గ్రామ పంచాయతీల్లోని కార్మికుల వేతనాలపై హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ స్థాయిల్లోని కార్మికులకు నియామక పత్రాలు లేకపోయినప్పటికీ, చట్ట ప్రకారం వారు కనీస వేతనాలు పొందేందుకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. వారికి దక్కాల్సిన కనీస వేతనాలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. గ్రామ పంచాయతీల్లోని కార్మికుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వేతనాలతో పాటు వారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రామపంచాయతీల్లోని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దాఖలు చేసిన పిల్ సోమవారం విచారణకు వచ్చింది. 8 వేల గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 55 వేల మంది కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.1000 మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, వారు చట్టం ప్రకారం రూ.2500 పొందేందుకు అర్హులని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వివరించారు. వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
కనీస వేతనానికి అర్హులే
Published Tue, Jun 16 2015 3:36 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement