కేజ్రీవాల్‌ బెయిల్‌ రద్దుపై పిటిషన్‌.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం | Supreme Court Junks ED Plea On action against Kejriwal Bail | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ బెయిల్‌ రద్దుపై పిటిషన్‌.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం

Published Thu, May 16 2024 4:45 PM | Last Updated on Thu, May 16 2024 5:37 PM

Supreme Court Junks ED Plea On action against Kejriwal Bail

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ను రద్దు చేసి, తిరిగి జైలుకు పంపాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీకోర్టు తోసిపుచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఓటేస్తే.. తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన పని లేదంటూ కేజ్రీవాల్ చేసిన‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈడీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ‘సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రచారంలో భాగంగా ఆప్‌కి ఓటు వేస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది కోర్టు విధించిన షరతులను స్పష్టంగా ఉల్లంఘించడమే. ఇది న్యాయవ్యవస్థకు చెంపదెబ్బగా పేర్కొన్నారు. 

మరోవైపు కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ మను స్పందిస్తూ.. పలువురు కేంద్ర మంత్రులు (పేర్లు ప్రస్తావించకుండా) తన క్లైయింగ్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ రావడంపై వ్యతిరేకంగా రకరకాల ప్రకటనలు చేశానే విషయాన్ని ఎత్తిచూపారు.

ఇరుపక్షాల వాదనలపై కోర్టు స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయమని, అదంతా అతని ఊహేనని ఈడీకి తెలిపింది. దానిపై తాము మాట్లాడటానికి ఏం లేదని పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జూన్‌ 2న తిరిగి జైలుకు రావాలంటూ తాము స్పష్టమైన ఆదేశం ఇచ్చామని వెల్లడించింది. అదే ఈ కోర్టు నిర్ణయమని, తాము చట్టబద్ధమైన పాలన ద్వారా నడుచుకుంటామని స్పష్టం చేసింది.

‘కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు, తమ తీర్పుపై విశ్లేషణను, విమర్శలను స్వాగతిస్తున్నాం. కానీ మేము ఈ విషయంలో జోక్యం చేసుకోము. మా ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. తిరిగి జైలుకొచ్చే తేదీలు వెల్లడించాం. మధ్యంతర బెయిల్‌ మంజూరుకు కారణాలు కూడా చెప్పాం’ అని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement