చాలా మంది ఇలాగే భావిస్తున్నారు
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌పై అమిత్ షా వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ సాధారణ ‘ప్రక్రియ’లాగా లేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించారు. బుధవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా పలు అంశాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
జడ్జీలు ఇది గమనించాలి
‘‘కేజ్రీవాల్‌కు ఎన్నికల సందర్భంగా బెయిల్ రావడం చూస్తుంటే సుప్రీంకోర్టు ఆయన విషయంలో స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఈ మాట నేను అనట్లేదు. దేశవ్యాప్తంగా చాలా మంది ఇలాగే భావిస్తున్నారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే తాను మళ్లీ జైలు కెళ్లాల్సిన అవసరం రాదని బెయిల్ తర్వాత కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ధిక్కారమే. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే వాళ్లను సుప్రీంకోర్టు జైలుకు పంపదని ఆయన మాటల్లోని అసలు అర్థం. ఆయన మాటలు విన్నాక అయినా ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జీలు.. కేజ్రీవాల్ బెయిల్‌ను ఎలా వాడుకుంటున్నారు, ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి’’ అని షా విజ్ఞప్తిచేశారు.
బెయిల్ తీర్పుపై..
‘‘చట్టాన్ని ఏ కేసుల్లో ఎలా ఆపాదించాలో సర్వోన్నత న్యాయస్థానానికి బాగా తెలుసు. అయితే ఈ ఒక్క కేజ్రీవాల్ బెయిల్ విషయంలో మాత్రం కోర్టు ఇచ్చిన తీర్పు మిగతా తీర్పుల్లా సాధారణంగా అనిపించట్లేదు. దేశ జనాభాలో చాలా మంది మససుల్లో ఇలాంటి భావనే నెలకొంది. తిహార్ జైలు అమర్చిన కెమెరాల సీసీటీవీ ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది పూర్తిగా అబద్దం. ఎందుకంటే తిహార్ జైలు కేంద్రం అధీనంలో ఉండదు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది అని వివరించారు.
ప్రధానిగా మోదీ రిటైర్మెంట్‌పై
‘‘వచ్చే ఏడాదికి మోదీకి 75 ఏళ్లు వస్తాయి. 75కి చేరినందుకు బీజేపీ నియమావళి ప్రకారం మోదీని పక్కనబెట్టి అమిత్‌షాను ప్రధాని చేయాలని చూస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అదంతా అబద్ధం. ఇప్పుడు, ఎప్పుడూ మోదీయే మా ప్రధాని అభ్యర్థి. మేం గెలిచాక 2029 ఏడాదిదాకా మోదీయే ప్రధానిగా కొనసాగుతారు. ఆయన సారథ్యం, మార్గదర్శకత్వంలోనే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తాం’’ అని అమిత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment