పంచాయుతీలకు అధికారాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం అధికారాలను బదలాయించడంతోపాటు, జవాబుదారీతనం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాలపై కేసీఆర్ సమీక్షించారు. పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారాలు బదలాయించాలని, ప్రాథమిక విద్యను పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధి బాధ్యతను పంచాయతీలకు అప్పగించాలని పేర్కొన్నారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేద్దామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్ర పథ కం ఆసరాగా గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి తారకరామారావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యారు.