రెండు రాష్ట్రాల ఓటరు గుర్తింపు కార్డులు చూపుతున్న పరందోళి గ్రామస్తురాలు కాంబ్లే దైవశీల
సాక్షి, ఆసిఫాబాద్: ఆ గ్రామాల్లో అన్ని డబుల్ ధమాకే. రెండు ప్రభుత్వాల రేషన్ కార్డులు, రెండు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటరు ఐడీలు, స్కూళ్లు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా అన్నీ డబులే. ఏళ్లుగా సరిహద్దు వివాదాలతో నలుగుతున్న కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న 12 గ్రామాల పరిస్థితి ఇది. 23 ఏళ్లుగా ఆ గ్రామాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ.. మహారాష్ట్ర మధ్య భూ సరిహద్దు వివాద గ్రామాలుగా మారి అన్ని డబుల్‌గా మారాయి. అటు మహారాష్ట్ర ఆ గ్రామాలను మావి అంటే.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అవి మా భూభాగంలో ఉన్న గ్రామాలని వాదిస్తుండటంతో ఏళ్లుగా ఈ పంచాయితీ తెగడంలేదు.
తేలని సరిహద్దు సమస్య
దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సమయంలో ఈ 12 గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ భూభాగం ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర భూభాగంలోనే వీరంతా కొనసాగుతూ వచ్చారు. మొదటిసారిగా 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 12 గ్రామాల పరి«ధిలో పరందోళి, అంతపూర్‌లను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అయితే దీనిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో 1988లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేకే.నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నప్పటికీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవనే ఈ కమిటీ తేల్చింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో ఇక్కడ మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిపింది.
మొదటిసారిగా పరందోళి, అంతాపూర్‌లో ఇద్దరు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. దీంతో తెలంగాణ సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చేసింది. దీంతో చంద్రాపూర్ కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఈ గ్రామాలపై పోటాపోటీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉండగా, ఇతర అన్ని సంక్షేమ పథకాలను ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అయితే.. రెండు ప్రభుత్వాల పర్యవేక్షణలోనూ కనీస వసతులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీల వివరాలివీ..
- ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న పరందోళి గ్రామ పంచాయతీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్‌లొద్ది, లెండిజాల, పరందోళి తండా, మహారాజ్‌గూడ ఉన్నాయి. ఇందులో ముకదంగూడ గ్రామ సగ భూభాగం మహారాష్ట్ర భూభాగంలో వివాదంలో లేకుండా ఉంది. మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ మొదట అప్పటి తొలి తెలుగు సర్పంచ్. అనంతరం మళ్లీ ఆయన తెలుగు సర్పంచ్‌గా ఎన్నిక కాగా, మరల ఆయనే మూడోసారి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.
- రెండో గ్రామపంచాయతీ అంతాపూర్ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్‌ను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అంతాపూర్ సర్పంచ్‌గా అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కోటాలో పరమేశ్వర్ ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు మాత్రం రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ రెండు ప్రభుత్వాల్లోనూ ఎంపిక అవుతున్నారు.
2,600 మంది ఓటర్లు
ఈ రెండు గ్రామపంచాయతీల పరిధిలో 4 వేల జనాభా వరకు ఉంది. ఓటర్లు 2,600 వరకు ఉన్నారు. ఒక్క పరందోళిలోనే రెండు వేల జనాభా ఉంది. ఇక్కడ అధికంగా 80 శాతం (మహర్, మాంగ్) ఎస్సీలు ఉన్నారు. మిగతా ఎస్టీలు (లంబాడ), ఆదివాసీలు, బీసీలు ఉన్నారు.
రెండు చోట్లా ఓటేస్తాం
మేం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేస్తాం. అయితే మాకు అన్ని డబుల్ ఉన్నట్లే కానీ మా పరిస్థితులు మాత్రం ఏమీ మారడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కానీ అందరూ అర్హులు కావడం లేదు.
–కడ్సే, తులసీరాం, పరందోళి
Comments
Please login to add a commentAdd a comment