సాక్షి, హైదరాబాద్: ‘నగర శివార్లలోని గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మాపై(రాష్ట్ర ఎన్నికల సంఘం) హైకోర్టులో కోర్టు ఉల్లంఘన కేసులు నమోదు అవుతున్నాయి. ఆ గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తారా? లేక మునిసిపాలిటీలుగా ప్రకటిస్తారా? రెండు రోజుల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పండి’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఆ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసిందని, దీంతో ఆ ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. ఈ విలీన ప్రక్రియను ప్రశ్నిస్తూ పలువురు కోర్టుకు వెళ్లడం.. కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూనే.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం పంచాయతీలను విలీనం చేయలేదని పేర్కొన్న విషయాన్ని రమాకాంత్‌రెడ్డి పురపాలక శాఖ ఉన్నతాధికారులకు గుర్తుచేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నగర శివారు గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించింది. ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి, కార్యదర్శి నవీన్ మిట్టల్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఆర్‌డీఎంఏ డాక్టర్ సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలోని 37 గ్రామ పంచాయతీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై 15 పంచాయతీల ప్రజలు కోర్టుకు వెళ్లడంతో ఆ ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. అయితే, ప్రస్తుతం ఈ పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాలా? లేక పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేయాలా? అన్న అంశంపై ఫైలును ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపించినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి వివరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు వెళ్తామని, దీనిపై రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామని అధికారులు వివరించినట్లు సమాచారం.
మార్చిలోపే మున్సిపల్ ఎన్నికలు!
మునిసిపల్ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించినట్లు సమాచారం. మునిసిపల్ ఎన్నికలు మార్చి మొదటి వారంలోగా పూర్తిచేయాలని, సాధారణ ఎన్నికలు దగ్గర పడ్డాక ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేస్తే.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. మునిసిపల్ ఎన్నికలపై ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
శివారు పంచాయతీలపై తేల్చండి!
Published Wed, Oct 30 2013 2:38 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement