడు పాక్‌లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే టీటీపీ (తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్)కు తాలిబన్లు పగ్గాలు వేస్తారని ఆశించింది. అయితే ఈ రెండు ఆశలు ఆడియాసలయ్యాయి. పౌర ప్రభుత్వ హయంలో కన్నా తాలిబన్ హయంలో సరిహద్దు రేఖ (డ్యురాండ్ రేఖ) వద్ద ఘర్షణలు పెరిగాయి. పాకిస్తాన్‌లో టీటీపీ ఉగ్రదాడులు మరింతగా పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో పాక్ 100మంది సైనికులను కోల్పోయింది.
డ్యురాండ్ రేఖ వద్ద పాక్ కంచె నిర్మాణాన్ని తాలిబన్లు అంగీకరించడంలేదు. అక్కడున్న పష్తూన్ జనాభాను ఈ కంచె విభజిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అమెరికా పరోక్ష పాలన సాగిన రోజుల్లో అఫ్గాన్ రహస్యాలను పాక్ అమ్ముకున్నదని అఫ్గన్లు నమ్ముతున్నారు. దీంతో అఫ్గన్‌లో ఇటీవల కాలంలో పాక్‌పై వ్యతిరేకత ప్రబలుతోంది. పాక్ అంటేనే అస్థిరతకు మారురూపమని, పాక్ స్నేహం వద్దని పలు అఫ్గాన్ నగరాల్లో ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. టీటీపీని అదుపు చేయడానికి కూడా తాలిబన్లు ఇష్టపడడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్ నిష్క్రమణ జరగింది. తాలిబన్లతో ఇమ్రాన్‌కు కొంత మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగించేవాళ్లు కరువయ్యారని నిపుణులు భావిస్తున్నారు.
ఏం జరగవచ్చు?∙
తమ ప్రభుత్వం ఉగ్రవాదంతో పోరాడుతుందని పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. అంటే టీటీపీతో పరోక్షంగా తాలిబన్లతో వైరం కొనసాగవచ్చని ఆయన భావన. దేశంలోని టీటీపీ ఆపరేటర్లను తుడిచిపెడతామని పాక్ మిలటరీ కూడా ప్రకటించింది. అదేవిధంగా సరిహద్దులను పరిరక్షించుకుంటామని తెలిపింది. దీనిపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే పాక్ సరిహద్దులపై జరిపిన దాడుల్లో 20మంది చిన్నారులు సహా 50 మంది అఫ్గాన్లు మరణించారని తాలిబన్లు ఆరోపించారు. తమ దేశస్థుల మరణాలకు యుద్ధం తప్పదని పాక్‌ను హెచ్చరించారు.
పాక్ దాడులకు ప్రతిగా సరిహద్దుల్లో 7గురు పాక్ సైనికులను మట్టుబెట్టారు. దీంతో ఇరుదేశాల మధ్య స్నేహం స్థానంలో వైరం మొదలైంది. తాజాగా పాక్ వైఖరిపై తాలిబన్లు ఐరాసలో ఫిర్యాదు చేయడం గమనిస్తే ఇరుపక్షాల మధ్య వైరం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులుండరని, ఉగ్రవాదులంటే ఉగ్రవాదులేనని పాక్‌కు టీటీపీ అంశంతో బోధపడింది. తాను పెంచి పోషించిన తాలిబన్ తండా తనకే సవాలుగా మారడంతో పాక్ పెద్దలు తలపట్టుకుంటున్నారు. ఈ వైరం మరింత ముదరవచ్చని, చివరకు ఇది మరో సుదీర్ఘ పరోక్ష యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాముకు పాలు పోస్తే...
అమెరికా ట్విన్ టవర్స్‌పై దాడికి బదులుగా వార్ ఆన్ టెర్రరిజం పేరిట రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లపై యుద్ధం చేసి అఫ్గాన్‌లో పౌర ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే అటు అమెరికాకు సహాయం చేస్తున్నామంటూ నిధులు దండుకున్న పాకిస్తాన్ మాత్రం తాలిబన్లకు, ఐసిస్‌కు, ఆల్‌ఖైదాకు లోపాయికారీ మద్దతు కొనసాగిస్తూనే వచ్చింది. గతేడాది అఫ్గాన్ రక్షణ తమ వల్ల కాదని అమెరికా చేతులెత్తి మొహం చాటేయగానే, పాక్ వత్తాసున్న తాలిబన్లు తలెగరేశారు. అతి స్వల్పకాలంలోనే అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తమకనుకూల ప్రభుత్వం ఏర్పడిందని పాక్ ఆనందించింది. కానీ తాలిబన్ అనుబంధ సంస్థ టీటీపీ పాక్‌లో తరుచూ దాడులకు దిగడం, అటు సరిహద్దు వద్ద కంచెను తాలిబన్లు అడ్డుకోవడంతో పాక్‌కు తత్వం తెలిసివచ్చింది. తాను పాలు పోసి పెంచిన పాము తననే కాటేయడానికి తయారైందని గ్రహించిన పాక్ డామిట్, కథ అడ్డం తిరిగిందని నాలుక్కరుచుకుంటోంది.
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment