సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలోని మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పదవులను ఆయా కేటగిరీల మహిళలకు కేటాయించాలని సూచించారు.
కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాలకు 34 శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించాలని స్పష్టం చేశారు. ఇక మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73 శాతం లెక్కన ఆ వర్గానికి 580 సర్పంచ్ పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పదవులన్నింటినీ ఆ వర్గం వారికే కేటాయించాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా ఎస్టీలకు 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అయ్యాయి.
కొత్త చట్టం.. కొత్త రిజర్వేషన్లు..
రాష్ట్రంలో మొత్తం సర్పంచ్ స్థానాలు 12,751. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి 2.02 కోట్ల జనాభా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్సీ మహిళ, ఎస్టీ, ఎస్టీ మహిళ, బీసీ, బీసీ మహిళ, జనరల్, జనరల్ మహిళ కేటగిరీలుగా రిజర్వేషన్లు ఉంటాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ఖరారు విధానం ప్రస్తుత ఎన్నికలతోనే మొదలుకానుంది. అంటే 1995, 2001, 2006, 2013 ఎన్నికలలో ఖరారైన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా (జీరో రిజర్వేషన్) ప్రస్తుతం కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34 శాతం పదవులను కేటాయిస్తున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా.. జిల్లాల వారీగా బీసీలకు ఖరారు చేసే పదవుల సంఖ్యలో మార్పులు ఉంటాయి.
2011 లెక్కల ఆధారంగా
తాజా రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించనున్నారు. సర్పంచ్‌ల రిజర్వేషన్ సంఖ్యలను జిల్లాల వారీగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, మండలాల వారీగా జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్ పదవులు ఏ వర్గానికి అనేదాన్ని ఆర్డీవో, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీవో నిర్ణయిస్తారు. మొత్తానికి మండలం యూనిట్‌గా తీసుకుని జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు వరుసగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మిగిలిన పంచాయతీలను జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. గ్రామాల్లోని మొత్తం ఓటర్లు, అందులో బీసీ ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటూ రిజర్వేషన్లను నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment