
నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాలి
కేజ్రీవాల్ పిలుపు
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు.
తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు.
‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు
అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.
‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’
– ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
‘‘హనుమాన్‌జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’
– సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’
– మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి
‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’
– శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత
Comments
Please login to add a commentAdd a comment