sanjiv chaturvedi
-
మంత్రుల అవినీతిని బయటపెట్టండి
న్యూఢిల్లీ: 2014–17 మధ్యకాలంలో కేంద్ర మంత్రులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను, వారిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని ముఖ్య సమాచార కమిషనర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సంజీవ్ చతుర్వేది పిటిషన్ మేరకు సమాచార కమిషనర్ రాధాకృష్ణ మాధుర్ పీఎంవోకు పైవిధంగా సూచించారు. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశాల నుంచి రప్పించిన నల్లడబ్బుపై పూర్తి సమాచారం ఇవ్వాలని, రప్పించిన నల్లధనం దేశప్రజల బ్యాంకు ఖాతాల్లో ఎంత డిపాజిట్ చేశారో కూడా వెల్లడించాలని ఆయన పీఎంవోను ఆదేశించారు. సంజీవ్ చతుర్వేది గతంలోనే సమాచార హక్కు చట్టం కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి పై విషయాలపై దరఖాస్తు చేసుకున్నారు. అయితే నల్లధనం ‘సమాచారం’ కిందకు రాదని ఆయన దరఖాస్తును ప్రధాని కార్యాలయ వర్గాలు తిరస్కరించాయి. అయితే సమాచార కమిషనర్ ఈ వాదనను కొట్టిపారేశారు. దరఖాస్తుదారుడు తప్పుగా దరఖాస్తు చేశారనడంలో వాస్తవం లేదని, పీఎంవో వాదన సరికాదని ఆయన తేల్చిచెప్పారు. -
ఎయిమ్స్ సీవీఓకు పెరుగుతున్న మద్దతు
న్యూఢిల్లీ: ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీఓ) సంజీవ్ చతుర్వేదికి మద్దతుగా సంతకాల సేకరణ కొనసాగుతోంది. ఎయిమ్స్ డాక్టర్లు చేస్తున్న ఈ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఎయిమ్స్ సీవీఓగా విధులు నిర్వర్తిస్తున్న చతుర్వేదిని పదవి నుంచి తొలగిస్తూ సీనియర్ అధికారుల బృందం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చతుర్వేది నిజాయతీపరుడైన అధికారి అని, విధి నిర్వహణలో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, ఎయిమ్స్‌లోని అనేకమంది అవినీతి అధికారుల బాగోతాలను ఆయన బయటపెట్టారని ఆందోళనకారులు తెలిపారు. అందుకే ఆయనకు మద్దతుగా సంతకాల సేకరణను ప్రారంభించామని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపా రు. ఎయిమ్స్ హక్కుల సంఘం ఆధ్వరంలో నిర్వహిస్తున్న ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి భారీ స్పందన కనిపిస్తోందన్నారు. నిజాయతీపరుడైన అధికారిని తొలగించడం ద్వారా సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకావశముందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... ‘సీవీఓ పదవికి చతుర్వేది అనర్హుడు. అందుకే ఆయనను ఎయిమ్స్‌లో కొనసాగించాలని భావించడంలేదు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనుమతి లేకుండానే ఆయన పదవిని చేపట్టినట్లు తెలిసింది. అందుకే ఆయనను విధుల నుం చి తప్పిస్తున్నాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనుమతి లేకుండా ఎవరు కూడా సీవీఓలుగా పదవులు చేపట్టే అవకాశం లేదు. ఈ విషయం మా దృష్టికి రావడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా తొలగించడంలో తప్పేమీ లేద’న్నారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రిత్వశాఖ ఎటువంటి కారణం చెప్పకుండానే చతుర్వేదిని పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో విశ్వాస్ మెహతాను నియమిస్తున్నట్లు కూడా ఎయిమ్స్‌కు సమాచారం పంపింది. హర్యానా ఫారెస్ట్ సర్వీస్, 2002 బ్యాచ్‌కు చెందిన చతుర్వేది నిజానికి 2016 వరకు కొనసాగాల్సి ఉంది. నాలుగేళ్ల విధి నిర్వహణ పూర్తి కాకుండానే రెండేళ్లకే అతణ్ని పదవి నుంచి తొలగించారు. గడిచిన రెండేళ్ల తన పదవీకాలంలో చతుర్వేది అనేక అవినీతి బాగోతాలను బయటపెట్టారు. ఎయిమ్స్‌లో ఆయన బయటపెట్టిన అవినీతిపై సీబీఐ కూడా పలు కేసులు నమోదు చేసి, విచారిస్తోంది. దీంతో ఆయన వ్యవహారం సీనియర్ అధికారులకు ఇబ్బందికరంగా మారినందునే ఆయనను పదవి నుంచి తప్పించేందుకు కుట్రలు పన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చతుర్వేదిని విధుల నుంచి తప్పించిన సీనియర్ అధికారుల్లో కూడా ఆయనంటే పడనివారు ఉన్నారని, నిజాయతీగా నడుచుకోవడం వల్లే ఆయనను ఎయిమ్స్ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని పలువురు సిబ్బంది, డాక్టర్లు ఆరోపిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. -
హర్షవర్ధన్‌ను తక్షణమే తప్పించాలి
ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని పదవినుంచి తప్పించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను పదవి నుంచి తప్పించాలని లేదా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై పార్టీ కార్యాలయంలో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతి కార్యకలాపాలను సంజీవ్ చతుర్వేది బయటపెట్టారు. ఈ కారణంగానే ఆయనను ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి పదవినుంచి తొలగించారు’ అని అరోపించారు. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ చతుర్వేది సదరు అధికారిపై చర్యలకు ఉపక్రమించాడు. దీంతో ఆ అధికారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కారణంగా సదరు ఐఏఎస్ అధికారి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాలేకపోయారు. బీజేపీ నాయకుడు చతుర్వేదిపై అనేక పర్యాయాలు ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదులను పరిశీలించి, చివరికి తిరస్కరించారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివాద పరిష్కారానికి మరింత సమయం కాగా పరువునష్టం కేసు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మరింత సమయమిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదావేసింది.