Information Commissioner
-
కమిషనర్లు లేక..సమాచారం రాక..
‘రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క కమిషనర్ కూడా లేరా? ఒక్క కమిషనర్ కూడా లేకుంటే అప్పీళ్లను సిబ్బంది విచారిస్తారా? ఇలాగైతే సమాచార హక్కు చట్టం చేసి ఏం ప్రయోజనం? కౌంటర్లు అక్కర్లేదు..ఎప్పుడు నియమిస్తారో చెప్పండి?’ – పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం ‘ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులొచ్చాయి. త్వరలో సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాం. దీని కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలి’ – 2023 ఆగస్టులో హైకోర్టుకు సర్కారు నివేదనసాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసురావడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన సమాచారహక్కు చట్టం కమిషనర్లు లేక నిర్వీర్యమవుతోంది. ప్రధాన సమాచార కమిషనర్ 2020, ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023, ఫిబ్రవరి 24న తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చే వారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలూ సరిగా లేవు. ఇక అప్పీలు చేద్దామంటే రాష్ట్రస్థాయిలో కమిషనే లేదు. ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి.. జూన్ 29వ తేదీని ఆఖరు తేదీగా ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా.. ఇప్పటివరకూ దరఖాస్తుల పరిశీలనే జరగలేదు .రాష్ట్ర కమిషన్.. సెక్షన్ 15(1) కింద ఈ కమిషన్ ఏర్పాటవుతుంది. దీనికి ఓ ప్రధాన కమిషనర్‌తో పాటు గరిష్టంగా 10 కమిషనర్ల వరకు నియమించవచ్చు. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా శాసనసభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ వీరిని నియమిస్తారు. కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. » ప్రజాజీవనంలో సుప్రసిద్ధులే ఉండాలి. విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవమున్నవారు ప్రధాన కమిషనర్, కమిషనర్‌గా అర్హులు. » ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామకమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా వయసు 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. అయితే మొత్తంగా ఐదేళ్లు మించి బాధ్యతల్లో కొనసాగడానికి వీలులేదు. » వీరిని తొలగించడం గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే సాధ్యం. అధికారాలు.. సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి »వ్యక్తులకు సమన్లు జారీ చేసి హాజరయ్యేట్టు లేదా లిఖిత పూర్వకంగా సాక్ష్యం ఇచ్చేట్టు చేయడం » అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించడం, తనిఖీ చేయడం » అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం స్వీకరించడం » కోర్టు లేదా ప్రభుత్వ కార్యా లయం నుంచి రికార్డులు, కాపీలు తెప్పించడం » ఏపీఐసీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ » 2017, సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ కమిషన్ ప్రారంభం. గణాంకాలు ఆ తేదీ నుంచే. »2024 అప్పీళ్లు, ఫిర్యాదుల గణాంకాలు ఆగస్టు 24 వరకు.. » 17,792 ఫిర్యాదుల్లో ఒకసారి కమిషన్ ఆదేశాలు జారీ చేసినా సమస్య పరిష్కారం కాలేదంటూ మళ్లీ వచి్చన కేసులు 3,210 ఎవరు అప్పీల్ చేయవచ్చు » సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారి నిరాకరించినప్పుడు.. » నిర్దేశించిన 30 రోజుల్లో సమాచారం రాకపోయినా.. » సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని అనిపిస్తే.. » ఒకవేళ అధికారి తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని భావిస్తే.. » తగిన కారణాలుంటే కమిషన్ నేరుగా విచారణకు కూడా స్వీకరించవచ్చు. -
సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార కమిషనర్ల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 29వ తేదీ లోపు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ శాంతకుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు.తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ TSIC.GOV.IN ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. -
ఏపీ ముఖ్య సమాచార కమిషనర్ & కమిషనర్ ప్రమాణస్వీకారం
-
నిబద్ధతే అసలైన కొలబద్ద
పదవీవిరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్ నియామక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపాల్సిన జోడు గుర్రాలు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వతంత్రులా? అస్వతంత్రులా? స్వతంత్రులైతే... తరచూ న్యాయస్థానాల మందలింపులెందుకు? విప క్షాల విమర్శలేల? సర్కార్లు మారినపుడల్లా సాధింపులెందుకు? అస్వ తంత్రులైతే... ఇంతకీ వారు ఎవరికి కట్టుబడి ఉండాలి, అప్పటి పాల కులకా? ప్రభుత్వ విధానాలకా? రాజ్యాంగ పరిధి చట్టాలకా? ఎందు కిన్ని ప్రశ్నలంటే.. వారి పనితీరు రేకెత్తిస్తున్న సందేహాలే కారణం! నిబంధనలకు నీళ్లొదిలి కొన్ని ప్రభుత్వాలు వారి సేవల్ని దుర్విని యోగం చేస్తున్న వైఖరొక హేతువు! సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను హైకోర్టు మందలించడం, ముంబై నగర పోలీస్ కమిషనర్ ఆక స్మిక బదిలీ, గోవా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు బాధ్యతల నుంచి ఆ రాష్ట్ర న్యాయకార్యదర్శిని సుప్రీంకోర్టు తప్పించడం.. ఇటువంటి తాజా పరిణామాలన్నీ ఇదే స్పష్టం చేస్తున్నాయి. దేశంలో అత్యున్నత అధికార వ్యవస్థను నడిపే అఖిల భారత సర్వీస్ అధికారులు తరచూ వివా దాలకు, విమర్శలకు కేంద్ర బిందువవుతున్నారు. నిజానికి ఎక్కువ మంది అధికారులు చట్టాలకు, విధానాలకు లోబడి ప్రజా సంక్షేమం కోసం పనిచేసే వారయినా, ఉద్యోగవర్గంపై విమర్శలకు కొదువ లేదు. కొన్నిసార్లు పాలకుల చేష్టలు కారణమైతే, మరికొన్నిసార్లు సదరు అధి కారుల వ్యవహారశైలే ఇందుకు దారితీస్తోంది. ఫలితంగా ఉన్నతాధికార వ్యవస్థ ప్రజా విశ్వాసం కోల్పోతోంది. మరేమిటి మార్గం? అనే ప్రత్యామ్నాయ ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. తాము తలపెట్టిన సంస్కరణలు నెమ్మదించడానికి అధికార వ్యవస్థ మందకొడితనమే కారణమని దేశ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. సంప్రదాయానికి భిన్నంగా, వయసు మళ్లిన నిపు ణుల్ని పాలనావ్యవస్థలోకి నేరుగా తీసుకోవడం (లేటర్ ఎంట్రీ) క్రమంగా ఎక్కువౌతోంది. ఆర్థిక వ్యవస్థ ఛిద్రమై, కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా ప్రైవేటీకరణకు వాకిళ్లు తెరుస్తున్న ప్రస్తుత సంక్షుభిత సమయంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సర్కారు ఎందుకు నడపాలి? అని ప్రశ్నించే ముందు, అందుకు బాధ్యులెవరో శోధించరా? కడదాకా నిలువని తొలినాళ్ల స్ఫూర్తి దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసు అధికారులు అత్యధికుల్లో తొలినాళ్ల ఉత్సాహం, నిబద్ధత తర్వాతి సంవత్సరాల్లో కనబడటం లేదు. పలు రకాల జాడ్యాలకు వారు లోబడిపోతున్నారనే విమర్శలున్నాయి. అత్యున్నత ప్రమాణాలతో ఎంపిక వల్ల ప్రతిభ, నైపుణ్యం కలిగిన వారే వస్తుంటారు. ఉత్తమ శిక్షణ వల్ల మంచి ఆశయాలతో సర్వీసులో చేరుతారు. ఇటీవలి సంవత్స రాల్లో అయితే... ఐఐటీ, ఐఐఎం తదితర ప్రామాణిక సంస్థల నుంచి పట్టాలు పొందిన వారు అఖిల భారత, రాష్ట్రాల సర్వీసులకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. మొదట్లో వారు పూర్తి సమయం వెచ్చించి, ఉదాత్తమైన సేవల్ని అందిస్తారు. సంక్షేమమైనా, అభివృద్ది కార్యక్రమా లైనా క్షేత్రంలో మంచి చొరవ, నాయకత్వ స్ఫూర్తితో నిర్వహించి ఆద రణ పొందుతారు. కాలం గడుస్తుంటే పరిస్థితిలో చాలా మార్పు వస్తోంది. అధికారం కేంద్రీకృతమయ్యే రాజకీయ వ్యవస్థ ప్రాపకం కోసం ప్రయాసలో దారి తప్పుతుంటారు. కొన్నిసార్లు రాజకీయ క్రీ(నీ)డల్లో సమిధలవుతారు. అందుకే తరాలు మారుతున్నా... అధికా రుల మంచితనం మాట్లాడేటప్పుడు ఒక శంకరన్, ఒక వేణుగోపాల్, ఒక నాగిరెడ్డి వంటి కొన్ని పేర్లే ఉదహరించాల్సి వస్తోంది. ‘అధికార వ్యవస్థ–వృద్ధి’ అనే అంశంపై ఓ ప్రపంచ స్థాయి సదస్సులో సమ ర్పించిన పత్రం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న 35 దేశాల్లో ఆర్థికాభివృద్ధికి అధికారుల నైపుణ్యాలే కారణంగా వెల్లడైంది. ‘తూర్పు ఆసియా అద్భుతం’ పేరిట ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదికలోనూ జపాన్, కొరియా వంటి దేశాల్లో ఇది సాధ్యమైనట్టు స్పష్టమైంది. మనది సహజంగానే ‘వృద్ధి ప్రతిబంధక’ ఉద్యోగ వ్యవస్థ అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. వీరప్పమొయిలీ నేతృత్వాన 2005లో ఏర్పాట యిన రెండో పాలనా సంస్కరణల కమిషన్ సిఫారసుల్లోనూ అత్య ధికం సీనియర్ అధికారులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. కానీ, అవేవీ సరైన రీతిలో అమలుకు నోచలేదు. పాలనా సంస్కరణలు కష్టమేమో కానీ, అసాధ్యమేమీ కాదు. చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పి.. అధికార వ్యవస్థ చెడ్డపేరుకు కారణాలెన్నో! వారి పనుల్లో రాజకీయ అనుచిత జోక్యాలు, నేతల ప్రాపకానికి అధికారులు అర్రులు చాచడం వంటివి ముఖ్యం. మంచి హోదాలు పొందడానికో, ఇష్టమైన చోటుకు బదిలీనో–ఇష్టం లేని చోటు తప్పించుకోవడానికో కొందరు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నారు. అంతిమంగా వివిధ స్థాయిల్లో జరిగే అవి నీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాయి. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించే పనులు నాయకులు చెప్పినా... కూడదని నిరాకరించి, అడ్డంగా నోట్‌ఫైల్ రాసే అధికారులు ఎందరుంటారు? దేశంలో మధ్యాహ్న భోజన వ్యవస్థకు తమిళనాడులో బీజం పడింది. సదరు ప్రతిపాదన వచ్చినపుడు ఇది ఆచరణ సాధ్యం కాదంటూ ఫైలును ఆర్థికాధికారి తిప్పిపంపారు. నాటి ముఖ్యమంత్రి ఆ అధికారిని పిలిపించి, ‘ఈ పూట భోజనం ఎక్కడ్నుంచి, ఎవరు పంపితే వచ్చిందో తెలియకుండా.. తదుపరి పూట భోజనం అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా?’ అని అడిగారట. ‘లేదు’ అని చెప్పిన అధికారికి, ‘నేనా పరిస్థితి ఎదు ర్కొన్నాను. రాష్ట్రంలో ఎందరో అలాంటి వారున్నారు. సంక్షేమ రాజ్యంగా వారిని ఆదుకోవడం మన బాధ్యత, ఎలా సాధ్యమో నే చూసుకుంటాను, నీ అభిప్రాయాన్ని ఓవర్‌రూల్ చేస్తూ నోట్ రాస్తున్నాలే!’ అని సౌమ్యంగా చెప్పి పంపారట. ఆయన ఎవరో కాదు, దివంగత ఎమ్జీ రామచంద్రన్. రాజకీయ వ్యవస్థకు లొంగి చట్టాలు, నిబంధనల్ని మెలితిప్పటమే కాదు, కోర్టు ఉత్తర్వుల్నీ అమలు చేయని అధికారులుంటారు. అది న్యాయ ధిక్కారం కేసు అయినపుడు కోర్టుల నుంచి చీవాట్లు. ‘ఈ పద్ధతేం బాగోలేదు. కోర్టు ఆదేశాలు అమలు చేయరు. చివరి నిమిషం దాకా ఎలా భంగపరచాలని చూస్తారు. తప్పనపుడు... బేషరతుగా క్షమాపణలు అడుగుతారు’ అని తెలంగాణ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సంగారెడ్డి జిల్లా అధికారుల్ని మందలించింది. పరస్పర లబ్ధికి లొంగుబాట్లు.. విభేదించినప్పటి కన్నా, నేతలతో అధికారులు అంటకాగటం వల్ల ఉద్యోగ వ్యవస్థ భ్రష్టుపట్టిందే ఎక్కువ! అలా అని అన్నింటికీ అధికా రులు నేతల్ని విభేదించాలని ఎవరూ అనరు. పాలకులకు అనుచిత ప్రయోజనాలు కల్పించినందుకు ఉద్యోగ విరమణ తర్వాత మంచి హోదాలు పొందిన వారుంటారు. వాటిపై కన్నేసి... రాజ్యాంగానికి, చట్టానికీ అతీతంగా ఉద్యోగం చివరి రోజుల్లో రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసిన అధికారులూ ఉన్నారు. అందుకే, వివిధ కమిషన్లు, కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల్లోకి పదవీ విరమణ తర్వాత అధికారులు రావడాన్ని పౌరసమాజం తరచూ విమర్శిస్తోంది. యోగ్యులు, వివాద రహితులైన తటస్థ అధికారులు రావటాన్ని స్వాగతించిన సందర్భాలెన్నో! యోగ్యత లేకుండా జరిగే అడ్డదిడ్డపు నియామకాలను కోర్టులూ తప్పుపట్టాయి. పదవీ విరమణ చేసిన అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఎక్కువ మందిని సమాచార హక్కు కమిషనర్లుగా నియమించడం పట్ల దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నది ముఖ్య విమర్శ. అధికారులు సమాచారం సరిగా ఇవ్వనందుకే, సర్వీసు నిబంధనల్ని ఉన్నతాధికారులుగా ఉల్లంఘించినందుకే... అప్పీళ్లు వచ్చే ఆర్టీఐ కమిషన్లలో, పాలనా ట్రిబ్యునళ్లలో తిరిగి రిటైర్డ్ అధికారులే తీర్పులు చెప్పడమేమిటి? అన్నది సగటు మనిషి విస్మయం. కేంద్ర విజిలెన్స్ కమిషన్‌లోకి ఓ అధికారి థామస్ నియా మక ప్రక్రియ వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కూడా, ‘మీకు నిపుణులంటే రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కనిపిస్తారా? పౌర సమాజంలోని ఇతర మేధావుల్ని ఎంపిక చేసుకోవడంపై ఎందుకు దృష్టి పెట్టరు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాయకులైనా, అధికారులైనా... జనహితమే లక్ష్యంగా పాలనా రథాన్ని సజావుగా నడపా ల్సిన జోడు గుర్రాలు. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు. ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా? బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఇతర సమాచారం.. ► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. ► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది. బిల్లుపై కేంద్రం మాట.. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది. -
మాజీ సేవకులే, తాజా కమిషనర్లా?
సమాచార కమిషనర్ల నియామకంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తాపీగా, నింపాదిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తిం చింది. కమిషనర్లను నియమించకపోవడం, ఉన్న వారు పదవీ విరమణ చేసిన తరువాతైనా కొత్తగా నియామకాలు చేయకపోవడం, మాజీ ప్రభుత్వోద్యోగులను నియమించడమే ప్రభుత్వాలు సమాచార హక్కును నీరుగార్చడానికి పన్నే వ్యూహాలు. కాలపరిమితుల్లో ఫైళ్ల సమాచారాన్ని పౌరులకు ఇప్పించడానికి రూపొందిన ఆర్టీఐ చట్టం కమిషనర్లు లేకుండా సాగదు. పౌరులు అడిగిన సమాచారాన్ని కమిషనర్లు ఇప్పించడంతో పాలకుల సంగతులన్నీ జనాలకు తెలియడం మొదలైంది. జనం ఏమడుగుతారో, ఏం ఇవ్వాల్సి వస్తుందో అని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వారిపై రాజకీయ నాయకులు ఆందోళన చెందడం కూడా పెరి గిపోయింది. దీనివల్ల జనం చైతన్యవంతులవుతున్నారనీ, తప్పులు చేయదలుచుకున్న అధికారులు, ఉద్యోగులు భయపడడం వల్ల అవినీతి తగ్గుతుందని తెలిసినా కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వాలు కదలడమే లేదు. ఆర్టీఐ ప్రియులు కోర్టులను ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాలు వేస్తే, దానిపై కోర్టులు నోటీసులు ఇచ్చి నాలుగు అక్షింతలు వేస్తే తప్ప నియామకాల ఫైళ్లు కదలడం లేదు. ఒక్క కేంద్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. కేంద్రంలో ఉన్నంత కదలిక రాష్ట్రాలలో లేకపోవడం దురదృష్టకరం. వెంట వెంటనే నియామకాలు పూర్తి చేయమంటూ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఒక గణనీయమైన తీర్పు చెప్పింది. ఏపీ, తెలంగాణతో ఏడు రాష్ట్రాలు వెంటనే పారదర్శకంగా కమిషనర్ల నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించింది. నియామకాలు జరిగిన చోట పరిశీలిస్తే అందరూ మాజీ అధికారులే. ప్రభుత్వ సేవకులనే ప్రభుత్వం కమిషనర్లుగా నియమించడం ఎందుకనీ, మిగతా రంగాలలో మీకు సుప్రసిద్ధులైన వ్యక్తులే దొరకలేదా అనీ నిలదీసింది. ఆర్టీఐ చట్టం సెక్షన్ 12(5)లో ఎనిమిది రకాల వృత్తి ఉద్యోగరంగాలను పేర్కొంటూ అందులో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయాలని ఆదేశిస్తున్నా, కేవలం ఉద్యోగులనే నియమిస్తున్నారు. ‘తమ అధీనంలో పనిచేసిన మాజీ అధికారులనే కమిషనర్లుగా నియమించడంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నదని’ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎ కె సిక్రీ, ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఏపీతో సహా చాలా రాష్ట్రాల్లో చీఫ్ కమిషనర్ లేనే లేరు. తెలంగాణలో చీఫ్, ఒక కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కమిషనర్లను నియమించారు కానీ వారి పని ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో 2019 జనవరి 23 నాటికి పది వేల 102 అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. 2017 అక్టోబర్ 23 నుంచి 2019 జనవరి 23 వరకు దాఖలైన అప్పీల్స్‌లో 65 శాతం వినడం పూర్తయింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి చీఫ్‌తోపాటు ఒక కమిషనర్ పనిచేస్తున్నారు. ఈ కమిషనర్ల సంఖ్య సరిపోదు, చాలా తక్కువ అని సుప్రీంకోర్టు విమర్శించింది. కమిషనర్ల నియామకం కాకముందే 6,825 కేసులు ఉన్నాయి. తరువాత పదివేలకు పెరి గాయి. ఈ ఇద్దరు కమిషనర్లు ఎన్నేళ్లు వింటే ఈ కేసులు ముగుస్తాయి? జనానికి ఎప్పుడు సమాచారం ఇస్తారు? తెలంగాణ కమిషన్‌లో మిగతా ఖాళీలు ఆర్నెల్లలో పూరించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణం. అడిగిన సమాచారం ఇవ్వడం ఎందుకు, రెండో అప్పీలు వినడానికి కమిషనే లేదు. కమిషన్ వేసినా పని మొదలు కాలేదు. ఆ తరువాత మన కేసు కొన్నేళ్లదాకా రాదు. అయినా మన బాస్‌లే అక్కడ కమిషనర్లు కనుక పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదులే అనే నిర్లక్ష్య వైఖరి అక్కడ నెలకొంది. 2014లో రాష్ట్రవిభజన తరువాత సొంతంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఊసే ఎత్తరు. ఉమ్మడి రాష్ట్రం కమిషనర్లలో కొందరు రిటైరయినారు. కొందరి నియామకం రద్దయింది. తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇద్దరిని నియమించుకున్నది. ఏపీలో కమిషనే లేదు. ఈ హక్కు లేకుండానే రెండేళ్లు గడిపింది ఏపీ సర్కార్. హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు పడిన తరువాత ఇటీవల ముగ్గురిని ఎంపిక చేశారు. వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తరువాత నెలలు గడిచినా వారికి కార్యాలయమైనా ఉందా? కేసుల విచారణ చేపట్టారా? అనుమానమే. చీఫ్ కమిషనర్, ఇంకొందరు కమిషనర్ల ఎంపికకు చర్యలే తీసుకోవడం లేదేమిటి అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. మూడు నెలల్లో చీఫ్‌ను నియమించండి, కమిషన్ ఖాళీలను పూరించండి అని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
‘కమిషనర్ల’ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇకపై ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లను నియమించేటప్పుడు నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాతే వచ్చిన దరఖాస్తుల్లో నుంచి అర్హులను ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రస్తుత ప్రధాన సమాచార కమిషనర్ రాజా సదారాం, సమాచార కమిషనర్ బుద్దా మురళి నియామకాలను రద్దు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారి అర్హతలపై పిటిషనర్ ఎటువంటి అభ్యంతరం లేవనెత్తని నేపథ్యంలో నియామకాలను రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేయకుండానే సదారాంను ప్రధాన సమాచార కమిషనర్‌గా, మురళిని సమాచార కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిందని.. దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి ఆ నియామకాలను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌కు చెందిన జి.శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. కేవలం నోటిఫికేషన్ ఇవ్వకుండా నియా మకాలు చేపట్టడం మాత్రమే పిటిషనర్‌కు అభ్యంతరంగా కనిపిస్తోందని.. ఇకపై అలా జరగకుండా నోటిఫికేషన్ జారీ చేసి ఆ పదవుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక వ్యాజ్యంలో విచారించడానికి ఏమీ లేదని.. దాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని, ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది. సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
సర్కారుకు హైకోర్టు షాక్
నలుగురు సమాచార కమిషనర్ల నియామకం రద్దు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్లుగా వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మలల నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు ఆమోదంతో ఆ నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 75ను కోర్టు రద్దు చేసింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆరు వారాల్లోపు కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. నియామకం నాటికి ఆ నలుగురికి రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది గనుక వారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. గవర్నర్ తిరస్కరించినా... వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఎం.విజయనిర్మల, ఇంతియాజ్ అహ్మద్‌లను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఫైలును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపడం, వారి పేర్లపై తీవ్ర విమర్శల నేపథ్యంలో గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. కానీ మరోసారి అవే పేర్లతో ఫైలును పంపడంతో వారి నియామకాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆ మేరకు ్త 2013 ఫిబ్రవరి 6న ప్రభుత్వం జీవో 75ను జారీ చేసింది. ఆ జీవోను కొట్టివేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్ కె.పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్ఎస్ ఎం.పద్మనాభరెడ్డి, డాక్టర్ రావ్ చెలికాని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరవాత రూల్ ఆఫ్ లా అనే సంస్థ కూడా మరో వ్యాజ్యం వేసింది. నమిత్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈ నలుగురి నియామకం జరిగిందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ‘‘సమాచార కమిషన్ సభ్యుల్లో కనీసం ఇద్దరికి న్యాయ పరిజ్ఞానం ఉండాలని, పలు రంగాల్లో నిష్ణాతులైన వారినే నియమించాలని సుప్రీం చేసిన నిర్దేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కమిషనర్లుగా నియమితులయ్యే వారికి రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధమూ, లాభదాయ పోస్టులు, వ్యాపారాలూ ఉండరాదన్న నిబంధనలకు విరుద్ధంగా వారి నియామకం జరిగింది. తాంతియాకుమారి చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు. కమిషనర్‌గా ఆమె పేరును ముగ్గురు మంత్రులు సిఫార్సు చేశారు. ఇంతియాజ్ అహ్మద్ 2009లో టీడీపీ తరఫున ప్రస్తుత సీఎం కిరణ్‌పై పోటీ చేసి ఓడిపోయి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. విజయనిర్మల 2009లో నూజివీడు నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడారు. వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరించారు. కమిషనర్‌గా ఆయన పేరును పరిశీలించాలంటూ మంత్రులు జానారెడ్డి, రఘువీరారెడ్డి, పార్థసారథి రాతపూర్వకంగా సీఎంకు సిఫార్సు చేశారు’’ అని వాదించారు. వాటితో ధర్మాసనం ఏకీభవించింది. ‘‘నియామకం నాటికి తమకు ఏ పార్టీలతోనూ అనుబంధం లేదని వారు తమ కౌంటర్లలో ఎక్కడా చెప్పలేదు. తద్వారా పార్టీలతో తమ అనుబంధాన్ని వారు ఖండించలేదు’’ అని తీర్పులో పేర్కొంది. సమాచార కమిషనర్ల నియామకాలను ఆరీటై చట్టప్రకారమే చేపట్టాలంటూ నమిత్‌శర్మ కేసు తీర్పును పునః సమీక్షించి సుప్రీం తాజాగా తీర్పునిచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో ఆ నలుగురు భేటీ సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ నలుగురు ఆర్టీఐ కమిషనర్లు గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నియామకంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కమిషనర్లు యోచిస్తున్నారు. -
సమాచార కమిషనర్లపై తీర్పులో పొరపాటు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాల్లో అర్హతలను సవరించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తన తీర్పులో పొరపాటును గ్రహించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారిని మాత్రమే కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించాలని, ఇందుకోసం సమాచార హక్కు చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పులో న్యాయపరమైన పొరపాటు దొర్లినట్లు పేర్కొంది. ఆ మేరకు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. సమాచార కమిషనర్ల పదవుల్లో నియామకానికి అవసరమైన అర్హతలకు సంబంధించి సమాచార హక్కు చట్టం-2005లోని 12, 15 సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం గత ఏడాది సెప్టెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఆ సెక్షన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే సమాచార కమిషనర్లు వంటి న్యాయ సదృశమైన పదవుల్లో న్యాయపరమైన నేపథ్యం ఉన్నవారినే నియమించాలని, ఆమేరకు చట్టంలో సవరణలు చేయాలని తీర్పులో పేర్కొంది. ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని సమాచార కమిషనర్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వారినే నియమించాలని స్పష్టం చేసింది.