న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను స్పెషల్ మెన్షన్ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్ శ్రేణుల్లో నెలకొంది.
లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్‌లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.
ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.
అరెస్ట్ చట్టవిరుద్ధం కాదు
కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది.
‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment