బాబు హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం | Local agencies weaken during Chandrababu regime | Sakshi
Sakshi News home page

బాబు హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం

Published Mon, Jun 25 2018 3:37 AM | Last Updated on Sat, Jul 28 2018 4:24 PM

Local agencies weaken during Chandrababu regime - Sakshi

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం మరూరులో మురుగుకాల్వల నిర్మాణం కూడా సరిగా లేక రోడ్డుపైనే మురుగు పారుతోంది. 
...
గుంటూరు జిల్లా రొంపిచర్లలో మంచినీటి పథకం ఉన్నా ఊరంతా మంచినీటి సమస్య..  
...
రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో ఊరుకో సమస్య.. ఒక ఊళ్లో శ్మశానం లేక సమస్య.. మరో ఊళ్లో వాగుపై వంతెన లేక ప్రజల ఇబ్బంది.. ఇలా ఎన్నో.. మరెన్నో.. 

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటిని కేంద్ర స్థాయిలోనో.. రాష్ట్ర స్థాయిలోనో పరిష్కరించడం సాధ్యం కాదని పాతికేళ్ల క్రితం స్థానిక సంస్థలకే విధులు, నిధులు, అధికారాలు అనే నినాదంతో 73, 74వ రాజ్యాంగ సవరణలు చేశారు. వీటి ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామ పంచాయతీలకు, పట్టణ, నగర పాలకసంస్థలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు నేరుగా చెల్లించాలి. ఈ నిధులతో స్థానిక సంస్థలు ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ, 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నేరుగా ఇచ్చే నిధులను సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఖర్చు చేయాలని ఆదేశాలిస్తోంది. దీంతో స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదు. స్థానిక సంస్థల అధికారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెలాయిస్తూ వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాటికే పెత్తనం అప్పగించింది. 

రూ.5,831 కోట్లు కేంద్రం ఇచ్చినా.. 
గత నాలుగేళ్లలో కేంద్రం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు రూ.5,831 కోట్ల నిధులు ఇచ్చింది. చిన్న గ్రామ పంచాయతీలు ఒక్కోదానికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా.. పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.60 లక్షల వరకు నిధులొచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సమస్యలకు ఆ నిధులను ఖర్చు పెట్టనీయకుండా చంద్రన్నబాట, చంద్రన్న క్రాంతి, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పథకాలకు మాత్రమే కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు పెట్టాలని ఆదేశాలిస్తోంది. దీంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ఉదాహరణకు.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం మరూరులో మురుగు కాల్వలు లేక రోడ్డుపైనే మురుగు పారుతోంది. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో రాప్తాడు నియోజకవర్గంలోనే గత మూడు నెలల్లో 30 మలేరియా కేసులు నమోదయ్యాయి.

అలాగే గుంటూరు జిల్లా రొంపిచర్లలో మంచినీటి సమస్య వేధిస్తోంది.  స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో ఉన్న అధికారాలు, నిధులను గ్రామ పంచాయతీలు వినియోగించుకోలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అవసరాలకు కాకుండా గ్రామంలో సమస్యల పరిష్కారానికి, ఏవైనా అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులు నిధులు డ్రా చేసుకోనీయకుండా చంద్రబాబు సర్కార్‌ ట్రెజరీలకు మౌఖిక ఆదేశాలను జారీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు కారణంగా.. ట్రెజరీల్లో గ్రామ పంచాయతీల నిధులు రూ.1730 కోట్లు వృథాగా పడి ఉన్నాయని పంచాయతీ అధికారుల అంచనా. మరోపక్క ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పేరుతో వచ్చే పదేళ్లు ఏటా గ్రామ పంచాయతీలు కాంట్రాక్టర్లకు లక్షల్లో (ఒక్కో విద్యుత్‌ స్తంభానికి రూ.450 చొప్పున) చెల్లించేలా గ్రామ పంచాయతీల నెత్తిన బండ వేసింది. 

జిల్లా, మండల పరిషత్‌లు అస్తవ్యస్తం 
మరోపక్క జిల్లా, మండల పరిషత్‌లు మూడేళ్లుగా నిధుల్లేక విలవిల్లాడుతున్నాయి. ఏడాదికి రెండు, మూడు లక్షల ఆదాయం కూడా లేని మండల పరిషత్‌లు రాష్ట్రంలో వందల సంఖ్యలోనే ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు గతంలో దాదాపు రూ.25 కోట్లు ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. కాగా, గతేడాది ఆర్థిక సంఘం నిధులు లేక దాని ఆదాయం రూ.15 కోట్లకు పరిమితమైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం.. పంచాయతీలకు, జిల్లా, మండల పరిషత్‌లకు వాటాలవారీగా నిధులు ఇచ్చేది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత మొత్తం నిధులను గ్రామ పంచాయతీలకే ఇస్తూ.. మండల, జిల్లా పరిషత్‌ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి నిధులు విడుదల చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలకు ముందుకు రాకపోవడంతో జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి చెల్లించే నిధులను కూడా విడుదల చేయలేదు. 

అప్పుల ఊబిలో మునిసిపాలిటీలు
చంద్రబాబు ప్రభుత్వం పట్టణ, నగర పాలక సంస్థల విధుల్లోనూ జోక్యం చేసుకుంటోంది. ఏ అవసరాలకు నిధులను ఖర్చు పెట్టాలో ఆదేశాలు జారీ చేస్తోంది. కేంద్రమిచ్చే నిధులను తాము చెప్పిన పథకాలకే ఖర్చు పెట్టిస్తుండటంతో పట్టణ, నగరపాలక సంస్థలు డమ్మీలుగా మారాయి. దీంతో అవి అప్పుల ఊబిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ వంటి నగరపాలక సంస్థలు అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు, విశాఖపట్నం వంటి నగర పాలక సంస్థలకు ఏళ్ల తరబడి ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది. 

ఉత్సవ విగ్రహాల్లా ప్రజాప్రతినిధులు 
స్థానిక సంస్థల అధికారాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం జన్మభూమి కమిటీల నియామకం చేపట్టడంతో  ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. లబ్ధిదారుల ఎంపిక మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను జన్మభూమి కమిటీలే చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో 12,805 మంది గ్రామ సర్పంచులు, దాదాపు 1,38,000 మంది వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉంటున్నారు. జిల్లా, మండల పరిషత్‌లకు నిధుల్లేక 10,800 మంది ఎంపీటీసీలు, 660 మందికి పైగా జెడ్పీటీసీలు తాము ప్రజలకు ఏం చేయాలో తెలియక కాలం వెళ్లదీస్తున్నారు.

రాష్ట్రంలో స్థానిక ప్రజా ప్రతినిధులు 12,805 మంది
గ్రామ సర్పంచులు 1,38,000  మంది వార్డు సభ్యులు (దాదాపు) 
10,800 మంది ఎంపీటీసీలు
660 మందికి పైగా జెడ్పీటీసీలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement