♦ న్యాయ చిక్కులతో 5 మునిసిపాలిటీల ఏర్పాటులో జాప్యం
♦ 11 గ్రామాలకు ‘పంచాయతీ’లుగానే ఎన్నికలు!
♦ ప్రభుత్వానికి లేఖ రాసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగర శివార్లలో ఐదు కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుకు బ్రేక్ పడింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండల పరిధిలో 11 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా జల్‌పల్లి, బోడుప్పల్, పిర్జాదిగూడ, జిల్లేలగూడ, మీర్‌పేట మునిసిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేస్తే తమ పదవులు కోల్పోతామని స్థానిక ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. న్యాయ చిక్కుల్లో ఇప్పట్లో తొలగే సూచనలు కనిపించకపోవడంతో ఈ 11 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. జల్‌పల్లి, జిల్లేలగూడ, మీర్‌పేట్‌తో పాటు ఘట్‌కేసర్ మండల పరిధిలో బోడుప్పల్, పిర్జాదిగూడ, కొత్తపేట, పహాడిషరీఫ్, బాలాపూర్, బోడుప్పల్, చెంగిచెర్ల, మేడిపల్లి, పర్వతాపూర్, జిల్లేలగూడ, మీర్‌పేటలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకట్రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
నేడు సిద్దిపేట ఎన్నికల నోటిఫికేషన్
మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలకు ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించి 11వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
20 వార్డులుగా బాదేపల్లి నగర పంచాయతీ
మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన బాదేపల్లి (జడ్చర్ల) నగర పంచాయతీని 20 వార్డులుగా పునర్విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒకట్రెండు రోజుల్లో పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేయనుంది.
శివార్లలో కొత్త పురపాలికలకు బ్రేక్
Published Sun, Mar 20 2016 4:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement