నిధులు వరద
పంచాయతీలకు 9 నెలల్లో రూ.73.87 కోట్లు
గత ఏడాది కన్నా 12 రెట్లు అధికం నిబంధనలతో కొత్త పనులకు అడ్డంకులు
సడలింపు కోసం ప్రభుత్వానికి నివేదిక యోచిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
హన్మకొండ అర్బన్ : జిల్లాలో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు పోటెత్తాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలో రూ.73.87 కోట్లు పంచాయతీల ఖాతాల్లో చేరాయి. మరో నెల రోజుల్లో నాలుగో విడత నిధులూ జమ కానున్నాయి. మొత్తం రూ.100 కోట్లు దాటే అవకాశం ఉంది. గతంలో ఆగిన టీఎఫ్‌సీ ఫండ్ సైతం ప్రస్తుతం విడుదలవుతుండడంతో వచ్చిన నిధులు ఎలా ఖర్చు చేయాలో గ్రామ సర్పంచ్‌లకు అంతుచిక్కడం లేదు. అయితే... ఉన్న నిధులు ఖర్చు చేసే విధానంపై కొన్ని ఆంక్షలు ఉండడంతో పనులు చేపట్టే విషయంలో సడలింపు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాలని జిల్లా అధికా
యంత్రాంగం ఆలోచిస్తోంది.
పంచాయతీ చరిత్రలో తొలిసారి
ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం గ్రామ పంచాయతీల చరిత్రలోనే ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. నిధులు పెద్ద మొత్తంలో ఉండడంతో కొన్ని చోట్ల సర్పంచ్‌లు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. ఈ మేరకు లెక్కలు చూపలేక జిల్లాలో ఇప్పటికే 9 మంది వరకు సర్పంచ్‌లు చెక్‌పవర్ కోల్పోయారు. పరిస్థితి గమనించిన ప్రభుత్వం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాత లెక్కలు ఓసారి పరిశీలిస్తే 2013-14 ఆర్ధిక సంవ త్సరంలో జిల్లాలో మొత్తం 1014 గ్రామ పంచాయతీలు ఉండేవి. అప్పటి లెక్కల ప్రకారం పంచాయతీల పరిధిలోని జనాభా కూడా ఎక్కువగానే ఉండేది. అయినా 2013-14లో పంచాయతీలకు వచ్చిన మొత్తం సుమారు రూ.6.12 కోట్లు మాత్రమే అని అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. వాటితో పోల్చి చూస్తే ప్రస్తుతం వచ్చిన మూడు విడతల వచ్చిన నిధులు 12 రెట్లు అధికంగా ఉన్నాయి.
మరమ్మతులకు మాత్రమే...
ప్రస్తుతం ఉన్న నిధులు కేవలం మరమ్మతులు, వీధిలైట్ల వంటి వాటికి మాత్రమే వినియోగించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పంచాయతీల్లో నిధులు మూలుగుతున్నా... కొత్త పనులు చేపట్టలేక పోతున్నారు. పంచాయతీల నిధులు ఖర్చు కాకపోవడానికి ఇది కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. అయితే కొత్త డ్రెరుున్ల వంటి వాటిని ప్రస్తుత నిధులతో చేపట్టడంలో ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిసాదనలు సిద్ధం చేస్తున్నారు. ఉన్న నిధులను కొత్త పనులకు ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెరుున్ల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది.
ప్రతి పైసకూ జవాబుదారీగా ఉండాలి
గతంలో పంచాయతీలకు పాలకవర్గం లేని సమయంలో ఆగిపోయిన నిధులు కూడా ప్రస్తుతం విడుదలవుతున్నాయి. నిధుల ఖర్చుపై కొన్ని పరిమితులు ఉండడంతో పనులు కావడం లేదు. ఈ విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందకు చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీలకు వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం జాయింట్ చెక్‌వవర్ ఇచ్చింది. సర్పంచ్, కార్యదర్శులు ప్రతి పైసకూ జవాబుదారీగా ఉంటూ ఖర్చు చేయాలి.
- ఈఎస్.నాయక్, డీపీఓ