village panchayats
-
‘మల్టీపర్పస్’ పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలకు పాలక వర్గాలు ఎసరు పెడుతున్నాయి. అరకొర జీతాలిస్తూ.. పెరిగిన వేతనాలను నొక్కేస్తున్నాయి. బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీ పర్పస్వర్కర్) నియామకాల్లో స్పష్టత కొరవడటంతోనే ఈ అక్రమాలకు తెరలేచినట్టు తెలుస్తోంది. నిర్దేశిత జనాభా కంటే అధికంగా ఉన్న సిబ్బందిని ఇతర గ్రామాల్లో సర్దుబాటు చేయకపోవడం.. జనాభా కంటే తక్కువ ఉన్న చోట్ల కొత్తగా నియమించుకోకుండా ప్రభుత్వ ఖజానాకు జెల్లకొడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఇప్పటివరకు అనేక జిల్లాల్లో పెంచిన వేతనాలు ఇవ్వకుండా స్వాహా చేస్తున్నట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. కోత పెట్టాలన్నా.. కొత్తగా పెట్టుకోవాలనుకున్నా.. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 2.04 కోట్ల జనాభా ఉంది. ఈ జనాభాకు అనుగుణంగా మల్టీపర్పస్ వర్కర్‌ను నియమించుకోవాలి. ఇందులో 4,380 గ్రామ పంచాయతీల్లో 500 జనాభానే ఉంది. వీటిలో మాత్రం కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో 36 వేల మంది పనిచేస్తుండగా.. మరో 17 వేల మందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలనుకున్నా.. అదనంగా ఉన్నవారికి కోతపెట్టాలన్నా.. పక్క పంచాయతీల్లో సర్దుబాటు చేయాలనుకున్నా స్థానిక రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికంగా ఉన్నవారు పక్క గ్రామాలకు వెళ్లేందుకు ససేమిరా అనడమేగాక.. ప్రభుత్వం పెంచిన వేతనాన్ని సమానంగా పంచుకుంటామని, అందరం ఇక్కడే పనిచేస్తామని మొండికేస్తున్నారు. దీంతో అంతర్గత సర్దుబాటు చేసుకుని వారి చేత అక్కడే పనిచేయించుకుంటున్నారు. ఇక, గోల్మాల్ కూడా ఈ అంశం ఆధారంగానే జరుగుతోంది. కొన్ని జీపీల్లో జనాభా దామాషా ప్రకారం ఉండాల్సిన సిబ్బంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్నారు. జనాభా దామాషాకు అనుగుణంగా ఆయా జీపీల్లో తగినంత మంది సిబ్బందిని నియమించుకుని వారందరికీ కొత్త వేతనాలు చెల్లించాలి. కానీ, అలా చేయకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై తక్కువ మందితోనే నెట్టుకొస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిబ్బంది వేతనాలను డ్రా చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మరికొన్ని చోట్ల పాత వేతనాలిస్తూ కొత్తజీతాలిస్తున్నామని రికార్డుల్లో రాసుకుంటూ మిగిలింది నొక్కేస్తున్నారనే సమాచారం కూడా పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో గ్రామపంచాయతీల వారీగా పనిచేస్తున్న సిబ్బందికి గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం నెలకు రూ.8,500 అందుతున్నాయో లేదో నివేదిక తెప్పించుకుని తమకు పంపాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు ఇటీవల లేఖ రాసింది. కచ్చితంగా విచారణ జరిపి తగిన సమాచారం ఇవ్వాలని ఈ నెల 6న పంచాయతీరాజ్ కమిషనర్ మెమో నం: 4978 జారీ చేశారు. 500 జనాభాకు ఒకరు.. ప్రతి 500 జనాభాకు ఒక బహుళ ప్రయోజన సిబ్బంది (మల్టీపర్పస్ వర్కర్)ని నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గ్రామంలో 500 జనాభా మాత్రమే ఉంటే కనిష్టంగా ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పించింది. పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ, పంచాయతీకి సంబంధించిన ఇతర పనులకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్‌ను పంపిణీ చేస్తున్నందున.. దీన్ని నడిపేలా ఒకరికి కచ్చితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్ సరఫరా పనులు చేయడంలోనూ నైపుణ్యం ఉండేలా చూడాలని, లేనిపక్షంలో జాబ్ వర్క్ కింద ప్రైవేటు సేవలు పొందాలని పేర్కొంది. ఈ మేరకు గతేడాది అక్టోబర్‌లో పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.8,500 చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సర్కార్.. ఇప్పటికే గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని, ఒకవేళ నిర్దేశిత జనాభా కంటే ఎక్కువ మంది కార్మికులుంటే 5 కి.మీ.ల పరిధిలో ఉండే గ్రామాల్లో వీరి సేవలను వాడుకోవాలని స్పష్టం చేసింది. కాగా, విధిగా అదే గ్రామానికి చెందినవారినే వర్కర్లుగా పెట్టుకోవాలని కూడా సూచించింది. ఈ నిబంధన పంచాయతీల్లో గందరగోళానికి తెరలేపింది. -
మళ్లీ పంచాయతీలకే వీధి దీపాలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వీధి దీపాల పర్యవేక్షణ పంచాయతీల ఆధీనంలోనే ఉండాల్సినా టీడీపీ హయాంలో దీన్ని పైవేట్‌పరం చేశారు. ట్యూబులైట్ల స్థానంలో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎల్ఈడీ బల్బులు మాడిపోతే మార్చడం, సక్రమంగా వెలిగేలా చూసే బాధ్యతను ప్రైవేట్ సంస్థలే నిర్వహించేలా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో ఎల్ఈడీ దీపానికి ఏటా రూ. 450 – రూ. 600 చొప్పున సంబంధిత గ్రామ పంచాయతీ ప్రైవేట్ సంస్థకు పదేళ్ల పాటు చెల్లించాలనేది ఒప్పందంలో ప్రధాన నిబంధన. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 11,032 పంచాయతీల్లో ఈ పనులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి. పగలే వెలుగుతున్న లైట్లు: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్ పరం చేసిన తర్వాత పట్టపగలు కూడా లక్షల సంఖ్యలో లైట్లు వెలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 23.90 లక్షల కరెంట్ స్థంభాలు ఉండగా 27,65,420 వీధి దీపాలున్నాయి. వీటిల్లో 2,29,194 వీధి దీపాలు నిరంతరాయంగా 24 గంటలూ వెలుగుతున్నాయని గుర్తించారు. మరోవైపు 2,77,324 వీధి దీపాలు అసలు వెలగటం లేదని పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యత: వీధి దీపాలను రోజూ సాయంత్రం వెలిగించడం, తెల్లవారు జామున తిరిగి ఆఫ్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థల నుంచి తప్పించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లకు అప్పగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారం పది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
విద్యుత్ బిల్లు చెల్లించకపోతే వేటే!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ వంటి సంస్థలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలది కీలక పాత్ర.. తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్ కోసం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ ‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్ వీక్’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్‌ను తట్టుకునేందుకు, సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అటూఇటు.. మన ఓటు!
సాక్షి, ఆసిఫాబాద్: ఆ గ్రామాల్లో అన్ని డబుల్ ధమాకే. రెండు ప్రభుత్వాల రేషన్ కార్డులు, రెండు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటరు ఐడీలు, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా అన్నీ డబులే. ఏళ్లుగా సరిహద్దు వివాదాలతో నలుగుతున్న కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ఉన్న పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఉన్న 12 గ్రామాల పరిస్థితి ఇది. 23 ఏళ్లుగా ఆ గ్రామాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ.. మహారాష్ట్ర మధ్య భూ సరిహద్దు వివాద గ్రామాలుగా మారి అన్ని డబుల్‌గా మారాయి. అటు మహారాష్ట్ర ఆ గ్రామాలను మావి అంటే.. ఇటు తెలంగాణ ప్రభుత్వం అవి మా భూభాగంలో ఉన్న గ్రామాలని వాదిస్తుండటంతో ఏళ్లుగా ఈ పంచాయితీ తెగడంలేదు. తేలని సరిహద్దు సమస్య దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన సమయంలో ఈ 12 గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గం జివితి తాలుకాలో ఉండేవి. అదే సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ భూభాగం ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల్లో ఈ గ్రామాల వివరాలు లేకపోవడంతో మహారాష్ట్ర భూభాగంలోనే వీరంతా కొనసాగుతూ వచ్చారు. మొదటిసారిగా 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 12 గ్రామాల పరి«ధిలో పరందోళి, అంతపూర్లను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. అయితే దీనిపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీంతో 1988లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేకే.నాయుడు కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక స్థితిగతులు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం సాంస్కృతిక పరంగా మరాఠా ప్రభావం ఉన్నప్పటికీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటంతో ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవనే ఈ కమిటీ తేల్చింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో ఇక్కడ మొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరిపింది. మొదటిసారిగా పరందోళి, అంతాపూర్లో ఇద్దరు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించింది. దీంతో తెలంగాణ సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ భూభాగాలు ఉన్నాయని తేల్చేసింది. దీంతో చంద్రాపూర్ కలెక్టర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ప్రస్తుతం కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక అప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు ఈ గ్రామాలపై పోటాపోటీగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఉండగా, ఇతర అన్ని సంక్షేమ పథకాలను ఇరు రాష్ట్రాల నుంచి పొందుతున్నారు. అయితే.. రెండు ప్రభుత్వాల పర్యవేక్షణలోనూ కనీస వసతులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల వివరాలివీ.. - ఈ సరిహద్దు వివాదాల్లో ఉన్న పరందోళి గ్రామ పంచాయతీ పరిధిలో ముకదంగూడ, కోట, శంకర్‌లొద్ది, లెండిజాల, పరందోళి తండా, మహారాజ్‌గూడ ఉన్నాయి. ఇందులో ముకదంగూడ గ్రామ సగ భూభాగం మహారాష్ట్ర భూభాగంలో వివాదంలో లేకుండా ఉంది. మిగతా భాగం ఇరు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన కాంబ్లే లక్ష్మణ్ మొదట అప్పటి తొలి తెలుగు సర్పంచ్. అనంతరం మళ్లీ ఆయన తెలుగు సర్పంచ్‌గా ఎన్నిక కాగా, మరల ఆయనే మూడోసారి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. - రెండో గ్రామపంచాయతీ అంతాపూర్ పరిధిలో బోలాపటార్, ఇంద్రానగర్, ఎస్సాపూర్, లెండిగూడ, గౌరి, నారాయణగూడ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోలాపటార్‌ను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. అంతాపూర్ సర్పంచ్‌గా అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కోటాలో పరమేశ్వర్ ఎన్నికయ్యారు. ప్రజాప్రతినిధులు మాత్రం రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ రెండు ప్రభుత్వాల్లోనూ ఎంపిక అవుతున్నారు. 2,600 మంది ఓటర్లు ఈ రెండు గ్రామపంచాయతీల పరిధిలో 4 వేల జనాభా వరకు ఉంది. ఓటర్లు 2,600 వరకు ఉన్నారు. ఒక్క పరందోళిలోనే రెండు వేల జనాభా ఉంది. ఇక్కడ అధికంగా 80 శాతం (మహర్, మాంగ్) ఎస్సీలు ఉన్నారు. మిగతా ఎస్టీలు (లంబాడ), ఆదివాసీలు, బీసీలు ఉన్నారు. రెండు చోట్లా ఓటేస్తాం మేం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లు వేస్తాం. అయితే మాకు అన్ని డబుల్ ఉన్నట్లే కానీ మా పరిస్థితులు మాత్రం ఏమీ మారడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కొన్ని పథకాలు బాగానే ఉన్నాయి. కానీ అందరూ అర్హులు కావడం లేదు. –కడ్సే, తులసీరాం, పరందోళి -
‘పంచాయతీ’ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికలసంఘం కసరత్తు ముమ్మరం చేసింది. హైకోర్టు తీర్పు అమలులో భాగంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ 25న ప్రకటించిన అసెంబ్లీ స్థానాల వారీ ఓటరు జాబితా ఆధారంగా గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా ఎలక్టోరల్ జాబితాను నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా తయారు చేయనుంది. జిల్లా పంచా యతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పీఆర్ అండ్ ఆర్డీ విస్తరణ అధికారి, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని, నవంబర్ నాలుగో వారం నుంచి డిసెం బర్ మొదటి వారంలోగా ఈ ప్ర క్రియ పూర్తి చేయాలని, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితా తయారీ, స్టేజీ–1, స్టేజీ–2 అధికారులకు ఉత్తర్వుల జారీ, శిక్షణలకు సైతం సమయాన్ని ఖరారు చేసింది. స్టేజీ–1 అధికారులకు నవంబర్ నాలుగో వారంలో, స్టేజీ–2 అధికారులకు డిసెంబర్ మొదటి వారంలో శిక్షణ పూర్తి చేయాలని నిర్ణయించింది. పోలింగ్ సిబ్బంది సమాచారం, ఎంపిక, నియామకాల జారీని సైతం నవంబర్ రెండో వారంలో పూర్తి చేయాలని, డిసెంబర్ రెండోవారంలోగా శిక్షణ కార్య క్రమాలన్నీ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిస్తూ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలిచ్చింది. -
పంచాయతీలకు నేటి నుంచే ప్రత్యేక పాలన
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి ప్రత్యేకాధికారులు కొలువు దీరనున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు నేటితో ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అన్ని గ్రామ పంచాయతీలకు నేడు ఉదయమే ప్రత్యేకాధికారులుగా మండల స్థాయిలోని వివిధ శాఖల ముఖ్యమైన అధికారులు బా«ధ్యతలను తీసుకోనున్నారు. నేటి నుంచి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు మాజీలు కానున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ప్రత్యేకాధికారులే గ్రామ పరిపాలనా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా ఉన్న గ్రామ పంచాయతీలకే కాకుండా, కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు మం డల స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలను అప్పగించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. వీరంతా ఉదయ మే ప్రత్యేక అధికారులుగా బాధ్యతలను తీసుకుంటారు. కొత్తగా 4,383 పంచాయతీలు.. రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలోని 534 మండలాల్లో ఇప్పటిదాకా 8,690 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 4,383 ఏర్పాటు అవుతున్నాయి. వీటిలో మున్సిపల్, పట్టణ స్థానిక సంస్థల్లోకి 306 గ్రామ పంచాయతీలు వెళ్లాయి. మరో 16 గ్రామ పంచాయతీలు నిర్వాసిత గ్రామాలు కానున్నాయి, రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు మనుగడలో ఉంటున్నాయి. వీటిలో 18 గ్రామ పంచాయతీలకు ఐదేళ్ల గడువు పూర్తికాలేదు. దీంతో 12,733 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు బాధ్యతలను తీసుకోనున్నా రు. షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలు 1,308 కాగా పూర్తిగా ఎస్టీలకే రిజర్వు అయిన గ్రామ పంచాయతీలు 10,266. వీటికి ఎన్నికలను నిర్వహించేదాకా ప్రత్యేక అధికారులే స్థానిక పాలనను నిర్వహించనున్నారు. తాత్కాలిక భవనాల్లోనే.. కొత్తగా ఏర్పాటు అవుతున్న గ్రామ పంచాయతీలకు తాత్కాలిక భవనాలను ఎంపిక చేశారు. ప్రభుత్వ శాఖలకు చెందిన ఏ భవనం ఉన్నా కొత్త పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పాలకవర్గాలకే పదవీ కాలాన్ని పొడిగించాలి: చాడ గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించ కుండా, పాలకవర్గాలకే పదవీకాలాన్ని పొడిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌చేశారు. లోక్‌సభ, శాసనసభలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నట్లుగానే స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సర్పంచులకు పదవీకాలాన్ని పొడిగించడం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టానికి సంబంధించిన అంశమని హైకోర్టు చెప్పినా, ఎందుకు పదవీకాలాన్ని పొడిగించలేదని ప్రశ్నించారు. దీనిపై మొండిగా వ్యవహరించకుండా, మరోసారి ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
గ్రామ పంచాయతీల్లో పాలనపై తేల్చని ప్రభుత్వం
-
తేలని ‘పంచాయితీ’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల పదవీకాలం రేపటితో ముగిసిపోతున్నప్పటికీ అనంతరం పంచాయతీల్లో పాలనను ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా 12,850 చోట్ల సర్పంచ్ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది. 3 రకాల ప్రతిపాదనలతో సీఎంకు నివేదిక పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగించాలా..? లేక ప్రత్యేకాధికారులను నియమించాలా..? లేదంటే సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలా? అనే మూడు రకాల ప్రతిపాదనలతో పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులు నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీసుకునే రాజకీయ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు పంచాయతీల్లో పాలనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. సోమవారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు ఆశించినా రాత్రి వరకు అటువంటిదేమీ వెలువడలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి కనీసం రెండు మూడు రోజులైనా సమయం అవసరమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘ప్రత్యేక’ కసరత్తు షురూ
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటి నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లు, 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలపై ప్రతిపాదనలను రెండ్రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం, హరితహారం, మత్స్యశాఖ, పాడిగేదెల పంపిణీ, వివిధ కేసుల్లో మెడికల్, పోస్టుమార్టం నివేదికల జారీలో జాప్యం, లారీల సమ్మె తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్‌చార్జీలుగా పంచాయతీ కార్యదర్శులు, 68 కొత్త మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లుగా తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులుగా ఆర్డీవోలు, లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు పంపించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రత్యేకాధికారులు, ఇన్చార్జి కమిషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కోరారు. కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ కొత్త పురపాలికలుంటే అందుకనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. కొత్త పుర పాలికలు ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాలను మూసే సి జాతీయ బ్యాంకుల్లో కొత్తగా అకౌంట్లు తెరవాలని సూచించారు. పురపాలికల్లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టే పనులు డిసెంబర్‌కు పూర్తి చేయాల న్నారు. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై పంచాయతీ రాజ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం, వైద్య నివేదికల్లో జాప్యం వద్దు వివిధ కేసుల్లో పోస్టుమార్టం, వైద్య నివేదికలు జిల్లాల వారీగా పెండింగ్‌లో లేకుండా చూడాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేసుల దర్యాప్తును నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తిచేసేందుకు వైద్య, పోస్టు మార్టం నివేదికల జారీలో జాప్యం లేకుండా చూడా లని డీజీపీ మహేందర్ రెడ్డి కలెక్టర్లను కోరారు. 20 నుంచి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపునిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోషి ఆదేశించారు. -
గ్రామ పంచాయతీల విలీనం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీలో కలపడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఐయూరిపల్లి గ్రామ పంచాయతీని వేములవాడ మున్సిపాలిటీలో, తాడుకోలు గ్రామ పంచాయతీని భాన్సవాడ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్దంగా కలిపారని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై హైకోర్టు విచారించింది. గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపొద్దని హైకోర్టు తెలిపింది. అంతేకాక యధావిధిగా ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
బాబు హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం మరూరులో మురుగుకాల్వల నిర్మాణం కూడా సరిగా లేక రోడ్డుపైనే మురుగు పారుతోంది. ... గుంటూరు జిల్లా రొంపిచర్లలో మంచినీటి పథకం ఉన్నా ఊరంతా మంచినీటి సమస్య.. ... రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో ఊరుకో సమస్య.. ఒక ఊళ్లో శ్మశానం లేక సమస్య.. మరో ఊళ్లో వాగుపై వంతెన లేక ప్రజల ఇబ్బంది.. ఇలా ఎన్నో.. మరెన్నో.. సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటిని కేంద్ర స్థాయిలోనో.. రాష్ట్ర స్థాయిలోనో పరిష్కరించడం సాధ్యం కాదని పాతికేళ్ల క్రితం స్థానిక సంస్థలకే విధులు, నిధులు, అధికారాలు అనే నినాదంతో 73, 74వ రాజ్యాంగ సవరణలు చేశారు. వీటి ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామ పంచాయతీలకు, పట్టణ, నగర పాలకసంస్థలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు నేరుగా చెల్లించాలి. ఈ నిధులతో స్థానిక సంస్థలు ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ, 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా ఇచ్చే నిధులను సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఖర్చు చేయాలని ఆదేశాలిస్తోంది. దీంతో స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదు. స్థానిక సంస్థల అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెలాయిస్తూ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాటికే పెత్తనం అప్పగించింది. రూ.5,831 కోట్లు కేంద్రం ఇచ్చినా.. గత నాలుగేళ్లలో కేంద్రం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రూ.5,831 కోట్ల నిధులు ఇచ్చింది. చిన్న గ్రామ పంచాయతీలు ఒక్కోదానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా.. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.60 లక్షల వరకు నిధులొచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సమస్యలకు ఆ నిధులను ఖర్చు పెట్టనీయకుండా చంద్రన్నబాట, చంద్రన్న క్రాంతి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాలకు మాత్రమే కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు పెట్టాలని ఆదేశాలిస్తోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఉదాహరణకు.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మరూరులో మురుగు కాల్వలు లేక రోడ్డుపైనే మురుగు పారుతోంది. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో రాప్తాడు నియోజకవర్గంలోనే గత మూడు నెలల్లో 30 మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే గుంటూరు జిల్లా రొంపిచర్లలో మంచినీటి సమస్య వేధిస్తోంది. స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో ఉన్న అధికారాలు, నిధులను గ్రామ పంచాయతీలు వినియోగించుకోలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అవసరాలకు కాకుండా గ్రామంలో సమస్యల పరిష్కారానికి, ఏవైనా అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులు నిధులు డ్రా చేసుకోనీయకుండా చంద్రబాబు సర్కార్ ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలను జారీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు కారణంగా.. ట్రెజరీల్లో గ్రామ పంచాయతీల నిధులు రూ.1730 కోట్లు వృథాగా పడి ఉన్నాయని పంచాయతీ అధికారుల అంచనా. మరోపక్క ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పేరుతో వచ్చే పదేళ్లు ఏటా గ్రామ పంచాయతీలు కాంట్రాక్టర్లకు లక్షల్లో (ఒక్కో విద్యుత్ స్తంభానికి రూ.450 చొప్పున) చెల్లించేలా గ్రామ పంచాయతీల నెత్తిన బండ వేసింది. జిల్లా, మండల పరిషత్‌లు అస్తవ్యస్తం మరోపక్క జిల్లా, మండల పరిషత్‌లు మూడేళ్లుగా నిధుల్లేక విలవిల్లాడుతున్నాయి. ఏడాదికి రెండు, మూడు లక్షల ఆదాయం కూడా లేని మండల పరిషత్‌లు రాష్ట్రంలో వందల సంఖ్యలోనే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు గతంలో దాదాపు రూ.25 కోట్లు ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. కాగా, గతేడాది ఆర్థిక సంఘం నిధులు లేక దాని ఆదాయం రూ.15 కోట్లకు పరిమితమైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం.. పంచాయతీలకు, జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలవారీగా నిధులు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత మొత్తం నిధులను గ్రామ పంచాయతీలకే ఇస్తూ.. మండల, జిల్లా పరిషత్ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి నిధులు విడుదల చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ముందుకు రాకపోవడంతో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి చెల్లించే నిధులను కూడా విడుదల చేయలేదు. అప్పుల ఊబిలో మునిసిపాలిటీలు చంద్రబాబు ప్రభుత్వం పట్టణ, నగర పాలక సంస్థల విధుల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఏ అవసరాలకు నిధులను ఖర్చు పెట్టాలో ఆదేశాలు జారీ చేస్తోంది. కేంద్రమిచ్చే నిధులను తాము చెప్పిన పథకాలకే ఖర్చు పెట్టిస్తుండటంతో పట్టణ, నగరపాలక సంస్థలు డమ్మీలుగా మారాయి. దీంతో అవి అప్పుల ఊబిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరపాలక సంస్థలు అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు, విశాఖపట్నం వంటి నగర పాలక సంస్థలకు ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఉత్సవ విగ్రహాల్లా ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల అధికారాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం జన్మభూమి కమిటీల నియామకం చేపట్టడంతో ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. లబ్ధిదారుల ఎంపిక మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను జన్మభూమి కమిటీలే చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 12,805 మంది గ్రామ సర్పంచులు, దాదాపు 1,38,000 మంది వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉంటున్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల్లేక 10,800 మంది ఎంపీటీసీలు, 660 మందికి పైగా జెడ్పీటీసీలు తాము ప్రజలకు ఏం చేయాలో తెలియక కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులు 12,805 మంది గ్రామ సర్పంచులు 1,38,000 మంది వార్డు సభ్యులు (దాదాపు) 10,800 మంది ఎంపీటీసీలు 660 మందికి పైగా జెడ్పీటీసీలు -
బీసీలకు 3,440 పంచాయతీలు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పదవులను ఆయా కేటగిరీల మహిళలకు కేటాయించాలని సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాలకు 34 శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించాలని స్పష్టం చేశారు. ఇక మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73 శాతం లెక్కన ఆ వర్గానికి 580 సర్పంచ్ పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నింటినీ ఆ వర్గం వారికే కేటాయించాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా ఎస్టీలకు 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అయ్యాయి. కొత్త చట్టం.. కొత్త రిజర్వేషన్లు.. రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2.02 కోట్ల జనాభా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ, బీసీ, బీసీ మహిళ, జనరల్, జనరల్ మహిళ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఉంటాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు విధానం ప్రస్తుత ఎన్నికలతోనే మొదలుకానుంది. అంటే 1995, 2001, 2006, 2013 ఎన్నికలలో ఖరారైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా (జీరో రిజర్వేషన్) ప్రస్తుతం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34 శాతం పదవులను కేటాయిస్తున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా.. జిల్లాల వారీగా బీసీలకు ఖరారు చేసే పదవుల సంఖ్యలో మార్పులు ఉంటాయి. 2011 లెక్కల ఆధారంగా తాజా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించనున్నారు. సర్పంచ్ల రిజర్వేషన్ సంఖ్యలను జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మండలాల వారీగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్ పదవులు ఏ వర్గానికి అనేదాన్ని ఆర్డీవో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవో నిర్ణయిస్తారు. మొత్తానికి మండలం యూనిట్‌గా తీసుకుని జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు వరుసగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మిగిలిన పంచాయతీలను జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. గ్రామాల్లోని మొత్తం ఓటర్లు, అందులో బీసీ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటూ రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. -
గిరిజనులకు పదవుల పంట...!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పునర్విభజన ప్రక్రియ గిరిజనుల రాజకీయ భవిష్యత్తును తిరగరాసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. గిరిజనుల రాజకీయ అవకాశాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకున్న ఎస్టీ సర్పంచుల సంఖ్య ఏకంగా డబుల్ కానుంది. పంచాయతీల పునర్విభజనకు ముందు రాష్ట్రంలో 1,308 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి. ఐదువందల జనాభా కంటే ఎక్కువున్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పునర్విభజన చేపట్టిన యంత్రాంగం... కొత్తగా 1,327 తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇచ్చింది. 5వందల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ... తండాల మధ్య దూరం, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు కొన్నిచోట్ల అంతకు తక్కువ జనాభా ఉన్న వాటిని కూడా పంచాయతీలుగా మార్చారు. కొన్నిచోట్ల జనాభా 700 నుంచి 900 వరకు ఉన్నప్పటికీ ఒకే పంచాయతీగా ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలో గిరిజన గ్రామ పంచాయతీల సంఖ్య 2,635కు చేరగా... సర్పంచుల సంఖ్య ఈ మేరకు పెరగనుంది. గిరిజన సర్పంచులు రెండు వేలు... ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గిరిజనుల నాయకత్వ పెరుగుదలకు మార్గం సుగమమైంది. నూరుశాతం ఎస్టీలున్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌లుగా ఎస్టీలనే నియమించాలని ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. గతంలో 1,308 గ్రామ పంచాయతీల్లో 627 పంచాయతీల్లోనే గిరిజన సర్పంచులుఉన్నారు. తాజాగా పంచాయతీల సంఖ్య 2,635కు పెరగగా ఇందులో 1,320 పంచాయతీల్లో నూరుశాతం జనాభా గిరిజనులే. దీంతో ఈ పంచాయతీలన్నీ గిరిజనుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇక్కడ సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఎస్టీలకే దక్కనున్నాయి. అదేవిధంగా మిగిలిన 1,315 పంచాయతీల్లో రొటేషన్ పద్ధతిన గిరిజనులకు సర్పంచ్ అవకాశం దొరుకుతుంది. వీటిలో సగానికి పైగా పంచాయతీలు ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. మొత్తంగా గిరిజన సర్పంచుల సంఖ్య రాష్ట్రంలో రెండు వేలకు పెరగనుంది. ఆ పంచాయతీలకు అదనపు నిధులు నూరుశాతం గిరిజన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనుంది. ఒక్కో గ్రామ పంచాయతీకి 3 నుంచి 5 లక్షల రూపాయలు ప్రత్యేక కోటాలో మంజూరు చేయనుంది. ఈ నిధులను ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పూర్తిగా పాలకవర్గం తీర్మానంతో ఖర్చు చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల అనంతరం పాలక వర్గాలు ఏర్పాటయ్యాక ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
కొత్తగా 28 పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పురపాలికల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. 28 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుతో పాటు ప్రస్తుత పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండటం తో కొత్త పురపాలికలు, విలీన గ్రామ పంచాయతీల సంఖ్య పెరగనుంది. సమీపంలోని రెండు, మూడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త పురపాలిక ఏర్పాటు చేయా లని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం 52 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 28 కొత్త పురపాలికలు ఏర్పాటు చేయాలని 15 జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 5 పురపాలికల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. జనాభా 15 వేలు మించితే పురపాలికే 15 వేలకు మించిన జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ప్రస్తుతం ఉన్న పురపాలికలకు చుట్టూ 1 నుంచి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న పురపాలికల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ లక్షణాలు, స్వభావం కలిగిన గ్రామ పంచాయతీలను గుర్తించి పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు లేదా సమీప పురపాలికల్లో విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారీ కోసం ప్రభుత్వం గత నెలలో 9 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రత్యేకాధికారులు 28 కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 73 పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆగస్టులో కొత్త పురపాలికల ఏర్పాటు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుంది. ఆ వెంటనే కొత్త పురపాలికల ఏర్పాటు, పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీల విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ లోపే పూర్తి చేయనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదనలకు తుదిరూపు లభించిన తర్వాత ప్రభుత్వం ఈ కసరత్తు ప్రారంభించనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు లేదా పురపాలికల్లో విలీనంపై సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేయనుంది. అభిప్రాయాలు తెలపడానికి స్థానిక ప్రజలకు 10 రోజుల గడువు లభించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం సంబంధిత గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఆయా గ్రామ పంచాయతీలను కొత్త నగర పంచా యతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ, శివారు పురపాలికల్లో విలీనం చేస్తున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంచరీ దాటనున్న పురపాలికలు రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 28 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, తుది ప్రతిపాదనలు సిద్ధమ య్యే సరికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పురపాలికలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 100కి మించిపోనుంది. -
కనీస వేతనానికి అర్హులే
గ్రామ పంచాయతీల్లోని కార్మికుల వేతనాలపై హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ స్థాయిల్లోని కార్మికులకు నియామక పత్రాలు లేకపోయినప్పటికీ, చట్ట ప్రకారం వారు కనీస వేతనాలు పొందేందుకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. వారికి దక్కాల్సిన కనీస వేతనాలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. గ్రామ పంచాయతీల్లోని కార్మికుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వేతనాలతో పాటు వారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీల్లోని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దాఖలు చేసిన పిల్ సోమవారం విచారణకు వచ్చింది. 8 వేల గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 55 వేల మంది కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.1000 మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, వారు చట్టం ప్రకారం రూ.2500 పొందేందుకు అర్హులని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వివరించారు. వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలై 6కు వాయిదా వేసింది. -
సమస్యల శి‘వార్’
* కోట్లలో ఆదాయమున్నా.. సౌకర్యాలు సున్నా * హైదరాబాద్ శివార్లలోని 37 గ్రామపంచాయతీల దుస్థితి * తాగునీరు కూడా సరిగా అందని పరిస్థితి * విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న అవినీతి * పాలకవర్గాలున్న చోట్ల కుమ్ములాటలు * సమస్యలతో జనం అవస్థలు రాష్ట్ర రాజధాని శివార్లలో ఉన్న గ్రామాలవి.. ఓ రకంగా రాజధానిలో భాగంగానే ఉన్న ప్రాంతాలవి.. కానీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. వీధి దీపాల్లేవు.. రోడ్లన్నీ గతుకులు.. పారిశుద్ధ్యం అసలే కనపడదు.. డ్రైనేజీలు పాడైపోయి మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.. ఇక మంచినీటి సరఫరా సరిగా లేక జనం పడే అవస్థ వర్ణనాతీతం.. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న 37 గ్రామ పంచాయతీల్లో దుస్థితి ఇది. ఇందులో గ్రేటర్లో విలీనం నిలిచిపోయి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు 12 కాగా.. పాలకవర్గాలుండీ పట్టింపునకు నోచుకోని గ్రామ పంచాయతీలు 25 ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారు గ్రామాలు రెంటికీ చెడిన రేవడిగా తయారయ్యాయి. 20 నెలలుగా ఆలనా పాలనా లేని పంచాయతీలు 12 ఉండగా.. పాలకవర్గాలుండీ పట్టింపు లేని పంచాయతీలు 25 ఉన్నాయి. ఈ 37 గ్రామా ల్లో సుమారు 16 లక్షల జనాభా ఉంది. బోడుప్పల్ పంచాయతీ నుంచి ఏడాదికి రూ.3.5 కోట్లు, పీర్జాదిగూడ నుంచి రూ.3.05 కోట్లు ఆదాయం వస్తోంది. ఇలా ప్రజలు చెల్లించే పన్నులతో ఈ గ్రామాలకు ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కానీ మౌలిక వసతులు ఎండమావిగా మారాయి. జీహెచ్ఎంసీలో విలీనం నిలిచిపోయిన 12 గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపనికీ పైసలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ 12 పంచాయతీల్లో ప్రజల నుంచి పన్నుల రూపేణా ఏటా రూ.11 కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ మౌలిక వసతుల కోసం పైసా ఖర్చు చేయడం లేదు. పాలకవర్గాలున్న పంచాయతీల్లోనూ రాజకీయాలు, కుమ్ములాటలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. సమస్యలతో అవస్థలు పడుతున్నా.. వీటివైపు సర్కారు చూడడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ‘ప్రత్యేక’ బాధలు.. సరూర్‌నగర్ మండలం ఏర్పాటైనప్పుడు13 గ్రామాలుండేవి. రెండేళ్ల కిందట 8 గ్రామాలను కలిపి బడంగ్‌పేట నగర పంచాయతీని ఏర్పాటు చేశారు. మిగతా గ్రామాలు మీర్‌పేట, జిల్లెలగూడ, పహాడీషరీఫ్, కొత్తపేట, జల్పల్లి, బాలాపూర్ గ్రామంలోని కొంత భాగాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రకటన చేశారు. కానీ స్థానిక నేతలు కోర్టుకు వెళ్లి... వీటిని గ్రామ పంచాయతీలుగానే ఉండేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటికే రాష్ట్రవ్యాప్తం గా పంచాయతీ ఎన్నికలు ముగిసి పోవడంతో.. ఈ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. దీంతో ఇవి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ గ్రామాల్లోనూ మౌలిక సౌకర్యాలకు దిక్కులేదు. గ్రేటర్లో కలిపితే అభివృద్ధి జరుగుతుందని కొందరు భావిస్తుండగా.. పన్నులు పెరగడం తప్ప లాభమేమీ ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అన్నీ అవస్థలే రాజేంద్రనగర్ మండల పరిధిలోని 14 పంచాయతీల్లో అభివృద్ధి లేదు. రోడ్లు, నీటివసతి, పారిశుద్ధ్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నా రు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండడం, డివిజన్ల సంఖ్యను పెంచే యోచన ఉండడంతో.. పలు గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోడుప్పల్ పంచాయతీ పరిధిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటికి కటకట తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కొత్తపేట, పహాడిషరీఫ్ గ్రామ పంచాయతీలకు ఎలాంటి ఆదా య వనరులు లేకపోవడంతో అభివృద్ధి ఏనాడో కుంటుపడింది. వీటిని గ్రేటర్లో కలపాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. - సిల్వేరు సాంబశివ, కొత్తపేట సమస్యలు పరిష్కరిస్తలేరు బాలాపూర్ చౌరస్తాకు ఆనుకొని మా కాలనీ ఉంది. డ్రైనేజీ, నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. - మల్లేష్ ముదిరాజ్, మీర్‌పేట -
నిధులు వరద
పంచాయతీలకు 9 నెలల్లో రూ.73.87 కోట్లు గత ఏడాది కన్నా 12 రెట్లు అధికం నిబంధనలతో కొత్త పనులకు అడ్డంకులు సడలింపు కోసం ప్రభుత్వానికి నివేదిక యోచిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం హన్మకొండ అర్బన్ : జిల్లాలో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు పోటెత్తాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలో రూ.73.87 కోట్లు పంచాయతీల ఖాతాల్లో చేరాయి. మరో నెల రోజుల్లో నాలుగో విడత నిధులూ జమ కానున్నాయి. మొత్తం రూ.100 కోట్లు దాటే అవకాశం ఉంది. గతంలో ఆగిన టీఎఫ్సీ ఫండ్ సైతం ప్రస్తుతం విడుదలవుతుండడంతో వచ్చిన నిధులు ఎలా ఖర్చు చేయాలో గ్రామ సర్పంచ్‌లకు అంతుచిక్కడం లేదు. అయితే... ఉన్న నిధులు ఖర్చు చేసే విధానంపై కొన్ని ఆంక్షలు ఉండడంతో పనులు చేపట్టే విషయంలో సడలింపు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాలని జిల్లా అధికా యంత్రాంగం ఆలోచిస్తోంది. పంచాయతీ చరిత్రలో తొలిసారి ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం గ్రామ పంచాయతీల చరిత్రలోనే ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. నిధులు పెద్ద మొత్తంలో ఉండడంతో కొన్ని చోట్ల సర్పంచ్‌లు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఈ మేరకు లెక్కలు చూపలేక జిల్లాలో ఇప్పటికే 9 మంది వరకు సర్పంచ్‌లు చెక్‌పవర్ కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాత లెక్కలు ఓసారి పరిశీలిస్తే 2013-14 ఆర్ధిక సంవ త్సరంలో జిల్లాలో మొత్తం 1014 గ్రామ పంచాయతీలు ఉండేవి. అప్పటి లెక్కల ప్రకారం పంచాయతీల పరిధిలోని జనాభా కూడా ఎక్కువగానే ఉండేది. అయినా 2013-14లో పంచాయతీలకు వచ్చిన మొత్తం సుమారు రూ.6.12 కోట్లు మాత్రమే అని అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. వాటితో పోల్చి చూస్తే ప్రస్తుతం వచ్చిన మూడు విడతల వచ్చిన నిధులు 12 రెట్లు అధికంగా ఉన్నాయి. మరమ్మతులకు మాత్రమే... ప్రస్తుతం ఉన్న నిధులు కేవలం మరమ్మతులు, వీధిలైట్ల వంటి వాటికి మాత్రమే వినియోగించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీల్లో నిధులు మూలుగుతున్నా... కొత్త పనులు చేపట్టలేక పోతున్నారు. పంచాయతీల నిధులు ఖర్చు కాకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. అయితే కొత్త డ్రెరుున్ల వంటి వాటిని ప్రస్తుత నిధులతో చేపట్టడంలో ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిసాదనలు సిద్ధం చేస్తున్నారు. ఉన్న నిధులను కొత్త పనులకు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెరుున్ల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రతి పైసకూ జవాబుదారీగా ఉండాలి గతంలో పంచాయతీలకు పాలకవర్గం లేని సమయంలో ఆగిపోయిన నిధులు కూడా ప్రస్తుతం విడుదలవుతున్నాయి. నిధుల ఖర్చుపై కొన్ని పరిమితులు ఉండడంతో పనులు కావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీలకు వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం జాయింట్ చెక్వవర్ ఇచ్చింది. సర్పంచ్, కార్యదర్శులు ప్రతి పైసకూ జవాబుదారీగా ఉంటూ ఖర్చు చేయాలి. - ఈఎస్.నాయక్, డీపీఓ -
ప్రభుత్వ పరిధిలోకి పంచాయతీ రహదారులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావు మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో పంట కల్లాలకు ప్లాట్‌ఫామ్‌లు గ్రామలకు ఆర్వో ప్లాంట్లు.. గ్రామలకు అధికారాలే కాదు..జవాబుదారీతనం ముఖ్యమే.. హైదరాబాద్: అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా పంట కల్లాల ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులను గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రైతులు పంటల సమయంలో తమ ధాన్యాన్ని రహదారులపై ఎండబెడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే కల్లాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ల(ఆర్వో) నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన కూడా ఉందన్నారు. గృహ నిర్మాణానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంత్రి తారక రామారావు ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... మేజర్ పంచాయతీల్లో 250 మెట్రిక్ టన్నులు, మండల కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగులు నిర్మిస్తామని వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కల్పించే పని దినాలు చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువగా ఉన్నాయని, పనిదినాల సంఖ్య పెంచడం వల్ల.. కూలీలకు వేతనాలతోపాటు, మెటీరియల్ కాంపోనెంట్ పెరగడం వల్ల.. ఎక్కువ ఆస్తుల కల్పనకు వీలు కలుగుతుందని తెలిపారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రభుత్వ పరిధిలోకి రహదారులు గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ పరిధిలోని రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తే..అది రెవెన్యూ వ్యయంగా పరిగణిస్తున్నందున, ఆ రహదారులను ప్రభుత్వ అధీనంలోకి తెస్తే మరిన్ని నిధులు వ్యయం చేయడానికి వీలవుతుందని అన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని గత ప్రభుత్వాలు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై నిధులు రావడం లేదని, ప్రస్తుతం ఆ తప్పును సరిచేసే పనిలో ఉన్నామన్నారు. అధికారాలే కాదు.. బాధ్యతనూ గుర్తెరగాలి... అధికార వికేంద్రీకరణ కోరుతున్న పంచాయతీలు బాధ్యత, జవాబుదారీతనం కూడా పెంచుకోవాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీల్లో ఆస్తిపన్ను, మంచినీటి బిల్లులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధ్దిని సొంత అభివృద్ధిగా ప్రజలు భావించాలని సూచించారు. సర్పంచులు కేవలం అధికారమే కావాలంటే కాదని, బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. వందకోట్లు ఖర్చు చేస్తే..మూడు వేల సింగిల్ విలేజ్ స్కీమ్స్‌కు తాగునీటి పథకాలు పూర్తి చేయొచ్చని, అలాగే వెయ్యికోట్లు నిధులు ఇస్తే.. సమగ్ర మంచినీటి పథకాలు పూర్తి చేసే అవకాశం ఉన్నందున వాటికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆదర్శ పంచాయతీల అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు సర్పంచులను పంపిస్తామని తెలిపారు. ఈ-పంచాయతీలు...: పంచాయతీల్లో బ్రాడ్‌బాండ్ నెట్వర్క్ ఉన్న వాటిని ఈ-పంచాయతీలుగా మారుస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలోని 57 పంచాయతీల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తు తం ఈ-సేవ కేంద్రాల ద్వారా 340 సేవలను అందిస్తున్నామని, వాటి లో 50 సేవలను పంచాయతీలను అందించినా ప్రయోజనం ఉంటుందన్నారు. ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీనిని ‘జీ టు పీ’(గవర్నమెంట్ టు పీపుల్)గా పిలువనున్నట్లు తెలిపారు. విలీనం చేయాల్సిందే.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలంటే శివార్లలోని పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాగాలంటే వీటి విలీనం తప్పనిసరి అని పేర్కొన్నారు. -
పంచాయుతీలకు అధికారాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం అధికారాలను బదలాయించడంతోపాటు, జవాబుదారీతనం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలపై కేసీఆర్ సమీక్షించారు. పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారాలు బదలాయించాలని, ప్రాథమిక విద్యను పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని పేర్కొన్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేద్దామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర పథ కం ఆసరాగా గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి తారకరామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యారు. -
పంచాయుతీరాజ్‌లో అధికార వికేంద్రీకరణ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలను బలోపేతం చేయుడానికి కృషిచేస్తానని, ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేపడతామని గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ ద్వారా లభించే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. గురువారం సచివాలయంలోని డి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం మొదటి ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం తన అదృష్టమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గ్రామీణాభివృద్ధి చేపడతావుని చెప్పారు. మొదటి ప్రాధాన్యంగా ఫ్లోరైడ్బాధిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తావున్నారు. ఐటీలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతావుని, ఇందుకోసం అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో 15 నుంచి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, 20 నుంచి 25 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. -
శివారు పంచాయతీలపై తేల్చండి!
సాక్షి, హైదరాబాద్: ‘నగర శివార్లలోని గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మాపై(రాష్ట్ర ఎన్నికల సంఘం) హైకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసులు నమోదు అవుతున్నాయి. ఆ గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తారా? లేక మునిసిపాలిటీలుగా ప్రకటిస్తారా? రెండు రోజుల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పండి’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేసిందని, దీంతో ఆ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఈ విలీన ప్రక్రియను ప్రశ్నిస్తూ పలువురు కోర్టుకు వెళ్లడం.. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూనే.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పంచాయతీలను విలీనం చేయలేదని పేర్కొన్న విషయాన్ని రమాకాంత్‌రెడ్డి పురపాలక శాఖ ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నగర శివారు గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఆర్డీఎంఏ డాక్టర్ సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ శివార్లలోని 37 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై 15 పంచాయతీల ప్రజలు కోర్టుకు వెళ్లడంతో ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. అయితే, ప్రస్తుతం ఈ పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయాలా? లేక పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై ఫైలును ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి వివరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు వెళ్తామని, దీనిపై రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామని అధికారులు వివరించినట్లు సమాచారం. మార్చిలోపే మున్సిపల్ ఎన్నికలు! మునిసిపల్ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు మార్చి మొదటి వారంలోగా పూర్తిచేయాలని, సాధారణ ఎన్నికలు దగ్గర పడ్డాక ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. మునిసిపల్ ఎన్నికలపై ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. -
కూలుతున్న ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామ పంచాయతీలు సైతం చాలా వరకు నూతన భవనాలు నిర్మించుకున్నాయి. కానీ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం రేపోమాపో కూలుతుందేమోనన్నట్లు తయారైంది. పెచ్చులూడిన పైకప్పుతో, చెట్ల వేర్లు పాకిన, తేమతో నిండిన గోడలతో ఉద్యోగులను భయపెడుతోంది. అందులో కూర్చుండి పనిచేయడానికి శాఖ ఉద్యోగులు జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని భయం భయంగా పనిచేస్తున్నారు. ఇందులోని డీపీఓ, డీఎల్పీఓ చాంబర్లతో పాటు ఇతర గదులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల పలు భవనాలు కూలిన సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీచేయాలని నోటీసులు జారీ చేశారు. కానీ పంచాయతీ అధికారి కార్యాలయానికి మాత్రం నోటీసులు పంపలేదు. గోడలపై చెట్లు మొలిచి, పెద్దపగుళ్లు వచ్చాయి. స్లాబు పూర్తిగా చెడిపోయి పెచ్చులూడుతోంది. వర్షకాలం సీలింగ్ నుంచి ధారగా ఊరుస్తూనే ఉంది. గోడలన్నీ తేమగా మారిపోయాయి. ఇప్పటికే కంప్యూటర్ విభాగంలో రెండు కొత్త కంప్యూటర్లు వర్షానికి తడిసి చెడిపోయాయి. ఉన్నవాటిని కాపాడుకునేందుకు సిబ్బంది కవర్లు కప్పి ఉంచుతున్నారు. పాతకాలం నాటి విలువైన దస్త్రాలు సైతం తడిసి ముద్దయ్యాయి. మొన్నటికి మొన్న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సామగ్రి సైతం వర్షంనీళ్లకు తడిసింది. ఇప్పటికీ అద్దె భవనంలోనే.. అసలు జిల్లా పంచాయతీ అధికారికి సొంత భవనమే లేదు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న కార్యాలయ భవనం మునిసిపాల్టీకి చెందింది. దీనికి శాఖ అద్దె చెల్లిస్తోంది. ఇందులో 1991 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఓ కార్యాలయానికి స్థలం ఉంది. దీంట్లో నూతన భవన నిర్మాణం కోసం 2000లో ప్రణాళికలు వేశారు. తీరా నిధులు లేక నిర్మాణం అటకెక్కింది. నిధుల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మంజూరు మాటేలేదు. నూతన భవనం కోసం.. -సురేశ్‌బాబు, డీపీఓ ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయంలో శిథిలావస్థకు చేరుకుంది. జడ్పీలో ఖాళీస్థలం ఉన్నా నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. వీటికోసం మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. అప్పటి వరకు మరో అద్దెభవనం కోసం గాలిస్తున్నాం.