హర్షవర్ధన్‌ను తక్షణమే తప్పించాలి
ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని పదవినుంచి తప్పించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను పదవి నుంచి తప్పించాలని లేదా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై పార్టీ కార్యాలయంలో ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎయిమ్స్ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అవినీతి కార్యకలాపాలను సంజీవ్ చతుర్వేది బయటపెట్టారు.
ఈ కారణంగానే ఆయనను ఎయిమ్స్ ప్రధాన విజిలెన్స్ అధికారి పదవినుంచి తొలగించారు’ అని అరోపించారు. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ చతుర్వేది సదరు అధికారిపై చర్యలకు ఉపక్రమించాడు. దీంతో ఆ అధికారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కారణంగా సదరు ఐఏఎస్ అధికారి... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాలేకపోయారు. బీజేపీ నాయకుడు చతుర్వేదిపై అనేక పర్యాయాలు ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదులను పరిశీలించి, చివరికి తిరస్కరించారు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వివాద పరిష్కారానికి మరింత సమయం
కాగా పరువునష్టం కేసు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు బీజేపీ అగ్రనాయకుడు నితిన్ గడ్కరీ, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు మరింత సమయమిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదావేసింది.