న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment