మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా | Ed Files Chargesheet Against Arvind Kejriwal, Aap In Liquor Policy Case | Sakshi
Sakshi News home page

మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా

Published Fri, May 17 2024 7:13 PM | Last Updated on Fri, May 17 2024 7:41 PM

Ed Files Chargesheet Against Arvind Kejriwal, Aap In Liquor Policy Case

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్‌ షీట్‌ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది.  

మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్‌పై ఛార్జ్ షీట్‌ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్‌ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు.  

ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్‌ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు  ప్రశ్నించింది.

ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్‌.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది.  

ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్‌ చేశాయి.  

వీరిలో సంజయ్‌ సింగ్‌ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement