
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాతే వచ్చిన దరఖాస్తుల్లో నుంచి అర్హులను ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్ రాజా సదారాం, సమాచార కమిషనర్ బుద్దా మురళి నియామకాలను రద్దు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారి అర్హతలపై పిటిషనర్ ఎటువంటి అభ్యంతరం లేవనెత్తని నేపథ్యంలో నియామకాలను రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేయకుండానే సదారాంను ప్రధాన సమాచార కమిషనర్‌గా, మురళిని సమాచార కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిందని.. దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి ఆ నియామకాలను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌కు చెందిన జి.శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. కేవలం నోటిఫికేషన్ ఇవ్వకుండా నియా మకాలు చేపట్టడం మాత్రమే పిటిషనర్‌కు అభ్యంతరంగా కనిపిస్తోందని.. ఇకపై అలా జరగకుండా నోటిఫికేషన్ జారీ చేసి ఆ పదవుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక వ్యాజ్యంలో విచారించడానికి ఏమీ లేదని.. దాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment